
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ రద్దవుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే మీడియా ప్రతినిధులు, కొందరు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, పోలీసులతో రాజ్‌భవన్ పరిసరాల్లో సందడి నెలకొంది. ఉదయం 9 గంటల నుంచే అక్కడ మీడియా హడావుడి మొదలైంది. అప్పటి నుంచే ప్రత్యేక ప్రసారాలతో రాజ్‌భవన్ ప్రాంగణం హోరెత్తింది. కేబినెట్ తీర్మానం అనంతరం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వస్తారని తెలియడంతోనే టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఈ తతంగం బయటి నుంచి చూడటానికి ఆసక్తిగా తరలివచ్చారు. మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం మంత్రులందరితో కలసి బస్సుల్లో రాజ్‌భవన్ చేరుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ముఖ్యమంత్రి ఒక్కరే తన కాన్వాయ్‌లో సరిగ్గా 1.28 గంటలకు రాజ్‌భవన్ చేరుకున్నారు. తిరిగి 2.02 నిమిషాలకు ఆయన ప్రగతి భవన్‌కు వెనుదిరిగి వెళ్లారు.
మినిట్ టు మినిట్...
ఉదయం...
9.00 గంటలు: రాజ్‌భవన్ చేరుకున్న మీడియా ప్రతినిధులు
10.00 గంటలు: రాజ్‌భవన్ పరిసరాల్లో పోలీసుల ఆంక్షలు
11.00 గంటలు: సీఎం వచ్చే విషయంపై టీవీ జర్నలిస్టుల విశ్లేషణలు
మధ్యాహ్నం..
12.00 గంటలు: సీఎం వస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
12.20 గంటలు: గవర్నర్ సెక్యూరిటీ సిబ్బంది ఎలాంటి వాహనాలనూ లోనికి వెళ్లనివ్వలేదు.
12.31 గంటలు: పూర్తిగా గేట్లకు తాళాలు వేసిన సెక్యూరిటీ సిబ్బంది
1.19 గంటలు: రాజ్‌భవన్ రోడ్డుపై పోలీసుల అప్రమత్తం, ట్రాఫిక్ నిలిపివేత
1.20 గంటలు: సీఎం కోసం ఎదురుచూస్తుండగా బొప్పాని ఈశ్వర్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు వెంటనే అతనిని నిలువరించారు.
1.22 గంటలు: అమరులకు గుర్తింపు దక్కలేదని అందుకే తాను ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించానని ఈశ్వర్ మీడియాతో మాట్లాడాడు.
1.26 గంటలు: యువకుడిని ఆటోలో స్టేషన్‌కు తరలించిన పోలీసులు
1.28 గంటలు: రాజ్‌భవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్
2.02 గంటలు: రాజ్‌భవన్ నుంచి ప్రగతి భవన్‌కు వెనుదిరిగిన సీఎం కేసీఆర్.