
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఈసారి స్వయంగా తిట్ల దండకం ఎత్తుకున్నారు. వైఎస్సార్ సీపీ నేతలనుద్దేశించి తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ ఉద్రేకంతో ఊగిపోయారు. పదేపదే ‘నా కొడకల్లారా..!’ అంటూ దాదాపు గంటపాటు బండ బూతులు వల్లించారు. భారత రాజ్యాంగం తనకు కల్పించిన హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛని ఈ విధంగా ప్రకటిస్తున్నానని, ఇవాళ్టి నుంచి యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయం దీనికి వేదికగా మారింది.
‘కొడకల్లారా.. నా భాష తెలుసురా మీకు? మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నావ్ అంటారా? మీరూ చేసుకోండ్రా.. ఎవడు కాదన్నారు? విడాకులు ఇచ్చే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా సన్నాసుల్లారా.. ఒకర్ని పెళ్లి చేసుకొని 30 స్టెప్నీలతో తిరిగే మీకేంట్రా నేను చెప్పేది... వెధవల్లారా.. చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతాం రా...’ అంటూ మంగళవారం కార్యకర్తల సమావేశంలో పవన్‌కళ్యాణ్ రెచ్చిపోయారు.
నన్ను ప్యాకేజీ స్టార్ అనే సన్నాసి నా కొడుకులు ఎవరు? అంటూ ఊగిపోయారు. వైసీపీ నాయకులు ఒక్కొక్కరినీ దవడ వాచిపోయేలా కొడతా కొడకల్లారా (కాలి చెప్పు తీసి చూపిస్తూ).. తమాషాగా ఉందా కొడకల్లారా..? ఇంకోసారి ప్యాకేజీ గీకేజీ అంటే చెప్పు తీసుకొని పళ్లు రాలగొడతా కొడకల్లారా. మెడ పిసికి కింద నొక్కేస్తాం కొడకల్లారా..’ అంటూ పచ్చిబూతులు మాట్లాడారు. ఈ సమయంలో కార్యకర్తల కేరింతలతో పవన్ కళ్యాణ్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉండిపోయారు.
అధికారం ఒకట్రెండు కులాలకే కుదరదు..
జనసేనకు బలం ఉంది కానీ పోలింగ్ బూత్‌ల వద్ద యుద్ధం చేయడానికైనా నిలబడే వారు కావాలని పవన్ వ్యాఖ్యానించారు. బలిజ, కాపు, తెలగ, ఒంటరి సమూహం ఇంత సంఖ్యా బలం ఉన్నా అధికారం దక్కలేదంటున్నారని, అందుకోసం ఏం చేశారని వారంతా ఆలోచించుకోవాలన్నారు. రంగాను స్టేట్ (ప్రభుత్వం) చంపేస్తదని అన్నప్పుడు గ్రామానికి ఓ పది మంది ఆయన పక్కన ఎందుకు లేరని ప్రశ్నించారు.
ఆయన మరణానికి మీరు బాధ్యత తీసుకోండి అంటూ ఆయా కులాల వారిని ఉద్దేశించి అన్నారు. ఇక నుంచి అధికారాన్ని ఒకట్రెండు కులాలు దగ్గర పెట్టుకుంటే కుదరదని, అందరికీ రావాలని వ్యాఖ్యానించారు. కాపులను చరిత్రలో గొప్పగా చిత్రీకరించిన పలు పుస్తకాల గురించి ప్రస్తావిస్తూ.. కాపులకు పెద్దన్న పాత్ర వహించమని ఊరికే చెప్పలేదన్నారు.
మీరు గట్టిగా నిలబడాలి మరి..
స్టీల్ ప్లాంట్ పోతుంటే విశాఖ వాసులకు కోపం ఎందుకు రావడం లేదు? భయమా? అని పవన్‌కళ్యాణ్ ప్రశ్నించారు. మీరు (కార్మికులనుద్దేశించి) బయటకు రావాలి. మీరు నిలబడతామంటే ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూసే బాధ్యత మేం తీసుకుంటామన్నారు. భవిష్యత్తులోనూ తాను కచ్చితంగా సినిమాలు చేస్తానని చెప్పారు. పోలీసులు రేపొద్దున తమ ప్రభుత్వం కిందే పని చేయాల్సి వస్తుందని గుర్తు పెట్టుకోవాలన్నారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో 7 – 14 వరకు అసెంబ్లీ స్థానాల్లో, రెండుకు పైగా ఎంపీ సీట్లలో జనసేన పోటీ చేసే అంశాన్ని అక్కడి నేతలు చర్చించి చెబుతారన్నారు. అక్కడ కొండగట్టు నుంచి యాత్ర మొదలుపెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.