రాజ్యాంగంలో లేని ‘ఆపద్ధర్మం’! | Brief about caretaker government | Sakshi
Sakshi News home page

రాజ్యాంగంలో లేని ‘ఆపద్ధర్మం’!

Published Fri, Sep 7 2018 2:20 AM | Last Updated on Fri, Sep 7 2018 5:11 AM

Brief about caretaker government  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎన్నుకున్న లోక్‌సభ లేదా శాసనసభ కాల పరిమితి ముగియక ముందే రద్దు అయితే తిరిగి ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం కొలువు తీరేంత వరకు అప్పటిదాకా ఉన్న ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి ఆపద్ధర్మంగా కొనసాగుతారు. పాలనాపరంగా ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సభ లు రద్దయ్యే సమయానికి ప్రధాని లేదా సీఎంగా కొనసాగిన వ్యక్తిని అదే పదవిలో కొనసాగాలని రాష్ట్రపతి లేదా గవర్నర్‌ కోరుతారు. ఇలా వారి కోరిక మేరకు సీఎం పదవిలో కొనసాగిన వ్యక్తి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అవుతారు. అప్పటివరకు పని చేసిన మంత్రు లు కూడా అవే బాధ్యతలను నిర్వర్తిస్తారు.

అలాగే శాసనసభ లేని సమయంలో ప్రధాని లేదా ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం అంటారు. అయితే ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గురించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. తెలంగాణ శాసనసభ రద్దయిన నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విధులు, అధికారాలపై న్యాయనిపుణులను ప్రశ్నించినప్పుడు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆపద్ధర్మ ప్రభుత్వం అన్నది రాజ్యాంగంలో లేకపోయినా మన దేశంలో ఓ సంప్రదాయంగా వస్తోందని వారు వివరించారు.

విధాన నిర్ణయాలకు తావు లేదు
అసాధారణ, అత్యవసర పరిస్థితుల్లో తప్ప సాధారణంగా కీలక విధానపరమైన నిర్ణయాలేవీ కూడా ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదు. ఎన్ని కలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరాదు. రోజువారీ వ్యవహారాలు, కార్యకలాపాలకు సంబంధించిన నిర్ణయాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.

బడ్జెట్‌ తయారీ, ఆర్డినెన్స్‌ల జారీ, పన్ను ల పెంపు, తగ్గింపు, భారీ ప్రాజెక్టుల ప్రకటన, నామినేటెడ్‌ పదవుల భర్తీ, కీలక పోస్టుల్లోని ఉన్నతాధికారుల బదిలీలు వంటి విషయాల్లో నిర్ణయాలు తీసు కోవడానికి వీల్లేదు. వీటికి సంబంధించిన నిర్ణయాల ను ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వ మే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆపద్ధర్మ ప్రభు త్వం ఏదైనా కీలక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే.. ఆ నిర్ణయం సబబా? కాదా? అన్న విషయంపై న్యాయ సమీక్ష చేసేందుకు అవకాశం ఉంది. ఆపద్ధర్మ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

1975లో దేశంలో తొలిసారి..
మన దేశం విషయానికొస్తే డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ 1974లో ఎన్నికల సంస్కరణలపై జస్టిస్‌ వీఎం తర్కుండే నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 1975లో ఇచ్చిన తన నివేదికలో తొలిసారి ఆపద్ధర్మ ప్రభుత్వం గుర్తించి ప్రస్తావించింది. ఎన్నిక ల సమయంలో ఉండే ప్రభుత్వం కేవలం ఆపద్ధర్మ ప్రభుత్వంగానే బాధ్యతలు నిర్వర్తించేలా చూడాల్సిన అవసరం ఉందని ఆ కమిటీ సిఫారసు చేసింది. తర్వాత 1989లో అప్పటి న్యాయశాఖ మంత్రి దినేశ్‌ గోస్వామి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. ఆపద్ధర్మ ప్రభుత్వం విషయంలో 1975లో జస్టిస్‌ తుర్కుండే కమిటీ చేసిన సిఫారసును వ్యతిరేకించింది.

నీలం సంజీవరెడ్డి తొలి అధికారిక ప్రకటన
1979లో లోక్‌సభ రద్దయినప్పుడు అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆపద్ధర్మ ప్రభుత్వం విషయంలో తొలిసారి అధికారిక ప్రకటన చేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వం కొత్త విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని ఆ ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే అప్పటి ప్రధాని చరణ్‌సింగ్‌ దీన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని, ఈ విషయంలో రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదని స్పష్టం చేశారు. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదా, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఆర్థిక సాయం వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

1991లో నాటి ప్రధాని చంద్రశేఖర్‌ కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నారు. న్యాయవ్యవస్థలో పలు బదిలీలను చేపట్టారు. కొందరు అధికారులను కూడా బదిలీ చేశారు. వీటిపై ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పినా పట్టించుకోలేదు. అయితే పార్లమెంట్‌ రద్దు చివరి రోజు ఎంపీలకు పెన్షన్‌ జారీ విషయంలో తీసుకొచ్చిన బిల్లు వివాదాస్పదమైంది. నాటి రాష్ట్రపతి వెంకటరామన్‌ ఆ బిల్లులకు ఆమోదం తెలపలేదు. 1997లో ఐకే గుజ్రాల్‌ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం కూడా వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంది.

ఏకంగా గవర్నర్ల నియామకాలు చేపట్టింది. పంజాబ్‌ రాష్ట్రంలో రూ.కోట్ల రుణాలను మాఫీ చేసింది. తర్వాత వాజ్‌పేయి నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలే తీసుకుంది. రాష్ట్రపతి అభిప్రాయాలతో విభేదించేందుకు సైతం వాజ్‌పేయి ప్రభుత్వం వెనుకాడలేదు. ఆశ్రిత పక్షపాతానికి, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు విధానపరమైన నిర్ణయాలను ఉపయోగించరాదన్న ఉద్దేశంతోనే ఆపద్ధర్మ ప్రభుత్వానికి కీలక నిర్ణయాల విషయంలో ఆంక్షలు విధించారు.


ఆపద్ధర్మ సీఎంగా 450 ఎకరాలు కట్టబెట్టిన బాబు..
2004లో అప్పటి ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన సొంత మనిషి బిల్లీరావుకు చెందిన ఐఎంజీ భరత అకాడమీస్‌కు అత్యంత ఖరీదైన గచ్చిబౌలి ప్రాంతంలోని 450 ఎకరాలను ఎకరా రూ.50 వేలకే కట్టబెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆపద్ధర్మ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకోరాదని తెలిసినా, మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని తెలుసుకున్న చంద్రబాబు ఆగమేఘాలపై వేల కోట్ల విలువైన 450 ఎకరాల భూమిని కేవలం రూ.2 కోట్లకే ఐఎంజీకి కేటాయించి శంకుస్థాపన కూడా పూర్తి చేశారు.

ఐఎంజీ భరత కార్యాలయానికి జూబ్లీహిల్స్‌లో ఐదు ఎకరాలను ఎకరా రూ.50 వేలకే కేటాయించారు. ఈ కేటాయింపులను అప్పట్లో భారీ కుంభకోణంగా అభివర్ణించారు. ఈ భూములకు సంబంధించిన వివా దం ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. చంద్రబాబు హయాంలో జరిగిన భారీ కుంభకోణాల్లో ఐఎంజీకి చేసిన భూముల కేటాయింపు వ్యవహారం మొదటిస్థానంలో ఉంటుంది.  


విన్‌స్టన్‌ చర్చిల్‌తో ప్రారంభం
రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ఇంగ్లండ్‌ ప్రధాన మంత్రిగా విన్‌స్టన్‌ చర్చిల్‌ కొనసాగుతున్నప్పుడు ‘ఆపద్ధర్మ ప్రభుత్వం’అన్న పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన చర్చిల్‌ తన పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలన్న ఉద్దేశంతో ఇంగ్లండ్‌ రాజుకు తన రాజీనామాను సమర్పించారు. తర్వాత ఇంగ్లండ్‌ రాజు చర్చిల్‌ను పిలిచి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కార్యనిర్వహణ బాధ్యతలు చూసుకోవాలని చెప్పి దానికి ‘కేర్‌టేకర్‌ గవర్నమెంట్‌ (ఆపద్ధర్మ ప్రభుత్వం)’గా నామకరణం చేశారు. ఈ ఆపద్ధర్మ ప్రభుత్వంలో విధానపరమైన నిర్ణయాలేవీ తీసుకోరాదని నిర్ణయించారు. నాడు పోట్స్‌డామ్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న చర్చిల్‌ తనతోపాటు ప్రతిపక్ష పార్టీ నేతను కూడా తీసుకెళ్లి.. ఆపద్ధర్మ ప్రభుత్వం నడవాల్సిన తీరు ఇదేనంటూ ప్రపంచానికి చాటి చెప్పారు. అప్పుట్లో ఆయనపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement