
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలు కొనసాగుతున్నాయి.
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలు కొనసాగుతున్నాయి. జనసేన నూజివీడు మండల అధ్యక్షుడు యర్రం శెట్టి రాముపై చింతమనేని అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారు. 2014 నుండి దుగ్గిరాలలో కౌలు వ్యవసాయం చేస్తున్న యర్రం శెట్టి రాము పొలంలో చెరుకు పంటను నాశనం చేశారు.
స్పందనతో పాటు, నారా లోకేష్, టీడీపీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదంటూ జనసేన నేత వాపోతున్నారు.
తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియాలో పెట్టామని దుగ్గిరాల వీఆర్వోతో తిరిగి తనపై కేసు పెట్టించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై దాడి చేసిన చింతమనేని అనుచరులపై చర్యలు తీసుకోవాలని యర్రం శెట్టి రాము కోరుతున్నారు.
ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
యర్రంశెట్టి రాముపై చింతమనేని అనుచరుల దాడిపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంపై స్టేషన్ ఎదుట జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చింతమనేని, అతని అనుచరులపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినా కానీ.. పోలీసులు టీడీపీ నేతలకు కొమ్ముకొస్తున్నారు అంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దెందులూరులో జనసేన మండల అధ్యక్షుడికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని జనసేన నేతలు నిలదీశారు. స్పందనతో పాటు నారా లోకష్‌కు, జనవాణిలో ఫిర్యాదు చేసిన తమకు న్యాయం జరగలేదంటున్న జనసేన నేతలు.. చింతమనేని, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.