
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ నియోకజవర్గం పరిధిలోని రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే నేతలకు సంబంధించి ఇప్పటికే పలు అంశాలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను మార్చమని, ఒకటి, అర తప్ప అందరికీ టిక్కెట్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిగా మారాయి. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో దశాబ్ధాల పాటు ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన దివంగత గడ్డం వెంకటస్వామి కుటుంబం వచ్చే ఎన్నికల్లో కూడా కీలకంగా మారనుంది.
2009 నుంచి 2014 వరకు పెద్దపల్లి లోక్‌సభ ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన గడ్డం వివేక్ ఈసారి టీఆర్‌ఎస్ నుంచి శాసనసభకు పోటీ చేయాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే వివేక్ సోదరుడు, 2004లో చెన్నూరు నుంచి ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి జి.వినోద్‌ను పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయించే ప్రతిపాదనలు సాగుతున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న బాల్క సుమన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో సైతం తనకే అవకాశం లభిస్తుందన్న ధీమాతో ఉన్నారు. అలాగే ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న గొడెం నగేష్ ఈసారి బోథ్ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ ఎంపీగా బరిలో నిలిచేందుకు పలువురు ఎస్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు.
మారుతున్న సమీకరణలు
2009 సార్వత్రిక ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యేగా వినోద్ విజయం సాధించి, వైఎస్సార్ క్యాబినెట్‌లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పదవి చేపట్టారు. 2004 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2004లో పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి వారసుడిగా వివేక్ 2009 ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దపల్లి ఎంపీగా వివేక్ విజయం సాధించారు. 2010 నుంచి ఊపందుకున్న తెలంగాణ ఉద్యమంలో నల్లాల ఓదెలు ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్‌లో కీలకపాత్ర పోషించగా, వివేక్, వినోద్ కాంగ్రెస్‌లోనే ఉన్నారు.
కేసీఆర్ పిలుపు మేరకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఓదెలు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా వినోద్‌పై రెండుసార్లు గెలుపొందారు. ఈ పరిణామాల క్రమంలో వివేక్, వినోద్ 2013లో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచే వారిద్దరు పోటీ చేస్తారని భావించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మొగ్గుచూపడంతో ఈ ఇద్దరు నాయకులు తిరిగి కాంగ్రెస్‌లో చేరి, 2014 ఎన్నికల్లో పూర్వ స్థానాల నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2017లో గడ్డం సోదరులు మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి రాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ఎంపీ వివేక్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. వీరిద్దరు టీఆర్‌లోకి వచ్చినప్పటి నుంచి 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరుపున పోటీలో ఉంటారనే ప్రచారం ఊపందుకుంది. అయితే వివేక్ ఒక్కరే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండగా, వినోద్ తెరవెనుకే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా వివేక్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వివేక్ ఎమ్మెల్యేగా గెలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో మంత్రివర్గంలో కీలక పదవి దక్కుతుందని ఆయన వర్గీయులు చెపుతున్నారు.
పోటీ ఎక్కడి నుంచి..?
వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని వివేక్ భావిస్తే ఆయనకు టిక్కెట్టు ఇవ్వక తప్పని పరిస్థితి టీఆర్‌ఎస్‌లో ఉందనేది వాస్తవం. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేదే ప్రశ్న. 2004లో తన సోదరుడు గడ్డం వినోద్ పోటీ చేసిన చెన్నూరు ఎస్‌సీ రిజర్వు స్థానం నుంచి బరిలో దిగుదామంటే 2009 నుంచి సాధారణ, ఉప ఎన్నికల్లో వరుసగా టీఆర్‌ఎస్ నుంచి విజయం సాధిస్తూ వస్తున్న నల్లాల ఓదెలును కాదనే పరిస్థితి కనిపించడం లేదు. ఇక మరో రిజర్వుడు సీటు అయిన బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వివేక్ కోసం చిన్నయ్యకు చెక్ పెడతారా అనేది కూడా అనుమానమే. దుర్గం చిన్నయ్య రాష్ట్రంలోనే నేతకాని సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే. కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటే చిన్నయ్యను కదపడం కూడా పార్టీకి చిక్కే. ఇక జిల్లాలో మిగిలిన జనరల్ సీటు మంచిర్యాల.
ఇక్కడ నుంచి నడిపెల్లి దివాకర్‌రావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌లో అంతకు ముందు రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన దివాకర్‌రావు ప్రస్తుతం ఇక్కడ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. అయినా ఏకైక జనరల్ సీటు నుంచి కూడా ఎస్సీ అభ్యర్థికి స్థానం కల్పించే సాహసం కేసీఆర్ చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలోని ధర్మపురి స్థానం ఎస్సీ రిజర్వుడు అయినప్పటికీ ఇక్కడ సీనియర్ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
అలాగే ఎంపీగా వివేక్ సోదరుడు మాజీ మంత్రి వినోద్‌ను పోటీ చేయించాలని భావిస్తుండగా, పెద్దపల్లిలో సిట్టింగ్ ఎంపీ బాల్క సుమన్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. తాను మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేయడం ఖాయమనే ధీమాతో ఉన్నారు. అయితే ‘రాజు తలుచుకుంటే... ఏదైనా సాధ్యమే’ అనే సూత్రం ప్రకారం కేసీఆర్ సీటు ఇవ్వాలనుకుంటే ఎక్కడి నుంచైనా వివేక్ సోదరులను పోటీ చేయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెపుతున్నాయి.
ఆదిలాబాద్ ఎంపీ చూపు బోథ్ వైపు...
2014 వరకు తెలుగుదేశం పార్టీ నుంచి బోథ్ ఎమ్మెల్యేగా ఉన్న గొడెం నగేష్ 2014లో టీఆర్‌ఎస్‌లో చేరి సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా విజయం సాధించారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మంత్రివర్గంలో స్థానం దక్కేదని భావిస్తున్న నగేష్ వచ్చే 2019 ఎన్నికల్లో ఆ అవకాశాన్ని కోల్పోకూడదనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా బోథ్ నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నగేష్ బోథ్‌కు వస్తారని ప్రచారం సాగుతుండడంతో ఆదిలాబాద్ ఎంపీ సీటు కోసం పోటీ పెరిగింది. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఖానాపూర్ సీటుపై కన్నేశారు. వివిధ సమీకరణాల నేపథ్యంలో ఖానాపూర్ తప్పిపోతే ఆదిలాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు కూడా సిద్ధమేనని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికల నాటికి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఇప్పటి నుంచే సవాలక్ష అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment