దేశంలో ఎన్నికల సందర్భం వచ్చినప్పుడల్లా ప్రజాస్వామ్యం నగుబాటు పాల వడం రివాజుగా మారింది. ఓటర్లకు మోసపూరిత వాగ్దానాలు చేయడం, అధికారం అప్పగిస్తే వారికి అన్నీ ఉచితంగా పంచిపెడతామనడం, డబ్బులు పంపిణీ చేయడం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో సర్వసాధారణమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఈ అవలక్షణాలు కనబడుతున్నాయి. కేంద్ర స్థాయిలో పెద్దల సభగా మన్ననలు పొందే రాజ్యసభకూ, రాష్ట్రాల్లో ఆ స్థాయి సభగా పిల్చుకునే శాసన మండలికీ జరిగే ఎన్నికలు కూడా ఇందుకు మినహాయింపుగా లేవని ఈమధ్య కాలంలో తరచు రుజువవుతున్నది. మన ప్రజాప్రతినిధుల వద్దకు ఎవరైనా రహస్య కెమెరాలతో వెళ్తే చాలు...మన ప్రజాస్వామ్యం అసలు రంగు బయటపడటం పెద్ద కష్టం కాదని పదే పదే వెల్లడవుతోంది. నిరుడు తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల సందర్భంలో టీడీపీ నేత రేవంత్ రెడ్డి టీఆర్‌ఎస్ శాసనసభ్యుడొకరికి కోట్ల రూపాయలు ఎరజూపుతూ నోట్ల కట్టలతో వీడియోకు దొరికిపోయారు.
అదే శాసనసభ్యుడితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన సంభాషణల ఆడియో టేపులు కూడా బయటపడ్డాయి. ‘మీకిచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చే బాధ్యత నాద’ని టీఆర్‌ఎస్ శాసనసభ్యుడికి బాబు హామీ ఇవ్వడం అంద రినీ దిగ్భ్రమపరిచింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు నెలల క్రితం నారద న్యూస్‌పోర్టల్ సంస్థ తృణమూల్ కాంగ్రెస్ నేతలపై జరిపిన స్టింగ్ ఆపరేషన్‌ను బయటపెట్టింది. ఈమధ్య జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటకకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమ ఓటుకు ముట్టజెప్పాల్సిన డబ్బు గురించి బేరసారాలాడుతూ స్టింగ్ ఆపరేషన్‌కు పట్టుబడ్డారు.
తెలంగాణలో సాగిన ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో దొరికిపోయినా ఏ కేసూ లేకుండా చూసుకోగలిగా నన్న ధీమాతో కావొచ్చు...ఏపీ నుంచి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సైతం అదే పాచికను ప్రయోగించడానికి బాబు తెగ ఉత్సాహపడ్డారు. అందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు కూడా. విజయవాడ నగరానికి ఎన్నికల వేదికను మార్చ డానికి ఎన్నికల సంఘం అంగీకరించకపోవడం... ముగ్గురిని మాత్రమే గెలుచు కోగలిగే స్థితి ఉన్నప్పుడు నాలుగో అభ్యర్థిని దించితే మీతోపాటు మా పరువు కూడా పోతుందని బీజేపీ అగ్రనాయకత్వం హెచ్చరించడంలాంటి పరిణామాలతో మాత్రమే ఆయన వెనక్కు తగ్గారని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. నాయకు లనుకుంటున్నవారు ఎంతగా దిగజారుతున్నారో, విలువలు ఏ స్థాయిలో పతన మవుతున్నాయో ఈ ఉదంతాలన్నీ రుజువు చేస్తున్నాయి.
మౌలికంగా రాజ్యసభ రాష్ట్రాల సభ. వివిధ రాష్ట్రాల అసెంబ్లీల నుంచి ఎన్నికైన ప్రతినిధులు ఇందులో ఉండాలన్నది మన రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం. వేర్వేరు రంగాల్లో నిష్ణాతులైనవారిని ఈ సభకు ఎంపిక చేస్తే వారిచ్చే సలహాలు, సూచ నలు... అక్కడ జరిగే చర్చలు సమర్ధవంతమైన పాలనకు దోహదపడతాయన్నది వారి ఆలోచన. వారి ఉద్దేశాలతో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను పోల్చి చూస్తే మన రాజకీయ వ్యవస్థ ఎంతగా పతనమైందన్నది స్పష్టమవుతుంది. చాలా సందర్భాల్లో పారిశ్రామికవేత్తలనూ, భారీగా డబ్బులివ్వడానికి సిద్ధపడేవారినీ, అవ తలి పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కోగలిగిన సామర్ధ్యం ఉన్నవారినీ పార్టీలు ఎంపిక చేస్తున్నాయి. విలాసపురుషుడిగా ప్రసిద్ధికెక్కిన విజయ్‌మాల్యా బ్యాంకు బకాయి లను చెల్లించకుండా,తన సంస్థల్లో వేలాదిమంది ఉద్యోగులకు జీతాలివ్వకుండా కాలక్షేపం చేసినా రాజ్యసభకు సునాయాసంగా ఎంపిక కాగలిగారంటే పరిస్థితులు ఏ స్థితికి చేరుకున్నాయో అర్ధమవుతుంది.
ఈనెల 11న ఉత్తరప్రదేశ్(11), మధ్యప్రదేశ్(3), ఉత్తరాఖండ్(1), జార్ఖండ్ (2), కర్ణాటక (4), హర్యానా(2), రాజస్థాన్(4)లనుంచి రాజ్యసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఆరు రాష్ట్రాల్లోనూ ప్రతిచోటా అదనంగా ఒకరు పోటీలో ఉన్నారు. ఒక్క ఉత్తరాఖండ్‌లో మాత్రం ఒకే ఒక్క సీటు కోసం ముగ్గురు పోటీపడు తున్నారు. ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు ‘అంతరాత్మ’కూ, దాని ప్రబోధానికీ గిరాకీ ఏర్పడింది. అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటేయండన్న ప్రచారం ఊపందుకుంది. అందులోని అంతరార్ధం ఏమిటో పరాయి రాష్ట్రాల్లో వెలుస్తున్న క్యాంపులే చెబుతు న్నాయి. భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయన్న కథనాలు వస్తున్నాయి. బలం లేకపోయినా పోటీకి దిగినవారిలో అత్యధికులు వ్యాపారవేత్తలే. కర్ణాటక లాంటిచోట స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి అమ్ముడుపోతున్న ఎమ్మెల్యేల వైనాన్ని కొన్ని చానెళ్లు వెల్లడించినా ఎన్నికల సంఘం ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉంది.
సాధారణంగా స్టింగ్ ఆపరేషన్లలో డబ్బుల ప్రస్తావన, రేటు విషయం లాంటివి మినహా నిజంగా నోట్ల కట్టలు చేతులు మారుతున్న వైనం వెల్లడికాదు (రేవంత్ రెడ్డి వ్యవహారం ఇందుకు మినహాయింపు. ఆయన నోట్ల కట్టలతో దొరికిపోయారు). అందువల్ల ఎన్నికల సంఘం చర్య తీసుకోవడం సాధ్యం కాదు. ఒకవేళ అక్రమాలు జరిగాయని రుజువైనా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల తరహాలో రాజ్యసభ ఎన్నికలను రద్దు చేయడం వీలుకాదు. 2012లో జార్ఖండ్ నుంచి రెండు స్థానాలకు జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను ఎన్నికల సంఘం రద్దు చేసింది. అయితే అక్కడ నుంచి పోటీపడుతున్న అభ్యర్థి వాహనంనుంచి రూ. 215 కోట్లు పట్టుబడటంవల్ల అది సాధ్యమైంది. అది ఎమ్మెల్యేలకు పంచిపెట్టడానికేననడానికి రుజువేమిటని ఒక పిటిషన్ దాఖలైనా దాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు తోసిపుచ్చింది.
దేశంలో ఎన్నికల వ్యవస్థను ఈ స్థితికి దిగజార్చడం చేజేతులా ప్రజాస్వామ్య సౌధాన్ని కూల్చుకోవడమేనని అక్రమాలకు పాల్పడుతున్న పార్టీలు, నాయకులు గమనించాలి. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంపై ప్రజలకుండే నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని...అదే జరిగితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని తెలుసుకోవాలి. ఎన్నికల ప్రక్రియ సమూల ప్రక్షాళనకు అన్ని పార్టీలూ ముందుకు రావాలి.
ప్రజాస్వామ్య పునాదులను పెకిలించడానికి పెద్దగా శ్రమించవలసిన పనిలేదు. ఒక పార్టీనుంచి మరొక పార్టీకి గెంతితే చాలు.
- రబీ రే, లోక్‌సభ మాజీ స్పీకర్, సోషలిస్టు రాజకీయ నేత