సాక్షి, హైదరాబాద్ : ‘‘ఈ మధ్య రాష్ట్రంలో రాజకీయ విచ్చలవిడితనం, అతి ప్రవర్తన, అసహన వైఖరి చాలా చూస్తూ ఉన్నం. అది ఏ రకంగా కూడా వాంఛనీయం కాదు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కాకిగోల, పిచ్చి, పసలేని ఆరోపణలు చాలా భయంకర పద్ధతిలో జరుగుతున్నాయి. నీటి పారుదల ప్రాజెక్టుల మీద కోర్టులకు వెళ్లి స్టే తేవడం. రౌండ్ టేబుల్స్, వాటి బొంద టేబుల్స్(రౌండ్ టేబుల్ సమావేశాలు) పెట్టి పిచ్చిపిచ్చి పనికిమాలిన దుర్మార్గమైనటువంటి అత్యంత అవాంఛనీయ ఆరోపణలు చేస్తున్నరు. చాలా కురుచ వ్యక్తులు, ఏ మాత్రం అవగాహన, పరిజ్ఞానం లేని వ్యక్తులు అవాకులు చవాకులు పేలుతా ఉన్నరు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరింత విచ్చలవిడి ఆరోపణలు చేస్తున్నరు. అది మన వృద్ధిని అడ్డుకుంటది.
అధికారులు సైతం కొంత స్థైర్యం కోల్పోయే పరిస్థితి. ఆరు నూరైనా సరే తెలంగాణ ప్రగతి రథచక్రం ఆగకూడదు. ఈ అభివృద్ధి ప్రక్రియ, ఆర్థికాభివృద్ధి పెరుగుదల ఆగకూడదు. అందువల్లే ఆల్రెడీ ఎన్నికల జోన్‌లోకి వచ్చినం కాబట్టి రెండు రోజులు ముందుగానో వెనకగానో ఎన్నికలకు వెళ్తున్నం’’అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేక కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గురువారం శాసనసభను రద్దు చేసిన అనంతరం తెలంగాణ భవన్‌లో మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘గత నాలుగేళ్లలో రాష్ట్రం 17.17 శాతం ఆర్థిక ఎదుగుదల సాధించింది. కాగ్ రిపోర్టు ప్రకారం కేంద్ర ఆర్థికశాఖ ఈ గణాంకాలు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఐదు మాసాల్లో రాష్ట్రం 21.96 శాతం ఆర్థిక వృద్ధి సాధించింది. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయ వృద్ధిలో దేశంలోని ఏ రాష్ట్రం మనకు దరిదాపుల్లో లేదు. 10 శాతానికిపైన కేవలం రెండో మూడో రాష్ట్రాలున్నయి. మిగలినవన్నీ ఒక అంకె వృద్ధి శాతానికే పరిమితమయ్యాయి. మంచి వృద్ధితో రాష్ట్రం ముందుకు పోతావుంది’’అని పేర్కొన్నారు.
ఆరోపణలకు ఒక్క ఆధారం చూపలేదు !
‘‘ఈ వృద్ధి ఎట్ట సాధ్యమైతది? కచ్చితంగా చాలా పట్టుదలతో కడుపు, నోరు కట్టుకొని నియంత్రిత విధానంలో ఉన్నత స్థాయి క్రమశిక్షణతో పని చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కొత్త రాష్ట్రం అనతి కాలంలో 21.96 శాతం వృద్ధి సాధించడం పిల్లలాట కాదు. కేంద్రంలో ఉన్నది మా పార్టీ ప్రభుత్వం కాదు. మా స్నేహపూర్వక ప్రభుత్వం కూడా కాదు. మేం వారి కూటమిలో లేము. వాళ్లు ఇచ్చిన అంకెలు ఇవి. దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నం. తెలంగాణకు ఇప్పటికే 40 అవార్డులొచ్చాయి. మిషన్ భగీరథ వంటి పథకాలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పెడితే దానికి కమీషన్లు అంటరు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా అనేక పదవుల్లో పాత్రదారులైన దద్దమ్మలు ఈ ఆరోపణలు చేస్తున్నరు. కాకతీయ రాజుల పుణ్యమా అని వెలిసిన మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ మొత్తం ధ్వంసమైతే ఈ సన్నాసులెవరూ నోరు తెరవలేదు. కనీసం వారి నియోజకవర్గ అభివృద్ధి నిధులతో కూడా వాటిని చేపట్టలేదు.
పూర్తిగా నేరపూరిత నిర్లక్ష్యం, తత్ఫలితంగా ఏర్పడినవాటిని సరిద్దుదుకుని పోతుంటే అవాకులు చావాకులు పేలుతున్నరు. ఈ రోజు వరకు వారు చేసిన ఆరోపణల్లో ఒక్క ఆధారం, రుజువు చూపెట్టలేదు. నోరుంది కదా, పత్రికలు రాస్తాయని ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తావున్నరు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నీటిపారుదల రంగం మీద చేసిన ఖర్చు రూ.25 వేల కోట్లు. అది సాధ్యమయ్యే పనికాదు. అద్భుతమైన అభివృద్ధి దృశ్యం ఆవిష్కృతమవుతుందని నేను అంటున్నా, మన ఇంజనీర్లు అందుకోగలుగుతరా? అని అనుమానాలుండేవి. మనం వచ్చే నాటికి అన్నీ ఈపీసీ కాంట్రాక్టులే. కనీసం సర్వే చేసేందుకు నీటిపారుదల శాఖలో దుర్బిణ్లు కూడా లేవు. రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఖర్చుపెట్టి సామాన్లు కొనిపించి పనులు చేపట్టినం. నేనే వందల వేల సమీక్షలు చేసి ఇంజనీర్ల ఓరియంటేషన్‌లో మార్పు తెచ్చి సరైన మార్గంలో పెట్టిన. గోదావరి, కృష్ణా మీద బ్యారేజీలు అత్యున్నత నాణ్యతతో కడితే కానీ నిలబడవు. కాంట్రాక్టర్ ఏం చేస్తుండో క్షణం క్షణం చూడాలి.
అర్థరాత్రి కూడా కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నరో రికార్డు చేసే స్థాయికి మన ఇంజనీర్లు పోయినరు. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కరెంట్ కోసం ఏడిపించిండ్రు. నాతో సహా అందరం కరెంట్ కోసం బాధపడేవాళ్లం. చివరికి పారిశ్రామికవేత్తలే ఇందిరా పార్కు వద్ద ధర్నా చేసే దురవస్థకు చేరింది. 35 ఏళ్ల కింద మొదలైన కరెంట్ కోతలు ఊరకనే పోలె. ఎంత నిబద్ధతతో పని చేసి ఎంత అద్భుతమైన చర్యలు తీసుకుంటే కరెంట్ బాగా అయింది ఈ రోజు రాష్ట్రంలో? ఆషామాషీగా అవుతదా? కాంగ్రెస్ వాళ్లు చాలా గొప్పోళ్లు.. మేధావులు అయితే మా కంటే ముందు ఎందుకు చేయలేదు? ఎందుకు సంపిండ్రు ప్రజానికాన్ని. 35 ఏళ్లు విద్యుత్ రంగంలో మనం తీవ్రంగా బాధపడ్డాం. దాన్ని సక్కగా చేసినం. దాని మీద కూడా విమర్శలు చేస్తున్నరు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం దగ్గర కరెంట్ కొన్నా అవినీతి ఆరోపణలు. మెదడు ఉందా? ఏమైనా విషయం ఉందా కూడా అర్థం కాని పరిస్థితి’’అని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్ ప్రారంభించిన ప్రగతి, సంక్షేమాన్ని చాలా మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, స్వయంగా ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో కొనియాడారని, తాజాగా ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక కూడా తనకు బిజినెస్ రిఫార్మర్ అవార్డు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
త్యాగం చేసింది మేము..మా ఎమ్మెల్యేలకు శాల్యూట్ !
‘‘ఈ రోజు ఎవరన్నా త్యాగం చేశారంటే మేమే చేసినం. ఎవరేం చేయలేదు. మా శాసనసభ్యులు మా మంత్రివర్గం మాకుండే మరో నాలుగైదు మాసాల సమయాన్ని త్యాగం చేశాం. పదవుల కోసం మేం లాలూచీ పడలేదు. పిచ్చిపిచ్చి రాజకీయ క్రీడలు చేయలేదు. ఒక ప్రామాణికంగా పని చేసినం. తెలంగాణ కోసం అవసరమైన ప్రతిసారీ రాజీనామాలు విసిరేసినం. రాష్ట్ర ప్రగతి, మంచి భవిష్యత్తును ఆకాంక్షించి ఈ రోజు కూడా ఎవరైనా త్యాగం చేశారంటే అది మేమే. ఐ శాల్యూట్ మై ఎమ్మెల్యేస్, మై ఎంపీస్. వారు అద్భుతమైన సహకారం అందించారు. నేను ఈ రోజు నిర్ణయం తీసుకున్ననంటే కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా నాలుగు రోజులు ఆగి చేద్దాం సార్. మనకు టైం ఉంది కదా అని చెప్పలేదు. ఈ మధ్య పార్టీ శాసనసభాపక్ష సమావేశం పెట్టినప్పుడు కూడా ముందుకు వెళ్లండి సార్ అన్నారు. నా సహచరులందరికీ ధన్యవాదాలు’’అని పార్టీ ఎమ్మెల్యేలపై కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.
సర్వేలు, వడపోత తర్వాతే అభ్యర్థుల ప్రకటన ...
అనేక సర్వేలు, మంచి చెడ్డలు పరిశీలించిన తర్వాత 105 మంది పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నానని కేసీఆర్ వెల్లడించారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మినహా అందరికీ టికెట్లు ఇస్తున్నట్లు చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, సంగారెడ్డి జిల్లా ఆందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్‌కు స్థానం కల్పించలేకపోయామన్నారు. వీరికి సమానమైన పదవి కల్పించి న్యాయం చేస్తామని ఇద్దరికీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. మేడ్చల్, మల్కాజ్‌గిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ కలిపి మరో ఐదు నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేల అంశంపై చర్చ జరగాల్సి ఉండడంతో పెండింగ్ పెట్టామన్నారు. 100 శాతం ఎక్కడో అత్యవసరమైతే తప్ప సిట్టింగ్‌లను మార్చనని గతంలోనే చెప్పానని, అలాగే మాటను నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. కనీసం 35 నుంచి 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చనున్నారని పత్రికల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. 17, 18 సర్వేల సారాంశంతోపాటు తమ వద్ద ఉన్న సమాచారం, వ్యక్తిగతంగా తనకున్న లెక్కల ఆధారంగా వడపోసిన తర్వాతే అభ్యర్థుల జాబితా రూపొందించినట్టు వివరించారు. పార్టీ ముఖ్యులు ఈ వ్యవహారం చూశారని, వారి సలహాలు సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ అభ్యర్థులందరికీ ముందుగానే సమాచారమిచ్చినట్టు తెలిపారు.
శుభ ముహూర్తాన ప్రచారానికి శ్రీకారం!
టీఆర్‌ఎస్ అధ్యక్షుడి హోదాలో హుస్నాబాద్‌లో తొలి ఎన్నికల సభ నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. మంచి సమయంలో చేస్తే మంచిగానే ఉంటదని, చెడు సమయంలో చేస్తే చెడుగానే ఉంటదని అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఈ నెల 9న అమావాస్య వస్తోందని, అంతకుముందు 7న శ్రావణమాసం శుక్రవారం మంచిరోజు కావడంతో ఈ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తర్వాత పిత్రు మాసం వస్తుందని, దీనిని రోజుల కింద పరిగణలోకి తీసుకోరన్నారు. అందుకే వేగంగా ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్టు వివరించారు. అభ్యర్థులు కూడా వారి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటారని కేసీఆర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment