ఆదిలాబాద్: వచ్చే ఫిబ్రవరి నెలలోనే ముందస్తు పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు యోచిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ వేడి మొదలైంది. పంచాయతీ వ్యవస్థలో సమూల మార్పు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సంకేతాలిచ్చిన వ్యాఖ్యలతో ఎన్నికలపై చర్చ జోరందుకుంది. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా రిజర్వేషన్ ఎవరికి వస్తుంది.. ఈసారి ఎవరిని సర్పంచ్‌గా ఎన్నుకుందాం.. పార్టీల మార్పులు.. వంటి వాటిపైనే చర్చ సాగుతోంది. గత మూడు నెలలుగా సర్పంచ్‌లకు పరోక్ష ఎన్నికలు జరిపిస్తామని కేసీఆర్ సూత్రప్రాయంగా ప్రకటించినప్పటి నుంచే పల్లెల్లో రాజకీయ వాతావరణం కొంత మారినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం గ్రామ కూడళ్లలో, టీకొట్ల వద్ద పంచాయతీ ఎన్నికల విషయమై చర్చించుకుంటున్నారు. ఆశావాహులు ఇప్పటి నుంచే తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నిక పరోక్షమా..? ప్రత్యక్షమా..? అనే అంశంపై స్పష్టత రాకపోవడంతో ఏదైతే తమకు అనుకూలంగా ఉంటుందనే అంశాలపై లెక్కలు వేస్తున్నారు. బరిలో నిలవనున్న నేతలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
ఎవరికి కలిసొస్తుందో..!
2019లో జరిగే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు ప్రీఫైనల్‌గా భావించే పంచాయతీ ఎన్నికలు ముందస్తుగా నిర్వహించేందుకు కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. దీంతో జిల్లాలో ముందస్తు పంచాయతీ ఎన్నికలు ఏ పార్టీకి కలిసొస్తుందోననే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీల గుర్తుపై ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చట్టంలో మార్పులు తెస్తుందన్న సమాచారంతో పార్టీల పరంగా కూడా లెక్కలు వేస్తున్నారు. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలతోపాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని నార్నూర్ మండలాలు ఉన్నాయి. ఈ నాలుగు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ అధికారంలో ఉండడంతో ఈ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం మరో ఏడాదిన్నర పాటు అధికారంలో ఉంటుంది. దీంతో పార్టీల గుర్తులపై పంచాయతీ ఎన్నికలు జరిగితే ఫలితాలు ఆ పార్టీకి కొంత మెరుగ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి మూడున్నరేళ్లు గడుస్తుండడంతో ప్రజలు ఏ మేరకు ఆ పార్టీని ఆదరిస్తారో చూడాలి. ఇక ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తేనే పంచాయతీలపై ఆ పార్టీ పట్టు సాధించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ముందస్తు పంచాయతీ ఎన్నికలపై ఆయా పార్టీలు బలాబలాలను బేరీజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
విలీన గ్రామాలు, కొత్త పంచాయతీలపై సందిగ్ధత..
ప్రభుత్వం తరచూ ప్రకటిస్తున్న కొత్త పంచాయతీలు, నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని గత మూడున్నరేళ్లుగా ప్రభుత్వం ప్రకటిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 243 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల అధికారులు మరో 225 పంచాయతీలకు ప్రతిపాదనలు పంపారు. వీటిలో ప్రభుత్వం ఎన్నింటికి ఆమోదం తెలుపుతోందో చూడాలి. కొత్త పంచాయతీల ఏర్పాటుతోపాటు గతంలో ప్రభుత్వం మున్సిపాలిటీల్లో చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేస్తామన్న ప్రకటించింది. ఒకవేళ ఫిబ్రవరిలోనే ఎన్నికలు వస్తే విలీన గ్రామాల అంశం సందిగ్ధంలోనే ఉంటుంది. జిల్లాలో ఆదిలాబాద్ ఒక్కటే మున్సిపాలిటీ ఉంది. 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను విలీనం చేసేందుకు ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఆదిలాబాద్ జిల్లాలోని మావల మేజర్ గ్రామ పంచాయతీ, బట్టిసవర్గాం, రాంపూర్, పొన్నారి, లాండసాంగ్వి, పొచ్చర, చాందా–టి గ్రామాలు విలీనం చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. విలీన గ్రామాలపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడించడం లేదు. దీంతో ముందస్తు పంచాయతీ ఎన్నికలు జరిగితే ఈ గ్రామాలు విలీనం చేస్తారా.. లేదా అన్న సందిగ్ధత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment