dissolve assembly
-
వ్రతం చెడినా ఫలం దక్కేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. అసెంబ్లీ రద్దుకు మంత్రివర్గం నిర్ణయించడం, గవర్నర్ కేంద్రానికి పంపించడం చకచకా జరిగిపోయాయి. రాజకీయ నిర్ణయాలు తీసు కోవడంలో కేసీఆర్ ప్రదర్శించే వేగం, తేజం తాజా నిర్ణయాలలో సైతం కళ్ళకు కట్టాయి. అన్ని మతాలకూ, కులాలకూ, వర్గాలకూ చెందినవారికి లబ్ధి చేకూర్చే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్న ధైర్యంతో గడువుకు ఎనిమిది మాసాల 26 రోజులు ముందుగానే అసెంబ్లీని రద్దు చేశారు. ఒకే విడత 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి చరిత్ర సృష్టించారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సైతం రంగంలో దిగి సమరసన్నాహాలు చేస్తున్నది. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పార్టీ అధిష్ఠానవర్గానికి ప్రతిపాదిం చిన మూడు అంశాల సూత్రం ఇది: 1) ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలి 2)టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి 3) ఎంఐఎంతో సఖ్యత కోసం అసదుద్దీన్‌తో సమాలోచనలు జరపాలి. మొదటి సూత్రం అమలు చేస్తే అసలుకే ముప్పు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే ఆ పదవిని ఆశిస్తున్న అరడజనుకు తగ్గని ఇతర ముఖ్యనేతలు ఎన్నికలలో పార్టీ విజయం కోసం పని చేయకపోగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు. ఈ సంగతి కాంగ్రెస్ అధిష్ఠానవర్గానికి తెలుసు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌తో మాట్లాడి ప్రయోజనం లేదు. కేసీఆర్‌తో అసద్ అనుబంధం బలమైనది. ముస్లిం బాలబాలికలకోసం గురుకుల పాఠశాలలు నెలకొల్పడం, వారి ఉన్నత విద్యను ప్రోత్సహించడం, రిజర్వేషన్ల తీర్మానం అసెంబ్లీ చేత ఆమోదింపజేసి కేంద్రానికి పంపించడం వంటి కార్యక్రమాలు కేసీఆర్ చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్ కాబోతున్నారని అసద్ శనివారంనాడు నిర్ద్వంద్వంగా ప్రకటించారు. మూడు సూత్రాలలో మిగిలింది టీడీపీతో పొత్తు. అంతకంటే ముఖ్యంగా చంద్రబాబునాయుడితో వ్యవహారం. టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి ఏకపక్షంగా ప్రకటించారు. శనివారం చంద్రబాబు హైదరాబాద్‌కి రానే వచ్చారు. టీఆర్ఎస్లోకీ, కాంగ్రెస్‌లోకి గెంతినవారు పోగా మిగిలిన కొద్ది మంది నాయకులతో సుదీర్ఘ సమాలోచన జరిపి గంభీరోపన్యాసం ఇచ్చారు. కొరివితో తలగోక్కోవాలని కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉబలాట పడుతున్నారు? వారికి చంద్రబాబు పొత్తుల పురాణం తెలియదా? ఆయన నైజం అర్థం కాలేదా? ఆయనతో లోగడ పొత్తులు పెట్టుకొని భంగపడినవారికంటే తాము తెలివిగలవారమని అనుకుంటున్నారా? రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీనీ, సోనియాగాంధీని చంద్రబాబు తిట్టిన తిట్లన్నీ మరచి పోయారా? అన్నీ తెలిసే కపటనాటక సూత్రధారితో కరచాలనం చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారా? హైదరాబాద్‌లో టీటీడీపీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు నోట వెలువడిన తాజా అసత్యవాచకం అవధరించండి ‘నేను రాష్ట్రాన్ని విభజించమని కానీ వద్దని కానీ చెప్పలేదు.’ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సమ్మతి ప్రకటిస్తూ ప్రణబ్కుమార్ముఖర్జీ కమిటీకి రెండు విడతల ఉత్తరాలు రాసింది ఎవరు? ‘విభజన బిల్లు శాసనసభలో మీరు ప్రవేశపెడతారా మమ్మల్ని ప్రవేశపెట్టమంటారా’ అంటూ కాంగ్రెస్‌ని దబాయించింది ఎవరు? చంద్రబాబు కాదా? ఏదో ఒక విధంగా టీఆర్ఎస్ని ఓడించి అధికారంలోకి రావా లని తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తపన. ఏమైనా సరే జాతీయ స్థాయిలో మోదీని వదిలించుకోవడానికి కూటమి ఏర్పాటు చేయాలనీ, అందులో టీడీపీ భాగస్వామి కావాలనీ కాంగ్రెస్ అధిష్ఠానం తాపత్రయం. ఇది సకారాత్మకమైన రాజకీయం కాదు. ఆరోగ్యపరమైనదీ కాదు. పవిత్రమైనది అసలే కాదు. ప్రజలకు మేలు చేసిది అంతకన్నా కాదు. ఇక్కడ మార్గం ముఖ్యం కాదు, లక్ష్యం ప్రధానం. అస్థిరతకు బాటలు దేశ చరిత్రలో కేంద్రంలో అస్థిర ప్రభుత్వాలు ఏర్పడిన గడ్డుకాలంలో చక్రం తిప్పింది టీడీపీ అధినేతలనే వాస్తవాన్ని విస్మరించకూడదు. ఎన్టీఆర్ ‘తెలుగు దేశం పార్టీ’ని స్థాపించిన తొమ్మిది మాసాలలోనే ప్రభంజనం సృష్టించి కాంగ్రెస్‌ను కూకటివేళ్ళతో పెకిలించి చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించారు. కాంగ్రెస్‌వారిని కుక్కమూతి పిందెలని అవహేళన చేసేవారు. దాన్ని భూస్థాపితం చేయడం టీడీపీ ఏకైక లక్ష్యమంటూ ప్రకటించేవారు. కాంగ్రెస్ ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు విజయవాడలో ప్రతిపక్ష సదస్సు నిర్వహించారు. అది 1988లో నేషనల్‌ఫ్రంట్ ఆవిర్భావానికి దారితీసింది. రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో రక్షణమంత్రిగా ఉన్న విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలులో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి ‘జన్‌మోర్చా’ను నెలకొల్పారు. దాన్ని జనతాదళ్‌లో విలీనం చేశారు. రాజీవ్‌గాంధీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో ఆయన 1989 ఎన్నికలలో రెండు పరస్పర విరుద్ధమైన పార్టీలతో–బీజేపీతోనూ, వామపక్షాలతోనూ పొత్తు పెట్టుకున్నారు. నేషనల్‌ఫ్రంట్ అధ్యక్షుడుగా ఎన్టీఆర్ భాగస్వామ్యపక్ష నేతలతో సమాలోచనలు జరిపి విపి సింగ్‌ను ప్రధాని చేయాలని నిర్ణయించారు. ప్రధా నిగా ప్రమాణం చేసినప్పటి నుంచి విపి సింగ్ కుర్చీ కాపాడుకునేందుకే సర్వ శక్తులూ వినియోగించవలసి వచ్చింది. బీజేపీ అనుసరించిన హిందూత్వ విధానాలకు విరుగుడుగా మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని విపి సింగ్ నిర్ణయించారు. ఇందుకు ప్రతిగా బీజేపీ నేత అడ్వాణీ సోమనాథ్ మందిరం నుంచి అయోధ్యకు రథయాత్ర ఆరంభించారు. రథం బిహార్‌లోని సమస్తిపూర్ చేరగానే అడ్వాణీని లాలూప్రసాద్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇందుకు నిరసనగా విపి సింగ్ ప్రభు త్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నది. జనతాదళ్ నుంచి దేవీలాల్, చంద్రశేఖర్ 64 మంది ఎంపీలతో నిష్క్రమించి సమాజవాదీ జనతాదళ్ (రాష్ట్రీయ)ను నెలకొల్పారు. లోక్‌సభలో విశ్వాసతీర్మానం వీడిపోవడంతో విపి సింగ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధానిగా ప్రమాణం చేశారు. ఆరు మాసాలు తిరగకుండానే చంద్రశేఖర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్నది. ఆపద్ధర్మ ప్రధానిగా చంద్రశేఖర్ 1991లో ఎన్నికలు జరిగి పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించేవరకూ కొనసాగారు. విపి సింగ్, చంద్రశేఖర్‌ల హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. లండన్ బ్యాంకులో బంగారం కుదువపెట్టిన అప ఖ్యాతి చంద్రశేఖర్‌కు దక్కింది. విపి సింగ్ హయాంలో కశ్మీర్ లోయనుంచి 90 వేలమంది పండిట్లు ప్రాణాలు చేతపట్టుకొని వలస వెళ్ళి స్వదేశంలోనే శర ణార్థులుగా శిబిరాలలో తలదాచుకున్నారు. మామగారిని గద్దె దింపి అధికారం హస్తగతం చేసుకున్న చంద్రబాబు కూడా జాతీయ స్థాయిలో యునైటెడ్ఫ్రంట్కు కన్వీనర్‌గా వ్యవహరించి రెండు అల్పాయుష్షు ప్రభుత్వాలకు పురుడు పోశారు. 1996 నాటి ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం చెందింది. అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ ఆధిక్యం సంపాదించినప్పటికీ ఎన్నికల తీర్పు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వచ్చిందనే ఉద్దేశంతో పీవీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించలేదు. రెండవ అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ నేత అటల్ బిహారీ వాజపేయి ఏర్పాటు చేసిన ప్రభుత్వం 13 రోజులలో కుదేలయింది. అప్పుడు చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకి వచ్చింది. యునైటెడ్‌ఫ్రంట్ కన్వీ నర్గా దేవెగౌడనూ, ఐకె గుజ్రాల్నూ ప్రధానమంత్రులుగా చేయడంతో ఆయన పాత్ర లేకపోలేదు. కానీ ఆయనది నిర్ణాయక పాత్ర కాదు. సీపీఎం నేత హరి కిషన్‌సింగ్ సూర్జీత్ సంకీర్ణ ప్రభుత్వాల సృష్టికర్త. yì ఎంకె అధినేత కరుణానిధి సంధానకర్త. చంద్రబాబు యువకుడు కనుక సీనియర్ నాయకుల మధ్య సమన్వ యకర్తగా పని చేశారు. ఇద్దరు ప్రధానులూ కలసి రెండు సంవత్సరాలు కూడా ప్రభుత్వం నడిపించలేకపోయారు. నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి రెండు ప్రభుత్వాలకూ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించి అనిశ్చితికీ, అస్థిరతకూ దారి తీశారు. గుజ్రాల్ ప్రభుత్వం పతనమైన సమయంలోనే ప్రణబ్‌ముఖర్జీ, గులాంనబీ ఆజాద్, తదితరులు కేసరి చేతి నుంచి కాంగ్రెస్ పగ్గాలను లాగివేసి సోనియాగాంధీ చేతిలో పెట్టారు. నకారాత్మక రాజకీయం, అపవిత్ర పొత్తుల కారణంగానే దేశానికి అరిష్టం దాపురించింది. హానికరమైన ఈ ధోరణికి ప్రతీక చంద్రబాబు. పొత్తుల వీరుడు దుస్తులు మార్చినట్టు భాగస్వాములను మార్చివేయడం చంద్రబాబుకు బాగా తెలిసిన విద్య. 1995లో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన లోక్‌సభ (1996) ఎన్నికలలో టీడీపీ సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకున్నది. ఎన్నికలు జరిగిన తర్వాత కమ్యూనిజం కంటే టూరిజం ముఖ్యమంటూ కమ్యూనిస్టు నాయకులను ఎద్దేవా చేయడం ఆరంభించారు. 1998లోనూ వామపక్షాలతో ప్రయాణం కొనసాగించారు. కానీ ఎన్నికలు కాగానే వామపక్షాలకు గుడ్‌బై చెప్పి యునైటెడ్‌ఫ్రంట్ నుంచి నిష్క్రమించి వాజపేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకొని కార్గిల్ విజయం ఫలితంగా పెరిగిన వాజపేయి ప్రతిష్ఠ సహకారంలో అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొంది అధికారంలో కొనసాగారు. 2002లో గుజరాత్లో మారణకాండ జరిగినప్పుడు నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ తాను చేసిన సిఫార్సును వాజపేయి అమలు చేయనప్పటికీ మద్దతు ఉపసంహరించుకోలేదు. అలిపిరిలో నక్సలైట్ల దాడిలో ప్రాణాలతో బయటపడిన తన పట్ల ప్రజలలో సానుభూతి వెల్లువెత్తిందని భావించి ముందస్తు ఎన్నికలకు సిద్ధమై లోక్‌సభకు కూడా గడువుకంటే ముందు ఎన్నికలు జరిపించేందుకు వాజపేయిని ఒప్పించారు. 2004 ఎన్నికలలో బీజేపీ, టీడీపీ కూటమి ఓడిపోయిన వెంటనే బీజేపీతో పొత్తు పెట్టు కోవడం తప్పిదమని చెబుతూ జీవితంలో మళ్ళీ ఆ పార్టీతో పొత్తు పెట్టు కోనంటూ చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు. 1998లో తిరస్కరించిన వామపక్షాలను 2009లో చేరదీశారు. టీఆర్ఎస్ని కూడా మహాకూటమిలో చేర్చుకున్నారు. ఫలితాలు వెల్లడైన వెనువెంటనే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం వల్లనే అనర్థం జరిగిందని అన్నారు. 2014లో తిరిగి బీజేపీతో కలసి ఎన్నికలలో పోరాడటమే కాకుండా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్‌లో ఇద్దరు టీడీపీ మంత్రులను చేర్పించి, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇద్దరు బీజేపీ మంత్రులను చేర్చుకున్నారు. నాలుగున్నరేళ్ళు అంటకాగిన తర్వాత ఎన్డీఏ నుంచి తప్పుకున్నారు. నిరుడు విశాఖపట్టణంలో మహానాడు జరిగి నప్పుడు చంద్రబాబు చైనా నాయకుడు డెంగ్‌ను ఉటంకిస్తూ పిల్లి నల్లదా, తెల్లదా అన్నది ముఖ్యం కాదనీ, ఎలుకలు పట్టేది అయితే చాలుననీ చెప్పారు. రాజ కీయాలలో విలువలకు కాలం చెల్లిందనీ, విధానాలతో నిమిత్తం లేకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటూ పోవాలని ఉద్ఘాటించారు. ఓట్లు బదిలీ అయ్యేనా? మహాకూటమిలో టీడీపీని చేర్చుకుంటే టీఆర్ఎస్ని ఓడించవచ్చుననే కాంగ్రెస్ అంచనా తప్పు. టీడీపీకి 12 లేదా 15, టీజెఎస్కు 5 లేదా 6, సీపీఐకి నాలుగు సీట్లు విడిచిపెట్టాలని కాంగ్రెస్ తలపోస్తున్నట్టు భోగట్టా. హైదరాబాద్ పాత బస్తీలో సుమారు పది స్థానాలవైపు కాంగ్రెస్ తేరిపార చూసే పరిస్థితి లేదు. మిగిలిన 84 స్థానాలలో కనీసం 50 స్థానాలు గెలుచుకుంటేనే మిత్రులతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అంటే, పోటీ చేసే స్థానాలలో సుమారు 70 శాతం స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవాలి. అటువంటి అవకాశం ఉన్నదా? ఉంటే అన్ని స్థానాలకూ కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టవచ్చు. మూడున్నర దశాబ్దాలుగా టీడీపీకి వ్యతిరేకంగా ఓటు చేస్తున్న కాంగ్రెస్ ఓటర్లు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయరు. అదే విధంగా కాంగ్రెస్‌ని మట్టికరిపించడమే ధ్యేయంగా ఓటు చేస్తున్న టీడీపీ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి దోహదం చేయరు. టీడీపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ వ్రతం చెడినా ఫలం దక్కదు. తెలంగాణలో కాంగ్రెస్–టీడీపీ కూటమి విఫలమైతే ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు కాంగ్రెస్‌ని దగ్గరికి రానీయరని చెప్పడానికి గొప్ప తెలివి తేటలు అక్కర లేదు. అవకాశవాద, నకారాత్మక రాజకీయాల కంటే కాంగ్రెస్ ఒంటరిగా టీఆర్ఎస్తో తలబడితే అమీతుమీ తేల్చుకోవచ్చు. గెలిచినా, ఓడినా గౌరవప్రదంగా ఉంటుంది. త్రికాలమ్ కె. రామచంద్రమూర్తి -
గోల షురూ!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థులపై అసమ్మతి భగ్గుమంటోంది. ఎక్కడికక్కడ విభేదాలు రచ్చకెక్కెతున్నాయి. ముషీరాబాద్ సీటు విషయంలో చిక్కుముడి అలాగే ఉండగా...తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి టిక్కెట్ ఇప్పించేందుకు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. అవసరమైతే తానే ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ను ఫోన్లో సంప్రదించగా...చర్చిద్దామని సూచించినట్లు సమాచారం. ఇక కొన్నిచోట్ల అదే పార్టీకార్పొరేటర్లు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాము పోటీ చేసి తీరుతామని ప్రకటించారు. కూకట్‌పల్లిలో బాలాజీనగర్ కార్పొరేటర్ కావ్య భర్త హరీష్‌రెడ్డి, శేరిలింగంపల్లిలో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్‌లు శుక్రవారం పార్టీ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్‌లో నియోకజవర్గ ఇన్చార్జి కొలను హన్మంతరెడ్డి, జూబ్లీహిల్స్‌లో మురళీగౌడ్ (2014లో టీఆర్ఎస్అభ్యర్థి)లు సైతం పోటీకి సిద్ధమని ప్రకటించారు. కూకట్పల్లి నియోకవర్గంలో హరీష్‌రెడ్డితో పాటు గొట్టిముక్కల పద్మారావు, వెంకటేశ్వరరావులు సైతం తాజా మాజీ ఎమ్మెల్యే కృష్ణారావు అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయానికి వచ్చారు. వీరిలో హరీష్‌రెడ్డి ఏకంగా స్వతంత్య్ర అభ్యర్థిగా తానే పోటీ చేస్తానన్న ప్రకటన కూడా విడుదల చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సైతం తాజా మాజీ ఎమ్మెల్యే గాంధీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్కే చెందిన మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ అనుచరులతో శుక్రవారం సమావేశం నిర్వహించి, వారం రోజుల్లో అభ్యర్థిని మార్చాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. జగదీశ్వర్‌గౌడ్ సతీమణి పూజిత హఫీజ్‌పేట కార్పొరేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక కుత్బుల్లాపూర్‌లో నియోకవర్గ ఇన్చార్జి కొలను హన్మంతరెడ్డి తాను పోటీ చేయటం ఖాయమని శుక్రవారం ప్రకటించారు. మల్కాజిగిరి, మేడ్చల్‌లో హైడ్రామా మల్కాజిగిరి, మేడ్చల్ శాసనసభ స్థానాల విషయంలో హైడ్రామా కొనసాగుతోంది. మల్కాజిగిరి సీటును తొలుత తాజా మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతికి ఖరారు చేశారు. ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు సహా ఐదుగురు కార్పొరేటర్లు అభ్యంతరం తెలపటంతో అధికారిక ప్రకటనను వాయిదా వేశారు. తనకే టికెట్ ఇవ్వాలని మైనంపల్లి పట్టుపడుతుండగా,సీఎం కేసీఆర్ మాత్రం చింతల కనకారెడ్డి కుటుంబానికి ఇచ్చేందుకే సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయవర్గాల కథనం. సీటు కనకారెడ్డికా లేదా ఆయన కోడలుకా అన్న విషయాన్ని తేల్చే బాధ్యతను ఆయన సమీప బంధువు, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌కు అప్పగించారు. మేడ్చల్ నియోకజవర్గంలోనూ సస్పెన్స్ సాగుతోంది. ఎంపీ మల్లారెడ్డి పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తుండటంతో ఆయన వైపే సీఎం మొగ్గు చూపే అవకాశం ఉందని సమాచారం. తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సైతం రెండవ జాబితాలో తన పేరు ఖచ్చితంగా ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. ముషీరాబాద్ కిరికిరి.. నగర రాజకీయాల్లో కీలక స్థానమైన ముషీరాబాద్ అభ్యర్థిత్వం టీఆర్ఎస్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ స్థానాన్ని తన సమీప బంధువు, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని కోరుతున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, అది సాధ్యపడక పోతే తానే పోటీ చేస్తానని శుక్రవారం ప్రకటించారు. ఈ స్థానం నుండి 2014లో ముఠా గోపాల్ పోటీ చేసి బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ చేతిలో ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనకే అవకాశం ఇవ్వాలని గోపాల్ కోరుతున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని కోరేందుకు గోపాల్ శుక్రవారం హుస్నాబాద్ వెళ్లి బహిరంగసభ వద్ద సీఎంను కలిసే ప్రయత్నం చేశారు. ఇదే విషయమై హోంమంత్రి నాయిని ముఖ్యమంత్రిని ఫోన్లో సంప్రదించగా శనివారం రావాలని, చర్చించి ఓ నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు సమాచారం. -
ఎన్నికలకు ఈసీఐ సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సిద్ధమవుతోంది. అసెంబ్లీకి, లోక్‌సభకు కలిపి నిర్వహించేలా ఇప్పటి వరకు కసరత్తు చేసిన సీఈవో కార్యాలయం ఇప్పుడు వేర్వేరు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఈ మేరకు షెడ్యూల్లోనూ మార్పులు చేస్తోంది. 10న తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (టీఎస్‌సీఈవో) రజత్‌కుమార్ ఢిల్లీకి వెళ్తున్నారు. అసెంబ్లీ రద్దు అంశంపై సమగ్ర నివేదికను ఈసీఐకి సమర్పించనున్నారు. భారత ఎన్నికల సంఘంలోని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఎస్‌హెచ్.ఉమేశ్‌సిన్హా నేతృత్వం లోని బృందం సెప్టెంబర్ 11న హైదరాబాద్‌కు రానుంది. అసెంబ్లీ రద్దు పరిణామాలపై నివేదిక రూపొందించి ఈసీఐకి అందించనుంది. మరోవైపు టీఎస్‌సీఈవో కార్యాలయం ముందస్తు ఎన్నికల ఏర్పాట్లను గురువారం నుంచే మొదలుపెట్టింది. ఎన్నికల అధికారులుగా విధులు నిర్వహించే కలెక్టర్లకు కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోని సాంకేతిక సిబ్బందితో శుక్రవారం హైదరాబాద్‌లో అవగాహన కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం), ఓటరు రసీదు పరికరాల (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్) పనితీరుపై శిక్షణ ఇప్పించింది. అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని రజత్‌కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయానికి తగినట్లుగా షెడ్యూల్లో మార్పులు ఉంటాయని, దీనికి అనుగుణంగా జిల్లాల్లో ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తే... వెంటనే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని రెండు ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు. మొదటిసారి రసీదులు... ఓటరుకు రసీదు ఇచ్చే విధానం అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలతో రాష్ట్రంలో తొలిసారి అమల్లోకి రానుంది. ఓటు వేయగానే దీన్ని ధ్రువీకరించేలా రసీదు వస్తుంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు ఓటరు రసీదు పరికరాలను అమర్చనున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే రాష్ట్రానికి 84,400 ఈవీఎంలను, ఇదే సంఖ్యలో రసీదు పరికరాలు అవసరమవుతాయని సీఈవో కార్యాలయం గత నెలలో అంచనా వేసింది. ప్రస్తుతం అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దీంట్లో సగం ఈవీఎంలు, వీవీప్యాట్లు సరిపోతాయని నిర్ధారించింది. వీటిని సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఓటరు రసీదు పరికరాలు అమర్చుతున్న నేపథ్యంలో ఒక్కో ఈవీఎంలో గరిష్టంగా 1,400 ఓట్లు మాత్రమే నమోదు చేసే అవ కాశం ఉంటుంది. ఈ సంఖ్యను దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రాంతాల్లో 1,300 ఓటర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో 1,200 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిర్యాదులు, కొత్త ఓటర్లు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని... పోలింగ్ సమయంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పరిమితి కంటే తక్కువ ఓటర్లతోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో తెలంగాణలో 30,518 పోలింగ్ కేంద్రాలున్నాయి. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 32,573 పోలింగ్ కేంద్రాలు ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీఎస్‌సీఈవో కార్యాలయం ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదం రావాల్సి ఉంది. పూర్తి స్థాయి సిబ్బంది... ముందస్తు ఎన్నికల ఏర్పాట్ల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ మొదలైంది. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న జ్యోతి బుద్ధప్రకాశ్‌ను అదనపు సీఈవోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రాకు దళిత అభివృద్ధి శాఖ అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఈవోలో ఖాళీగా ఉన్న డిపూ ్యటీ సీఈవోలు, ఇతర పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణకు మేం సిద్ధం ఎన్నికల షెడ్యూలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉన్నా మని శుక్రవారం ఒక నివేదిక పంపారు. ఈ నివేదికను శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిషన్ సమీక్షించింది. 2018, జనవరి 1వ తేదీ ప్రాతిపదికన ఓటరు జాబితాలు సిద్ధంగా ఉన్నాయని, సిబ్బంది, వాహనాలు, ఇతరత్రా మౌలిక వసతులన్నీ అందుబాటులో ఉన్నాయని నివేదిక ఇచ్చారు. ఓటర్లు, పోలింగ్ కేంద్రాల సంఖ్య ఆధారంగా ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాల లభ్యత తదితర అంశాలను కేంద్ర ఎన్నికల కమిషన్ బేరీజు వేయాల్సి ఉంటుంది. 2019, లోక్‌సభ ఎన్నికల కోసం 16.15 లక్షల వీవీప్యాట్ యంత్రాలను సమకూర్చాలని బీఈఎల్, ఈసీఐఎల్ కంపెనీలను కేంద్ర ఎన్నికల కమిషన్ కోరింది. నవంబర్ 28లోగా ఈ మేరకు సమకూర్చనున్నాయి. ఇప్పటికే దాదాపు 50 శాతం యంత్రాలను సమకూర్చినట్టు సమాచారం. అందువల్ల వీవీప్యాట్ యంత్రాల లభ్యతకూ ఇబ్బంది ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. అక్టోబర్ మొదటి వారంలోనే షెడ్యూల్? మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు 2013లో ఎన్నికలు జరిగినప్పుడు అక్టోబర్ 4న షెడ్యూల్ వెలువడింది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 11, 19 తేదీల్లో, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 25న, రాజస్తాన్‌లో డిసెంబర్ 1న, మిజోరంలో డిసెంబర్ 4న ఎన్నికలు జరగగా, డిసెంబర్ 8న ఫలితాలు వెలువడ్డాయి. ప్రస్తుతం డిసెంబర్ 15 నాటికి మిజోరంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంది. అలా జరగాలంటే దాదాపు పాత షెడ్యూల్‌నే అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ లెక్కన ఆ 4 రాష్ట్రాలతోపాటు తెలంగాణలోనూ ఎన్నికలొస్తే అక్టోబర్ మొదటి వారంలోనో లేదా అంతకంటే ముందుగానో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంటుంది. సీఈసీ ఆదేశాల మేరకు చేస్తాం: రజత్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేస్తాం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే ఎలా వ్యవహరించాలనేది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. ఓటర్ల జాబితా సవరణ కోసం ప్రవేశపెట్టిన ఆధునిక సాఫ్ట్వేర్ ఈఆర్వో నెట్ 2.0 వెర్షన్‌పై అన్ని జిల్లాల ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ పూర్తి చేశాం. కొత్త ఈఆర్వో నెట్‌పైనా అవగాహన కల్పిస్తున్నాం. ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు స్థానిక అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఎలక్ట్రోరల్ రోల్ మేనేజ్ మెంట్ సిస్టం ఉండేది... కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ఈఆర్వో నెట్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానంతో నకిలీ ఓటర్లను ఏరివేయవచ్చు. -
తెలంగాణ అసెంబ్లీ రద్దుపై హైకోర్టులో పిటిషన్
-
అసెంబ్లీ రద్దు.. హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దుపై శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేయడంపై రాపోలు భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. ఉన్నపళంగా అసెంబ్లీని రద్దు చేయడం వలన రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని తెలిపారు. 5 సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకూ ఎలాంటి ఎన్నికలు జరగకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారించనుంది. -
నాయిని నారాజ్!
సాక్షి,సిటీబ్యూరో: తాను సూచించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గురువారం ప్రకటించిన టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ముషీరాబాద్ స్థానం నుంచి తన సమీప బంధువు, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన కేసీఆర్ నిర్వహించిన విలేకరుల సమావేశానికి సైతం దూరంగా ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఆ జాబితాలో ముషీరాబాద్ స్థానానికి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ముఠా గోపాల్ పేరు ఉందన్న సమాచారంతో నాయిని అలిగినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి హాజరు కాలేదన్న ప్రచారం జరిగింది. దీంతో చివరి నిమిషంలో ముషీరాబాద్ అభ్యర్థి ప్రకటనను వాయిదా వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయమై హోంమంత్రిని ‘సాక్షి’ ప్రతినిధి అడగ్గా.. కేబినెట్ సమావేశంలో తాను పాల్గొనడం వల్లే, కేసీఆర్ విలేకరుల సమావేశానికి వెళ్లలేదని, ‘అయినా ముషీరాబాద్ టికెట్ శ్రీనివాసరెడ్డికి ఎందుకు రాదు... తప్పకుండా వస్తుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పద్మారావు ‘పాంచ్’ పటాకా.. 2004లో తొలిసారి శాసనసభకు పోటీ చేసిన మంత్రి పద్మారావు.. రెండు విజయాలు, రెండు ఓటములు తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఐదోసారి పోటీకి సిద్ధమయ్యారు. 2004, 2014లో విజయం సాధించిన ఈయన.. 2008 ఉప ఎన్నికల్లో తలసాని చేతిలో, 2009లో (సనత్‌నగర్) మర్రి శశిధర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తలసాని ‘ఆరోసారి’.. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తొలిసారి టీఆర్ఎస్ తరఫున పోటీ చేయనున్నారు. 1995లో ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన తలసాని, 1999, 2008, 2014లలో విజయం సాధించారు. 2004, 2009లో ఓటమి పాలయ్యారు. ముందస్తు ఎన్నికల్లో ఆరోసారి శాసనసభకు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సాయన్నా.. ఆరోసారే.. కంటోన్మెంట్ నియోకజవర్గంలో 1994 నుంచి వరసగా పోటీ చేసి నాలుగుసార్లు సాయన్న విజయం సాధించారు. 2009లో శంకర్రావు చేతిలో ఓడిపోయారు. తిరిగి 2014లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు.. టీఆర్ఎస్ అభ్యర్థిగా తొలిసారిగా పోటీ చేస్తున్న సాయన్న.. శాసనసభ ఎన్నికలను ఎదుర్కోవడం ఇది ఆరోసారి. గతంలో ఓడిన వారికి మరో ఛాన్స్ 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి పాలైన ముద్దగోని రాంమోహన్‌గౌడ్(ఎల్బీనగర్), భేతి సుభాష్‌రెడ్డి(ఉప్పల్), జీవన్‌సింగ్(కార్వాన్), సీతారాంరెడ్డి (చాంద్రాయణగుట్ట), ఇనాయత్ అలీకి చార్మినార్ బదులు బహుదూర్‌పురాలో అవకాశం కల్పించారు. అంబర్‌పేట, మలక్‌పేట, గోషామహల్‌లలో కొత్త అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నారు. -
టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రొౖఫైల్
ఎన్నికలకు కారు జోరందుకుంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల గులాబీ గ్యాంగ్ తొలి జాబితా విడుదలైంది. గురువారం మధ్యాహ్నం శాసనసభనురద్దు చేసిన అనంతరం సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు.చాలామంది సిట్టింగ్లతో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి అభ్యర్థులకూ ఆయన అవకాశమిచ్చారు. సాక్షి,సిటీబ్యూరో: శాసనసభ రద్దుతో పాటు ఏకంగా అభ్యర్థులను సైతం ప్రకటించి అధికార టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికల రణానికి తెర తీయడంతో నగరంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. తొలి జాబితాలోనే తాజా మాజీ ఎమ్మెల్యేలతో పాటు (మల్కాజిగిరి మినహా) గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులకూ మరో అవకాశం కల్పించారు. చివరి నిమిషంలో మల్కాజిగిరి, ముషీరాబాద్ స్థానాల అభ్యర్థుల ప్రకటన నిలిపివేత, బీజేపీ, ఎంఐఎం సిట్టింగ్ స్థానాల్లో మెజారిటీ ప్రాంతాల్లో అభ్యర్థులను ప్రకటించకపోవడం రాజకీయ చర్చకు తెరలేపింది. టీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటించడంతో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, వైఎస్సార్ కాంగ్రెస్, జన సమితి సైతం తమ కార్యాచరణను ముమ్మరం చేశాయి. సిట్టింగ్‌లందరికీ సీటు ఖరారు టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వలస వెళ్లిన తలసాని శ్రీనివాసయాదవ్ (సనత్‌నగర్), మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్), ఎం.కృష్ణారావు(కూకట్పల్లి), ఎ.గాంధీ (శేరిలింగంపల్లి), ప్రకాష్‌గౌడ్(రాజేంద్రనగర్), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), సాయన్న (కంటోన్మెంట్), కె.పి. వివేకానంద్ (కుత్బుల్లాపూర్) వంటి వారందరికీ టీఆర్ఎస్ టికెట్లు ఖరారు చేసింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్‌పై విజయం సాధించిన మల్కాజిగిరి తాజా మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి పేరు లేకపోగా, టి.పద్మారావు (సికింద్రాబాద్)లకు మరో అవకాశం ఇచ్చారు. మల్కాజిగిరిలో కనకారెడ్డి కోడలు విజయశాంతి పేరు దాదాపు ఖాయమైన తర్వాత, చివరి నిమిషంలో తొలగించినట్లు సమాచారం. ముషీరాబాద్‌లో ముఠా గోపాల్ పేరు సైతం ఖరారు కాగా, హోంమంత్రి నాయిని ఫిర్యాదుతో అధికారిక ప్రకటన వాయిదా వేసినట్లు తెలిసింది. సనత్‌నగర్– తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేరు: తలసాని శ్రీనివాస్‌యాదవ్ విద్యార్హత: ఇంటర్మీడియెట్ కుటుంబం: భార్య స్వర్ణ, కుమార్తెలు శ్వేత, స్వాతి, కుమారుడు సాయికిరణ్ స్వస్థలం: ఆదయ్యనగర్, సికింద్రాబాద్ రాజకీయ నేపథ్యం: టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న ఆయన సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు పోటీ చేశారు. 1994, 1999, 2008, (ఉప ఎన్నిక)ల్లో సికింద్రాబాద్ నుంచి, 2014 సనత్‌నగర్ నుంచి సైకిల్ గుర్తుపై గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 1994లో కార్మిక శాఖ మంత్రిగా, 1999లో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. టీడీపీ నగర అధ్యక్షునిగా పనిచేసిన ఆయన 2014 ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి గెలుపొందారు. అనంతరం ఆయన టీఆర్ఎస్లో చేరి మంత్రి అయ్యారు. సికింద్రాబాద్– టి.పద్మారావు గౌడ్ పేరు: తీగుళ్ల పద్మారావు గౌడ్ విద్యార్హత: ఇంటర్ కుటుంబం: భార్య స్వరూప, కుమారులు కిషోర్, కిరణ్, రామేశ్వర్, త్రినేత్ర, కుమార్తెలు మనీష, మౌనిక రాజకీయ నేపథ్యం: 1973లో యువజన కాంగ్రెస్‌లో చేరిక. 1986లో హిస్సాంగంజ్ మోండా డివిజన్ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్‌గా గెలుపొందారు. 2002లో టీఆర్ఎస్ నుంచి మరోసారి జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా గెలుపొందారు. 2004లో సికింద్రాబాద్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 సికింద్రాబాద్ ఉప ఎన్నికల్లో తలసాని చేతిలో, 2009తో సనత్‌నగర్ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మారావు గౌడ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. బహదూర్‌పురా– మీర్ ఇనాయత్ అలీ బాక్రీ పేరు: మీర్ ఇనాయత్ అలీ బాక్రీ విద్యార్హత: బీఏ కుటుంబం: భార్య పర్వీన్, కుమార్తెలు నిఖత్, జబీన్, కుమారుడు రిజ్వాన్ అలీ బాక్రీ స్వస్థలం : దారుషిఫా, హైదరాబాద్ రాజకీయ నేపథ్యం: టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఆ పార్టీ చార్మినార్ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో చార్మినార్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. నిర్వహించిన పదవులు: సెట్విన్ చైర్మన్‌గా కొనసాగుతున్న ఆయన నేషనల్ హ్యాకర్స్ ఫెడరేషన్, ఏపీ హమాలీ అండ్ ట్రాన్స్‌ఫోర్టు వర్కర్స్ యూనియన్, ఏపీ మహిళా వెల్ఫేర్ సొసైటీ, భారత్ వెల్ఫేర్ సొసైటీ, తెలంగాణ ఉర్దూ తహరీఖ్, తెలంగాణ లేబర్ అసోసియేషన్లను కొనసాగుతున్నారు. చాంద్రాయణగుట్ట– ముప్పిడి సీతారాంరెడ్డి పేరు : ముప్పిడి సీతారాంరెడ్డి విద్యార్హత : బీఏ కుటుంబం : భార్య శోభారెడ్డి, కుమార్తె గ్రీష్మారెడ్డి స్వస్థలం : ఎస్సార్టీ కాలనీ, ఛత్రినాక, హైదరాబాద్ రాజకీయ నేపథ్యం: 2001 నుంచి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి క్రియాశీలక నాయకుడిగా కొనసాగుతున్నారు. 2002లో గౌలిపురా డివిజన్ నుంచి, 2016లో జంగమ్మెట్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం చాంద్రాయణగుట్ట నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. 2001లో ఆదిలాబాద్ జిల్లా జెడ్పీటీసీ ఇన్చార్జిగా కొనసాగారు. ఎల్బీనగర్– రాంమోహన్ గౌడ్ పేరు: ముద్దగౌని రాంమోహన్‌గౌడ్ విద్యార్హత: బీకాం డిగ్రీ కుటుంబం: భార్య లక్ష్మీప్రసన్న (పస్తుతం బీఎన్‌రెడ్డినగర్ కార్పొరేటర్) కుమారులు: రంజిత్‌గౌడ్, మనీష్‌గౌడ్ స్వస్థలం: సాహెబ్‌నగర్, వైదేహినగర్, బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ రాజకీయ నేపథ్యం: టీఆర్ఎస్లో చేరకముందు కాంగ్రెస్‌లో 30 ఏళ్లపాటు ఉన్నారు. ఎల్బీనగర్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీ ఎల్బీనగర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. చేపట్టిన పదవులు: 2007లో హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా.. 2011లో తిరిగి రెండోసారి హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పదవులు నిర్వహించారు. ప్రస్తుతం ఎల్బీనగర్ టీఆర్ఎస్ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. కార్వాన్– ఠాకూర్ జీవన్‌సింగ్ పేరు: ఠాకూర్ జీవన్‌సింగ్ విద్యార్హత: ఇంటర్మీడియెట్ కుటుంబం: భార్య దీపారాణి, కుమారుడు శశిధర్, కుమార్తెలు నిషిత, నిహారిక స్వస్థలం: మహబూబ్‌నగర్‌జిల్లా మొగిలిగిద్దె రాజకీయ నేపథ్యం: 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2012లో టీఆర్ఎస్లో చేరారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కార్వాన్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం టీఆర్ఎస్ కార్వాన్ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. మహేశ్వరం– తీగల కృష్ణారెడ్డి పేరు: తీగల కృష్ణారెడ్డి విద్యార్హత: బీఏ కుటుంబ నేపథ్యం: భార్య తీగల అరుంధతి కుమారులు: తీగల హరినాథ్ రెడ్డి, తీగల అమర్నాథ్ కుమార్తె: తీగల హరితారెడ్డి స్వస్థలం: రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం, పాత మీర్పేట్ చేపట్టిన పదవులు: 1987–89, 1995–98లలో హుడా చైర్మన్ (హైద్రాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)గా, 2001– 2006లో హైదరాబాద్ మేయర్‌గా పని చేశారు. 2014లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం టీఆర్ఎస్లో చేరారు. పటాన్చెరు– మహిపాల్‌రెడ్డి పేరు: గూడెం మహిపాల్‌రెడ్డి విద్యార్హత: ఇంటర్మీడియెట్ స్వస్థలం: పటాన్చెరు కుటుంబం: భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె రాజకీయ నేపథ్యం : 1996–99 వరకు పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2001–2002 వరకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా కొనసాగారు. 1995లో ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2001లో పటాన్చెరు మండల అధ్యక్షుడిగా ఎన్నిక. 2005 వరకు మండల అధ్యక్షుడిగా ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. పలు పరిశ్రమల్లో కార్మిక యూనియన్ నేతగా ఉన్నారు. 2009లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో బీఎస్పీ టికెట్‌తో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు. 2013లో వైఎస్సార్ సీపీలో చేరారు. 2014లో టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాంపల్లి– మునుకుంట్ల ఆనంద్‌కుమార్ గౌడ్ పేరు: మునుకుంట్ల ఆనంద్‌కుమార్ గౌడ్ విద్యార్హత: బీఏ స్వస్థలం: గౌలిగూడ, హైదరాబాద్ కుటుంబం: భార్య మంజుల, కుమారులు వైష్ణవ్ గౌడ్, అభినవ్‌గౌడ్ రాజకీయ నేపథ్యం: 1983లో రాజకీయ రంగ అరంగేట్రం. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సుల్తాన్‌బజార్ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా, 2014 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జాంబాగ్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. జూబ్లీహిల్స్– మాగంటి గోపీనాథ్ పేరు: మాగంటి గోపీనాథ్ విద్యార్హత: బీఏ కుటుంబం: భార్య మాగంటి సునీత, పిల్లలు మాగంటి వాత్సల్యనాథ్, అక్షర, దీక్షర నివాసం: హైదరాబాద్ రాజకీయ నేపథ్యం: మూడు దశాబ్దాలపాటు తెలుగు «యువత విభాగంలో ముఖ్యనేతగా, టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2015లో టీఆర్ఎస్లో చేరారు. ఉప్పల్– భేతి సుభాష్‌రెడ్డి పేరు: భేతి సుభాష్‌రెడ్డి విద్యార్హత: బీకాం కుటుంబం: భార్య భేతి స్వప్నరెడ్డి (జీహెచ్ఎంసీ హబ్సిగూడ కార్పొరేటర్), కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్వస్థలం: రామాజీపేట, యాదగిరిగుట్ట మండలం, యాదాద్రి జిల్లా ప్రస్తుత నివాసం: రవీంద్రనగర్ కాలనీ, హబ్సిగూడ, ఉప్పల్ రాజకీయ నేపథ్యం: ఇంటర్మీడియట్లో ఉండగా ఏఐఎస్ఎఫ్లో పనిచేశారు. డిగ్రీలో ఎన్ఎస్యూఐ నాయకుడిగా విద్యార్థి సమస్యలపై పోరాడారు. టీఆర్ఎస్లో రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శిగా, జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009 నుంచి టీఆర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా పనిచేస్తున్నారు. 2014లో ఉప్పల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. కూకట్పల్లి– మాధవరం కృష్ణారావు పేరు: మాధవరం కృష్ణారావు కుటుంబం: మాధవరం లక్ష్మీబాయి, కుమార్తె శ్రీలత, కుమారుడు సందీప్ స్వస్థలం : శేషాద్రినగర్, కూకట్పల్లి రాజకీయ నేపథ్యం: 1983 నుంచి 30 ఏళ్లపాటు టీడీపీలో పనిచేశారు. మూడుసార్లు కూకట్పల్లి పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో టీడీపీ కౌన్సిలర్‌గా గెలుపొంది కూకట్పల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం టీఆర్ఎస్లో చేరారు. యాఖుత్‌పుర– సామ సుందర్‌రెడ్డి పేరు: సామ సుందర్‌రెడ్డి విద్యార్హత: డిగ్రీ స్వస్థలం: చంపాపేట, కేశవనగర్ కాలనీ కుటుంబం: భార్య సామ స్వప్నారెడ్డి (ఐఎస్‌సదన్ డివిజన్ కార్పొరేటర్), కుమారుడు చరణ్‌రెడ్డి రాజకీయ నేపథ్యం: బీజేపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా పని చేశారు. 2009లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఐఎస్‌సదన్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యరు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన భార్య సామ స్వప్నారెడ్డి కార్పొరేటర్‌గా గెలుపొందారు. కుత్బుల్లాపూర్– కె.పి. వివేకానంద్ పేరు: కె.పి.వివేకానంద్ విద్యార్హత: బీఈ కుటుంబం: భార్య సౌజన్య, కుమార్తె మాతృశ్రీ, కుమారుడు విధాత్ వర్ధంత్ స్వస్థలం: మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ రాజకీయ నేపథ్యం: తండ్రి కేఎం పాండు 25 ఏళ్ల పాటు కుత్బుల్లాపూర్ సర్పంచ్‌గా, ఐదేళ్లు కుత్బుల్లాపూర్ మున్సిపల్ చైర్మన్‌గా పని చేశారు. పాండుకు ఏకైక కుమారుడు కేపీ వివేకానంద్ నిర్వహించిన పదవులు: శక్తి యువసేన సమితి ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టారు. వివేకానంద్ 2008లో టీడీపీలో చేరారు. గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2016లో టీఆర్ఎస్లో చేరారు. అసెంబ్లీలో ప్రొటోకాల్ విభాగం సభ్యుడిగా కొనసాగారు. శేరిలింగంపల్లి– ఆరెకపూడి గాంధీ పేరు: ఆరెకపూడి గాంధీ విద్యార్హత: పాలిటెక్నిక్ డిప్లొమా నివాసం: వివేకానందనగర్ కాలనీ, కూకట్పల్లి కుటుంబం: భార్య శ్యామల, కుమారుడు పృథ్వీ, కూతురు ప్రణీత స్వస్థలం: పాలకొండ, నందివాడ మండలం,కృష్ణా జిల్లా రాజకీయ నేపథ్యం: 1982 టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధిగా ఉన్నారు. బసవతారకం ట్రస్టీగా పని చేశారు. డిచ్పల్లి, నిజామాబాద్ లోక్ సభ, ఖైరతాబాద్, గుడివాడ, సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జిగా పని చేశారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా శేరిలింగంపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కంటోన్మెంట్– సాయన్న పేరు: జ్ఞాని సాయన్న విద్యార్హత: ఎల్ఎల్బీ కుటుంబం: భార్య గీత, కుమార్తెలు నమృత, నివేదిత, లాస్య నందిత (కవాడీగూడ కార్పొరేటర్) స్వస్థలం: వాల్వాపూర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయ నేపథ్యం: 1980లో బ్యాంకు ఉద్యోగిగా చేరిన సాయన్న, 1986లో హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కవాడీగూడ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో తొలిసారిగా 1994లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి వరుసగా ఇక్కడే పోటీ చేస్తున్నారు. 2015లో కొంతకాలం టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేసిన సాయన్న, 2015లో టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఇబ్రహీంపట్నం– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేరు: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విద్యార్హత: బీఏ స్వగ్రామం: ఎల్మినేడు, ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా సంతానం: కుమారులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి (మాజీ కార్పొరేటర్), వెంకటేశ్వర్‌రెడ్డి, కూతురు శీతల్. రాజకీయ నేపథ్యం: 1986లోఎల్మినేడు సర్పంచ్‌గా పని చేశారు. 1992లో సింగిల్‌విండో చైర్మన్‌గా, డీసీసీబీ డైరెక్టర్‌గా, టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శిగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2002లో ఏపీఐడీసీ చైర్మన్‌గా పనిచేశారు. 2004లో టీడీపీ నుంచి మలక్‌పేట్ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2009– 2014లలో రెండుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2015లో టీఆర్ఎస్లో చేరారు. రాజేంద్రనగర్– టి.ప్రకాష్‌గౌడ్ పేరు: తొలుకట్ట ప్రకాష్‌గౌడ్ స్వస్థలం:మైలార్‌దేవ్‌పల్లి గ్రామం విద్యార్హత: ఎస్సెస్సీ నివాసం: మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ సర్కిల్,రంగారెడ్డి జిల్లా రాజకీయ నేపథ్యం: 2009 ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి బి.జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌పై గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యే మళ్లీ విజయం సాధించారు. 2016లో ఆయన టీఆర్ఎస్లో చేరారు. -
పాపాత్ముని పాలన అంతం: మధుయాష్కీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పాపాత్ముని పాలన అంతమైందని మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. గురువారం గాంధీ భవన్లో అసెంబ్లీ రద్దుపై ఆయన మాట్లాడారు. ఐదేళ్లు పాలించమని ప్రజలు అధికారమిస్తే.. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరమేమొచ్చిందన్నారు. కేసీఆర్ ఓ ఆధునిక నయీం అని, అతని ఎన్కౌంటర్ తర్వాత దొరికిన డైరీ, ఆస్తులు ఎటుపోయాయని ప్రశ్నించారు. పేకాట క్లబ్బులు మూసేస్తామని చెప్పి.. పబ్బులను కేటీఆర్ తెరిపించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇసుక, గుట్కా దందాలతో దోచుకుంటున్నారని ఆరోపించారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. -
ఉదయం నుంచి ఉత్కంఠే..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ రద్దవుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే మీడియా ప్రతినిధులు, కొందరు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, పోలీసులతో రాజ్‌భవన్ పరిసరాల్లో సందడి నెలకొంది. ఉదయం 9 గంటల నుంచే అక్కడ మీడియా హడావుడి మొదలైంది. అప్పటి నుంచే ప్రత్యేక ప్రసారాలతో రాజ్‌భవన్ ప్రాంగణం హోరెత్తింది. కేబినెట్ తీర్మానం అనంతరం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వస్తారని తెలియడంతోనే టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈ తతంగం బయటి నుంచి చూడటానికి ఆసక్తిగా తరలివచ్చారు. మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం మంత్రులందరితో కలసి బస్సుల్లో రాజ్‌భవన్ చేరుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ముఖ్యమంత్రి ఒక్కరే తన కాన్వాయ్‌లో సరిగ్గా 1.28 గంటలకు రాజ్‌భవన్ చేరుకున్నారు. తిరిగి 2.02 నిమిషాలకు ఆయన ప్రగతి భవన్‌కు వెనుదిరిగి వెళ్లారు. మినిట్ టు మినిట్... ఉదయం... 9.00 గంటలు: రాజ్‌భవన్ చేరుకున్న మీడియా ప్రతినిధులు 10.00 గంటలు: రాజ్‌భవన్ పరిసరాల్లో పోలీసుల ఆంక్షలు 11.00 గంటలు: సీఎం వచ్చే విషయంపై టీవీ జర్నలిస్టుల విశ్లేషణలు మధ్యాహ్నం.. 12.00 గంటలు: సీఎం వస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది 12.20 గంటలు: గవర్నర్ సెక్యూరిటీ సిబ్బంది ఎలాంటి వాహనాలనూ లోనికి వెళ్లనివ్వలేదు. 12.31 గంటలు: పూర్తిగా గేట్లకు తాళాలు వేసిన సెక్యూరిటీ సిబ్బంది 1.19 గంటలు: రాజ్‌భవన్ రోడ్డుపై పోలీసుల అప్రమత్తం, ట్రాఫిక్ నిలిపివేత 1.20 గంటలు: సీఎం కోసం ఎదురుచూస్తుండగా బొప్పాని ఈశ్వర్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు వెంటనే అతనిని నిలువరించారు. 1.22 గంటలు: అమరులకు గుర్తింపు దక్కలేదని అందుకే తాను ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించానని ఈశ్వర్ మీడియాతో మాట్లాడాడు. 1.26 గంటలు: యువకుడిని ఆటోలో స్టేషన్‌కు తరలించిన పోలీసులు 1.28 గంటలు: రాజ్‌భవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ 2.02 గంటలు: రాజ్‌భవన్ నుంచి ప్రగతి భవన్‌కు వెనుదిరిగిన సీఎం కేసీఆర్. -
‘ముందస్తు’పై కోర్టుకు!
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో జరగనున్న ముందస్తు ఎన్నికలపై కోర్టుకెళ్లాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ జరుగుతోందని, 13 లక్షల మంది యువకులు ఓటు హక్కు కోసం వేచి చూస్తున్నారని, జనవరి 1 తర్వాతే ఎన్నికలు జరిగితే వారు ఎన్నికల్లో పాల్గొంటారని, అలా కాదని ముందస్తుకెళితే కోర్టుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలిసింది. అసెంబ్లీని రద్దు చేయాలంటూ తెలంగాణ సీఎం, కేబినెట్ నిర్ణయం తీసుకోవడం.. ఇందుకు గవర్నర్ కూడా ఆమోదించడంతో ప్రక్రియపై కమిషన్ సందిగ్ధంలో పడిపోయిందని ఆ పార్టీ నేతలు అంటున్నట్లు సమాచారం. జాబితా సవరణ జరుగుతున్నపుడు ఎన్నికలు ఇంతవరకు జరగలేదని, అసెంబ్లీ రద్దయినా వచ్చే ఏడాదికి ముందు ఎన్నికలు జరగవని వారు చెబుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రస్తావిస్తూ.. ‘రాష్ట్రంలో ఓటర్ల జాబితా ముసాయిదాను సెప్టెంబర్ 1నే కమిషన్ విడుదల చేసింది. ఇందుకు అక్టోబర్ 31 వరకు సమయమిచ్చింది. నవంబర్ 30 వరకు ధ్రువీకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత చివరగా జాబితా సవరణ చేసి జనవరి 4న తుది జాబితా వెల్లడిస్తామంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు రాష్ట్రంలో ఎన్నికలు జరపకూడదు’అని పేర్కొంది. ఎన్నికలు కనీసం రెండు నెలలు కూడా లేని ఇలాంటి పరిస్థితి కమిషన్‌ను సందిగ్ధంలోకి నెడుతుందని చెప్పింది. -
అసెంబ్లీ ఎన్నికలపై రంగంలోకి సీఈసీ
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. రాష్ట్రంలోని పరిస్థితులు, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై శుక్రవారం సమావేశం నిర్వహించనుంది. అధికార వర్గాల సమాచారం మేరకు.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్, మరో ఇద్దరు సభ్యులు అశోక్ లావాసా, సునీల్ అరోరాలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారులతో భేటీ కానున్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా, భద్రతా సిబ్బంది, పోలింగ్ సిబ్బంది, పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, ఈవీఎంలు తదితర అంశాలపై వీరు చర్చించనున్నారు. ఇక్కడ నెలకొన్న పరిస్థితులు, శాంతి భద్రతల అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందితే సోమ లేదా మంగళవారం రోజున తెలంగాణకు కేంద్ర బృందాల్ని పంపి ఇక్కడి అధికారులతో సమావేశాలు నిర్వహించనుంది. ఇదిలావుండగా మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు నవంబర్ రెండో వారంలో గడువు ముగుస్తున్న నేపథ్యంలో అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించాలని కమిషన్ భావిస్తోంది. కుదిరితే ఈ నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలోనూ ఒకటి లేదా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణపై ఈ రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల అభ్యంతరాలు, అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల సంఘం తెలుసుకోనుంది. -
అసెంబ్లీ రద్దుకు నిరసనగా ఓయూలో ఆందోళనలు
హైదరాబాద్: కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలతో అసెంబ్లీ రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులు గురువారం నిరసనలు చేపట్టారు. ఒక వైపు నల్ల జెండాలతో నిరసన ర్యాలీలు నిర్వహించగా, నాలుగున్నరేళ్లుగా రాష్ట్రానికి పట్టిన శని విరగడైందంటూ మరోవైపు స్వీట్లు పంచి, కేక్‌లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ప్రధాన లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల మీదుగా భారీ ర్యాలీ జరిపారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్,టీజేఎస్ నేతలు రమేష్, కాంగ్రెస్ నేతలు దయాకర్ మాట్లాడుతూ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండా అసెంబ్లీని రద్దు చేయడం వల్ల తెలంగాణకు పట్టిన దరిద్రం వదిలిందని, కేసీఆర్ నియంత పాలననుంచి ప్రజలకు విముక్తి కలిగిందన్నారు. నాలుగున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయకుండా మానిఫెస్టో హామీలను అమలు చేయకుండానే అసెంబ్లీ రద్దు చేయడం సిగ్గు చేటన్నారు. ప్రజల ఆకాంక్షను వ్యక్తిగత స్వార్థాల కోసం, తన వ్యక్తిగత కోరికలతో కాలాన్ని వృథా చేశారన్నారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రానికి ఇదొక శుభపరిణామమని, రానున్న ఎన్నికల్లో యువత, నిరుద్యోగుల తీర్పు కీలకంగా మారుతుందన్నారు. ప్రజా తీర్పుతోనే కేసీఆర్ చెంపచెల్లుమనేలా విద్యార్థి లోకం సిద్ధం కావాలన్నారు. నేడు విద్యాసంస్థల బంద్: అసెంబ్లీ రద్దును నిరసిస్తూ విద్యార్థులు ఓయూలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ రద్దును నిరసిస్తూ శుక్రవారం విద్యా సంస్థలు, యూనివర్సిటీల బంద్‌కు ఐక్య విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.బంద్‌లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు యూనివర్సిటీలు విధిగా పాల్గొనాలని విద్యార్థి సంఘాల నేతలు కోరారు. -
ప్రగతి చక్రం ఆగకూడదనే..
సాక్షి, హైదరాబాద్ : ‘‘ఈ మధ్య రాష్ట్రంలో రాజకీయ విచ్చలవిడితనం, అతి ప్రవర్తన, అసహన వైఖరి చాలా చూస్తూ ఉన్నం. అది ఏ రకంగా కూడా వాంఛనీయం కాదు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కాకిగోల, పిచ్చి, పసలేని ఆరోపణలు చాలా భయంకర పద్ధతిలో జరుగుతున్నాయి. నీటి పారుదల ప్రాజెక్టుల మీద కోర్టులకు వెళ్లి స్టే తేవడం. రౌండ్ టేబుల్స్, వాటి బొంద టేబుల్స్(రౌండ్ టేబుల్ సమావేశాలు) పెట్టి పిచ్చిపిచ్చి పనికిమాలిన దుర్మార్గమైనటువంటి అత్యంత అవాంఛనీయ ఆరోపణలు చేస్తున్నరు. చాలా కురుచ వ్యక్తులు, ఏ మాత్రం అవగాహన, పరిజ్ఞానం లేని వ్యక్తులు అవాకులు చవాకులు పేలుతా ఉన్నరు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరింత విచ్చలవిడి ఆరోపణలు చేస్తున్నరు. అది మన వృద్ధిని అడ్డుకుంటది. అధికారులు సైతం కొంత స్థైర్యం కోల్పోయే పరిస్థితి. ఆరు నూరైనా సరే తెలంగాణ ప్రగతి రథచక్రం ఆగకూడదు. ఈ అభివృద్ధి ప్రక్రియ, ఆర్థికాభివృద్ధి పెరుగుదల ఆగకూడదు. అందువల్లే ఆల్రెడీ ఎన్నికల జోన్లోకి వచ్చినం కాబట్టి రెండు రోజులు ముందుగానో వెనకగానో ఎన్నికలకు వెళ్తున్నం’’అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేక కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గురువారం శాసనసభను రద్దు చేసిన అనంతరం తెలంగాణ భవన్లో మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘గత నాలుగేళ్లలో రాష్ట్రం 17.17 శాతం ఆర్థిక ఎదుగుదల సాధించింది. కాగ్ రిపోర్టు ప్రకారం కేంద్ర ఆర్థికశాఖ ఈ గణాంకాలు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఐదు మాసాల్లో రాష్ట్రం 21.96 శాతం ఆర్థిక వృద్ధి సాధించింది. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయ వృద్ధిలో దేశంలోని ఏ రాష్ట్రం మనకు దరిదాపుల్లో లేదు. 10 శాతానికిపైన కేవలం రెండో మూడో రాష్ట్రాలున్నయి. మిగలినవన్నీ ఒక అంకె వృద్ధి శాతానికే పరిమితమయ్యాయి. మంచి వృద్ధితో రాష్ట్రం ముందుకు పోతావుంది’’అని పేర్కొన్నారు. ఆరోపణలకు ఒక్క ఆధారం చూపలేదు ! ‘‘ఈ వృద్ధి ఎట్ట సాధ్యమైతది? కచ్చితంగా చాలా పట్టుదలతో కడుపు, నోరు కట్టుకొని నియంత్రిత విధానంలో ఉన్నత స్థాయి క్రమశిక్షణతో పని చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కొత్త రాష్ట్రం అనతి కాలంలో 21.96 శాతం వృద్ధి సాధించడం పిల్లలాట కాదు. కేంద్రంలో ఉన్నది మా పార్టీ ప్రభుత్వం కాదు. మా స్నేహపూర్వక ప్రభుత్వం కూడా కాదు. మేం వారి కూటమిలో లేము. వాళ్లు ఇచ్చిన అంకెలు ఇవి. దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నం. తెలంగాణకు ఇప్పటికే 40 అవార్డులొచ్చాయి. మిషన్ భగీరథ వంటి పథకాలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పెడితే దానికి కమీషన్లు అంటరు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా అనేక పదవుల్లో పాత్రదారులైన దద్దమ్మలు ఈ ఆరోపణలు చేస్తున్నరు. కాకతీయ రాజుల పుణ్యమా అని వెలిసిన మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ మొత్తం ధ్వంసమైతే ఈ సన్నాసులెవరూ నోరు తెరవలేదు. కనీసం వారి నియోజకవర్గ అభివృద్ధి నిధులతో కూడా వాటిని చేపట్టలేదు. పూర్తిగా నేరపూరిత నిర్లక్ష్యం, తత్ఫలితంగా ఏర్పడినవాటిని సరిద్దుదుకుని పోతుంటే అవాకులు చావాకులు పేలుతున్నరు. ఈ రోజు వరకు వారు చేసిన ఆరోపణల్లో ఒక్క ఆధారం, రుజువు చూపెట్టలేదు. నోరుంది కదా, పత్రికలు రాస్తాయని ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తావున్నరు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నీటిపారుదల రంగం మీద చేసిన ఖర్చు రూ.25 వేల కోట్లు. అది సాధ్యమయ్యే పనికాదు. అద్భుతమైన అభివృద్ధి దృశ్యం ఆవిష్కృతమవుతుందని నేను అంటున్నా, మన ఇంజనీర్లు అందుకోగలుగుతరా? అని అనుమానాలుండేవి. మనం వచ్చే నాటికి అన్నీ ఈపీసీ కాంట్రాక్టులే. కనీసం సర్వే చేసేందుకు నీటిపారుదల శాఖలో దుర్బిణ్లు కూడా లేవు. రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఖర్చుపెట్టి సామాన్లు కొనిపించి పనులు చేపట్టినం. నేనే వందల వేల సమీక్షలు చేసి ఇంజనీర్ల ఓరియంటేషన్లో మార్పు తెచ్చి సరైన మార్గంలో పెట్టిన. గోదావరి, కృష్ణా మీద బ్యారేజీలు అత్యున్నత నాణ్యతతో కడితే కానీ నిలబడవు. కాంట్రాక్టర్ ఏం చేస్తుండో క్షణం క్షణం చూడాలి. అర్థరాత్రి కూడా కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నరో రికార్డు చేసే స్థాయికి మన ఇంజనీర్లు పోయినరు. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కరెంట్ కోసం ఏడిపించిండ్రు. నాతో సహా అందరం కరెంట్ కోసం బాధపడేవాళ్లం. చివరికి పారిశ్రామికవేత్తలే ఇందిరా పార్కు వద్ద ధర్నా చేసే దురవస్థకు చేరింది. 35 ఏళ్ల కింద మొదలైన కరెంట్ కోతలు ఊరకనే పోలె. ఎంత నిబద్ధతతో పని చేసి ఎంత అద్భుతమైన చర్యలు తీసుకుంటే కరెంట్ బాగా అయింది ఈ రోజు రాష్ట్రంలో? ఆషామాషీగా అవుతదా? కాంగ్రెస్ వాళ్లు చాలా గొప్పోళ్లు.. మేధావులు అయితే మా కంటే ముందు ఎందుకు చేయలేదు? ఎందుకు సంపిండ్రు ప్రజానికాన్ని. 35 ఏళ్లు విద్యుత్ రంగంలో మనం తీవ్రంగా బాధపడ్డాం. దాన్ని సక్కగా చేసినం. దాని మీద కూడా విమర్శలు చేస్తున్నరు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం దగ్గర కరెంట్ కొన్నా అవినీతి ఆరోపణలు. మెదడు ఉందా? ఏమైనా విషయం ఉందా కూడా అర్థం కాని పరిస్థితి’’అని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ప్రారంభించిన ప్రగతి, సంక్షేమాన్ని చాలా మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, స్వయంగా ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో కొనియాడారని, తాజాగా ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక కూడా తనకు బిజినెస్ రిఫార్మర్ అవార్డు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. త్యాగం చేసింది మేము..మా ఎమ్మెల్యేలకు శాల్యూట్ ! ‘‘ఈ రోజు ఎవరన్నా త్యాగం చేశారంటే మేమే చేసినం. ఎవరేం చేయలేదు. మా శాసనసభ్యులు మా మంత్రివర్గం మాకుండే మరో నాలుగైదు మాసాల సమయాన్ని త్యాగం చేశాం. పదవుల కోసం మేం లాలూచీ పడలేదు. పిచ్చిపిచ్చి రాజకీయ క్రీడలు చేయలేదు. ఒక ప్రామాణికంగా పని చేసినం. తెలంగాణ కోసం అవసరమైన ప్రతిసారీ రాజీనామాలు విసిరేసినం. రాష్ట్ర ప్రగతి, మంచి భవిష్యత్తును ఆకాంక్షించి ఈ రోజు కూడా ఎవరైనా త్యాగం చేశారంటే అది మేమే. ఐ శాల్యూట్ మై ఎమ్మెల్యేస్, మై ఎంపీస్. వారు అద్భుతమైన సహకారం అందించారు. నేను ఈ రోజు నిర్ణయం తీసుకున్ననంటే కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా నాలుగు రోజులు ఆగి చేద్దాం సార్. మనకు టైం ఉంది కదా అని చెప్పలేదు. ఈ మధ్య పార్టీ శాసనసభాపక్ష సమావేశం పెట్టినప్పుడు కూడా ముందుకు వెళ్లండి సార్ అన్నారు. నా సహచరులందరికీ ధన్యవాదాలు’’అని పార్టీ ఎమ్మెల్యేలపై కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. సర్వేలు, వడపోత తర్వాతే అభ్యర్థుల ప్రకటన ... అనేక సర్వేలు, మంచి చెడ్డలు పరిశీలించిన తర్వాత 105 మంది పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నానని కేసీఆర్ వెల్లడించారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మినహా అందరికీ టికెట్లు ఇస్తున్నట్లు చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, సంగారెడ్డి జిల్లా ఆందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్‌కు స్థానం కల్పించలేకపోయామన్నారు. వీరికి సమానమైన పదవి కల్పించి న్యాయం చేస్తామని ఇద్దరికీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. మేడ్చల్, మల్కాజ్గిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ కలిపి మరో ఐదు నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేల అంశంపై చర్చ జరగాల్సి ఉండడంతో పెండింగ్ పెట్టామన్నారు. 100 శాతం ఎక్కడో అత్యవసరమైతే తప్ప సిట్టింగ్‌లను మార్చనని గతంలోనే చెప్పానని, అలాగే మాటను నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. కనీసం 35 నుంచి 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చనున్నారని పత్రికల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. 17, 18 సర్వేల సారాంశంతోపాటు తమ వద్ద ఉన్న సమాచారం, వ్యక్తిగతంగా తనకున్న లెక్కల ఆధారంగా వడపోసిన తర్వాతే అభ్యర్థుల జాబితా రూపొందించినట్టు వివరించారు. పార్టీ ముఖ్యులు ఈ వ్యవహారం చూశారని, వారి సలహాలు సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ అభ్యర్థులందరికీ ముందుగానే సమాచారమిచ్చినట్టు తెలిపారు. శుభ ముహూర్తాన ప్రచారానికి శ్రీకారం! టీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో హుస్నాబాద్‌లో తొలి ఎన్నికల సభ నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. మంచి సమయంలో చేస్తే మంచిగానే ఉంటదని, చెడు సమయంలో చేస్తే చెడుగానే ఉంటదని అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఈ నెల 9న అమావాస్య వస్తోందని, అంతకుముందు 7న శ్రావణమాసం శుక్రవారం మంచిరోజు కావడంతో ఈ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తర్వాత పిత్రు మాసం వస్తుందని, దీనిని రోజుల కింద పరిగణలోకి తీసుకోరన్నారు. అందుకే వేగంగా ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్టు వివరించారు. అభ్యర్థులు కూడా వారి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటారని కేసీఆర్ తెలిపారు. -
శాసనసభ రద్దు
కొద్ది రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు సీఎం కేసీఆర్ తెరదించారు. అసెంబ్లీ రద్దు లాంఛనంగా ముగియడంతో ముందస్తు ఎన్నికలకు తొలి అడుగు పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పగ్గాలు చేపట్టిన తొలి ప్రభుత్వం ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకోకుండానే రద్దయింది. కేబినెట్ తీర్మానానికి గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలపడం.. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు గెజిట్ నోటిఫికేషన్ జారీతో నిర్ణీత కాలపరిమితికంటే 8 నెలల 26 రోజుల ముందే శాసనసభ కాలం ముగిసినట్లైంది. నగరంలో గురువారం అంతా టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన, అసెంబ్లీ రద్దు హడావుడే కనిపించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం ఎన్నికలతోపాటే తెలంగాణకు నవంబర్ 20 తరువాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ జారీ కావొచ్చని, డిసెంబర్ ఆఖరి వారంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలున్నట్లు అంచనా. సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు తొలి అడుగు పడింది. అసెంబ్లీ రద్దు లాంఛనం ముగిసింది. తెలంగాణ తొలి శాసనసభ ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకోకుండానే గురువారం రద్దయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 క్లాజ్ 2 (బీ)ని అనుసరించి శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తరువాత శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు గవర్నర్ నోటిఫికేషన్‌ను ప్రస్తావిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో నిర్ణీత కాలపరిమితికంటే 8 నెలల 26 రోజుల ముందే శాసనసభ రద్దయినట్లైంది. అంతా అనుకున్నట్లుగానే... మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి ఎలాంటి చర్చ లేకుండానే శాసనసభ రద్దు చేయాలని సిఫారసు చేస్తూ తీర్మానం చేసింది. మంత్రులంతా ప్రగతి భవన్‌కు వచ్చిన వెంటనే సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ) అధికారులు మంత్రలకు ఎజెండా కాపీలతోపాటు శాసనసభ రద్దు తీర్మానం కాపీని చూపారు. ఈ తీర్మానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి సంతకం చేయగా తరువాత ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంతకాలు చేశారు. మిగిలిన వారు వరుస క్రమంలో ఈ తతంగాన్ని పూర్తి చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 1:14 గంటలకు తీర్మానం కాపీ ముఖ్యమంత్రి చేతికి అందింది. (చదవండి: మళ్లీ నేనే సీఎం) సభ రద్దుపై కాసేపు మంత్రులతో సంభాషించిన కేసీఆర్ మధ్యాహ్నం 1:23 గంటలకు ప్రగతి భవన్ నుంచి రాజ్ భవన్ బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం 1:28 గంటలకు రాజభవన్ చేరుకొని మంత్రివర్గం చేసిన సభ రద్దు సిఫారసు తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా దాదాపు 30 నిమిషాలు గవర్నర్‌తో సమావేశమయ్యారు. కేసీఆర్ రాజ్‌భవన్‌లో ఉండగానే శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాలతో శాసనసభను రద్దు చేసినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ పదవిలో కొనసాగాలని కేసీఆర్‌కు సూచించారు. ఆ తరువాత కొద్దిసేపటికే కేసీఆర్, ఆయన మంత్రివర్గ సహచరులు ఆపద్ధర్మ ప్రభుత్వంగా వ్యవహరిస్తారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి ఉత్తర్వులు జారీ చేశారు. గెజిట్ నోటిఫికేషన్ జారీ... శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ వెలువరించిన కాసేపటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు పేరుతో విడుదలైన ఈ నోటిఫికేషన్ కాపీని ఆయన స్వయంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్‌ను కలసి అందించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ సమాచారం కేంద్ర హోంశాఖ నుంచి మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని, శాసనసభ రద్దు విషయాన్ని సీఈవో లాంఛనంగా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేసినా అది కమ్యూనికేషన్ కిందకే వస్తుందని ఎన్నికల వర్గాలు చెప్పాయి. కేంద్ర హోంశాఖకు చేరనున్న గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ శాసనసభ కార్యదర్శి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ గవర్నర్ ద్వారా రాష్ట్రాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే కేంద్ర హోంమంత్రిత్వశాఖకు చేరుతుంది. అక్కడి నుంచి తెలంగాణ శాసనసభ రద్దయిన దృష్ట్యా తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ హోంశాఖ కార్యదర్శి ఎన్నికల సంఘానికి తెలియజేస్తారు. ఈ ప్రక్రియ ముగియడానికి 2–3 రోజులు పడుతుందని, వచ్చే సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ శాసనసభ రద్దుపై ప్రకటన వెలువరిస్తుందని అధికార వర్గాలు తెలియజేశాయి. నవంబర్ ఆఖరులో ఎన్నికల షెడ్యూల్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం ఎన్నికలతోపాటే తెలంగాణకు నవంబర్ నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు అవకాశాలు ఉన్నాయి. పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి 40 రోజుల మందు షెడ్యూల్ వెలువడుతుంది. పోలింగ్‌కు మూడు వారాల ముందు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ నాలుగు రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి జనవరి మొదటి వారంతో పూర్తవుతుంది. అంటే డిసెంబర్ ఆఖరు వారంలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే నవంబర్ 20 తరువాత ఎప్పుడైనా ఆ నాలుగు రాష్ట్రాలతోపాటే తెలంగాణకు ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యే అవకాశం ఉంది. గన్‌పార్కుకు వెళ్లకుండానే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు మధ్యాహ్నం 1.30 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ లభించగా ఆ మేరకే సీఎం కాన్వాయ్ సరిగ్గా 1:28 గంటలకు గవర్నర్ నివాసం రాజ్‌భవన్ చేరుకుంది. అరగంట తరువాత.. అంటే మధ్యాహ్నం 2:02 గంటలకు ముఖ్యమంత్రి కాన్వాయ్ బయటకు వచ్చింది. అయితే అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదం తెలిపాక కేసీఆర్ నేరుగా గన్‌పార్కుకు చేరుకుంటారని, అక్కడ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో పాల్గొంటారని ప్రచారం సాగింది. కానీ సీఎం కాన్వాయ్ గవర్నర్ నివాసం నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకుంది. దీంతో మీడియా ప్రతినిధులు అప్రమత్తమై ఆయన వాహన శ్రేణిని అనుసరించారు. అయితే ఈ మార్పునకు కారణం తెలియరాలేదు. -
అంతా అనుకున్నట్టే!
గత కొన్ని నెలలుగా మీడియాలో హోరెత్తుతున్న ముందస్తు ఎన్నికల ముహూర్తం ఆగమించింది. గడువుకన్నా దాదాపు 9 నెలల ముందు తెలంగాణ తొలి అసెంబ్లీ రద్దయింది. అందరి ఊహా గానాలనూ నిజం చేస్తూ గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశమై అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయడం, గవర్నర్ నరసింహన్ దాన్ని ఆమోదించడం చకచకా పూర్తయ్యాయి. అయితే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మరింత దూకుడుగా వ్యవహరించారు. ఎవరూ అంచనా వేయని రీతిలో 105 స్థానాలకు పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించి విపక్షాలను విస్మయపరిచారు. బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయి మెరుపు వేగంతో ఇంతటి ప్రధానమైన రాజకీయ నిర్ణయం తీసుకునే సాహసం చేసి ఉండరు. ఇక ఎన్నికలు ఎప్పుడన్నదానిపైనే అందరికీ ఉత్కంఠ. వచ్చే డిసెంబర్‌లోపు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి గనుక వాటితోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండాలన్నది కేసీఆర్ భావన. ఆయనకు కేంద్రంతో పెద్దగా పేచీలేమీ లేవు గనుక ఇందుకు అవాంతరాలు ఎదురు కాకపోవచ్చు కూడా. అనుకోని రీతిలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తప్ప రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ రద్దయిన ఆర్నెల్లలో ఎటూ ఎన్నికలు జరిగితీరాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఎన్నికలు ఆలస్యమై సార్వత్రిక ఎన్నికలతోపాటే ఇవీ జరిగితే ఆయన లెక్కలు తారుమారు కావడానికి ఆస్కారం ఉంది. 2003లో తనపై అలిపిరిలో నక్సలైట్లు హత్యాయత్నం చేసినప్పుడు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై జనంలో సానుభూతి వెల్లువెత్తుతున్నదని భ్రమించి ముందస్తు కోసం తొందరపడ్డారు. 2004 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని లెక్కలేశారు. కానీ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తి కాలేదన్న కారణంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయన వినతిని తోసిపుచ్చింది. ఆ ఏడాది ఏప్రిల్–మే నెలల్లో లోక్‌సభతోపాటే ఎన్నిక లొచ్చి బాబు పదవీచ్యుతుడయ్యారు. సహజంగానే తాజా నిర్ణయాన్ని పార్టీలన్నీ తప్పుబడుతున్నాయి. ముందస్తుకు వెళ్లడం కేసీఆర్ చేతగానితనానికి నిదర్శమంటున్నాయి. ఈ విమర్శల మాటెలా ఉన్నా ముందస్తుకు వెళ్లడం కేసీఆర్ తోనే మొదలు కాలేదు. 1970 చివరిలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు జోరుగా ఉన్నప్పుడు నాటి ప్రధాని ఇందిరాగాంధీ వాటిని ఖండించేవారు. పైకి ఏం చెప్పినా చివరకు దాదాపు ఏడాది ముందుగా లోక్‌సభను రద్దుచేశారు. 1971 మార్చిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. ఆ తర్వాత పలుసార్లు మద్యంతర ఎన్నికలు జరిగాయి. జనంలో పాలన బాగుందన్న భావన బలంగా ఉన్నదని విశ్వసించినా... ప్రధాన ప్రత్యర్థి పక్షాలు అయోమయంలో పడ్డాయని, వాటి నైతికస్థైర్యం సన్నగిల్లిందని భావించినా... సర్జికల్ స్ట్రైక్ తరహాలో విపక్షాలకు షాక్ ఇవ్వాలనుకున్నా అధికార పార్టీలు ముందస్తు వైపు మొగ్గుతాయి. మున్ముందు పరిస్థితులు ప్రతికూలం కావొచ్చుననుకున్నా ఇలాంటి నిర్ణయం తీసుకుంటాయి. కేసీఆర్ చెబుతున్న వివరణ వేరు. రాష్ట్రంలో రాజకీయ విచ్చలవిడితనం, అతి ప్రవర్తన, అసహనం పెరిగిపోయాయని... విపక్షాలు అవాంఛనీయ మైన ఆరోపణలు చేస్తున్నాయని, ఇందువల్ల అధికారుల స్థైర్యం దెబ్బతినే అవకాశం ఉన్నదని... కను కనే ప్రగతి రథచక్రం ఆగకూడదన్న ఉద్దేశంతో కాస్త ముందుగా ఎన్నికలకు పోతున్నామన్నారు. అంటే... వాటి ప్రచార ప్రభావం ఉన్నకొద్దీ పెరిగి తమకు చేటు తెస్తుందని ఆయన భావించార నుకోవాలా? టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకొచ్చినా ఈ విపక్షాలు ఉంటాయి. ఇప్పటిలాగే అప్పుడూ అవి ఆరోపణలు చేస్తాయి. కనుక కేసీఆర్ చెప్పిన వివరణ సంతృప్తికరమైనది కాదు. అయితే ఆయన నిర్ణయం వెనక రాజకీయ చతురత పుష్కలంగా ఉన్నది. ప్రధాని మోదీ హవా 2014నాటితో పోలిస్తే తగ్గిందని కొందరు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పుంజుకున్న సూచనలున్నాయని వారి భావన. ఆ ఫలితాల ప్రభావం రానున్న సార్వత్రిక ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుంది. పర్యవసానంగా మోదీ, రాహుల్ మధ్య పోటీగా ఆ ఎన్నికలు పరిణమిస్తే సహజంగానే అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఎంతో కొంత పుంజుకునే అవకాశం ఏర్పడుతుంది. తెలంగాణలో టీడీపీని కేసీఆర్ ఎటూ సమాధి చేశారు. తాను ఇచ్చిన లేఖ వల్లే తెలంగాణ ఏర్పడిందని బాబు ఇక్కడ చెప్పుకుంటున్నా, ఏపీలో మాత్రం రాత్రికి రాత్రే అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారని, దాన్ని తాము వ్యతిరేకించామని అవకాశం చిక్కినప్పుడల్లా ఆయన వాపోతున్నారు. దానికితోడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరిని కోట్లు ముట్టజెప్పి కొనాలని ప్రయత్నించి ఆయన అడ్డంగా దొరికిపోయారు. చివరకు హడావుడిగా ప్రభు త్వాన్ని ఏపీకి తరలించారు. ఈ కారణాల వల్ల తెలంగాణలో బాబుకు మునుపటి విశ్వసనీయత లేదు. నూతన రాష్ట్రంలో బీజేపీ పెద్దగా ఎదిగింది లేదు. కనుక కేసీఆర్‌కు ఉంటే గింటే కాంగ్రెస్ మాత్రమే ప్రధాన ప్రత్యర్థి. టీడీపీతో అది కలిస్తే దాని విశ్వసనీయతే దెబ్బతింటుందని ఆయన భావిస్తున్నారు. కనుకనే ముందస్తుకు సిద్ధపడటమే శ్రేయస్కరమని ఆయన భావిస్తున్నట్టు కనబడు తోంది. ప్రభుత్వం చేతిలో ఉంటే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనడం కష్టమేమీ కాదు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చునన్న అంచనా ఇతర రాజకీయ పక్షాలకు ఉన్నా ఆ పార్టీలు పెద్దగా కదిలింది లేదు. కాంగ్రెస్‌లో ఇంటిపోరు షరా మామూలే. పొత్తు గురించి ఊహాగా నాలొస్తున్నా కాంగ్రెస్, టీడీపీలు ఇంకా గోప్యతనే పాటిస్తున్నాయి. అవి మొహమాటాన్ని ఎప్పుడు విడిచిపెడతాయో చూడాలి. కొద్దో గొప్పో బలమున్న సీపీఎం మాత్రం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) పేరిట ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీఆర్ఎస్కు అనుకూల ప్రచారం చేసు కోదగ్గ పథకాలున్నట్టే... సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రజాన్యాయ స్థానంలో చివరకు ఎలాంటి తీర్పు వెలువడనున్నదో వేచిచూడాలి. -
ముందస్తు.. ఫలితాలు ఇలా..!
నిర్ణీత కాలవ్యవధి కంటే దాదాపు ఏడెనిమిది నెలల ముందే తెలంగాణ శాసనసభ రద్దుకు కేబినెట్ చేసిన తీర్మానాన్ని సీఎం కేసీఆర్ సమర్పించిన కొద్ది సేపటికే గవర్నర్ దానిపై ఆమోదముద్రవేశారు. ఇలా గడువు కంటే ముందే పలు సందర్భాల్లో లోక్‌సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు కూడా రద్దయిన జాబితాలో ఉన్నాయి. ఈ విధంగా చట్టసభల పూర్తికాలం ముగియకుండానే లోక్‌సభ/ అసెంబ్లీలు రద్దయ్యాక జరిగిన ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయన్నది ఆసక్తికరంగా మారింది. అలాంటి సందర్భాల్లో కొన్ని... లోక్‌సభకు... లోక్‌సభ కాల పరిమితి ముగిసేందుకు ఇంకా ఏడాది సమయం ఉండగానే 1970 చివర్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దానిని రద్దు చేసి 1971 మార్చిలో ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఆమె నేతత్వంలోని కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించింది. గడువు ప్రకారం 2004 సెప్టెంబర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉండగా, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాష్ట్ర శాసనసభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే వత్తిడిని ప్రధాని ఏబీ వాజ్‌పేయిపై తీసుకొచ్చారు. విశ్వసనీయ భాగస్వామ్యపక్షంగా ఉన్న టీడీపీ ఒత్తిళ్ల నేపథ్యంలో వాజ్‌పేయి లోక్‌సభను కూడా రద్దు చేసి 2004 ఏప్రిల్ / మే లలో ఎన్నికలకు వెళ్లగా కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ, ఏపీలో చంద్రబాబు నేతత్వంలోని టీడీపీ,బీజేపీ కూటమి ఓటమి చవిచూశాయి. అసెంబ్లీలకు... 1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఎన్టీరామారావు సీఎం అయ్యాక 1984 ఆగస్టులో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. తదనంతర పరిణామాల్లో నెలరోజుల పాటు నాదెండ్ల భాస్కరరావు సీఎంగా వ్యవహరించారు. ప్రభుత్వం మనుగడ సాధించేందుకు అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకపోవడంతో ఆ ప్రభుత్వం పడిపోయింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ ఎన్టీఆర్ గూటికి చేరుకున్నా పార్టీ / ప్రభుత్వంలో అసంతప్తి లేకుండా చేసేందుకు 1984 నవంబర్‌లో ఎన్టీఆర్ అసెంబ్లీ రద్దుచేశారు. 1985 మార్చిలో జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సాధించి ఆయన మళ్లీ సీఎం అయ్యారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు 1992లో జరగాల్సి ఉండగా, 1991లోనే అప్పటి సీఎం జ్యోతిబసు రద్దుచేశారు. 1991లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికలతో పాటు బెంగాల్ ఎన్నికలు కూడా నిర్వహించారు. ఆ ఎన్నికల్లో సీపీఎం ఆధ్వర్యంలోని లెఫ్ట్‌ఫ్రంట్ గెలుపొంది జ్యోతిబసు మళ్లీ సీఎం అయ్యారు. 2003 మార్చి వరకు శాసనసభ కాలపరిమితి ఉన్నా (9 నెలలు ముందుగానే) గోధ్రా అల్లర్లు, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలను సమర్థవంతంగా నియంత్రించిన నేపథ్యంలో 2002 లోనే అప్పటి సీఎం నరేంద్రమోదీ గుజరాత్ అసెంబ్లీని రద్దుచేశారు. ఆ తర్వాత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో మోదీ మళ్లీ సీఎం అయ్యారు. 2004 సెప్టెంబర్/ అక్టోబర్ వరకు ఏపీ (అవిభాజ్య) అసెంబ్లీ పూర్తయ్యేందుకు గడువు మిగిలి ఉన్నా, అలిపిరి వద్ద నక్సల్స్ జరిపిన దాడి నుంచి బయటపడిన సానుభూతి పనిచేస్తుందనే నమ్మకంతో అప్పటి సీఎం చంద్రబాబు 2003 నవంబర్లోనే శాసనసభ రద్దుచేశారు. 2004 ఏప్రిల్ / మేలో లోక్‌సభతో కలిసి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నేతత్వంలోని టీడీపీ ఓటమిపాలైంది. అయితే నిర్ణీత కాల వ్యవధి ముగియకుండానే వివిధ రాష్ట్రాల అసెంబ్లీల రద్దుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేసినా వాటిని ఆమోదించని సందర్భాలు కూడా ఉన్నాయి. సర్కారియా కమిషన్ నివేదికలోని వివరాలను బట్టి 1967లో పంజాబ్, 1968లో ఉత్తరప్రదేశ్‌లో, 1969లో మధ్యప్రదేశ్, 1971లో ఒరిస్సా ప్రభుత్వాలు శాసనసభ రద్దుకు చేసిన విజ్ఞప్తులను అంగీకరించలేదు. 2003లోనూ యూపీ సీఎంగా ఉన్న మాయవతికి కూడా అసెంబ్లీ రద్దుకు అనుమతి లభించలేదు. -
నేడే చూడండి..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ రద్దుకు ముహూర్తం ఖరారైంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై ఈ మేరకు తీర్మానం చేస్తుంది. అయితే కేబినెట్ సమావేశానికి సంబంధించిన ఎజెండాను సాధారణ పరిపాలన శాఖ ఇప్పటివరకూ మంత్రులకు పంపలేదు. ప్రగతి భవన్లో సమావేశానికి రాగానే జీఏడీ అధికారులు ఎజెండా కాపీలను మంత్రులకు అందజేస్తారు. ఆ వెంటనే శాసనసభ రద్దు సిఫారసుకు సంబంధించిన తీర్మానంపై మంత్రుల సంతకాలు తీసుకుంటారు. ఈ కసరత్తు పూర్తయ్యేలోపు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శాసనసభ రద్దు, ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్నదానిపై అమాత్యులకు సమాచారం ఇస్తారని తెలుస్తోంది. గురువారం ఉదయం హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని మాత్రమే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు మంత్రులకు సూచించారు. మంత్రివర్గ సమావేశం ఎప్పుడు ఉంటుంది? ఎజెండా ఏమిటన్న విషయాలు మాత్రం గోప్యంగానే ఉంచారని ఓ సీనియర్ మంత్రి బుధవారం రాత్రి ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. జీఏడీ అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రివర్గ సమావేశం ఉంటుంది. 1–30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిసి కేబినెట్ తీర్మానం కాపీని అందజేస్తారు. అనంతరం గన్‌పార్క్ వద్దకు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం రెండు గంటలకు కేసీఆర్ టీఆర్ఎస్ భవన్‌కు చేరుకుని మీడియా సమావేశంలో మాట్లాడతారు. శాసనసభ రద్దుకు సంబంధించి గురువారం సాయంత్రం ప్రకటన వెలువడగానే.. శుక్రవారం ఉదయం సిద్దిపేట జిల్లాకు బయలుదేరి వెళతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం తరువాత హుస్నాబాద్‌కు చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. నేటి సాయంత్రం నుంచి ఆపధర్మ ప్రభుత్వం శాసనసభ రద్దుకు సంబంధించి గవర్నర్ నరసింహన్ సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేస్తారని, అదేసమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని కేసీఆర్‌ను కోరతారని అధికార వర్గాలు వెల్లడించాయి. శాసనసభ రద్దయిన వెంటనే 119 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వం కోల్పోతారు. అయితే ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరులు యధావిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వారి జీతభత్యాలు, అలవెన్సుల్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా ఆపధర్మ మంత్రిమండలిగా కొనసాగాలని గవర్నర్ తన నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆపధర్మ ప్రభుత్వానికి అధికారాలు ఉండవు. 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఐఎంజీ సంస్థకు క్రీడా మైదానాలు కేటాయించడాన్ని న్యాయస్థానాలు తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాలను న్యాయస్థానాలు రద్దు చేయడమే కాకుండా కేర్‌టేకర్ ప్రభుత్వం దైనందిన ప్రభుత్వ కార్యకలాపాలకు విఘాతం కలుగకుండా చూడాలే తప్ప విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని వ్యాఖ్యానించింది. వచ్చే శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడేదాకా మంత్రులు అధికారిక పర్యటనలతో పాటు ప్రభుత్వ అతిథి గృహాల్లో బస చేయవచ్చు. ఆ నాలుగు రాష్ట్రాలతోనే ఎన్నికలు.. శాసనసభ రద్దుకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన మరుక్షణం దాని కాపీని ఇక్కడి ముఖ్య ఎన్నికల అధికారి ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి చేరవేసేలా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. వచ్చే వారం టీఆర్ఎస్ ఎంపీల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలసి వీలైనంత త్వరగా శాసన సభకు ఎన్నికలు నిర్వహించాలని కోరనుంది. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం మొదలైన నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నాటి జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని ఎంపీలు విన్నవించనున్నారు. డిసెంబర్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరంలతో పాటే తెలంగాణకు ఎన్నికలు నిర్వహించాలని ఈసీ యోచిస్తోంది. శాసనసభ రద్దు నోటిఫికేషన్ అధికారికంగా అందిన వెంటనే ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ లోక్‌సభ సభ్యుడొకరు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో తమ పేరు లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలించి జాబితాలో చేర్చడానికి ప్రత్యేకంగా ఒక గడువును నిర్దేశించే అవకాశం ఉంది. అక్టోబర్ 1 నుంచి 15 తేదీల మధ్య ఈ షెడ్యూల్ ఉండొచ్చని సమాచారం. -
రేపు కేబినెట్ భేటీ.. అసెంబ్లీ రద్దుకు సిఫారసు
-
ముహూర్తం ఖరారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది! శాసనసభ రద్దుకు కౌంట్‌డౌన్ మొదలైంది!! గురువారం ఉదయం మంత్రివర్గం సమావేశమై ఈ మేరకు తీర్మానం చేయనున్నట్లు అత్యున్నత అధికార వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతకం ప్రకారం గురువారం ఉదయం 6 గంటల నుంచి 7 వరకు కీలక నిర్ణయాలకు అత్యంత అనుకూల సమయమని, ఆయన నక్షత్ర, రాశులకు అనుకూలంగా గ్రహస్థితులు ఆ రోజు ఉన్నాయని, అందుకే ఆ సమయాన కేబినెట్ భేటీకి సీఎం సిద్ధమైనట్లు తెలియవచ్చింది. శాసనసభ రద్దుకు ప్రభుత్వం సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో మంగళవారం శరవేగంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు మంగళవారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌తో సమావేశమవగా ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయ్యారు. మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెరుపు వ్యూహంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నారు. లక్షలాది మందితో ప్రగతి నివేదన సభ నిర్వహించి 48 గంటలు కూడా దాటకముందే హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. అన్నీ అనుకున్నట్లు గురువారం శాసనసభ రద్దు ప్రకటన వెలువడితే ముఖ్యమంత్రి శుక్రవారం హుస్నాబాద్ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పోలీసుశాఖ సైతం ముందస్తు ఎన్నికలకు అవసరమయ్యే బలగాల కోసం కసరత్తు మొదలుపెట్టింది. అసెంబ్లీ రద్దుపై ఖాయమైన నిర్ణయం... మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకోవడం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో కేబినెట్ భేటీకి అవసరమైన అన్ని అంశాలను సాధారణ పరిపాలనశాఖ పూర్తి చేసింది. గురువారం ఉదయానికి హైదరాబాద్‌లో ఉండాలంటూ మంత్రులకు ఇప్పటికే సమాచారం పంపింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎస్. కె. జోషి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యులు మంగళవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీ రద్దు నిర్ణయం, ఆ తర్వాత అనుసరించాల్సిన విధానాలపై వారు ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. అనంతరం గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ నలుగురు అధికారులతో మరోసారి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ సూచన మేరకే ఉన్నతాధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లినట్లు తెలియవచ్చింది. డిసెంబర్‌లోగా కచ్చితంగా ఎన్నికలు జరిగేందుకు వీలుగా సాంకేతిక ఇబ్బందులేవీ లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు సూచించారు. గవర్నర్ కార్యాలయంలో చర్చల విషయాలను ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌కు ఫోన్లో వివరించినట్లు తెలిసింది. కేబినెట్ భేటీలో అసెంబ్లీ రద్దు అంశాన్ని చివరి నిమిషంలో ఎజెండాలో చేరుస్తారని, ఇప్పటికిప్పుడు ఎజెండాలో ఈ అంశం లేదని ఓ సీనియర్ మంత్రి చెప్పారు. ఢిల్లీలో అంతా ఓకే... తెలంగాణలో అసెంబ్లీని రద్దు చేస్తే డిసెంబర్‌లోగా కచ్చితంగా ఎన్నికల జరిగేలా జరుగుతున్న ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం కార్యాయంలోని అధికారి ప్రభుత్వానికి వివరించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, కరీంనగర్ ఎంపీ బి. వినోద్ కుమార్ వారం రోజులుగా ఢిల్లీలో ఇదే పనిలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌కు వచ్చిన వీరిద్దరు ఢిల్లీ అంశాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు. అనంతరం అసెంబ్లీ రద్దు ప్రక్రియపై కసరత్తు వేగవంతమైంది. సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం సీఎస్ ఎస్. కె. జోషి, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు సచివాలయానికి వచ్చారు. రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీని, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావుతోపాటు పలువురు ఇతర శాఖల ఉన్నతాధికారులను వేర్వేరుగా పిలిచి మాట్లాడారు. ప్రభుత్వపరంగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై సీఎం ఆదేశాల మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. సీఎస్‌తో ముఖ్య ఎన్నికల అధికారి భేటీ... తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (టీఎస్‌సీఈవో) రజత్ కుమార్ మంగళవారం సీఎస్ ఎస్.కె. జోషిని కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో నెలకొన్న సిబ్బంది కొరత విషయంలో ప్రభుత్వం వద్ద ఉన్న ప్రతిపాదలపై చర్చించేందుకు సీఎస్ పిలుపు మేరకే రజత్‌కుమార్ వెళ్లినట్లు తెలిసింది. అదనపు సీఈవో పోస్టులో ఐఏఎస్ అధికారిని నియమించాలని, జాయింట్ సీఈవో, డిప్యూటీ సీఈవోతోపాటు మరో 18 పోస్టులను భర్తీ చేయాలని రజత్ కుమార్ ఈ సందర్భంగా కోరారు. ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒకటి రెండు రోజుల్లోనే సీఈవో కార్యాలయంలో పూర్తిస్థాయి అధికారులు, సిబ్బంది కొలువుదీరనున్నారు. మరోవైపు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో కార్యాలయం బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటలకు సమావేశం నిర్వహిస్తోంది. అలాగే జిల్లాల ఎన్నికల అధికారులు (డీఈవో)గా పని చేసే కలెక్టర్లకు ఈ నెల 7న శిక్షణ కార్యక్రమం జరగనుంది. పోలీసుశాఖ ‘ముందస్తు’ఏర్పాట్లు... ముందస్తు ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్‌శాఖ అందుకు తగిన కార్యాచరణ, బలగాల పరిస్థితి, సిబ్బంది తదితర అంశాలపై దృష్టి పెట్టింది. ఎన్నికల బందోబస్తు కోసం సిద్ధంగా ఉండేలా కార్యచరణ రూపొందించాలని మౌఖికంగా బెటాలియన్ విభాగానికి పోలీస్‌శాఖ నుంచి సూచనలు వెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తం బెటాలియన్ల నుంచి 7–8 వేల మంది సిబ్బంది అందుబాటులో ఉండనున్నట్టు తెలిసింది. అలాగే అన్ని జిల్లాలు కమిషనరేట్లలో కలిపి సుమారు 3,500 మందిని కూడా ఎన్నికల విధుల్లో నియమించనున్నారు. మరోవైపు సుమారు 40 వేల మంది వరకు ఉన్న సివిల్ పోలీసులను మండలాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించేలా కార్యచరణ రూపొందిచనున్నారు. కాగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సుమారు 16 వేల మంది పారామిలిటరీ బలగాలను బందోబోస్తు కోసం కేటాయించేలా ఎన్నికల కమిషన్ ద్వారా పోలీస్‌శాఖ కోరనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పోలీస్ సిబ్బంది, కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటుగా హోంగార్డుల సేవలను ఎన్నికల సమయంలో వినియోగించుకోవాలని పోలీస్ శాఖ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అలాగే 24 వేల మంది హోంగార్డులను ఎన్నికల విధుల్లో నియమించేలా సన్నాహాలు చేస్తోంది. మొత్తంమీద ఎన్నికల బందోబస్తుపై త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అన్ని పనులకూ ఆ గుడి నుంచే శ్రీకారం సిద్దిపేట సమీపంలోని కోనాయపల్లిలో పూజ చేసిన తర్వాతనే ఏ పని అయినా ప్రారంభించడం కేసీఆర్‌కు అలవాటు. రాజకీయంగా చేసే ప్రతి పనినీ ఆ గుడిలో పూజ చేశాకే ప్రారంభిస్తారు. మొదటిసారి ఎమ్మెల్యే కావడానికి ముందు నుంచీ కేసీఆర్‌కు ఇదే సెంటిమెంటు ఉంది. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు కూడా ఈ గుడిలో పూజ చేశాకే కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించారు. 2009లో ఆమరణ దీక్ష సందర్భంగానూ ఇదే గుడిలో పూజలు చేసి దీక్షాస్థలికి చేరుకున్నారు. ఇలా అన్ని సందర్భాల్లోనూ ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ వచ్చారు. కేసీఆర్ దూకుడు శాసనసభ రద్దు ఖాయమన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత మెరుపు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను బుధవారమే పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. గురువారం శాసనసభ రద్దయితే 119 మంది శాసనసభ్యులు పదవులు కోల్పోతారు. సీఎం, మంత్రిమండలి ఆపధర్మ ప్రభుత్వంలో యథావిధిగా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు అందనంత దూరంలో మొదటి దశ ఎన్నికల ప్రచారం పూర్తి చేయాలని భావిస్తున్న టీఆర్ఎస్ అధినేత... హుస్నాబాద్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని మంత్రులు హరీశ్, ఈటలను మంగళవారం ఆదేశించారు. గురువారం శాసనసభ రద్దు చేస్తూ ప్రకటన వెలువడితే మొదటిసారిగా హుస్నాబాద్ సభలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే 50 రోజుల్లో వంద సభలు పూర్తి చేయాలన్న ఆలోచనతో కార్యాచరణ మొదలుపెట్టారు. 2–3 రోజుల్లో 10 బహిరంగ సభలకు తేదీలు, స్థలాలు ఖరారు చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే ఒకేరోజు 2–3 సభలు నిర్వహించేలా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. సభల నిర్వహణపై 24 గంటల్లోగా సమాచారం ఇవ్వాలని మంత్రులు, సీనియర్ నేతలను ఆదేశించారు. మంగళవారం ఆయన నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల ముఖ్యులు, మంత్రులతో సభల విషయం చర్చించినట్లు తెలిసింది. ఈ నెలాఖరుకల్లా 20కిపైగా సభలకు వ్యూహరచన చేస్తున్నారు. ప్రతిపక్షాలు తేరుకోకముందే వీలైనంత త్వరగా తొలి విడత ప్రచారం ముగించాలని భావిస్తున్నారు. అభ్యర్థులను ఖరారు చేసిన నియోజకవర్గాల్లో మొదటి పది రోజుల్లో సభలు ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో మంగళవారం పార్టీ ముఖ్య నేతలు, అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలిసింది. ప్రగతి నివేదన సభ అనంతరం తన ఫాంహౌస్‌కు చేరుకొని మంత్రి హరీశ్‌రావుతో 2 గంటలపాటు కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై చర్చించినట్లు తెలియవచ్చింది. -
హస్తిన డెరైక్షన్‌లో అసెంబ్లీ రద్దు?
-
హస్తిన డెరైక్షన్‌లో అసెంబ్లీ రద్దు?
ఫిబ్రవరిలో రద్దు చేసే దిశగా సంకేతాలిస్తున్న కిరణ్ ‘సమైక్య చాంపియన్’ముద్ర కోసమే? కొత్త పార్టీ ముసుగులో ఎన్నికలకు వెళ్లేలా పావులు హస్తిన డెరైక్షన్లోనే నాటకం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను త్వరగా ముగించాలంటూ ఆదేశం సాక్షి, హైదరాబాద్: బయటికి వీర సమైక్యవాదిగా పోజులిస్తూ, లోలోన మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఆదేశానుసారం విభజన ప్రక్రియకు మొదటినుంచీ పూర్తిగా సహకరిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి... తన డబుల్ యాక్షన్‌ను త్వరలో తారస్థాయికి తీసుకెళ్లనున్నారా? రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీ చర్చను సజావుగా ముగించి కేంద్రానికి తిప్పి పంపడం ద్వారా అధిష్టానం తనపై ఉంచిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేయనున్నారా? ఆ వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ‘కొత్త పార్టీ’ ముసుగులో, ‘సమైక్య కార్డు’తో ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నారా? అధిష్టానం స్థాయిలో ఈ మేరకు రూపుదిద్దుకున్న స్క్రిప్టును తు.చ అమల్లో పెడుతూ వస్తున్నారా? కొంతకాలంగా అధికారిక సవూవేశాల్లో కిరణ్ తీసుకుంటున్న పలు నిర్ణయూలు ఇవే సంకేతాలను ఇస్తున్నారుు. సాధారణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరిలో నిర్వహించడం పరిపాటి. కానీ ఈసారి ఏమాత్రం అవకాశమున్నా వాటిని జనవరి నెలాఖరు నుంచే మొదలు పెట్టి, వీలైనంత త్వరగా ముగించాలని కిరణ్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు! ఇది ‘అసెంబ్లీ రద్దు’ దిశగా గట్టి సంకేతమేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఆత్రమంతా అందుకే... సాధారణ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం కోసం ఫిబ్రవరి 14 నుంచి 22 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ కిరణ్‌కు ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. 2014-15 రాష్ట్ర వార్షిక ప్రణాళికకు ఆదాయ వనరులు, ప్రణాళిక పరిమాణంపై ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కిరణ్ శనివారం సమావేశమై చర్చించారు. ఓటాన్ బడ్జెట్ సమావేశాలను వీలైనంత ముందుకు జరపాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్ర విభజన బిల్లుపై జనవరి 23 దాకా అసెంబ్లీలో చర్చ జరగనుండటం తెలిసిందే. అనంతరం నాలుగైదు రోజుల విరామంతో జనవరి నెలాఖరు నుంచి ఓటాన్ అకౌంట్ సమావేశాలను మొదలు పెట్టి, ఫిబ్రవరి తొలి వారానికల్లా ముగించాలని అధికారులకు కిరణ్ స్పష్టం చేశారు. అంత త్వరగా అంటే బడ్జెట్ పుస్తకాల ముద్రణ తదితరాల సాధ్యాసాధ్యాలపై వారు సందేహం వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదని సమాచారం. కిరణ్ పట్టు నేపథ్యంలో జనవరి 28 నుంచే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరగవచ్చని ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన తీరు చూస్తుంటే అసెంబ్లీని ముందుగానే రద్దు చేసేలానే కన్పిస్తున్నారని అభిప్రాయపడుతున్నాయి. మొదటినుంచీ వి‘భజనే’ కిరణ్ సొంత పార్టీ పెట్టనున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన తాజా వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తావిస్తోంది. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని నిర్ధారణకు వచ్చిన ఆ పార్టీ అధిష్టానం, సొంత నేతలతోనే ‘వ్యతిరేక రాగం’ విన్పించి, కొత్త పార్టీ పెట్టించి, ఆ ముసుగులో ఎన్నో కొన్ని ఓట్లు, సీట్లు రాబట్టుకోవాలని వ్యూహరచన చేసినట్టు పీసీసీ వర్గాల్లోనే చాలాకాలంగా విన్పిస్తుండటం తెలిసిందే. తాజా పరిణామాలు, సీఎం చర్యలన్నీ అందులో భాగంగానే కన్పిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సవూవేశాల్ని వీలైనంత త్వరగా మమ అన్పించి అసెంబ్లీని రద్దు చేసి, విభజన నిర్ణయానికి నిరసనగానే ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకుంటూ, సమైక్యవాద చాంపియన్‌గా పోజివ్వాలన్నది కిరణ్ ఆలోచనగా చెబుతున్నారు. విభజనపై మొదటినుంచీ కిరణ్ మాటలకూ, చేతలకూ ఎక్కడా పొంతనే ఉండటం లేదన్నది బహిరంగ రహస్యమే. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సీమాంధ్రలో ప్రభుత్వోద్యోగులు కనీవినీ ఎరగని రీతిలో రెండు నెలలకు పైగా ఉద్యమిస్తే, వారి సమ్మెను కిరణ్ నయానా భయానా విరమింపజేశారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేద్దామని సీమాంధ్ర మంత్రులంతా ప్రతిపాదించినా, అలాగైతే అసెంబ్లీలో సమైక్యవాదాన్ని విన్పించేదెవరంటూ వారినీ వారించారు. విభజన ప్రక్రియ అంత సులువుగా ముందుకెళ్లదు లెమ్మంటూ ఎప్పటికప్పుడు కల్లబొల్లి కబుర్లతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను మభ్యపెడుతూ కాలం గడిపారు. కానీ విభజన దిశగా ఆయన జరగదని చెప్పిన ప్రతి ప్రక్రియా చకచకా పూర్తవుతూ వచ్చిన వైనం పీసీసీ వర్గాలనే విస్మయానికి గురి చేసింది. అవన్నీ కిరణ్‌కు తెలిసే జరిగాయని, ఈ విషయంలో కిరణ్ తమను పూర్తిగా మోసగించారని సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎంతగానో వాపోయారు కూడా. కనీసం విభజన బిల్లు రాష్ట్రపతి నుంచి రాష్ట్రానికి చేరకముందే సమైక్యాంధ్రకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సహా ఎవరు డిమాండ్ చేసినా కిరణ్ బేఖాతరు చేశారు. ఇక బిల్లు అసెంబ్లీకి చేరుకున్న రోజు ఆయన వ్యూహాత్మకంగా సభకు గైర్హాజరయ్యారు. పైగా సీమాంధ్రకు చెందిన స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభాపతి స్థానంలో ఉండకుండా, తెలంగాణకు చెందిన డిప్యూటీ స్పీకర్ నేతృత్వంలో బిల్లుపై చర్చ మొదలయ్యేలా పక్కా పథకం ప్రకారం పావులు కదిపిన వైనం రాష్ట్రమంతటినీ విస్మయానికి గురి చేసింది.