
ఆదిలాబాద్: జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు రిమ్స్ ఆస్పత్రిని నిమ్స్ తరహాలో ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏర్పాటు చేసిన సిటీస్కానింగ్, డయాలసిస్ సెంటర్, డిజిటల్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, ఈ–హెల్త్‌సెంటర్, పేయింగ్‌రూమ్స్, పీడియాట్రిక్ ఐసీయూ, టెలీమెడిసిన్ సెంటర్, గెస్ట్‌రూమ్స్, ఉద్యోగుల క్వార్టర్లు మంత్రులు అటవీశాఖ మంత్రి జోగు రామన్న, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రిమ్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అధునాతన పరికరాలతో జిల్లా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు డయాలసిస్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సేవల కోసం హైదరాబాద్, నాగ్‌పూర్ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని అన్నారు. దేశంలోనే మొదటిసారిగా సింగిల్ ఫిల్టర్ ద్వారా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని చెప్పారు. రిమ్స్‌లో త్వరలో వైద్య పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నందుకు ఇటీవల కోల్‌కతాలో అవార్డు కూడా అందుకున్నట్లు తెలిపారు. రిమ్స్‌లో ఏర్పాటు చేసిన పరికరాల నిర్వహణ సంబంధిత కంపెనీలకు అప్పగించామని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో అవగాహన లేకపోవడంతోనే గతంలో మలేరియా వంటి జ్వరాలతో మరణాలు సంభవించాయని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ మరణాలను అరికట్టగలిగామని అన్నారు. నిత్యం ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ఏజెన్సీలో వైద్య సేవలు అందించడంతో ఈ ఏడాది ఒక్క మరణం కూడా సంభవించలేదని అన్నారు. రిమ్స్‌లో 150 మెడికల్ సీట్లు, విద్యార్థులకు సదుపాయాల కోసం రూ.103 కోట్లు కావాలని, నర్సింగ్ కళాశాల భవన నిర్మాణం చేపట్టాలని మంత్రి రామన్న తనకు ప్రతిపాదించారని, త్వరలో వీటిని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రిమ్స్ ఆస్పత్రిని సెమీ అటానమస్ నుంచి అటనామస్‌కు మార్చేందుకు కృషి చేస్తామన్నారు.
కేసీఆర్ చేతుల మీదుగా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభిస్తాం..
ఆదిలాబాద్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాటీ ఆస్పత్రి నిర్మాణాలు త్వరలో పూర్తి కానున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి జోగు రామన్న అన్నారు. సూపర్‌స్పెషాలీటీ సేవలు అందుబాటులోకి వస్తే మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో జిల్లాకు వైద్యులు రావాలంటేనే భయపడేవారని, తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాకు వరుస కడుతున్నారని అన్నారు. అధునాతన పరికరాలతోపాటు వాటి నిర్వహణకు సంబంధించిన వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరారు. అనంతరం రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూ వార్డులకు ఇటీవల వచ్చిన జాతీయ అవార్డును మంత్రుల చేతుల మీదుగా ఆ విభాగం వైద్యుడు సూర్యకాంత్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివ్య దేవరాజన్, రాష్ట్ర పాడి పరిశ్రమ శాఖ చైర్మన్ లోక భూమారెడ్డి, బోథ్ ఎమ్మెల్యే బాపూరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ మనీషా, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ రాజన్న, జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, మావల సర్పంచ్ రఘుపతి, డీఎంహెచ్‌ఓ రాజీవ్‌రాజ్, డైరెక్టర్ అశోక్, ఐసీడీఎస్ ఆర్గనైజర్ ప్రేమల, ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులు నీలాబాయి, తదితరులు పాల్గొన్నారు.
అపరిశుభ్రతపై లోక భూమారెడ్డి అసంతృప్తి..
రిమ్స్ ఆడిటోరియంలో మంత్రుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి రిమ్స్, ఆడిటోరియంలో అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు వచ్చినా కనీసం ఆడిటోరియంలో బూజు, దుమ్ము దులపలేదని, నడుస్తుంటే కాళ్ల అడుగులు కనిపిస్తున్నాయని అన్నారు. ఓ పక్క ప్రభుత్వం స్వచ్ఛభారత్ దిశగా ముందుకు వెళ్తుంటే.. రిమ్స్‌లో మాత్రం స్వచ్ఛత కనిపించడం లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment