ప్రాంతీయ అస్తిత్వాలపై దొంగ దెబ్బ
ప్రాంతీయ అస్తిత్వాలపై దొంగ దెబ్బ
Published Fri, Jan 27 2017 12:27 AM | Last Updated on Sat, Mar 9 2019 3:59 PM
సమకాలీనం
లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికల వల్ల వ్యయం భారీగా తగ్గుతుందని, ఐదేళ్లు ప్రభుత్వాలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చని అంటున్నారు. కానీ దీనివల్ల నష్టాలను ప్రస్తావించడం లేదు. ఐదేళ్లకు లైసెన్సు అన్నట్టు ప్రభుత్వాలు నిరంకుశంగా ప్రవర్తించకుండా మధ్య, మధ్య జరిగే ఎన్నికలు అడ్డుకుంటాయని వాదన ఉంది. ఇది, జాతీయ సమస్యలపై ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల ప్రాభవాన్ని తగ్గించవచ్చనే జాతీయ పార్టీల దురాశనీ, ప్రాంతీయ అకాంక్షలకు, అస్థిత్వాలకు ముప్పు అని విమర్శకులు భావిస్తున్నారు.
రాజుకు ఏడుగురు కొడుకులు. వేటకు వెళ్లి ఏడు చేపలు తెచ్చారు. ఎండ బెడితే ఒకటి ఎండలేదు. చేపాచేపా ఎందుకు ఎండలేదంటే, గడ్డిమోపు అడ్డొ చ్చిందని... ఎందుకడ్డొచ్చావంటే ఆవు మేయలేదని... ఎందుకు మేయలే దంటే, పనివాడు మేపలేదని... ఎందుకు మేపలేదంటే, అవ్వ బువ్వ పెట్టలే దని... ఎందుకు పెట్టలేదంటే, చంటాడు ఏడ్చాడని, ఎందుకు ఏడ్చావంటే? చీమ కుట్టిందని! చీమా! చీమా! ఎందుకు కుట్టావంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా! అందనేది పాత కథ. గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా రాష్ట్రపతి ప్రసంగమైనా, ఓటర్ దినోత్సవంలో గవర్నర్ అభిభాష ణైనా... సారమొక్కటే, సంస్కరణలు రావాలి, భారత ప్రజాస్వామ్యం మరింత పరిపుష్టం కావాలి. ఓటరు బలోపేతమై జనాభిప్రాయానికి ప్రాధా న్యత పెరగాలి. మరి ఎందుకు జరగట్లేదు? పైన చెప్పిన కథలాగే అదో పెద్ద గొలుసు ప్రక్రియ. కడకు ఎక్కడొచ్చి ఆగుతుందంటే, మన రాజకీయ వ్యవస్థ వద్ద! తక్షణం ప్రక్షాళన చేయాల్సిన వాటిలో కీలకమైంది రాజకీయ రంగమే. నల్ల సంపదకు వ్యతిరేకంగా యావత్ దేశం యజ్ఞం చేస్తోంది, కానీ రాజకీయ వ్యవస్థ ఆజ్యం పోస్తున్న అక్రమార్జన మూలాల్ని కత్తిరించం. పన్ను ఎగవేత సంస్కృతికి పగ్గమేయాలంటాం కానీ, రాజకీయ పార్టీలకొచ్చే విరాళాలకు లెక్కపక్కాలుండవు. పాలనా వ్యవస్థల్లో పారదర్శకత కావాలంటాం కానీ, పార్టీల అంతర్గత వ్యవహారాలపై గోప్యత ముసుగు తీయం. లోక్‌సభ, శాసన సభలకు శాశ్వత ప్రాతిపదికన జమిలి ఎన్నికలంటాం కానీ, సాధ్యాసాధ్యాల పైన, స్థానిక ప్రజల ఆకాంక్షలు, అభీష్టాలపైన నిర్మాణాత్మక చర్చ జరపం. ఇదీ వర్తమాన భారతం! పార్టీలకు లభించే విరాళాలపై నిఘా, నియంత్రణ లేకుండా ఎన్నికల ప్రచార వ్యయానికి ప్రజాధనాన్ని వెచ్చించడం ఎలా సమం జసమనే ప్రశ్న తలెత్తుతోంది. ఓసారి ఎన్నికైతే చాలు, జనాభిప్రాయానికి కించిత్తు విలువివ్వకుండా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపే ప్రభుత్వాలు... అయిదేళ్ల దాకా దేశంలో ఎక్కడా ఇక ఎన్నికలే లేవంటే ఎలా వ్యవహరిస్తాయో ఊహించడం దుర్భరమంటున్నాయి ప్రజాసంఘాలు. ఎన్నికల సంస్కరణ లపై నిర్మాణాత్మక చర్చ జరగాలంటూనే, ఇప్పుడున్న పలు విధానాలు 'పకడ్బందీగా' లేవని రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేసిన దరిమిలా కొన్ని కీల కాంశాలు తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల సంస్కరణల్ని విడిగా చూడలేము, అవీ స్థూల రాజకీయ సంస్కరణల్లో భాగంగా జరగాల్సిందేనన్న అభిప్రాయం దృఢంగా వ్యక్తమౌతోంది.
ఉద్యమాలపై ఉక్కు పాదానికి లైసెన్స్
మొన్న తమిళనాడులో జల్లికట్టు, నిన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా.... రేపు మరోటి! రాజకీయాలకతీతంగా జనాభిప్రాయం ఉవ్వెత్తున ఎగిసిపడ్డ కీలకాం శాలు. వీటిని లక్ష్యపెట్టకుంటే ఎలా? ఏపీలో పాలకపక్షమైన తెలుగుదేశం కేంద్రంలోని ఎన్డీఏలో భాగమై జనాందోళనల్ని అణగదొక్కుతున్న తీరు కళ్లకు కట్టింది. 'ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా, అధికారంలో ఉన్నాం మాకు తోచిందే చేస్తాం!' అన్న వ్యవహార శైలి రాజకీయ నిరంకుశత్వానికి ప్రతీక! సాక్షాత్తూ గణతంత్ర దినోత్సవం రోజున విశాఖ విమానాశ్రయంలో విపక్షనేతను నిర్బం ధించిన తీరు, శాంతియుత నిరసనను అడ్డుకున్న వైనం పాలకపక్ష దురహం కారాన్ని తేటతెల్లం చేసింది.
లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు జమిలిగా జరగా లనే ప్రతిపాదనను ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు తోస్తోంది. రాష్ట్రపతి గణతంత్ర ప్రసంగంలోనూ ఇది వ్యక్తమైంది. స్వతంత్రపు తొలినాళ్లలో ఇలాగే జరిగిందనీ ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు జమిలి ఎన్నికలు మొదలైనా... కాలం క్రమేణా రకరకాల కారణాల వల్ల వివిధ రాష్ట్రాల శాసన సభల ఎన్ని కలు విడిగా జరగడం, వాటి శాసనసభా కాలాలు ముగియడం మారడం అనివార్యం. అస్పష్ట ప్రజా తీర్పు, రాజకీయ అస్థిరత, పార్టీ మార్పిడుల వల్ల ప్రభుత్వాలు కూలడం వంటి పరిస్థితుల్లో సభలు అర్ధంతరంగా రద్దవుతాయి. అలా ముందే ఎన్నికలు జరిగిన రాష్ట్రంలో ఆ పైన విధిగా లోక్‌సభ, శాస నసభల ఎన్నికలు ఒకేసారి జరగవు. అలా కాదని, నిర్బంధంగా జమిలి ఎన్నికలు జరిపితే అనర్థాలు తప్పవు.
ముఖ్యంగా ప్రాంతీయ అస్తిత్వాలు, స్థానికాంశాల ఆధారంగా సాగే ఆందోళనలు, ఉద్యమాలకు అది విఘాతం. ప్రాంతీయ పార్టీల మనుగడకు పెనుసవాలు! అన్నిటికీ మించి సమాఖ్య స్పూర్తికే ఇది భంగకరం. జమిలి ఎన్నికల వల్ల రెండు ప్రయోజనాలను చూపు తున్నారు. అలాచేస్తే ఒకటి అపారమైన ఎన్నికల వ్యయాన్ని నియంత్రించ వచ్చు. రెండు, దేశమంతా ఒక్కసారి ఎన్నికలయిపోయాక ఐదేళ్ల వరకూ రాజ కీయ 'క్రీడ'లుండవు, ప్రభుత్వాలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు.
ఈ రెండు ప్రయోజనాల గురించి ప్రచారమే తప్ప, దీనివల్ల కలిగే నష్టాల ప్రస్తా వన తేవడం లేదు. ఐదేళ్లకు లైసెన్సు దొరికినట్టు ప్రభుత్వాలు నియంతృ త్వంగా వ్యవహరించకుండా, మధ్య మధ్య వచ్చే రాష్ట్రాల ఎన్నికలు అడ్డుకుం టాయనీ, కొంత మేరకైనా ప్రజాభిప్రాయమెరిగి నడుచుకుంటాయనే వాదనా ఉంది. లోక్‌సభ, శాసనసభల ఎన్నికల్ని ఒకేసారి జరిపే తలంపు వెనుక జాతీయ పార్టీల స్వార్థమూ ఉంది. ఇదంతా జాతీయ సమస్యల ఆధారంగానే ఎన్నికలు జరిగితే, ప్రాంతీయ పార్టీల ప్రాభవం తగ్గుతుందనే దురాశ కావ చ్చని పరిశీలకుల భావన. ఇది ప్రాంతీయ ఆకాంక్షలకు, అస్థిత్వాలకు ముప్పు అని వారంటున్నారు.
ఎన్నికల సంస్కరణల్ని విడదీసి చూడలేము
మన దేశంలో ఎన్నికల సంస్కరణల్ని ఎప్పుడూ స్థూలంగా రాజకీయ సంస్కర ణల్లో భాగంగానే చూడాలి. రాష్ట్రపతైనా, గవర్నరైనా ఎన్నికల సంస్కరణల గురించే తప్ప, రాజకీయ పక్షాల గురించి మాట్లాడరు. పార్టీలన్నీ ఒకే తాను ముక్కలైనపుడు మార్పులైనా, సంస్కరణలైనా తమకు అనుకూలంగా ఉండా లనే దాదాపుగా అవన్నీ కోరుకుంటాయి. దేశ ప్రయోజనం, జనహితం గాలికి పోతుంది. అందుకే, తమ అకృత్యాలకు ప్రతిబంధకాలు ఏర్పడ్డ ప్రతిసారీ రాజకీయ విభేదాలకతీతంగా పార్టీలన్నీ ఏకమౌతాయి.
ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని సుప్రీంకోర్టు లోగడ తీర్పిస్తే... దాన్ని వ్యతిరేకించిన పార్టీలన్నీ ఆ తీర్పును వమ్ముచేయడానికి ఏకమయ్యాయి. ఇప్పుడూ సమా చార హక్కు చట్టం పరిధిలోకి తాము రామనే పిడివాద పంథాను అనుసరి స్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేస్తూ కేంద్ర ఉద్యోగులు శిక్షణ మంత్రిత్వ శాఖ (డీఓపీటీ) సుప్రీం కోర్టుకు గత వారం ఒక వివరణ ఇచ్చింది. 'ఆ విషయంలో కేంద్ర సమాచార కమిషన్ లోగడ తప్పుడు తీర్పి చ్చింది, రాజకీయ పార్టీలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావు, అలా వచ్చి, వాటిని పబ్లిక్ అథారిటీ(పీఏ)లుగా ప్రకటించాల్సివస్తే తీవ్ర ఇబ్బం దులు ముంచుకొస్తాయి' అన్నది దాని సారాంశం.
నిజానికి ప్రజా వ్యవహా రాల్లో మునిగి తేలి, భారీగా విరాళాలు పొందుతూ, ప్రభుత్వం నుంచి విలు వైన స్థలాలు, పన్ను మినహాయింపులు, ఇతర రాయితీలు పొందే పార్టీలు... చట్ట నిర్వచనం ప్రకారం పీఏలేనని 2013 జూన్‌లో కేంద్ర సమాచార కమిషన్ తీర్పునిచ్చింది. పార్టీల అంతర్గత నిర్మాణం, ఎన్నికల ప్రక్రియ, విరాళాలు, వ్యయం పైన అడిగిన వారికి సమాచారం ఇవ్వాల్సిందేనని ఆ తీర్పు సారాంశం. ఆ తీర్పును పార్టీలు పాటించట్లేదు, పాటించేలా చర్యలు తీసు కోవాలని కోరుతూ ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)తో సుప్రీంకోర్టును సంప్రదించింది.
దానిపై సుప్రీం ఇచ్చిన నోటీసుకు కేంద్రం ఇప్పుడు స్పందించింది. పార్టీలు కూడా దాదాపు ఇలాగే స్పందిస్తున్నాయి. పార్టీల ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని వెల్లడించేలా ప్రజాప్రాతినిధ్య చట్టంలో, ఆదాయం పన్ను చట్టంలో ఉన్న కొన్ని నిర్బంధాలు సరిపోతాయని కేంద్రం వాదన. వాటిలోని డొల్లతనం వల్లే ఇన్ని అనర్థాలూ జరుగుతున్నాయని, చట్టాల్లోని లొసుగులు, అనుచిత మిన హాయింపులు పార్టీల అకృత్యాలకు అండగా ఉన్నాయని ప్రజా సంఘాల విమర్శ. వాటిని పరిహరించే సంస్కరణలు కావాలన్నది వాటి ప్రధాన డిమాండు.
విరాళాల విష సంస్కృతే నల్ల సంపదకు మూలం
దేశంలోని ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు దశాబ్ద కాలంలో రూ. 11,367 కోట్లు విరాళంగా లభించినట్టు ఒక అంచనా. అందులో, రూ. 7,833 కోట్లు, అంటే 69% విరాళాలు ఎవరి నుంచి అందాయో లెక్కల్లేవు. చెప్పనవసరం లేదని వాటి వాదన. రూ. 20 వేలకు పైబడ్డ విరాళాల ఇచ్చిన దాతల పేర్లు పేర్కొనాలని ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉంది. దీనికి రూ. 20 వేల లోపు విరాళాల దాతల పేర్లు చెప్పనక్కర్లేదని వ్యాఖ్యానం చెప్పి వారి పేర్లను చెప్పడం లేదు. ఎంత పెద్ద విరాళాలనైనా రూ. 20 వేల లోపువిగానే విడగొట్టి చూపుతూ దాతల వివరాలను దాచడానికి ఆ నిబంధనను వాడుకుంటు న్నారు.
కాంగ్రెస్‌కు లభించిన రూ.3,982 కోట్లలో 83% గుప్త విరాళాలే! బీజేపీకి లభించిన రూ. 3,273 కోట్లలో 65% శాతం ఇదే బాపతు! సమా జ్‌వాదీ పార్టీ విరాళాల్లో 94%, అంటే రూ.786 కోట్లు కూడా ఈ ఖాతాల్లోవే. ఇక బీఎస్పీకి లభించిన రూ.764 కోట్లకు గాను అది ఒక్క దాత పేరూ వెల్ల డించలేదు! తెలుగు రాష్ట్రాల్లోని పాలకపక్షాల విరాళాల కథా అలాంటిదే! తెలుగుదేశం ప్రకటించిన మొత్తం రూ.145 కోట్ల విరాళాల్లో రూ.45 కోట్లు గుప్త దాతలవే! తెలంగాణ రాష్ట్ర సమితి విరాళాలు రూ.35.92 కోట్లలో రూ. 25.2 కోట్లు ఎవరిచ్చిందీ పేర్కొనలేదు. చట్టాల్లోని లొసుగుల్ని ఆసరా చేసు కొని రాజకీయ పార్టీలు అనుచిత ప్రయోజనాలు పొందుతున్నాయి.
ఎన్నికల్లో విచ్చలవిడిగా ధనం వెచ్చించి రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. రాజకీయ పార్టీలకిచ్చిన మినహాయింపులకు వ్యతిరేకంగా దాఖలైన 'పిల్'ను జనవరి 11న సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయగా దేశ మంతా నోట్ల కొరతతో అల్లల్లాడుతున్నపుడు రాజకీయ పార్టీల సొత్తు మాత్రం భద్రంగా ఉండటం సగటు మనిషిని నివ్వెరపరిచింది. ఆదాయం పన్ను చట్టం–1961, సెక్షన్ 13 ఏ ప్రకారం రాజకీయ పార్టీల విరాళాలకు పన్ను మినహాయింపు ఉందని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి ప్రకటిస్తే, డిసెంబర్ 31 వరకు బ్యాంకుల్లో, 31 మార్చి 2017 వరకు ఆర్బీఐ కౌంటర్లలో రద్దయిన పాత నోట్లను అవి డిపాజిట్ చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక కార్యదర్శి ప్రకటించారు. దీంతో సామాన్యులకు పుండు మీద కారం చల్లినట్టయింది. విమర్శలు వెల్లు వెత్తాయి. కేంద్రం సర్దుకుంది. మొత్తానికి, గత డిసెంబర్లో తెచ్చిన చట్ట సవ రణ ద్వారా ఈ సౌకర్యాన్ని రద్దు చేసినట్టు ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు.
పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీలు ఆర్థిక, సామాజిక వ్యవస్థల్ని కలుషితం చేస్తున్నాయి. జూలై 2015 నాటికి దేశంలో 1,866 రాజకీయ పార్టీలున్నట్టు ఎన్నికల సంఘం తేల్చింది. ఇందులో 464 పార్టీలే 2014 ఎన్నికల్లో అభ్యర్థుల్ని బరిలోకి దించినా, అందులో మూడింట రెండొం తుల పార్టీలు కడదాకా పోరాడనే లేదు. ముఖ్యంగా నల్లసంపద వృద్ధి మూలాలపై ఆరా ఎక్కడ మొదలెట్టినా, పైన కథలో చెప్పినట్టు లెక్క రాజ కీయ వ్యవస్థ వద్ద కొచ్చి ఆగుతుంది. స్థూలంగా రాజకీయాల్ని, అందులో భాగంగానే ఎన్నికల ప్రక్రియను సంస్కరించాల్సిన అవసరాన్ని తాజా పరి స్థితులు నొక్కి చెబుతున్నాయి. ఇది క్యాన్సర్‌లా విస్తరించి ప్రాణాల్ని కబ ళించకముందే జాగ్రత్తపడాలి. అవసరమైతే శస్త్రచికిత్సకు సిద్ధపడి మనను మనం రక్షించుకోవాలి.
ఈమెయిల్: dileepreddy@sakshi.com
దిలీప్ రెడ్డి
Advertisement
Advertisement