నిప్పులు చెరిగిన బుమ్రా.. అరుదైన రికార్డుతో దిగ్గజ కెప్టెన్ల సరసన! | Ind vs Aus Bumrah Enters Elite List Of India Captains Rohit Kohli Not Part Of It | Sakshi

నిప్పులు చెరిగిన బుమ్రా.. అరుదైన రికార్డుతో దిగ్గజ కెప్టెన్ల సరసన!

Nov 23 2024 11:22 AM | Updated on Nov 23 2024 1:04 PM

Ind vs Aus Bumrah Enters Elite List Of India Captains Rohit Kohli Not Part Of It

టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన కెప్టెన్ల జాబితాలో చోటు సంపాదించాడు. అదే విధంగా.. భారత దిగ్గజ పేసర్‌ జహీర్‌ ఖాన్‌, ఇషాంత్‌ శర్మల రికార్డును సమం చేశాడు. అసలు విషయం ఏమిటంటే!..

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. అయితే, భారత జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరం కాగా.. పేస్‌ దళ నాయకుడు బుమ్రా పగ్గాలు చేపట్టాడు. ఇక పెర్త్‌ వేదికగా మొదటి టెస్టులో టాస్‌ గెలిచిన బుమ్రా.. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

టీమిండియా 150 పరుగులకు ఆలౌట్‌
ఈ క్రమంలో టీమిండియా 150 పరుగులకు ఆలౌట్‌ అయి తమ తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌.. మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి ఏడు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. శుక్రవారం బుమ్రా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. మహ్మద్‌ సిరాజ్‌ రెండు, హర్షిత్‌ రాణా ఒక వికెట్‌ తీశారు.

రెండో రోజు ఆరంభంలోనే బుమ్రా ఇలా
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన కాసేపటికే వికెట్‌ కోల్పోయింది. ప్రమాదకారిగా మారే అవకాశం ఉన్న ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ(21)ని అవుట్‌ చేసి బుమ్రా బ్రేక్‌ ఇచ్చాడు. అంతేకాదు.. పెర్త్‌ టెస్టులో తన ఖాతాలో ఐదో వికెట్‌ జమచేసుకున్నాడు. ఓవరాల్‌గా బుమ్రాకు ఇది టెస్టుల్లో పదకొండో ఫైవ్‌ వికెట్‌ హాల్‌ కాగా.. సారథిగా మొదటిది.

ఈ క్రమంలో టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన టీమిండియా కెప్టెన్ల సరసన బుమ్రా చేరాడు. అతడి కంటే ముందు.. వినోద్‌ మన్కడ్‌, బిషన్‌ బేడి, కపిల్‌ దేవ్‌, అనిల్‌ కుంబ్లే ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధికసార్లు ఫైవ్‌ వికెట్‌ హాల్‌ సాధించిన బౌలర్ల జాబితాలో జహీర్‌ ఖాన్‌, ఇషాంత్‌ శర్మలను బుమ్రా వెనక్కినెట్టడం మరో విశేషం.

టెస్టుల్లో టీమిండియా తరఫున ఐదు వికెట్ల ప్రదర్శన(ఒకే ఇన్నింగ్స్‌) నమోదు చేసిన టీమిండియా కెప్టెన్లు
1. వినోద్‌ మన్కడ్‌(1)
2. బిషన్‌ బేడి(8)
3. కపిల్‌ దేవ్‌(4)
4. అనిల్‌ కుంబ్లే(2)
5. జస్‌ప్రీత్‌ బుమ్రా(1)

టెస్టుల్లో అత్యధికసార్లు ఫైవ్‌ వికెట్‌ హాల్‌ సాధించిన భారత బౌలర్లు
1. రవిచంద్రన్ అశ్విన్ - 37 (105 మ్యాచ్‌లు)  
2. అనిల్ కుంబ్లే - 35 (132 మ్యాచ్‌లు)  
3. హర్భజన్ సింగ్ - 25 (103 మ్యాచ్‌లు)  
4. కపిల్ దేవ్ - 23 (131 మ్యాచ్‌లు)  
5. బీఎస్ చంద్రశేఖర్ - 16 (58 మ్యాచ్‌లు)  
6. రవీంద్ర జడేజా - 15 (77 మ్యాచ్‌లు)  
7. బిషన్ సింగ్ బేడీ - 14 (67 మ్యాచ్‌లు)  
8. సుభాశ్‌ చంద్ర పండరీనాథ్ గుప్తే - 12 (36 మ్యాచ్‌లు)  
9. జస్‌ప్రీత్‌ బుమ్రా - 11 (41 మ్యాచ్‌లు)  
10. జహీర్ ఖాన్ - 11 (92 మ్యాచ్‌లు)  
11. ఇషాంత్ శర్మ - 11 (105 మ్యాచ్‌లు)

ఇదిలా ఉంటే.. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. భారత పేసర్లలో బుమ్రా ఐదు, రాణా మూడు, సిరాజ్‌ రెండు వికెట్లు దక్కించుకున్నారు.

చదవండి: హర్షిత్‌.. నీ కంటే నేను ఫాస్ట్‌గా బౌల్‌ చేయగలను: స్టార్క్‌ వార్నింగ్‌.. రాణా రియాక్షన్‌ వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement