సాక్షి. హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జూన్ తర్వాత హామీలపై కార్యాచరణ ఉంటుందని ఆయన సోమవారం వెల్లడించారు. వరసగా వివిధ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. వివిధ చర్యలు చేపట్టే విషయంలో, అధికారిక ప్రకటనలు చేసే విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల సంక్షేమానికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నామన్నారు. పీఆర్‌సీ, టీచర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు జూన్ తర్వాత పరిష్కారం ఉంటుందన్నారు. ఉద్యోగ విరమణ వయసు పెంపునకు సంబంధించి ఒక కటాఫ్ డేట్ నిర్ణయించాక అమలుచేస్తామని స్పష్టం చేశారు. మొత్తం దేశంలోనే అత్యధిక వేతనం పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులేనన్నారు. కాంగ్రెస్, టీడీపీల హయాంలో 42, 43% జీతాలు పెంచిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు చురుకైన పాత్ర పోషించారని.. సమ్మెలో పాల్గొన్న రోజులను ఆన్‌డ్యూటీగా పరిగణించడంతో పాటు తెలంగాణ ఇన్సెంటివ్ అని ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. (కేసీఆర్ ప్రధాని కావాలని మొక్కుకున్నా..)
ఆచితూచి అప్పులు!
ఎఫ్‌ఆర్‌బీఎం కింద 28% వరకు రుణాలు తీసుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి, వెసులుబాటు ఉన్నా.. తాము 21.25% రుణాలు మాత్రమే తీసుకున్నామని కేసీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాలు కూడా 26.27% వరకు అప్పులు తీసుకున్నాయని.. ఆంధ్రప్రదేశ్ ఏకంగా 29% అప్పులు తీసుకుందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం కింద కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ ద్వారా అప్పులు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇలాంటి రుణాలు తీసుకుంటే ఏదో తప్పు జరిగినట్టు, నిబంధనలు అతిక్రమించినట్టు కాంగ్రెస్ సభ్యులు మాట్లాడడం సరికాదని కేసీఆర్ మండిపడ్డారు. ‘అప్పులు ఎట్లా తెస్తే మీకెందుకు? కార్పొరేషన్ల ద్వారా ఎందుకు ప్రభుత్వమే రుణాలు తీసుకోవచ్చుకదా అని విపక్షసభ్యులు అడుగుతున్నారు. అది ప్రభుత్వ వ్యూహం. దీనికి తోడు ప్రభుత్వం కూడా 30, 35వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్న విషయాన్ని ప్రతిపక్ష సభ్యులు మరిచిపోతున్నారు. మేం ఎలాంటి కుట్రా చేయడం లేదు. భవిష్యత్ తరాలను బంగారం చేసేందుకే రుణాలు తీసుకుంటున్నాం’అని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రానికున్న రూ.1.25 లక్షల కోట్ల అప్పులు ఒక ఏడాది పండే పంట విలువకు సమానమని సీఎం చెప్పారు. సంప్రదాయ ఆలోచనస్థితి బద్ధలు కావాలని.. ఆ దిశలోనే మిషన్ భగీరథ, తదితర పథకాలతో తాము ముందుకు సాగుతున్నామన్నారు. (మనసా, వాచా, కర్మేణా.. బంగారు తెలంగాణకు పునరంకితం)
కందిళ్లు కనబడుతున్నాయా?
కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్నప్పుడు.. విపక్షాలు దీపం కందిళ్లు, ఎండిన వరి, మొక్కజొన్న కంకులు పట్టుకుని అసెంబ్లీలో ధర్నాలు చేయడం ఆనవాయితీగా ఉండేదని సీఎం అన్నారు. గత ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు కనిపించలేదన్నారు. ఇప్పుడు పచ్చజొన్నలు, పసుపు పంటలకు గిట్టుబాటు ధరలంటూ పనిగట్టుకుని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఈ పంటల ధరలు అంత హీనంగా ఏమీ లేదన్నారు. మరో ఏడాది వరకు మాత్రమే గిట్టుబాటుధరలు అంటూ ధర్నాలు చేసేందుకు అవకాశముందని. ఆ తర్వాత అది కూడా ఉండదన్నారు. రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, పత్తి వంటివి ప్రధాన పంటలుగా ఉన్నాయన్నారు. పంట కాలనీలు నిర్ణయించి, రైతు సమన్వయ సమితుల ద్వారా చైతన్యం కలిగించి డిమాండ్ ఉన్న పంటలే పండించేలా చర్యలు చేపట్టే ఆలోచన ఉందన్నారు. గిట్టుబాటుధరల కోసం రైతులు ఆందోళన చెందే పరిస్థితి రాకుండా చూస్తామని సీఎం అన్నారు. (చంద్రబాబు కూడా మోసం చేశారు: ఎర్రబెల్లి)
తాత కడితే మనవడు తాగాలా?
జాతీయస్థాయిలో అందుబాటులోని నీటివనరుల నిర్వహణలో కాంగ్రెస్. బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీఎం విమర్శించారు. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు అందుబాటులోఉన్నా వాటిని సరిగ్గా వినియోగించుకోకపోతే అర్థం లేదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఏవైనా జలజగడాలు ఎదురైతే 2 దశాబ్దాలు గడిచినా ట్రిబ్యునళ్లు తీర్పునివ్వకపోవడం, సీడబ్ల్యూసీ స్పందించకపోవడం దారుణమన్నారు. ఎప్పుడో తాత ప్రాజెక్టు కడితే మనవడు ఆ నీటిని తాగే పరిస్థితి ఎదురైతే ఎలాగని ›ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి మొత్తం 1.350 టీఎంసీల నీటిని ఉపయోగించుకునేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ట్రెంచింగ్‌పై
అటవీ భూముల విషయంలో అటవీ అధికారులు ట్రెంచింగ్‌ల తవ్వకం నిలిపివేయాలని కాంగ్రెస్ నుంచి మంచి సూచన వచ్చిందని సీఎం అన్నారు. ప్రస్తుతానికి పోడుభూముల సమస్యపై స్పష్టత వచ్చే వరకు కందకాలు తవ్వడం నిలిపేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. పోడు భూములే కాకుండా గిరిజన పట్టా భూముల చుట్టూ కూడా అటవీ అధికారులు కందకాలు తవ్వడంతో సమస్యలు వస్తున్నాయని సీఎల్‌పీ నేత భట్టి ప్రస్తావించగా సీఎం పైవిధంగా స్పందించారు.
కాగితాలపైనే ఇళ్లు
స్టేషన్ ఘన్‌పూర్‌లోని ఒక గ్రామంలో 710 ఇళ్లు, వరికోలు అనే మరోగ్రామంలో 600 ఇళ్లు కట్టినట్టు కాగితాలపై ఉందని.. వాస్తవంగా వెళ్లి చూస్తే ఒక్క ఇంటిని కూడా కట్టలేదన్నారు. బలహీనవర్గాల గృహనిర్మాణాన్ని పకడ్బందీగా అమలుచేస్తామన్నారు. గతంలో ఎవరెవరికి ఇచ్చారు. ఇప్పటికే ఎవరికి ఇళ్లున్నాయి. తదితర చర్యలు చేపడతామన్నారు. గ్రామ స్వరాజ్య సాధన దిశలో సర్పంచ్‌లపై తీవ్రమైన శిక్షలున్నాయని, అదే విధంగా పంచాయతీ కార్యదర్శులు కూడా తమ విధులు, బాధ్యతలను కచ్చితంగా నిర్వహించేలా కొత్త చట్టంలోమార్పులు తెచ్చామన్నారు. కఠిన నిబంధనలు లేకపోతే ఫలితాలు రావన్నారు.
పల్లెల్లో భగీరథ భారం ఉండదు
మంచినీటి ఎద్దడి సమస్య ఏర్పడడం ఇకపై గత చరిత్రగా మారిపోతుందన్నారు. ప్రతీ హాబిటేషన్‌కు శుద్ధిచేసిన తాగునీటిని సరఫరాచేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా బాటిల్ నీటికి బదులు.. శుద్ధిచేసిన నీటిని వినియోగించాలనే అవగాహన పెరుగుతోందన్నారు. వచ్చే ఏప్రిల్ చివరకల్లా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ.. తాగునీటిని సరఫరా చేసిన ఘనతను తమ ప్రభుత్వం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో కలిపి మొత్తం 16వేల ఓవర్‌హెడ్ రిజర్వాయర్లు (ఓహెచ్‌ఆర్) కడితే.. తమ ప్రభుత్వం మరో 22 వేల ఓహెచ్‌ఆర్‌లు పూర్తిచేసిందని సీఎం వెల్లడించారు. మిషన్ భగీరథ భారాన్ని గ్రామపంచాయతీలు. గ్రామాలపై వేయదలుచుకోలేదన్నారు. గ్రామాల్లోని ప్రతీ ఇంటిలో ఒక్కొక్కరికి రోజుకు వందలీటర్ల చొప్పున.. పట్టణాల్లో ఒక్కొక్కరికి రోజుకు 150 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేస్తామన్నారు.
గతంలోని ఆర్‌డబ్ల్యూఎస్‌కు మిషన్ భగీరథకు పొంతన లేదన్నారు. భవిష్యత్‌లో 24 గంటల పాటు నీటి సరఫరాకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయిస్తున్నామన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ రెండూ ఒకే శాఖలో ఉండేలా చర్యలు చేపడుతున్నట్టు కేసీఆర్ చెప్పారు. గ్రామ, మండల, జిల్లా పరిషత్‌లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని జాతీయ ఉపాధి హామీ చట్టం ద్వారా వివిధకార్యక్రమాలను సమగ్రంగా చేపట్టే చర్యలు చేపట్టనున్నట్టు సీఎం తెలియజేశారు. నిరక్షరాస్యత విషయంలో రాష్ట్రంపై ఒక నల్లని మచ్చ ఉందని. విద్యారంగంలోని అంశాలను సమగ్రంగా పరిశీలించి. ఈ సమస్యను అధిగమించే చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment