కేసీఆర్‌కు క్లీన్‌చిట్‌ రాలేదు | CM Revanth Reddy Shocking Comments On KCR In Assembly | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు క్లీన్‌చిట్‌ రాలేదు

Published Tue, Jul 30 2024 4:58 AM | Last Updated on Tue, Jul 30 2024 4:58 AM

CM Revanth Reddy Shocking Comments On KCR In Assembly

‘విద్యుత్‌’ కమిషన్‌ చైర్మన్‌ను మార్చాలనే సుప్రీం చెప్పింది 

శాసనసభలో విద్యుత్‌ పద్దుపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి 

కమిషన్‌ను రద్దు చేయాలన్న విజ్ఞప్తిని కోర్టులు తిరస్కరించాయి 

యాదాద్రి ప్లాంట్‌లోనూ రూ.10వేల కోట్ల అవినీతి

సాక్షి, హైదరాబాద్‌: ‘విద్యుత్‌’విషయంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు క్లీన్‌చిట్‌ ఏమీ రాలేదని.. విద్యుత్‌ కమిషన్‌ చైర్మన్‌ను మార్చాలని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కమిషన్‌ను రద్దు చేయాలన్న కేసీఆర్‌ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు, హై కోర్టు తిరస్కరించాయని గుర్తుచేశారు. కానీ బీఆర్‌ఎస్‌ సభ్యుడు జగదీశ్‌రెడ్డి కోర్టు నిర్ణయాన్ని వక్రీకరిస్తూ మాట్లాడారని, అలా చేస్తే ప్రాసిక్యూట్‌ చేయాల్సి వస్తుందని హె చ్చరించారు.

శాసనసభలో విద్యుత్‌ పద్దుపై సోమ వారం జరిగిన చర్చలో రేవంత్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టడంతోపాటు గత బీఆర్‌ఎస్‌ సర్కారు నిర్ణయాలపై తీవ్రంగా మండిపడ్డారు. సీఎం రేవంత్‌ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ ఒప్పందాలు, ప్రాజెక్టుల్లో అవినీతి జరిగింది.

విద్యుత్‌ కొనుగోళ్లపై బీఆర్‌ఎస్‌ కోరితేనే విచారణకు ఆదేశించాం. కేసీఆర్‌ సత్యహరిశ్చంద్రుడికి వారసుడన్నట్టు జగదీశ్‌రెడ్డి మాట్లాడుతున్నారు. కానీ విచారణ కమిషన్‌తో వారి అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారు కోర్టుకు వెళ్లారు. కానీ విచారణ ఆపాలని కోర్టు చెప్పలేదు. సుప్రీంకోర్టు సలహా మేరకు కమిషన్‌ చైర్మన్‌ను మారుస్తున్నాం. కొత్త వ్యక్తిని త్వరలో నియమిస్తాం. 

గతంలోని కాంగ్రెస్‌ సర్కారు నిర్ణయాలతోనే.. 
విద్యుత్‌ ఉత్పత్తి తమ హయాంలోనే పెరిగిందని బీఆర్‌ఎస్‌ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్లే హైదరాబాద్‌ నగరానికి ఆదాయం పెరిగింది. విభజన తర్వాత విద్యుత్‌ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా కాంగ్రెస్‌ వ్యవహరించింది. అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి దీనికోసం కృషి చేశారు. అసెంబ్లీ ఈ వాస్తవాలు చెప్పేందుకు తాను ప్రయతి్నస్తే.. కేసీఆర్‌ సర్కార్‌ అవకాశం ఇవ్వలేదు. మార్షల్స్‌ను పెట్టి గెంటేయించారు. 

పేరుకే బీహెచ్‌ఈఎల్‌.. కాంట్రాక్టులు బినామీలకా? 
బీహెచ్‌ఈఎల్‌కు కాంట్రాక్టులు ఇస్తే తప్పేంటని, అవినీతికి ఆస్కారం ఎక్కడిదని జగదీశ్‌రెడ్డి చేస్తున్న వాదన అర్థరహితం. బీహెచ్‌ఈఎల్‌కు కేవలం ఎలక్రో్ట, మెకానికల్‌ పనులు చేసే సామర్థ్యమే ఉంటుంది. సివిల్‌ పనులు చేసే శక్తి లేదు. అందుకే బీహెచ్‌ఈఎల్‌కు విద్యుత్‌ ప్లాంట్‌ కాంట్రాక్టు ఇచ్చి ఆ సంస్థ నుంచి సివిల్‌ కాంట్రాక్టులను బీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్లకు, బినామీలకు, పార్టీ మారిన అప్పటి ఎమ్మెల్యేలకు ఇప్పించారు.

ఇందులో వేల కోట్ల దోపిడీ జరిగింది. నిజానికి జార్ఖండ్‌లో 2,400 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ పవర్‌ ప్లాంట్‌ కోసం టెండర్లు పిలిస్తే.. బీహెచ్‌ఈఎల్, ఎల్‌అండ్‌టీ, కొరియన్‌ సంస్థలు ముందుకొచ్చాయి. బీహెచ్‌ఈఎల్‌ 18% తక్కువకు టెండర్‌ వేసింది. అలా తెలంగాణలో టెండర్లు పిలిస్తే.. ఇక్కడా బీహెచ్‌ఈఎల్‌ 18 శాతం తగ్గించేది. కానీ అలా చేయకుండా వేలకోట్ల నష్టానికి కారణమయ్యారు. 

వేల కోట్లు చేతులు మారాకే.. 
నిజానికి ఇండియాబుల్స్‌ సంస్థ గతంలోనే సబ్‌ క్రిటికల్‌ థర్మల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం బీహెచ్‌ఈఎల్‌కు ఆర్డర్‌ ఇచ్చింది. ఆ యూనిట్లు సిద్ధమవుతున్న తరుణంలోనే.. కేంద్రం సూపర్‌ క్రిటికల్‌ పరిజ్ఞానంతో ప్లాంట్లు కట్టాలని చట్టం చేసింది. దీంతో ఆ సబ్‌ క్రిటికల్‌ యూనిట్లు తమకు వద్దని ఇండియాబుల్స్‌ సంస్థ చెప్పగా.. అప్పటికే తయారీ పూర్తయిందని బీహెచ్‌ఈఎల్‌ స్పష్టం చేసింది. ఇక్కడే వేల కోట్లు చేతులు మారాయి. గత ప్రభుత్వం కాలం చెల్లిన ఆ సబ్‌ క్రిటికల్‌ యూనిట్లతో తెలంగాణలోని భద్రాద్రి ప్లాంట్‌ పెట్టి.. ఇండియాబుల్స్‌ సంస్థను గట్టెక్కించింది. పైగా విద్యుత్‌ కోతలు నివారించడానికే ఇలా చేశామంటూ బీఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు మాటలు చెప్తున్నారు. 

అడ్డగోలుగా వ్యయం పెంచి.. 
రామగుండంలో ఎనీ్టపీసీ 2016లో 1,600మెగావాట్ల విద్యుత్‌ కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభించి 2024 ఫిబ్రవరిలో పూర్తి చేసింది. ఆ ప్లాంట్‌ వ్యయం ఒక్కో మెగావాట్‌కు రూ.7.38 కోట్లు అయితే.. భద్రాద్రి వ్యయం రూ.9.73కోట్లకు, యాదాద్రి వ్యయం రూ.8.64కోట్లకు పెరిగింది. యాదాద్రి పూర్తయ్యేసరికి రూ.10కోట్లకు పెరుగుతుంది. యాదాద్రిలో ఒక్కో మెగావాట్‌కు రూ.2.5 కోట్లు చొప్పున మొత్తం రూ.10వేల కోట్లు మింగింది ఎవరో? భద్రాద్రిలో మింగింది ఎవరో తేల్చడానికే విచారణ కమిషన్‌ ఏర్పాటు చేశాం. 

నష్టం వద్దనే ఎనీ్టపీసీ ఒప్పందానికి దూరం 
ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకుంటే మరో ఐదేళ్లలో ఆ ప్లాంట్‌ పూర్తవుతుంది. రూ.8–9కి యూనిట్‌ చొప్పున విద్యుత్‌ లభిస్తుందని లెక్కలు వేశాం. ప్రస్తుతం మార్కెట్లో రూ.5 నుంచి రూ 5.30కే యూనిట్‌ విద్యుత్‌ లభిస్తోంది. అందుకే ఎనీ్టపీసీతో ఒప్పందం చేసుకోలేదు. 

పాపం తగిలి మీ ఇళ్లలోని వారూ జైలుకెళ్తున్నారు 
ఓ టీవీ చానల్‌కు సీఈఓగా ఉన్న మహిళా జర్నలిస్టుపై ఎస్సీ, ఎస్టీ కేసుపెట్టి అరెస్టు చేసి టీవీ చానల్‌ను గుంజుకున్నారు. నేను నా న్యాయవాదిని పెట్టి ఆమెకు బెయిల్‌ ఇప్పించా. ఆడపిల్లను జైలుకు పంపిన పాపం ఊరికే పోదు. మంది పిల్లలను జైలుకు పంపిస్తే.. మీ ఇళ్లలో కూడా జైలుకుపోతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఫామ్‌హౌస్‌ కట్టారని బయటపెట్టినందుకు నన్ను 16 రోజులు చర్లపల్లి జైలులో పెట్టారు’’అని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ నేతలు కోరుకుంటే ఆగస్టు 1, 2 తేదీల్లోనూ అసెంబ్లీ నిర్వహించి.. గత పదేళ్ల పాలనపై రాత్రింబవళ్లు చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఆ తప్పులకు మీరే బాధ్యులు..
‘‘నాడు చంద్రబాబుతో అంటకాగి 610 జీవోనే వద్దని, మానవ వనరులు ఎక్కడున్నా వాడుకోవాలని చెప్పింది మీ నాయకుడు కేసీఆర్‌ కాదా? మీరు (హరీశ్‌రావు) కనీసం వార్డు మెంబర్‌ కూడా కాకపోయినా మంత్రిగా అవకాశం ఇచ్చింది వైఎస్‌ ప్రభుత్వం. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసినప్పుడు కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నది నాయిని నరసింహారెడ్డే కదా. చంద్రబాబు, వైఎస్సార్‌ పంచన చేరి ఊడిగం చేశారు. ఆ తప్పిదాలకు మీరే బాధ్యులు’’అని బీఆర్‌ఎస్‌ నేతలపై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఎవరో త్యాగాలు, ఆత్మబలిదానాలు చేస్తే వారి శవాల మీద అధికారంలోకి వచ్చారని విమర్శించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement