
నేరాల నియంత్రణకు నిరంతర పెట్రోలింగ్
ఓదెల(పెద్దపల్లి): నేరాల నియంత్రణ కోసం పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశించారు. పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌ను బుధవారం రాత్రి సీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఠాణా పరిసరాలు, కేసులు, సీజ్ చేసిన వాహనాలు తదితర వాటిపై ఆరా తీశారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి సమస్యలను పరిష్కరించాల ని అన్నారు. సమస్యాత్మక గ్రామాలు, అజ్ఞాతంలోని మావోయిస్టుల వివరాల గురించి ఎస్సైని అడిగి తెలుసుకున్నారు. రౌడీషీటర్లు, అనుమానితుల స్థితిగతులు, కదలికలపైనా ఆరా తీశారు. మత్తు పదార్థాలను తయారు చేస్తున్న, నిల్వచేస్తున్న, రవాణా చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎస్సై రమేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నస్పూర్ పాలిటెక్నిక్‌లో 50 శాతం సీట్లు
గోదావరిఖని: పదోతరగతి పూర్తిచేసిన సింగరేణి ఉద్యోగుల పిల్లలకు నస్పూర్ పాలిటెక్నిక్‌లో 50 సీట్లు కేటాయించనున్నట్లు ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్ తెలిపారు. మెరిట్ ప్రాతిపాదికన ఇతరులకూ సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. డిప్లొమా ఇన్ సివిల్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, డిప్లొమా ఇన్ మెకానికల్, డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు జీఎం లలిత్‌కుమార్ వెల్లడించారు. బాల, బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆర్జీ–1 సింగరేణి పాఠశాలలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకించి కొత్తగూడెంలోని మహిళా జూనియర్, మహిళా డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ కోర్సులు ఇంగ్లిష్, తెలుగు మీడియంలో అందుబా టులో ఉన్నట్లు వివరించారు. ఆసక్తి గలవారు స్థాని క సింగరేణి హైస్కూల్ సెక్టార్–2 ప్రధానోపాద్యాయుడు శ్రీనివాస్ 94908 82498, లేదా స్వర్ణలత టీచర్ 98497 72512 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
ఎల్‌ఆర్‌ఎస్ గడువు పొడిగింపు
పెద్దపల్లిరూరల్: ఎల్‌ఆర్‌ఎస్ గడువును ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పొడిగించిందని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ బుధవారం తెలిపారు. లే అవుట్ లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తమ ప్లాట్లను 25శాతం రాయితీ ఫీజుతో క్రమబద్ధీకరించుకోవాలన్నారు. ఇందుకోసం ము న్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని వివరించారు. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను చెల్లించేవారికి ఐదుశాతం రాయితీ వర్తింపజేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.