సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : రాష్ట్రంలో ఎందుకీ ముందస్తు ఎన్నికలు? గత కొన్ని రోజులుగా తెలంగాణలో ప్రతి ఒక్కరినీ తొలుస్తున్న ప్రశ్న. గురువారం అసెంబ్లీ రద్దు ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ఎక్కడ, ఏ నలుగురు కలిసినా దీనిపైనే చర్చోపచర్చలు. గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వారికి సానుకూల ఫలితాలు రాలేదని తెలిసినా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ రద్దువైపే మొగ్గు చూపారంటే దాని వెనుక బలమైన కారణాలు ఉండి ఉండొచ్చంటూ విశ్లేషణలు.
టీఆర్‌ఎస్‌ను కలసికట్టుగా ఎదుర్కోవాలని భావిస్తున్న ప్రతిపక్షాలు అందుకు సిద్ధమ య్యేలోగా దెబ్బకొట్టేందుకే సీఎం ‘ముందస్తు’బరిలోకి దూకారని కొందరు భావిస్తుండగా వివిధ పథకాలపై వ్యక్తమవుతున్న ప్రజా సంతృప్తిని వెంటనే ఓట్లుగా మలుచుకోవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని మరికొందరు అంచనా వేస్తున్నారు. మరోవైపు గత లోక్‌సభ ఎన్ని కల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉన్న రాష్ట్రాల్లో పుంజుకుంటున్నట్లు వార్తలు వెలువడటం, పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక రాహుల్ గాంధీపట్ల ప్రజాదరణ పెరగడం వంటి పరిణామాలు కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ఓ కారణమై ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రచారాస్త్రాలుగా పథకాలు ...
ఉద్యమ పార్టీగా తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్... ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీల అమల్లోనూ విజయవంతమైందనే వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. కొన్ని హామీలు అమలు కాలేదనే విమర్శలున్నా 24 గంటల నిరంతర విద్యుత్ టీఆర్‌ఎస్‌కు ఉన్న సానుకూల అంశాల్లో అత్యంత ఎక్కువ ప్రభావం చూపుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
అలాగే రైతు బంధు పథకం ద్వారా 34 లక్షల మంది రైతాంగానికి ఎకరాకు రూ. 4 వేల చొప్పున పెట్టుబడి రాయితీ ప్రకటించి అమలు చేయడం, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున బీమా సదుపాయం కల్పించడం వంటి అంశాలు పెద్ద ప్రచారాస్త్రాలుగా ఉపయోగపడుతాయని టీఆర్‌ఎస్ భావిస్తోంది. డబుల్ బెడ్రూం, మిషన్ భగీరథ వంటి పథకాలు ఇంకా పూర్తి కాకున్నా మళ్లీ అధికారంలోకొస్తే వాటిని త్వరగా పూర్తి చేస్తామని ప్రజలను ఒప్పించగలమన్న ధీమాతో కేసీఆర్ ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొంటున్నారు.
ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకూడదనే...
ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిస్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని భావించిన టీఆర్‌ఎస్... ఆయా పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకునేందుకు సమయం ఇవ్వకూడదనే ముందస్తుకు మొగ్గుచూపిందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేల్లో అనుకూల ఫలితాలు వచ్చినా ఆయా సర్వేల్లో పార్టీ గెలిచే సీట్ల సంఖ్య కాస్త తగ్గుతూ రావడం సీఎంకు ఆందోళన కలిగించిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సర్వే సంస్థ నిర్వాహకుడు చెప్పారు.
మరిన్ని సీట్లు తగ్గేదాకా ఆగడంకంటే ప్రజాదరణ ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్లడం శ్రేయస్కరమని కేసీఆర్ భావించి ఉంటారని ఆ నిర్వాహకుడు అభిప్రాయపడ్డారు. కోదండరాం సహా కొందరు తెలంగాణ ఉద్యమకారుల విమర్శలూ సీఎం ‘ముందస్తు’కు కారణమని తెలుస్తోంది. అలాగే ముందస్తు ఎన్నికల్లో విజయం సాధిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించుకోవచ్చని కేసీఆర్ అంచనా వేస్తున్నారని ఓ నేత పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment