
న్యూఢిల్లీ: శిక్షా కాలం సగం ముగిశాక శిక్ష రద్దుపై నిర్ణయం తీసుకుంటామంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఓ వ్యక్తి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఎటువంటి ప్రాతిపదిక లేని కొట్ట చట్టాన్ని హైకోర్టు కనిపెట్టడం మాకు ఆశ్చర్యం కలిగించింది’ అని వ్యాఖ్యానించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం పిటిషనర్‌కు బెయిల్ మంజూరు చేసింది.
అయితే, భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నందున తీర్పును సవాల్ చేస్తూ వేసే అప్పీల్‌పై సమీప భవిష్యత్తులో వాదనలు వినే అవకాశాలు లేవు కాబట్టి బెయిల్ ఇవ్వవచ్చని ఈనెల 17న వెలువరించిన తీర్పులో స్పష్టం చేసింది. చట్టాలను యథాతథంగా అమలు చేయాలని, బెయిల్ కోసం పిటిషనర్లు తమ దాకా వచ్చేలా చేయరాదని పేర్కొంది.
కాగా, హైకోర్టు ఏం చెప్పిందంటే.. ‘తన వద్ద పట్టుబడిన నకిలీ నోట్ల గురించి పిటిషనర్ ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అందుకే, శిక్ష నిలిపివేత, బెయిల్ మంజూరుకు తగు ప్రాతిపదిక లేదు. మొదటి దరఖాస్తును తిరస్కరించిన రెండు నెలల లోపలే బెయిల్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నాడు. అందుకే, సగం శిక్షా కాలం పూర్తయ్యాక మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’ అని పేర్కొంది. సాధారణ చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్లో నిందితులకు బెయిల్ తిరస్కరించ వద్దని గతంలో ట్రయల్ కోర్టును, హైకోర్టులను కూడా సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది.