
న్యూఢిల్లీ:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వెంటనే స్పందించింది. ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రశ్నలను,సూచనలను తాము గౌరవిస్తున్నామని త్వరలో ఈ విషయంపై స్పందిస్తామని పేర్కొంది. మహారాష్ట్ర ఓటర్ల జాబితా వివరాలన్నీ రాతపూర్వకంగా వెల్లడిస్తామని తెలిపింది. ఈ మేరకు ఈసీ శుక్రవారం(ఫిబ్రవరి7) ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా, ఈసీ ప్రకటనకు ముందు రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపించారు. జనాభా కంటే ఎక్కువగా మహారాష్ట్ర ఎన్నికల్లో పలు చోట్ల ఓట్లు నమోదయ్యాయన్నారు. గతేడాది మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు, నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు మధ్య కొత్తగా 35 లక్షల మంది ఓటర్లుగా చేరడమేంటని రాహుల్ ప్రశ్నించారు.
ప్రతిపక్షాలకు చెందిన పార్టీలన్నీ కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని మహారాష్ట్ర ఓటర్ల జాబితాపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. బలహీన వర్గాలకు చెందిన ఎందరో ప్రజల ఓట్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని,కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లు ఉన్నా అక్కడి ఓటర్లను మరో పోలింగ్ బూత్‌కు మార్చారని ఆరోపించారు.
మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలు తమకు ఇవ్వాలని ఈసీని కోరామని, దీనిద్వారా కొత్తగా చేరిన ఓటర్లు ఎవరనేదానిపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఇంతేగాక ఎంతమంది ఓటర్లను తొలగించారో,ఒక బూత్‌నుంచి మరొక బూత్‌కు ఓటర్లను ఎందుకు బదిలీ చేశారో తెలుస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలున్నందునే ఓటర్ల జాబితాను తమకు ఇచ్చేందుకు ఈసీ ముందుకు రాలేని రాహుల్ అన్నారు.