
అడ్మిషన్లు మొదలుపెట్టిన ప్రైవేట్ జూనియర్ కాలేజీలు
ఇంటర్మీడియెట్ బోర్డు ఆదేశాలు బేఖాతరు
అనుబంధ గుర్తింపు ఇచ్చే వరకు విద్యార్థులను చేర్చుకోవద్దన్న బోర్డు
కానీ అన్ని జిల్లాల్లో జోరుగా అడ్మిషన్ల ప్రక్రియ
అఫ్లియేషన్ కోసం దరఖాస్తు చేసుకోకుండానే విద్యార్థుల కోసం గాలం
కాలేజీల ముందు బోర్డులు పెట్టి మరీ చేర్చుకుంటున్నా పట్టించుకోని అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిశాయి. అనుబంధ గుర్తింపు ఇచ్చేంత వరకూ కొత్తగా అడ్మిషన్లు చేపట్టవద్దని ఇంటర్మీడియెట్ బోర్డు స్పష్టం చేసింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి కార్యకలాపాలపై నిఘా పెట్టాలని జిల్లా అధికారులను ఆదేశించింది. అవసరమైతే పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టాలని సూచించింది. కానీ రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జూనియర్ కాలేజీలూ బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. ఎప్పుడో జూన్‌లో మొదలయ్యే తరగతుల కోసం అన్ని జిల్లాల్లోనూ పోటాపోటీగా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి.
విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకర్షించేందుకు యాజమాన్యాలు ప్రత్యేకంగా ఏజెంట్లను, పూర్వ విద్యార్థులు, కాలేజీ సిబ్బందిని రంగంలోకి దింపాయి. వారికి టార్గెట్లు పెడుతున్నాయి. తాయిలాల ఎర వేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లాల్లో అధికారులు ప్రవేశాలను అడ్డుకోవడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కళ్ళెదుటే కాలేజీలు బోర్డులు పెట్టి మరీ విద్యార్థులను చేర్చుకుంటున్నా, పట్టించుకోవడం లేదని అంటున్నారు. అయితే ఇలాంటివి ఇంతవరకు తమ దృష్టికి రాలేదని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు.
అనుమతికి అవకాశం లేకున్నా అడ్మిషన్లు!
వాస్తవానికి జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు జారీ చేసేందుకు బోర్డు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 5 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుంటామని తెలిపింది. అయితే ఇంతవరకూ ఏ కాలేజీ దరఖాస్తు చేయలేదు. మే 5 వరకూ గడువు ఉండటమే ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 1,200కు పైగా ప్రైవేటు జూని యర్ కాలేజీలున్నాయి. వీటిల్లో 350 కాలేజీలు గృహ, వాణిజ్య సముదాయాల్లో నడుస్తున్నాయి. ఈ కాలేజీలపై రెండేళ్ళ క్రితమే అగి్నమాపక శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. వీటికి అనుమతి ఇవ్వలేమని పేర్కొంది.
ఈ కాలేజీల్లో దాదాపు 80 వేల మంది చదువుతున్నారు. వీటిల్లో ఏ ఒక్కటీ ఇప్పటివరకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోలేదు. కానీ విద్యార్థుల నుంచి యథావిధిగా అడ్మిషన్లు మొదలు పెట్టాయి. నిబంధనలన్నీ కాగితాల్లోనే ఉంటాయని, తమకు అనుమతి వచ్చి తీరుతుందని ఆ కాలేజీలు నమ్మబలుకుతున్నాయి. వాస్తవానికి ఎప్పటికప్పుడు కాలేజీల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్ దెబ్బతింటుందని చెబుతూ బోర్డును వేడుకుంటున్నాయి. మరోవైపు రాజకీయంగానూ ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే బాటను నమ్ముకుని అడ్మిషన్లు చేపడుతున్నాయనే విమర్శలు విన్పిస్తున్నాయి.
భారీగా పెరిగిన ఫీజులు
మరోవైపు ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఈసారి భారీ యెత్తున ఫీజులు డిమాండ్ చేస్తున్నాయి. జేఈఈ, రాష్ట్ర ఇంజనీరింగ్ సెట్‌కు కలిపి కోచింగ్ ఇస్తామంటున్నాయి. వేసవి ముగిసే నాటికే సిలబస్ పూర్తి చేస్తామని, మిగిలిన రోజులంతా కోచింగ్‌పై దృష్టి పెడతామని చెబుతున్నాయి. ఇందుకోసం గత ఏడాది రూ.70 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఫీజు వసూలు చేశాయి. ఈసారి ఇది రూ.లక్ష నుంచి రూ.4.20 లక్షలకు పెంచేశాయి. ఈ క్రమంలో కార్పొరేట్ కాలేజీలు రకరకాల ఆశలు కల్పిస్తున్నాయి. కొన్నేళ్ళుగా జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో సాధించిన విజయాలతో ప్రచారం చేసుకుంటున్నాయి.
ఏజెంట్లు, సిబ్బంది కూడా దీన్నే ఆయుధంగా వాడుకుంటున్నారు. ముందే అడ్మిషన్ తీసుకుంటే 15 శాతం వరకు రాయితీ ఉంటుందని చెబుతున్నారు. ఒకసారి టెన్త్ పరీక్ష ఫలితాలు వెల్లడైతే ఎలాంటి రాయితీ ఉండదంటూ ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పిల్లల్ని చేర్చే క్రమంలో వాకబు చేయడానికి వచ్చే తల్లిదండ్రులను గంటల కొద్దీ కౌన్సెలింగ్ చేసి సీట్లు అంటగడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై ఇంటర్ బోర్డు అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.