
ఇంగ్లండ్ క్రికెట్‌లో కెప్టెన్‌గా జోస్ బట్లర్(Jos Buttler) ప్రస్థానం ముగిసింది. ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు జోస్ బట్లర్ శుక్రవారం ప్రకటించాడు. చాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ జట్టు నాకౌట్ రేసుకు దూరమైన నేపథ్యంలో బట్లర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
శనివారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు బట్లర్ వెల్లడించాడు. అయితే ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని వెల్లడించాడు. ‘కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. ఈ నిర్ణయం నాకు, జట్టుకు మేలు చేస్తుందనుకుంటున్నా. సారథ్య బాధ్యతలను ఇతరులకు అప్పగించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా’ అని బట్లర్ వెల్లడించాడు.
అయితే 2022 టీ20 ప్రపంచకప్‌ను నాయకుడిగా తన జట్టుకు అందించిన బట్లర్.. ఆ తర్వాత జరిగిన ఐసీసీ ఈవెంట్లలో తన మార్క్‌ను చూపించలేకపోయాడు. 2023లో భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్-2024లో లీగ్ స్టేజిలో ఇంటిముఖం పట్టిన ఇంగ్లీష్ జట్టు.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. దీంతో బట్లర్ కెప్టెన్సీ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే బట్లర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే ఇంగ్లండ్ తదుపరి కెప్టెన్ ఎవరన్నది క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్..?
పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తదుపరి కెప్టెన్‌గా మిడిల్-ఆర్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. బ్రూక్ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. గతేడాది బట్లర్ గైర్హజరీలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు సారథిగా కూడా బ్రూక్ వ్యవహరించాడు.
అయితే ఈ సిరీస్‌ను 3-2 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. అయితే జట్టులో లివింగ్ స్టోన్, అదిల్ రషీద్, డకెట్ వంటి సీనియర్లు ఉన్నప్పటికి .. ఇంగ్లండ్ హెడ్ కోచ్ మాత్రం బ్రూక్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంగ్లండ్ మాజీలు సైతం బ్రూక్‌ను కెప్టెన్‌గా నియమించాలని ఈసీబీని సూచిస్తున్నారు. ఇంగ్లండ్ తమ తదుపరి వైట్‌బాల్ సిరీస్ ఈ ఏడాది మేలో వెస్టిండీస్‌తో ఆడనుంది. ఈ గ్యాపులో ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు కొత్త వైట్‌బాల్ కెప్టెన్ వచ్చే ఛాన్స్ ఉంది.
చదవండి: Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్..