
పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీరుపై ఆ దేశ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) మండిపడ్డాడు. వరుస పరాజయాలతో పరువు తీస్తున్నారని.. ఇందుకు కారణం పాక్ క్రికెట్ బోర్డు (PCB) చెత్త నిర్ణయాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ క్రికెట్ బాగుపడాలంటే పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ వెంటనే రాజీనామా చేయాలని సూచించాడు.
వరుస పరాజయాలు
కాగా పాక్ జట్టు గత కొన్ని రోజులుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్ విజయాల తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. సొంతగడ్డపై సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌తో త్రైపాక్షిక వన్డే సిరీస్‌లో ఓటమి పాలైంది.
అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి ఘోర పరాభవం పాలైంది. న్యూజిలాండ్, టీమిండియాతో మ్యాచ్‌లలో ఓడి.. గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. అనంతరం టీ20 కొత్త కెప్టెన్ సల్మాన్ ఆఘా సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ మరోసారి దారుణంగా విఫలమైంది.
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో ఆతిథ్య కివీస్ జట్టుకు కోల్పోయింది. ఇక వన్డే సిరీస్‌తో మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వగా.. తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూసిన పాక్.. రెండో వన్డేలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.
84 పరుగుల తేడాతో
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన రెండో వన్డేలో 84 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పాక్‌పై విజయం సాధించింది. తద్వారా 2–0తో సిరీస్ చేజిక్కించుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. వికెట్ కీపర్ మిచెల్ హే (78 బంతుల్లో 99 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ శతకానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు.
పాక్ బౌలర్ వసీమ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో హే 2,0,6,6,4,4తో 22 పరుగులు పిండుకున్నాడు. కివీస్ ఇతర బ్యాటర్లలో మొహమ్మద్ అబ్బాస్ (41; 3 ఫోర్లు), నిక్ కెల్లీ (31; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ వసీమ్, సుఫియాన్ ముఖీమ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ పూర్తిగా తడబడింది. 41.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది.
ఫహీమ్ అష్రఫ్ (80 బంతుల్లో 73; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), నసీమ్ షా (44 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకాలతో పోరాడారు. వీరిద్దరికీ ఈ ఫార్మాట్‌లో ఇవే మొదటి హాఫ్ సెంచరీలు. కివీస్ బౌలర్ల ధాటికి పాకిస్తాన్ ఒకదశలో 32 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (5), బాబర్ ఆజమ్ (1), అబ్దుల్లా షఫీఖ్ (1), ఇమాముల్ హక్ (3), సల్మాన్ ఆఘా (9) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
చివర్లో ఫహీమ్, నసీమ్ షా ధాటిగా ఆడటంతో పాకిస్తాన్ 200 పరుగుల మార్క్ దాటగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్ సియర్స్ 5 వికెట్లు పడగొట్టగా... జాకబ్ డఫీ 3 వికెట్లు తీశాడు. మిచెల్ హేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
సిగ్గుచేటు.. పరువు తీస్తున్నారు
ఈ నేపథ్యంలో పాక్ జట్టు వరుస వైఫల్యాలపై మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఘాటుగా స్పందించాడు. ‘‘నిజంగా ఇది సిగ్గు చేటు. పీసీబీ చైర్మన్ పరిస్థితులను చక్కదిద్దకపోయినట్లయితే.. వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలి.
అంతేగానీ.. పాక్ క్రికెట్‌కు ఉన్న పేరును నాశనం చేయకండి. ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ప్రస్తుత జట్టు పరిస్థితిని బాగుచేయండి’’ అని కమ్రాన్ అక్మల్ మండిపడ్డాడు. కాగా న్యూజిలాండ్- పాకిస్తాన్ మధ్య నామమాత్రమైన చివరి వన్డే శనివారం మౌంట్‌మాంగనీలో జరుగుతుంది.
చదవండి: నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించింది: సెహ్వాగ్ ప్రశంసలు