నకిలీ పోలీసు అరెస్టు | Fake Police Gopala Krishna Arrested In Adilabad | Sakshi
Sakshi News home page

నకిలీ పోలీసు అరెస్టు

Published Wed, Jan 17 2018 7:53 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

Fake Police Gopala Krishna Arrested In Adilabad - Sakshi

ఆదిలాబాద్‌ రూరల్‌: పోలీసు అధికారిగా చెబుతూ ఆదిలాబాద్‌ ప్రాంతంలో చెలామణీ అవుతున్న నకిలీ పోలీసును జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నర్సింహారెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారిగా చెబుతూ మోసానికి పాల్పడుతున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన రంగస్వామి కన్నన్‌ గోపాలకృష్ణన్‌ను పట్టణంలోని ఎన్టీఆర్‌చౌక్‌లో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన గత పది సంవత్సరాల క్రితం ఆదిలాబాద్‌లో నివాసం ఉండి ఈ మధ్యనే వెళ్లిపోయినట్లు తెలిపారు.

గత వారం రోజుల నుంచి పట్టణంలోని ఓ లాడ్జిలో ఉంటూ ఉన్నత పోలీసు అధికారిగా చెలామణీ అవుతూ ఆదిలాబాద్‌ రైల్వే పోలీసుల వద్ద బెదిరించి రూ.2వేలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. 15 రోజుల కిందట రామగుండం రైల్వే పోలీసు అధికారితో డీఎస్పీగా పరిచయం చేసుకొని అనంతరం రైల్వే పోలీసులు విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, రూ.2వేలు అవసరం ఉందని నగదు తీసుకున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో రైల్వే పోలీసులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు వారి వద్ద నుంచి వాకిటాకీ (మ్యాన్‌ ప్యాక్‌) దొంగిలించినట్లు వివరించారు. ఇలా పలు నేరాలు చేస్తూ ఆదిలాబాద్‌లో నకిలీ పోలీసు అధికారిగా చెలామణీ అయిన రంగస్వామిని ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ ఆదేశాల మేరకు వన్‌టౌన్‌ సీఐ సురేశ్‌ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు.

ఆయన నుంచి మ్యాన్‌ప్యాక్, గ్రీన్‌ పెన్, పోలీసు బెల్ట్, లాఠీ, రెండు సెల్‌ఫోన్‌లు, డైరీ, ఆధార్‌ కార్డు, పోలీసు విజిల్, తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నకిలీ పోలీసుగా చెలామణీ అవుతూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే 83339 86898 నెంబర్‌కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. సమావేశంలో వన్‌టౌన్‌ సీఐ సురేశ్, ఎస్సైలు బి.అనిల్, ఎల్వి రమణారావు, ఐడీ పార్టీ పోలీసులు రమణ, రాంరెడ్డి, రాహత్, ఎంఏ కరీం ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement