నిర్ణీత కాలవ్యవధి కంటే దాదాపు ఏడెనిమిది నెలల ముందే తెలంగాణ శాసనసభ రద్దుకు కేబినెట్ చేసిన తీర్మానాన్ని సీఎం కేసీఆర్ సమర్పించిన కొద్ది సేపటికే గవర్నర్ దానిపై ఆమోదముద్రవేశారు. ఇలా గడువు కంటే ముందే పలు సందర్భాల్లో లోక్‌సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు కూడా రద్దయిన జాబితాలో ఉన్నాయి. ఈ విధంగా చట్టసభల పూర్తికాలం ముగియకుండానే లోక్‌సభ/ అసెంబ్లీలు రద్దయ్యాక జరిగిన ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయన్నది ఆసక్తికరంగా మారింది.
అలాంటి సందర్భాల్లో కొన్ని...
లోక్‌సభకు...
లోక్‌సభ కాల పరిమితి ముగిసేందుకు ఇంకా ఏడాది సమయం ఉండగానే 1970 చివర్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దానిని రద్దు చేసి 1971 మార్చిలో ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఆమె నేతత్వంలోని కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించింది. గడువు ప్రకారం 2004 సెప్టెంబర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉండగా, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాష్ట్ర శాసనసభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే వత్తిడిని ప్రధాని ఏబీ వాజ్‌పేయిపై తీసుకొచ్చారు. విశ్వసనీయ భాగస్వామ్యపక్షంగా ఉన్న టీడీపీ ఒత్తిళ్ల నేపథ్యంలో వాజ్‌పేయి లోక్‌సభను కూడా రద్దు చేసి 2004 ఏప్రిల్ / మే లలో ఎన్నికలకు వెళ్లగా కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ, ఏపీలో చంద్రబాబు నేతత్వంలోని టీడీపీ,బీజేపీ కూటమి ఓటమి చవిచూశాయి.
అసెంబ్లీలకు...
1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఎన్టీరామారావు సీఎం అయ్యాక 1984 ఆగస్టులో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. తదనంతర పరిణామాల్లో నెలరోజుల పాటు నాదెండ్ల భాస్కరరావు సీఎంగా వ్యవహరించారు. ప్రభుత్వం మనుగడ సాధించేందుకు అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకపోవడంతో ఆ ప్రభుత్వం పడిపోయింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ ఎన్టీఆర్ గూటికి చేరుకున్నా పార్టీ / ప్రభుత్వంలో అసంతప్తి లేకుండా చేసేందుకు 1984 నవంబర్‌లో ఎన్టీఆర్ అసెంబ్లీ రద్దుచేశారు. 1985 మార్చిలో జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సాధించి ఆయన మళ్లీ సీఎం అయ్యారు.
పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు 1992లో జరగాల్సి ఉండగా, 1991లోనే అప్పటి సీఎం జ్యోతిబసు రద్దుచేశారు. 1991లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికలతో పాటు బెంగాల్ ఎన్నికలు కూడా నిర్వహించారు. ఆ ఎన్నికల్లో సీపీఎం ఆధ్వర్యంలోని లెఫ్ట్‌ఫ్రంట్ గెలుపొంది జ్యోతిబసు మళ్లీ సీఎం అయ్యారు. 2003 మార్చి వరకు శాసనసభ కాలపరిమితి ఉన్నా (9 నెలలు ముందుగానే) గోధ్రా అల్లర్లు, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలను సమర్థవంతంగా నియంత్రించిన నేపథ్యంలో 2002 లోనే అప్పటి సీఎం నరేంద్రమోదీ గుజరాత్ అసెంబ్లీని రద్దుచేశారు. ఆ తర్వాత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో మోదీ మళ్లీ సీఎం అయ్యారు.
2004 సెప్టెంబర్/ అక్టోబర్ వరకు ఏపీ (అవిభాజ్య) అసెంబ్లీ పూర్తయ్యేందుకు గడువు మిగిలి ఉన్నా, అలిపిరి వద్ద నక్సల్స్ జరిపిన దాడి నుంచి బయటపడిన సానుభూతి పనిచేస్తుందనే నమ్మకంతో అప్పటి సీఎం చంద్రబాబు 2003 నవంబర్‌లోనే శాసనసభ రద్దుచేశారు. 2004 ఏప్రిల్ / మేలో లోక్‌సభతో కలిసి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నేతత్వంలోని టీడీపీ ఓటమిపాలైంది. అయితే నిర్ణీత కాల వ్యవధి ముగియకుండానే వివిధ రాష్ట్రాల అసెంబ్లీల రద్దుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేసినా వాటిని ఆమోదించని సందర్భాలు కూడా ఉన్నాయి. సర్కారియా కమిషన్ నివేదికలోని వివరాలను బట్టి 1967లో పంజాబ్, 1968లో ఉత్తరప్రదేశ్‌లో, 1969లో మధ్యప్రదేశ్, 1971లో ఒరిస్సా ప్రభుత్వాలు శాసనసభ రద్దుకు చేసిన విజ్ఞప్తులను అంగీకరించలేదు. 2003లోనూ యూపీ సీఎంగా ఉన్న మాయవతికి కూడా అసెంబ్లీ రద్దుకు అనుమతి లభించలేదు.
Comments
Please login to add a commentAdd a comment