
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఐదు సహకార సంఘాలకు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా విత్తన ఉత్పత్తి, సేంద్రియ ఉత్పత్తుల సహకార సంస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ సంస్థ ద్వారా సేంద్రియ వ్యవసాయం, విత్తన ఉత్పత్తుల్లో నిమగ్నమైన రైతులకు నేరుగా ప్రయోజనం కలుగుతుందని వివరించారు. రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సహకార సంఘాలకు గురువారం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా అవార్డులు అందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి.. రైతులనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో సహకార ఉద్యమం దాదాపు 125 సంవత్సరాల నుంచి ఉందని, కానీ సకాలంలో మార్పులు చేయకపోవడం వల్ల అది కాలం చెల్లినట్లు కనిపిస్తోందని అన్నారు. సహకార రంగం ఈ కాలపు అవసరాలకు అనుగుణంగా బలోపేతం కావాలని అభిప్రాయపడ్డారు.
సహకార రంగం పటిష్టతకు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేయడం చాలా ముఖ్యమని, ఇందు కోసం ప్రభుత్వం ద్వారా అనేక చర్యలు తీసు కుంటామని హామీ ఇచ్చారు. కాగా, ఈ కార్య క్రమంలో ఐదు సహకార సంఘాలకు అవార్డు లతో పాటు రూ.25 వేల నగదు బహుమతిని అందజేశారు. టీజీకాబ్ చైర్మన్ ఎం.రవీందర్‌రావు, ఎండీ గోపి, ఎన్‌సీడీసీ రీజనల్ డైరెక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల హాజరుపై నివేదిక ఇవ్వండి
వ్యవసాయ శాఖ డైరెక్టరేట్ పరిధిలో ఉద్యోగుల హాజరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ సంచాలకుడిని ఆదేశించారు. గురువారం మంత్రి బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు సమయానికి రాని విషయాన్ని గుర్తించిన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హాజరు తీరుపై సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి ఈ సందర్భంగా డైరెక్టర్‌ను ఆదేశించారు.