గత కొన్ని నెలలుగా మీడియాలో హోరెత్తుతున్న ముందస్తు ఎన్నికల ముహూర్తం ఆగమించింది. గడువుకన్నా దాదాపు 9 నెలల ముందు తెలంగాణ తొలి అసెంబ్లీ రద్దయింది. అందరి ఊహా గానాలనూ నిజం చేస్తూ గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశమై అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయడం, గవర్నర్ నరసింహన్ దాన్ని ఆమోదించడం చకచకా పూర్తయ్యాయి. అయితే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మరింత దూకుడుగా వ్యవహరించారు. ఎవరూ అంచనా వేయని రీతిలో 105 స్థానాలకు పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించి విపక్షాలను విస్మయపరిచారు.
బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయి మెరుపు వేగంతో ఇంతటి ప్రధానమైన రాజకీయ నిర్ణయం తీసుకునే సాహసం చేసి ఉండరు. ఇక ఎన్నికలు ఎప్పుడన్నదానిపైనే అందరికీ ఉత్కంఠ. వచ్చే డిసెంబర్‌లోపు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి గనుక వాటితోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండాలన్నది కేసీఆర్ భావన. ఆయనకు కేంద్రంతో పెద్దగా పేచీలేమీ లేవు గనుక ఇందుకు అవాంతరాలు ఎదురు కాకపోవచ్చు కూడా. అనుకోని రీతిలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తప్ప రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ రద్దయిన ఆర్నెల్లలో ఎటూ ఎన్నికలు జరిగితీరాలి.
ఒకవేళ ఏ కారణం చేతనైనా ఎన్నికలు ఆలస్యమై సార్వత్రిక ఎన్నికలతోపాటే ఇవీ జరిగితే ఆయన లెక్కలు తారుమారు కావడానికి ఆస్కారం ఉంది. 2003లో తనపై అలిపిరిలో నక్సలైట్లు హత్యాయత్నం చేసినప్పుడు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై జనంలో సానుభూతి వెల్లువెత్తుతున్నదని భ్రమించి ముందస్తు కోసం తొందరపడ్డారు. 2004 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని లెక్కలేశారు. కానీ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తి కాలేదన్న కారణంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయన వినతిని తోసిపుచ్చింది. ఆ ఏడాది ఏప్రిల్–మే నెలల్లో లోక్‌సభతోపాటే ఎన్నిక లొచ్చి బాబు పదవీచ్యుతుడయ్యారు.
సహజంగానే తాజా నిర్ణయాన్ని పార్టీలన్నీ తప్పుబడుతున్నాయి. ముందస్తుకు వెళ్లడం కేసీఆర్ చేతగానితనానికి నిదర్శమంటున్నాయి. ఈ విమర్శల మాటెలా ఉన్నా ముందస్తుకు వెళ్లడం కేసీఆర్ తోనే మొదలు కాలేదు. 1970 చివరిలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు జోరుగా ఉన్నప్పుడు నాటి ప్రధాని ఇందిరాగాంధీ వాటిని ఖండించేవారు. పైకి ఏం చెప్పినా చివరకు దాదాపు ఏడాది ముందుగా లోక్‌సభను రద్దుచేశారు. 1971 మార్చిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. ఆ తర్వాత పలుసార్లు మద్యంతర ఎన్నికలు జరిగాయి.
జనంలో పాలన బాగుందన్న భావన బలంగా ఉన్నదని విశ్వసించినా... ప్రధాన ప్రత్యర్థి పక్షాలు అయోమయంలో పడ్డాయని, వాటి నైతికస్థైర్యం సన్నగిల్లిందని భావించినా... సర్జికల్ స్ట్రైక్ తరహాలో విపక్షాలకు షాక్ ఇవ్వాలనుకున్నా అధికార పార్టీలు ముందస్తు వైపు మొగ్గుతాయి. మున్ముందు పరిస్థితులు ప్రతికూలం కావొచ్చుననుకున్నా ఇలాంటి నిర్ణయం తీసుకుంటాయి. కేసీఆర్ చెబుతున్న వివరణ వేరు.
