
అల్లర్ల బాధితులకు గవర్నర్ ఆనంద బోస్ హామీ
కోల్‌కతా: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్ల బాధితులను గవర్నర్ ఆనందబోస్ పరామర్శించారు. సాధ్యమైనంత మేర అన్ని విధాలుగా అండగా నిలుస్తామని వారికి హామీ ఇచ్చారు. అల్లర్ల సమయంలో దుండగులు షంషేర్‌గంజ్ ప్రాంతం జఫ్రాబాద్‌లో ఓ ఇంట్లో ఉన్న తండ్రి హర గోవింద్ దాస్, అతని కుమారుడు చందన్ దాస్‌లను కత్తితో పొడిచి చంపారు.
వీరి కుటుంబీకులు శనివారం తమ ఇంటికి వచ్చిన గవర్నర్ కాళ్లపై పడి, న్యాయం చేయాలని వేడుకున్నారు. ‘వీరి అభ్యర్థనలను పరిశీలిస్తాం. బాధితుల నుంచి మూడు, నాలుగు సూచనలందాయి. స్థానికంగా బీఎస్‌ఎఫ్ పోస్టులను ఏర్పాటు చేయడం ఇందులో ఒకటి. ఈ అంశాన్ని సంబంధిత యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తా. సానుకూల చర్యలను కచ్చితంగా తీసుకుంటాం. రాజ్‌భవన్‌లో అందుబాటులోకి తెచ్చిన హెల్ప్‌లైన్ నంబర్‌ను వారికి అందజేశా’అని గవర్నర్ మీడియాకు తెలిపారు. అనంతరం ధులియన్ బజార్ ప్రాంతంలో బాధితులను కలుసుకున్నారు.
బాధితులు కోరిన ప్రకారం న్యాయం దక్కేలా చూస్తామన్నారు. జఫ్రాబాద్‌లోని బెట్బోనా గ్రామం వద్ద స్థానికులు రోడ్డుపై అడ్డంకులు ఏర్పాటు చేయగా గవర్నర్ ఆగి, వారిని శాంతపరిచారు. అంతకుముందు, ఫరక్కాలోని అతిథి గృహం వద్ద కూడా గవర్నర్ అల్లర్ల బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు జరిగిన అల్లర్లలో తండ్రి, కుమారుడు సహా ముగ్గురు చనిపోవడంతోపాటు భారీగా ఆస్తినష్టం సంభవించిన ఘటనలపై పోలీసులు 274 మందిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం గవర్నర్ ఆనందబోస్ మాల్డా జిల్లాలో తాత్కాలిక శిబిరంలో తలదాచుకుంటున్న అల్లర్ల బాధిత ముర్షిదాబాద్ వాసులను పరామర్శించడం తెల్సిందే.
బాధితుల గోడు విన్న మహిళా కమిషన్
జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) చైర్‌పర్సన్ విజయా రాహత్కర్ శనివారం బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ధులియన్ తదితర వక్ఫ్ అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బెట్బోనా గ్రామంలో దుండగులు తమను భయభ్రాంతులకు గురి చేశారంటూ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, బీఎస్‌ఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలి, దాడులపై ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయించాలి అంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారు.
హింసాత్మక ఘటనల తీవ్రత అనూహ్య స్థాయిలో ఉందని తెలిసిందని అనంతరం రాహత్కర్ మీడియాకు తెలిపారు. బాధితుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని వారికి హామీ ఇచ్చామన్నారు. ఇక్కడి బాధిత మహిళల డిమాండ్లపై హోం మంత్రి అమిత్ షాకు నివేదిక అందజేస్తామని ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలు అర్చనా మజుందార్ తెలిపారు. శుక్రవారం మాల్డాలో అల్లర్ల బాధితులను రాహత్కర్ సారథ్యంలోని బృందం కలుసుకోవడం తెల్సిందే.
రాష్ట్రపతి పాలన విధించాలి: వీహెచ్‌పీ
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో చోటుచేసుకున్న అల్లర్లను నిరసిస్తూ శనివారం విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆందోళనలను నిర్వహించింది. బెంగాల్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది. బెంగాల్‌లో హిందువులకు రక్షణ కలి్పంచాలని, ముర్షిదాబాద్ అల్లర్ల బాధితులకు తగు పరిహారం అందజేయాలని కోరింది. బెంగాల్‌లో బంగ్లాదేశీ–రొహింగ్యా చొరబాటుదార్లను గుర్తించి, వెళ్లగొట్టాలంది. సోమవారం కూడా నిరసనలు తెలుపుతామని తెలిపింది.