
ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు
పెద్దపల్లిరూరల్: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. హమాలీల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలం గుర్తించాలని, కేటాయించిన రైస్ మిల్లులకే ధాన్యం తరలించాలని ఆయన సూచించారు. కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయాలని అన్నారు. నాణ్యతా ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. గ్రేడ్– ఏ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర చెల్లిస్తామని ఆయన తెలిపారు. ఈసారి 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనేది తమ లక్ష్యమని కలెక్టర్ వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 24 గంటల్లో మిల్లులకు తరలించేలా వాహనాలు సిద్ధం చేయాలని తెలిపారు. ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, అకాల వర్షాల నుంచి పంటను కాపాడేందుకు టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు.
చివరి ఆయకట్టుకు సాగునీరు
కమాన్‌పూర్(మంథని): మంథని నియోజకర్గంలోని పంటలు ఎండిపోకుండా చివరి ఆయకట్టుకు వరకు సాగునీరు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎస్సారెస్పీ అధికారులను ఆదేశించారు. రంగాపూర్ ఎస్సారెస్పీ డీ–83 కాలువతోపాటు గుండారం రిజర్వాయర్ నుంచి రామగిరి, ముత్తారం, మంథని పరిఽధిలోని పంటలకు సాగునీరు అందించే ఆర్‌ఎస్‌బీ కెనాల్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఎస్సారెస్పీ నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఎస్‌ఈ సత్యరాజ్‌చంద్ర, అధికారులు శ్రీనివాస్, బలరామయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌యూసీసీ ప్రతినిధి నియామకం
రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్ ఏరియాకు చెందిన అనుమాస శ్రీనివాస్‌ను దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ(డీఆర్‌యూసీసీ) ప్రతినిధిగా నియమించారు. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరవింద్‌కుమార్ జైన్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ 2026 ఆగస్టు వరకు ఈ పదవిలో ఉంటారని పేర్కొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీ హర్ష