రాష్ట్రంలో రాజకీయ విచ్చలవిడితనం, అతి ప్రవర్తన, అసహనం పెరిగిపోయాయని... విపక్షాలు అవాంఛనీయ మైన ఆరోపణలు చేస్తున్నాయని, ఇందువల్ల అధికారుల స్థైర్యం దెబ్బతినే అవకాశం ఉన్నదని... కను కనే ప్రగతి రథచక్రం ఆగకూడదన్న ఉద్దేశంతో కాస్త ముందుగా ఎన్నికలకు పోతున్నామన్నారు. అంటే... వాటి ప్రచార ప్రభావం ఉన్నకొద్దీ పెరిగి తమకు చేటు తెస్తుందని ఆయన భావించార నుకోవాలా? టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకొచ్చినా ఈ విపక్షాలు ఉంటాయి. ఇప్పటిలాగే అప్పుడూ అవి ఆరోపణలు చేస్తాయి. కనుక కేసీఆర్ చెప్పిన వివరణ సంతృప్తికరమైనది కాదు.
అయితే ఆయన నిర్ణయం వెనక రాజకీయ చతురత పుష్కలంగా ఉన్నది. ప్రధాని మోదీ హవా 2014నాటితో పోలిస్తే తగ్గిందని కొందరు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పుంజుకున్న సూచనలున్నాయని వారి భావన. ఆ ఫలితాల ప్రభావం రానున్న సార్వత్రిక ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుంది. పర్యవసానంగా మోదీ, రాహుల్ మధ్య పోటీగా ఆ ఎన్నికలు పరిణమిస్తే సహజంగానే అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఎంతో కొంత పుంజుకునే అవకాశం ఏర్పడుతుంది.
తెలంగాణలో టీడీపీని కేసీఆర్ ఎటూ సమాధి చేశారు. తాను ఇచ్చిన లేఖ వల్లే తెలంగాణ ఏర్పడిందని బాబు ఇక్కడ చెప్పుకుంటున్నా, ఏపీలో మాత్రం రాత్రికి రాత్రే అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారని, దాన్ని తాము వ్యతిరేకించామని అవకాశం చిక్కినప్పుడల్లా ఆయన వాపోతున్నారు. దానికితోడు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఒకరిని కోట్లు ముట్టజెప్పి కొనాలని ప్రయత్నించి ఆయన అడ్డంగా దొరికిపోయారు. చివరకు హడావుడిగా ప్రభు త్వాన్ని ఏపీకి తరలించారు. ఈ కారణాల వల్ల తెలంగాణలో బాబుకు మునుపటి విశ్వసనీయత లేదు. నూతన రాష్ట్రంలో బీజేపీ పెద్దగా ఎదిగింది లేదు. కనుక కేసీఆర్‌కు ఉంటే గింటే కాంగ్రెస్ మాత్రమే ప్రధాన ప్రత్యర్థి. టీడీపీతో అది కలిస్తే దాని విశ్వసనీయతే దెబ్బతింటుందని ఆయన భావిస్తున్నారు. కనుకనే ముందస్తుకు సిద్ధపడటమే శ్రేయస్కరమని ఆయన భావిస్తున్నట్టు కనబడు తోంది. ప్రభుత్వం చేతిలో ఉంటే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనడం కష్టమేమీ కాదు.
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చునన్న అంచనా ఇతర రాజకీయ పక్షాలకు ఉన్నా ఆ పార్టీలు పెద్దగా కదిలింది లేదు. కాంగ్రెస్‌లో ఇంటిపోరు షరా మామూలే. పొత్తు గురించి ఊహాగా నాలొస్తున్నా కాంగ్రెస్, టీడీపీలు ఇంకా గోప్యతనే పాటిస్తున్నాయి. అవి మొహమాటాన్ని ఎప్పుడు విడిచిపెడతాయో చూడాలి. కొద్దో గొప్పో బలమున్న సీపీఎం మాత్రం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) పేరిట ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీఆర్‌ఎస్‌కు అనుకూల ప్రచారం చేసు కోదగ్గ పథకాలున్నట్టే... సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రజాన్యాయ స్థానంలో చివరకు ఎలాంటి తీర్పు వెలువడనున్నదో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment