
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అభివృద్ధికి ఇన్నేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ప్రధాని నరంద్ర మోదీ ఆరోపించారు. వారి పాలనలో తరాల తరబడి రాష్ట్ర ప్రజలు ఉపాధి కోసం వలస పోతూ వచ్చారని ఆవేదన వెలిబుచ్చారు. ఈసారి ఓటేసేటప్పుడు ఎలాంటి పొరపాటూ చేయొద్దని రాష్ట్ర ప్రజలకు హితవు పలికారు. మంగళవారం వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్రానికి చాలా కీలకమైనవిగా అభివర్ణించారు.
ఉత్తరాఖండ్‌తో తనకు ప్రత్యేక బంధముందని, ప్రజల సమస్యలు, ఆకాంక్షలపై తనకు అవగాహన ఉందని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో ముస్లిం యూనివర్సిటీ పెడతామన్న కాంగ్రెస్ వాగ్దానాన్ని ప్రస్తావిస్తూ, ఓటు బ్యాంకు, సంతుష్టీకరణ రాజకీయాలను ఆ పార్టీ ఇంకా మానుకోలేదని ఎద్దేవా చేశారు. ఉత్తరాఖండ్ ఏర్పాటే కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి ఆ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమేనని మోదీ అన్నారు.