pre polls
-
ముందస్తుకు బ్రిటన్ జై
లండన్: బ్రెగ్జిట్ సంక్షోభాన్ని నివారించడానికి బ్రిటన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది. బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధానమంత్రి బొరిస్ జాన్సన్ ఇచ్చిన పిలుపుకి ప్రజాప్రతినిధులందరూ అనుకూలంగా స్పందించారు. దీంతో డిసెంబర్ 12న ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడానికి జనవరి నెలఖారువరకు ఈయూ గడువు పొడిగించడంతో ఈలోగా ఎన్నికలు నిర్వహించాలని బొరిస్ జాన్సన్ భావించారు. బ్రిటన్‌లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటే ప్రధానమంత్రి ఎంపీల మద్దతుతో మాత్రమే ఆ పని చేయగలరు. ఎన్నికలకు పార్లమెంటు ఆమోదం ప్రధాని బొరిస్ జాన్సన్ ముందస్తు ఎన్నికల ప్రతిపాదనపై చర్చించిన హౌస్ ఆఫ్ కామన్స్ 438–20 తేడాతో ఆమోద ముద్ర వేసింది. బ్రెగ్జిట్ ప్రణాళికకు అనుకూలంగా ప్రజా మద్దతు కూడగట్టుకోవడానికి జాన్సన్ క్రిస్మస్ పండుగకి ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని వ్యూహరచన చేశారు. ఓటు హక్కు వయసుని 16కి తగ్గించాలని, ఓటింగ్‌లో ఈయూ పౌరులు కూడా పాల్గొనాలని, డిసెంబర్ 9న ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష లేబర్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇరు పార్టీలకూ ప్రతిష్టాత్మకమే మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న కన్జర్వేటివ్ పార్టీ ఎలాగైనా బ్రెగ్జిట్ ఒప్పందానికి ఆమోద ముద్ర పడేలా ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతోంది. కానీ బ్రెగ్జిట్ ఒప్పందాన్ని విపక్ష లేబర్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉండడంతో అది సాధ్యం కావడం లేదు. బ్రెగ్జిట్‌కు ఈయూ గడువును అక్టోబర్ 31 నుంచి 2020 జనవరి 31 వరకు పెంచిన వెంటనే ప్రధాని బొరిస్ జాన్సన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా సహకరించింది. పార్లమెంటులో మరింత బలం పెంచుకొని ఈయూకి గుడ్‌బై కొట్టేయాలని లెక్కలు వేసుకుంటున్న బొరిస్ దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఈ ఎన్నికలు అత్యంత కీలకమని ప్రజలందరూ గ్రహించాలన్నారు. బ్రిటన్ బ్రెగ్జిట్ కల సాకారమవడానికి ప్రజలందరూ చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. వామపక్షభావజాలం కలిగిన లేబర్ పార్టీ నాయకుడు జెర్మీ కార్బన్ కూడా మార్పు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఒపీనియన్ పోల్స్ అన్నీ కన్జర్వేటివ్ పార్టీకే అధికారం దక్కుతుందని అంచనా వేస్తూ ఉండడంతో కార్బన్ నేతృత్వంలో ఎలాంటి ఫలితాలు వస్తాయోనన్న ఆందోళన ఆ పార్టీ ఎంపీల్లో నెలకొని ఉంది. నాలుగేళ్లలో మూడో ఎన్నికలు బ్రిటన్‌లో గత నాలుగేళ్లలో మూడోసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రజా తీర్పులో చాలా వైరుధ్యాలు ఉన్నాయి. 2015, 2017 ఎన్నికల్లో ప్రజల మూడ్‌లో వచ్చిన మార్పు చూస్తే ఈ ఎన్నికల్లో జాన్సన్ చావో రేవో తేల్చుకోవాల్సిందేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. బ్రెగ్జిట్ ఒప్పందం ముందుకు వెళ్లాలంటే బొరిస్ జాన్సన్ కచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలి. హంగ్ పార్లమెంటు వస్తే మళ్లీ దేశంలో అనిశ్చితి తప్పదని నిపుణుల అభిప్రాయంగా ఉంది. -
ముందస్తు కోతలు
ఆ సంవత్సరం మామిడి కాపు బావుంటుంది. రెమ్మ రెమ్మకీ గుత్తులు గుత్తులుగా పిందెలుంటాయ్. తోట యజమాని ఆశగా లెక్కలు వేసుకుంటూ వుంటాడు. పిందెలు కాయలవుతాయ్. మరింత సంతోషపడ తాడు. మార్కెట్లో మామిడికి మంచి ధర కూడా ఉంటుంది. యజమాని చాలా టెన్షన్‌కి గురి అవు తాడు. రేప్పొద్దున అన్ని తోటలూ, అన్ని చెట్లూ కోత కొస్తాయ్. ఒక్కసారి రేటు పడిపోయే ప్రమాదం ఉందని యోచన చేస్తాడు. మర్నాడే, టెంక ముద రకుండానే కాయలు కోస్తాడు. మంచి ధరకి మార్కె ట్కి పంపుతాడు. మార్కెట్ వాళ్లు లేతకాయల్ని కృత్రి మంగా పండబెట్టి జనం మీదికి వదులుతారు. ఎకరాకి అవలీలగా కోటి ఆదాయం తీసే ఆదర్శ రైతు కేసీఆర్ ఇప్పుడు ముందస్తుకు వచ్చి సరిగ్గా అదే వ్యూహం అమలు చేశారు. సుఖంగా కుటుంబ సభ్యు లంతా మూడు పదవులు ఆరు శాఖలుగా రాష్ట్రాన్ని ఏలుకుంటూ ఉండగా 9 నెలలు ముందుకు కోరి తెచ్చుకున్నారనిపిస్తోంది. ‘నాలుగున్నర సంవత్స రాలు ఇంటిళ్లిపాదీ రాష్ట్ర ప్రజకే అంకితమైపోయిన పుడు మళ్లీ గెలుపు గురించి జంకెందుకు?’ అని అజ్ఞానులు కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. జనం ఎంత చేసినా ఇంకా ఏదో చెయ్యలేదనే భావనలో ఉంటారు. బంగారు తెలంగాణ చేస్తే ప్లాటినం తెలం గాణ చెయ్యలేదని అసంతృప్తి పడుతూ ఉంటారు. తాగునీరు, సాగునీరు ఇస్తే ఇంకో కుళాయిలో ఇంటిం టికీ పాలు ఇవ్వచ్చుగదా అంటారు. పాలు కూడా ఇస్తే ఇంకో నల్లాలో ‘పాపాలు’ ఇవ్వచ్చుగదా అని వాపోతారు. మీకు తెలియదు రామరాజ్యంలోనే నెగటివ్ ఓట్లు పేరుకుపోయాయ్. వాటితోనే కదా రాముడి జీవితం మీడియాపాలై, పల్చనైపోయింది. ‘కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలుంటాయ్. చేసిన వాడికే చెరుపు’ అంటూ ఓ అనుభవజ్ఞుడు చాలా బాధ పడ్డాడు. చంద్రబాబుకి ముందస్తు అనే మూడక్షరాలు వినిపిస్తే దడ. అప్పట్లో అలిపిరి సంఘటనని ఆసరా చేసుకుని సింపతీ వేవ్‌ని సృష్టించడం నల్లేరుమీద బండి నడకని భావించిన బాబు పరమ ఘోరంగా దెబ్బతిన్నారు. పాపం, ఒడ్డున వున్న వాజ్‌పేయిని కూడా ముందస్తు గోతిలోకి దింపారు. చివరకి అటల్జీకి ఐదేళ్లు దేశాన్ని పాలించామనే తృప్తి కీర్తి లేకుండా చేశారు. అందుకని చంద్రబాబు పొరబా టున కూడా ప్రిపోల్స్ మాటెత్తరని తెలుగు తమ్ముళ్లు చెబుతూ ఉంటారు. చంద్రబాబుకి దిగితే తిరిగి ఎక్కగలం అన్నది ఎప్పుడూ డౌటే. ఇప్పుడు ఇంకా ఆర్నెల్లకైనా ఎన్నికల ముందుకి రాక తప్పదు. నాలు గున్నరేళ్లు గడిచినా చంద్రబాబుకి పాకుడు రాళ్లే తప్ప కాస్త కాలు మోపి నిలబడే రాయి చిక్కనే లేదు. ‘విశ్వవిఖ్యాత కాపిటల్’ కొండకి పట్టించిన నాగలిగా, గొంగళి చందంగా మిగిలింది. లక్ష ఎకరాల్లో దాదాపు పన్నెండు పంటలు వృథా అయినాయ్. భూమాతని గొడ్రాలుగా మిగిల్చినవారు శాపగ్రస్తులవుతారని ఒక సిద్ధాంతిగారు కంటతడి పెట్టారు. నేలని పిండి నూనె తీసిన కర్ణుడు శాపగ్రస్తుడైన మాట ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు చెప్పిన పోలవరం కదల్లేదు. కబుర్లే గానీ ఫలించిన పథకం ఒక్కటీ లేదని ప్రజలు అను కుంటున్న మాట నిజం. ఇప్పుడు గడువు దగ్గర పడే సరికి ఏవేవో ఆలోచనలు పుట్టుకొస్తున్నాయ్. చివరకు ప్రధాని మోదీ ఏపీకీ శత్రువనీ, మొత్తం ఆయన వల్లే తనేమీ చేయలేకపోయానని పదే పదే మన సీఎం చెబుతున్నారు. ఇదే ప్రస్తుతం చంద్రబాబు చేతిలో ఉన్న అస్త్రం. దాన్ని పదునుపెట్టే క్రమంలో మోదీ పెద్దమనిషి కానేకాడనీ ప్రచారంలోకి దిగారు. రాష్ట్రంలో తుఫాన్ వచ్చినా, వ్యాపార సంస్థలమీద ఆదాయపన్ను దాడులు జరిగినా, వైరల్ జ్వరా లొచ్చినా మోదీ చేస్తున్న కుట్రగానే చెబుతున్నారు. దీనివల్ల ఏపీ ఓటర్లు చంద్రబాబు చిత్తశుద్ధిని శంకించ రని ఆయన ఉద్దేశం. మావూళ్లో ఒక మహిళా ఓటరు రెండు ఐడి యాలిచ్చింది. తాగుడుతో మేమంతా విసిగి వేసారి ఉన్నాం. వారానికి ఒక్కరోజు మందు బంద్ చేసినా చాలండి జనం వోట్లేస్తారంది. అమలు చేయడం కష్టం కదా అన్నాను. చంద్రబాబు చెప్పినవి ఏవి అమలు చేశారు కాబట్టి.. అని పెదవి విరిచింది. ఇక రెండో ఐడియా ఏవిటన్నాను. అందరితో ఎడాపెడా పొత్తు పెట్టుకోవడమే అన్నదా మహిళ. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ముందస్తు.. ఫలితాలు ఇలా..!
నిర్ణీత కాలవ్యవధి కంటే దాదాపు ఏడెనిమిది నెలల ముందే తెలంగాణ శాసనసభ రద్దుకు కేబినెట్ చేసిన తీర్మానాన్ని సీఎం కేసీఆర్ సమర్పించిన కొద్ది సేపటికే గవర్నర్ దానిపై ఆమోదముద్రవేశారు. ఇలా గడువు కంటే ముందే పలు సందర్భాల్లో లోక్‌సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు కూడా రద్దయిన జాబితాలో ఉన్నాయి. ఈ విధంగా చట్టసభల పూర్తికాలం ముగియకుండానే లోక్‌సభ/ అసెంబ్లీలు రద్దయ్యాక జరిగిన ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయన్నది ఆసక్తికరంగా మారింది. అలాంటి సందర్భాల్లో కొన్ని... లోక్‌సభకు... లోక్‌సభ కాల పరిమితి ముగిసేందుకు ఇంకా ఏడాది సమయం ఉండగానే 1970 చివర్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దానిని రద్దు చేసి 1971 మార్చిలో ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఆమె నేతత్వంలోని కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించింది. గడువు ప్రకారం 2004 సెప్టెంబర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉండగా, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాష్ట్ర శాసనసభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే వత్తిడిని ప్రధాని ఏబీ వాజ్‌పేయిపై తీసుకొచ్చారు. విశ్వసనీయ భాగస్వామ్యపక్షంగా ఉన్న టీడీపీ ఒత్తిళ్ల నేపథ్యంలో వాజ్‌పేయి లోక్‌సభను కూడా రద్దు చేసి 2004 ఏప్రిల్ / మే లలో ఎన్నికలకు వెళ్లగా కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ, ఏపీలో చంద్రబాబు నేతత్వంలోని టీడీపీ,బీజేపీ కూటమి ఓటమి చవిచూశాయి. అసెంబ్లీలకు... 1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఎన్టీరామారావు సీఎం అయ్యాక 1984 ఆగస్టులో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. తదనంతర పరిణామాల్లో నెలరోజుల పాటు నాదెండ్ల భాస్కరరావు సీఎంగా వ్యవహరించారు. ప్రభుత్వం మనుగడ సాధించేందుకు అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకపోవడంతో ఆ ప్రభుత్వం పడిపోయింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ ఎన్టీఆర్ గూటికి చేరుకున్నా పార్టీ / ప్రభుత్వంలో అసంతప్తి లేకుండా చేసేందుకు 1984 నవంబర్‌లో ఎన్టీఆర్ అసెంబ్లీ రద్దుచేశారు. 1985 మార్చిలో జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సాధించి ఆయన మళ్లీ సీఎం అయ్యారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు 1992లో జరగాల్సి ఉండగా, 1991లోనే అప్పటి సీఎం జ్యోతిబసు రద్దుచేశారు. 1991లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికలతో పాటు బెంగాల్ ఎన్నికలు కూడా నిర్వహించారు. ఆ ఎన్నికల్లో సీపీఎం ఆధ్వర్యంలోని లెఫ్ట్‌ఫ్రంట్ గెలుపొంది జ్యోతిబసు మళ్లీ సీఎం అయ్యారు. 2003 మార్చి వరకు శాసనసభ కాలపరిమితి ఉన్నా (9 నెలలు ముందుగానే) గోధ్రా అల్లర్లు, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలను సమర్థవంతంగా నియంత్రించిన నేపథ్యంలో 2002 లోనే అప్పటి సీఎం నరేంద్రమోదీ గుజరాత్ అసెంబ్లీని రద్దుచేశారు. ఆ తర్వాత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో మోదీ మళ్లీ సీఎం అయ్యారు. 2004 సెప్టెంబర్/ అక్టోబర్ వరకు ఏపీ (అవిభాజ్య) అసెంబ్లీ పూర్తయ్యేందుకు గడువు మిగిలి ఉన్నా, అలిపిరి వద్ద నక్సల్స్ జరిపిన దాడి నుంచి బయటపడిన సానుభూతి పనిచేస్తుందనే నమ్మకంతో అప్పటి సీఎం చంద్రబాబు 2003 నవంబర్లోనే శాసనసభ రద్దుచేశారు. 2004 ఏప్రిల్ / మేలో లోక్‌సభతో కలిసి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నేతత్వంలోని టీడీపీ ఓటమిపాలైంది. అయితే నిర్ణీత కాల వ్యవధి ముగియకుండానే వివిధ రాష్ట్రాల అసెంబ్లీల రద్దుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేసినా వాటిని ఆమోదించని సందర్భాలు కూడా ఉన్నాయి. సర్కారియా కమిషన్ నివేదికలోని వివరాలను బట్టి 1967లో పంజాబ్, 1968లో ఉత్తరప్రదేశ్‌లో, 1969లో మధ్యప్రదేశ్, 1971లో ఒరిస్సా ప్రభుత్వాలు శాసనసభ రద్దుకు చేసిన విజ్ఞప్తులను అంగీకరించలేదు. 2003లోనూ యూపీ సీఎంగా ఉన్న మాయవతికి కూడా అసెంబ్లీ రద్దుకు అనుమతి లభించలేదు. -
పల్లెల్లో ‘పంచాయతీ’ చర్చ
ఆదిలాబాద్: వచ్చే ఫిబ్రవరి నెలలోనే ముందస్తు పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు యోచిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ వేడి మొదలైంది. పంచాయతీ వ్యవస్థలో సమూల మార్పు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సంకేతాలిచ్చిన వ్యాఖ్యలతో ఎన్నికలపై చర్చ జోరందుకుంది. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా రిజర్వేషన్ ఎవరికి వస్తుంది.. ఈసారి ఎవరిని సర్పంచ్‌గా ఎన్నుకుందాం.. పార్టీల మార్పులు.. వంటి వాటిపైనే చర్చ సాగుతోంది. గత మూడు నెలలుగా సర్పంచ్‌లకు పరోక్ష ఎన్నికలు జరిపిస్తామని కేసీఆర్ సూత్రప్రాయంగా ప్రకటించినప్పటి నుంచే పల్లెల్లో రాజకీయ వాతావరణం కొంత మారినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం గ్రామ కూడళ్లలో, టీకొట్ల వద్ద పంచాయతీ ఎన్నికల విషయమై చర్చించుకుంటున్నారు. ఆశావాహులు ఇప్పటి నుంచే తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నిక పరోక్షమా..? ప్రత్యక్షమా..? అనే అంశంపై స్పష్టత రాకపోవడంతో ఏదైతే తమకు అనుకూలంగా ఉంటుందనే అంశాలపై లెక్కలు వేస్తున్నారు. బరిలో నిలవనున్న నేతలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎవరికి కలిసొస్తుందో..! 2019లో జరిగే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు ప్రీఫైనల్‌గా భావించే పంచాయతీ ఎన్నికలు ముందస్తుగా నిర్వహించేందుకు కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. దీంతో జిల్లాలో ముందస్తు పంచాయతీ ఎన్నికలు ఏ పార్టీకి కలిసొస్తుందోననే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీల గుర్తుపై ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చట్టంలో మార్పులు తెస్తుందన్న సమాచారంతో పార్టీల పరంగా కూడా లెక్కలు వేస్తున్నారు. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలతోపాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని నార్నూర్ మండలాలు ఉన్నాయి. ఈ నాలుగు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ఈ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం మరో ఏడాదిన్నర పాటు అధికారంలో ఉంటుంది. దీంతో పార్టీల గుర్తులపై పంచాయతీ ఎన్నికలు జరిగితే ఫలితాలు ఆ పార్టీకి కొంత మెరుగ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి మూడున్నరేళ్లు గడుస్తుండడంతో ప్రజలు ఏ మేరకు ఆ పార్టీని ఆదరిస్తారో చూడాలి. ఇక ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తేనే పంచాయతీలపై ఆ పార్టీ పట్టు సాధించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ముందస్తు పంచాయతీ ఎన్నికలపై ఆయా పార్టీలు బలాబలాలను బేరీజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. విలీన గ్రామాలు, కొత్త పంచాయతీలపై సందిగ్ధత.. ప్రభుత్వం తరచూ ప్రకటిస్తున్న కొత్త పంచాయతీలు, నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని గత మూడున్నరేళ్లుగా ప్రభుత్వం ప్రకటిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 243 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల అధికారులు మరో 225 పంచాయతీలకు ప్రతిపాదనలు పంపారు. వీటిలో ప్రభుత్వం ఎన్నింటికి ఆమోదం తెలుపుతోందో చూడాలి. కొత్త పంచాయతీల ఏర్పాటుతోపాటు గతంలో ప్రభుత్వం మున్సిపాలిటీల్లో చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేస్తామన్న ప్రకటించింది. ఒకవేళ ఫిబ్రవరిలోనే ఎన్నికలు వస్తే విలీన గ్రామాల అంశం సందిగ్ధంలోనే ఉంటుంది. జిల్లాలో ఆదిలాబాద్ ఒక్కటే మున్సిపాలిటీ ఉంది. 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను విలీనం చేసేందుకు ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఆదిలాబాద్ జిల్లాలోని మావల మేజర్ గ్రామ పంచాయతీ, బట్టిసవర్గాం, రాంపూర్, పొన్నారి, లాండసాంగ్వి, పొచ్చర, చాందా–టి గ్రామాలు విలీనం చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. విలీన గ్రామాలపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడించడం లేదు. దీంతో ముందస్తు పంచాయతీ ఎన్నికలు జరిగితే ఈ గ్రామాలు విలీనం చేస్తారా.. లేదా అన్న సందిగ్ధత నెలకొంది. -
ముందస్తు ఎన్నికలకు సై..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోగి మంటలతో పాటే రాజకీయ వేడి కూడా రాజుకొంటోంది. గడువు కన్నా ఆరునెలల ముందే లోక్‌సభతో పాటు ఎనిమిది రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ యోచిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడంతో పాటు ప్రజాకర్షక పథకాలను అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రైతాంగానికి మేలు చేసే రెండు కీలక పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. ‘వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్’ను ఈనెల ఒకటో తేదీ నుంచే అమలు చేస్తున్నారు. ఎకరాకు రూ.4వేల ‘పెట్టుబడి’ అందించే ప్రక్రియ మే నుంచి ప్రారంభం కాబోతుంది. అదే సమయంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, పార్టీ జిల్లా, నియోజకవర్గ పరిశీలకులకు ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర స్థాయిలో ఊపు పెంచింది. టీడీపీ నుంచి అనుముల రేవంత్‌రెడ్డి వచ్చి చేరడంతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో తన గళం పెంచింది. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్న బీజేపీ తనకు పట్టున్న పట్టణ నియోజకవర్గాల్లోనైనా సత్తా చాటాలని భావిస్తోంది. రాష్ట్ర స్థాయిలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలను ఉమ్మడి జిల్లాలో కూడా అన్ని పార్టీల నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సీరియస్‌గా తీసుకుంటున్నారు. సంవత్సరాంతానికి ముందస్తుగా ఎన్నికలు వచ్చినా ఢీకొనాలని ఉవ్విళ్లూరుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 10 నియోజకవర్గాల్లో సాంకేతికంగా ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు పార్లమెంటు సీట్లు కూడా ఆ పార్టీవే. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి సిట్టింగుల్లో ఎవరెవరి స్థానాలు పదిలంగా ఉంటాయో, ఎవరి సీట్లను కొత్తవారికి అప్పగిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి ఎమ్మెల్యే ‘నా సీటు జోలికి రారు’ అనే ధీమాతో ఉన్నట్టే కనిపిస్తున్నా... అంతర్గతంగా మాత్రం కొందరిలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీ నేతలంతా టీఆర్ఎస్లో చేరడం, బీఎస్పీ, కాంగ్రెస్ నుంచి గెలిచిన ముగ్గురు సిట్టింగ్‌లు సైతం టీఆర్ఎస్ గూటికే వచ్చి సెటిలై పోవడంతో వచ్చే ఎన్నికల్లో సీట్ల విషయంలోనే అనిశ్చితి ఏర్పడింది. ప్రజాదరణ పొందుతూ వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న సిట్టింగ్‌లకు ఢోకా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో ఖానాపూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్, బోథ్ వంటి నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ల సీట్ల కోసం పార్టీలోనే పోటీదారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికతో ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు కీలక నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరారు. మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావు, సిర్పూర్ నుంచి రావి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం వీరే అనధికారిక కాంగ్రెస్ అభ్యర్థులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్, నవంబర్లలో ఉమ్మడి జిల్లాలో ఆదివాసీలు, లంబాడాల మధ్య మొదలైన వివాదం కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా అనుకూలించేదిగా మారింది. బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావు, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో టీఆర్ఎస్ ఆదివాసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందనే భావనను పెంపొందించారు. ఈ ఆదివాసీల ప్రభావం ఉమ్మడి జిల్లాలోని ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలతో పాటు సిర్పూర్, ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానాలపై కూడా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై కూడా ఆదివాసీల ప్రభావం అధికంగా ఉండనుంది. ఈ పరిణామాలన్నీ తమకు అనుకూలిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. మంచిర్యాలలో టిక్కెట్టు ఆశిస్తున్న కె.ప్రేంసాగర్‌రావు, ఎం.అరవింద్‌రెడ్డి చెరో దారిలో ఉన్నారు. ఇక్కడ ఎవరికి టిక్కెట్టు వచ్చినా, మరో నాయకుడు సహకరించే పరిస్థితి లేదు. నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. ఆదిలాబాద్‌లో ముగ్గురు నేతల మధ్య రాజకీయం టీఆర్ఎస్కు అనుకూలించే పరిస్థితి. ఈ మేరకు నాయకులంతా ‘ముందస్తు’ ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. పట్టణాల్లో పట్టు కోసం బీజేపీ దేశంలో అధికారంలో ఉన్నా... రాష్టంలో ఆశించిన స్థాయిలో ఎదగలేమనే నిర్ధారణకు వచ్చిన బీజేపీ తనకు పట్టున్న ప్రాంతాలపైనే దృష్టి పెట్టింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎదిగే పరిస్థితులు, సమయం లేదని భావిస్తున్న ఆపార్టీ పట్టణ ప్రాంతాలపై దృష్టి పెడుతోంది. ఉమ్మడి జిల్లాలో మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ సంస్థాగత బలం ఉన్న మంచిర్యాల, బెల్లంపల్లి, ఆదిలాబాద్, ముధోల్, నిర్మల్ వంటి నియోజకవర్గాలపై ప్రధాన దృష్టి పెడుతోంది. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల వైఫల్యాలు, వారిపై వచ్చిన ఆరోపణలను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావడంతో పాటు ప్రధానమంత్రి చరిష్మాను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. మంచిర్యాల పట్టణంలో పార్టీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై ప్రజల్లోకి వెళ్తున్నట్లు ఆయన ‘సాక్షి’కి చెప్పారు. కాగా మిగతా పార్టీల్లో టీడీపీ నామ్‌కే వాస్తేగా మిగిలిపోనుండగా, బెల్లంపల్లిలో పోరుకు సీపీఐ సన్నద్ధమవుతోంది. -
కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు: పల్లంరాజు
తెలంగాణ ఏర్పాటు వల్ల సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు మరింతమంది రాజీనామా చేసే అవకాశముందని, దీనివల్ల కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చన్న ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వ్యాఖ్యలతో కేంద్ర మంత్రి పల్లంరాజు ఏకీభవించారు. పవార్ అనుభజ్ఞుడైన నేతని, ఆయన మాటల్లో నిజం ఉండొచ్చని పల్లంరాజు అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రుల బృందం కూడా సీమాంధ్రులకు న్యాయం చేయకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని పల్లంరాజు అన్నారు. కాగా ఇటీవల ప్రధానిని కలసి తన రాజీనామాను ఆమోదించమని కోరిన పల్లంరాజు మళ్లీ రాజీనామా మాట ఎత్తడం గమనార్హం. తూర్పుగోదావరికి వచ్చిన కేంద్ర మంత్రికి స్థానికుల నుంచి నిరసన ఎదురైంది.