
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
పెద్దారవీడు: ఎదురెదురుగా వస్తున్న ద్విచక్రవాహనాలు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా..నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలో పుచ్చకాయలపల్లి, పెద్దారవీడు గ్రామాల మధ్య ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..పెద్దారవీడులో నాగులమీరాస్వామి ఉరుసు సందర్భంగా అల్లు మహేశ్వరెడ్డి, అల్లు ఈశ్వరరెడ్డి కలిసి ద్విచక్ర వాహనంపై పుచ్చకాయలపల్లిలో ఉన్న మేనేత్త పోతిరెడ్డి నారాయణమ్మను తీసుకువచ్చేందుకు వెళ్లారు. పుచ్చకాయలపల్లి గ్రామం నుంచి మహేశ్వరెడ్డి, ఈశ్వరరెడ్డి మేనేత్త పోతిరెడ్డి నారాయణమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై పెద్దారవీడు గ్రామానికి బయలుదేరారు. సుంకేసుల గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు పెద్దారవీడులో ఉన్న బంధువుల ఇంటికి వచ్చారు. తిరిగి పెద్దారవీడు నుంచి ద్విచక్ర వాహనంపై సొంత గ్రామానికి బయలుదేరగా పుచ్చకాయలపల్లి గ్రామం సమీపంలో మంగళికుంట వద్దకు రాగానే రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో మహేశ్వరరెడ్డికి తలకు, ఈశ్వరరెడ్డి, నారాయణమ్మ, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు వెంటనే మార్కాపురం జీజీహెచ్ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం మహేశ్వరరెడ్డి(15)ని ఒంగోలు జీజీ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో తరలించారు. మార్గమధ్యలో పొదిలి పట్టణానికి సమీపంలో మృతి చెందాడు. నారాయణమ్మ, ఈశ్వరరెడ్డిలను మెరుగైన వైద్యం నిమిత్తం నరసరావుపేటకు తరలించారు. మహేశ్వరరెడ్డి రాజంపల్లి సమీపంలో కేంద్రీయ విద్యాలయంలో 10వ తరగతి చదివి ఇటీవల పబ్లిక్ పరీక్షలు రాశారు. ఉరుసు పండుగ సందర్భంగా మహేశ్వరరెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు. తల్లిదండ్రులు, బంధవులు కన్నీరు మున్నీరయ్యారు.