
పీఆర్ ఈఎన్‌సీ కనకరత్నంకు ఏడాది పొడిగింపు...
స్త్రీ నిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డికి ఏడాది...
మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డికి అక్టోబర్ వరకు..
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (పీఆర్ ఆర్డీ) శాఖలో పాతకాపులకు పునరావాసం కల్పించారనే విమర్శలొస్తున్నాయి. గతంలోనే రిటైర్ అయ్యి మళ్లీ అపాయింట్ అయిన పలువురు అధికారులను ఇటీవలే తొలగించిన విషయం తెలిసిందే. ఇలా తొలగించిన వారిలో కొందరిని మళ్లీ కొనసాగిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ శాఖలోని పలు కీలక పోస్టుల్లో కొన్నేళ్లుగా రిటైరైన ఉన్నతాధికారులే కొనసాగుతుండగా... వారి సర్వీసులను రద్దుచేయాలనే సీఎస్ ఆదేశాలతో మిషన్ భగీరథ ఈఎన్‌సీగా కృపాకర్‌రెడ్డి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యదర్శిగా అశోక్ కుమార్, స్త్రీ నిధి సంస్థ ఎండీ విద్యాసాగర్ రెడ్డిలను రీ అపాయింట్‌మెంట్ సర్వీసు నుంచి తొలగించారు. వీరితోపాటు మార్చి 31 తో పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) కనకరత్నం కూడా పదవీ విరమణ చేశారు.
ఈ విభాగాలకు సంబంధించి కీలక బాధ్యతల్లో ఉన్న వీరిని ఉపసంహరించినా, ఆయా విభాగాల్లో తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందనే విమర్శలు వచ్చాయి. కనీసం ఆయా పోస్టులకు ఇన్‌చార్జీలను అయినా నియమించి ఉంటే సమస్య ఇంత తీవ్రంగా మారి ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే సీఎస్ ఇచ్చిన ఆదేశాల్లోనే... అవసరాన్ని బట్టి ఆయా అధికారులను ‘రీ అపాయింట్’ చేసుకోవచ్చునని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో పీఆర్ ఈఎన్‌సీగా కనకరత్నం సర్వీస్‌ను ఏడాది పొడిగించారు. మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి రీఅపాయింట్‌మెంట్ అయినపుడే 2025 అక్టోబర్ వరకు గడువు ఉండటంతో ఆయన సర్వీసును కూడా అప్పటిదాకా, స్త్రీ నిధి సంస్థ ఎండీ విద్యాసాగర్‌రెడ్డి సర్వీస్‌ను మరో ఏడాది పొడిగించారు.