
నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢీ
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
లక్నో: వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు... ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్‌తో పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి పోరులో గెలుపొందగా... ఆ తర్వాత వరుసగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకొని లీగ్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై... తిరిగి గెలుపు బాట పట్టాలని భావిస్తోంది.
గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టోర్నీకి దూరం కాగా... గత మ్యాచ్‌లోనే ‘మాస్టర్ మైండ్’ మహేంద్రసింగ్ ధోని జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే పరాజయాలతో డీలా పడ్డ జట్టును అతడి సారథ్యం కూడా గట్టెక్కించలేకపోయింది. కోల్‌కతాతో జరిగిన పోరులో బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో చెన్నై ఘోర పరాజయం మూటగట్టుకుంది. వాటన్నింటిని పక్కన పెట్టి తిరిగి సత్తా చాటాలని ధోనీ సేన భావిస్తోంది.
మరోవైపు రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సీజన్‌లో 6 మ్యాచ్‌లాడి 4 విజయాలు, 2 పరాజయాలు నమోదు చేసుకుంది. గత మూడు మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్‌లపై గెలిచి లక్నో ఫుల్ జోష్‌లో ఉంది. మరి లక్నో జోరును అడ్డుకొని చెన్నై విజయాల బాట పడుతుందా చూడాలి!
హిట్టర్లతో దట్టంగా...
గత మూడు మ్యాచ్‌ల్లోనూ పవర్‌ప్లే వికెట్లు కోల్పోని లక్నో జట్టు... హిట్టర్లతో దట్టంగా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల గుజరాత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో లేని మిచెల్ మార్ష్... చెన్నైతో పోరులో బరిలోకి దిగడం ఖాయమే. మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్‌తో లక్నో టాపార్డర్ శత్రుదుర్బేధ్యంగా ఉంది. గత కొన్నాళ్లుగా కేవలం సిక్స్‌లు కొట్టడమే తన లక్ష్యం అన్నట్లు చెలరేగిపోతున్న పూరన్‌ను అడ్డుకోవడం చెన్నై బౌలర్లకు కత్తి మీద సామే!
ఈ సీజన్‌లో సీఎస్‌కే ప్లేయర్లంతా కలిసి 32 సిక్స్‌లు బాదితే... పూరన్ ఒక్కడే 31 సిక్స్‌లు కొట్టాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగుతున్న ఈ విండీస్ వీరుడు మరోసారి చెలరేగితే లక్నో జైత్రయాత్ర కొనసాగినట్లే. రిషబ్ పంత్, ఆయుశ్ బదోనీ, అబ్దుల్ సమద్‌లతో మిడిలార్డర్ బలంగా ఉండగా... డేవిడ్ మిల్లర్ ఫినిషింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు.
ఇక అనూహ్యంగా జట్టులోకి వచ్చిన పేస్ ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకుంటుండగా... యువ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ... ‘సంతకం’ సంబరాలు కొనసాగించాలని చూస్తున్నాడు. అవేశ్ ఖాన్, ఆకాశ్‌దీప్, రవి బిష్ణోయ్‌తో లక్నో బౌలింగ్‌లో మంచి వైవిధ్యం ఉంది.
లోపాలు దిద్దుకుంటేనే!
చెన్నైకు ఈ సీజన్‌లో ఏదీ కలిసి రావడం లేదు. నిలకడ కనబర్చలేకపోతున్న ఆ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతోంది. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర రూపంలో మంచి ఓపెనర్లు ఉన్నా... ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను నడిపించే వారు కరువయ్యారు. రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు.
ఇక బ్యాటింగ్ ఆర్డర్‌లో అశ్విన్ తర్వాత క్రీజులోకి వస్తున్న ధోని... గతంలో మాదిరిగా ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం కనబర్చ లేకపోతున్నాడు. ఇతర జట్లలో దేశీయ ఆటగాళ్లు చెలరేగుతుంటే... చెన్నైలో ఆ బాధ్యత తీసుకునే ప్లేయర్లు కనపించడం లేదు. కోల్‌కతాతో జరిగిన చివరి మ్యాచ్‌లో అయితే చెన్నై మరీ పేలవ ఆటతీరు కనబర్చింది. ప్లే ఆఫ్స్ రేసులో ముందంజ వేయాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఆటగాళ్లంతా సమష్టిగా సత్తాచాటాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడని సీఎస్‌కే... మరో పరాజయం మూటగట్టుకుంటే ఇక కోలుకోవడం కష్టమే. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న చెన్నై బ్యాటర్లు... దిగ్వేశ్ రాఠీ, రవి బిష్ణోయ్‌లను ఎలా ఎదుర్కంటారనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
తుది జట్లు (అంచనా)
లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్ ), మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, పూరన్, పంత్, బదోనీ, మిల్లర్, సమద్, శార్దుల్, ఆకాశ్‌దీప్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ.
చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్ ), కాన్వే, రచిన్, త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అశ్విన్, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పతిరణ.