
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 10) ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయ జట్టుగా కొనసాగుతుండగా.. ఆర్సీబీ నాలుగింట మూడు గెలిచి, ఓ మ్యాచ్‌లో ఓడింది.
నేటి మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీ చేస్తే టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుంటాడు. తద్వారా పొట్టి క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.
టీ20ల్లో ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ ఒక్కడే 100 హాఫ్ సెంచరీలు (108) పూర్తి చేశాడు. గత మ్యాచ్‌లోనే టీ20ల్లో 13000 పరుగుల మార్కును తాకిన విరాట్ నేటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధిస్తే మరోసారి రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో విరాట్ 386 ఇన్నింగ్స్‌లు ఆడి 9 సెంచరీలు, 99 హాఫ్ సెంచరీల సాయంతో 13050 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ ఐదో స్థానంలో ఉన్నాడు.
నేటి మ్యాచ్ విషయానికొస్తే.. గత రికార్డుల ప్రకారం ఢిల్లీపై ఆర్సీబీదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 31 సార్లు తలపడగా ఆర్సీబీ 19, ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. అయితే ప్రస్తుత సీజన్‌లో పరిస్థితి చూస్తే మాత్రం ఢిల్లీకే అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఢిల్లీ ఈ సీజన్‌లో గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. కొత్త కెప్టెన్ అక్షర్ నేతృత్వంలో ఓటమెరుగని జట్టుగా దూసుకుపోతుంది.
ఢిల్లీ ఈ సీజన్‌లో అన్ని విభాగాల్లో సత్తా చాటుతూ లక్నో, సన్‌రైజర్స్, సీఎస్‌కేలపై అద్భుత విజయాలు సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 200కు పైగా లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ఏకైక జట్టు ఢిల్లీ మాత్రమే. ఢిల్లీ జట్టులో డుప్లెసిస్, కేఎల్ రాహుల్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్ జేక్ ఫ్రేజర్ వరుస వైఫల్యాలే జట్టును కలవరపెడుతున్నాయి.
మరోవైపు ఆర్సీబీ కూడా ఈ సీజన్‌లో గతంలో ఎన్నడూ లేనట్లుగా ఆది నుంచే అదరగొడుతుంది. తొలి మ్యాచ్‌లో కేకేఆర్, రెండో మ్యాచ్‌లో సీఎస్‌కేలకు షాకిచ్చిన ఈ జట్టు మూడో మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడి ఆతర్వాతి మ్యాచ్‌లోనే మళ్లీ గెలుపు బాట (ముంబైపై విజయంతో) పట్టింది.
ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో విరాట్, రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ.. బౌలింగ్‌లో హాజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ అదరగొడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
తుది జట్లు (అంచనా)..
ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్, రసిఖ్ సలామ్/సుయాష్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్: ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ/T నటరాజన్, ముఖేష్ కుమార్