1994లో అప్పటి టీడీపీ అధ్యక్షుడు ఎన్.టి.రామారావు ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రయోగాత్మకంగా 33 శాతం నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇప్పుడు టీఆర్‌ఎస్ 91 శాతం నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి రికార్డు సృష్టించింది.
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి దేశ రాజకీయాల్లో అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వెలువడుతుందో తెలియకుండానే ఒకేసారి 105 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది. 1994లో అప్పటి టీడీపీ అధ్యక్షుడు ఎన్.టి.రామారావు ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రయోగాత్మకంగా 33 శాతం నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇప్పుడు టీఆర్‌ఎస్ 91 శాతం నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి రికార్డు సృష్టించింది. గురువారం ప్రకటించిన జాబితాలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ఆయన మంత్రివర్గ సహచరులు, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఉన్నారు.
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ నుంచి ఫిరాయించి టీఆర్‌ఎస్‌లో చేరిన అందరికీ టిఆర్‌ఎస్ టికెట్లు కేటాయించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి ప్రాతి నిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులను ఎంపిక చేయలేదు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ 2014లో హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేఎల్పీనేత కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్‌పేట నియోజకవర్గానికీ అభ్యర్థిని ప్రకటించలేదు.
సాహసోపేత నిర్ణయమే...
ప్రస్తుత శాసనసభ్యుల్లో (ఇప్పటివరకు ప్రకటించిన జాబితాను అనుసరించి) ఇద్దరికి మినహా అందరికీ టికెట్లు కేటాయించి టీఆర్‌ఎస్ నాయకత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏదైనా ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిపై కొంత వ్యతిరేకత, మరికొందరిపై తీవ్ర వ్యతిరేకత ఉంటుందని, వాటిని అధిగమించడానికి టీఆర్‌ఎస్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కొంత ప్రతికూలతకు దారి తీసే అవకాశం లేకపోలేదని వారంటున్నారు.
వివాదాస్పదులుగా ముద్రపడిన కొందరు ఎమ్మెల్యేలకూ టికెట్లు కేటాయించడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. మహిళా కలెక్టర్‌పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు కేసు ఎదుర్కొంటున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, భూవివాదాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గత నాలుగేళ్లలో నియోజకవర్గాలకు చుట్టపు చూపుగా వెళ్లి వస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మంది ఎమ్మెల్యేలకు టీఆర్‌ఎస్ నాయకత్వం టికెట్లు ఖరారు చేసింది. కాగా, జాబితాలో నలుగురు మహిళలకు చోటు దక్కింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ పెద్దపీట...
గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన 25 మంది ఎమ్మెల్యేలకూ కేసీఆర్ టికెట్లు కేటాయించారు. అదే సమయంలో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వారెవరికీ ఈసారి టికెట్లు ఇవ్వలేదు. అయితే ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారారన్న అపవాదు మూటగట్టుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని, దాన్ని కూడా టీఆర్‌ఎస్ నాయకత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించే అంశమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నాయకత్వాన్ని నమ్మి పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు నిరాకరిస్తే పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో టీఆర్‌ఎస్ అధిష్టానం ఈ పని చేసి ఉంటుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు,. ఏదేమైనా టీఆర్‌ఎస్ నాయకత్వం టికెట్లు ఖరారు చేయడంలో మితిమీరిన ఆత్మవిశ్వాసం కనబరిచిందనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది.
బాల్క సుమన్‌కే అవకాశం...
రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని భావించిన అర డజను మంది ఎంపీలకు నిరాశే ఎదురైంది. కేవలం పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు మాత్రమే అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం లభించింది. సుమన్ చెన్నూరు నుంచి పోటీ చేయనున్నారు. కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత జగిత్యాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆశపడ్డ రాష్ట్ర రైతు సమితి చైర్మన్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి కూడా అవకాశం దక్కలేదు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ లేదా మునుగోడు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు దక్కాయి.
చోటు దక్కని దానం...
టీఆర్‌ఎస్‌లో ఇటీవలే అట్టహాసంగా చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్‌కు అభ్యర్థుల జాబితాలో చోటు దక్కలేదు. అయితే ఆయన టికెట్ ఆశిస్తున్న ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని మాత్రం కేసీఆర్ పెండింగ్‌లో పెట్టారు. అక్కడ నుంచి పోటీ చేయాలని ఆ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి, మాజీ మంత్రి పి. జనార్దన్‌రెడ్డి కుమార్తె విజయ సైతం ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ నాగేందర్‌కు టికెట్ ప్రకటిస్తే విజయ కాంగ్రెస్‌లో చేరే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వం ఆమెకు టికెట్ ఆఫర్ చేసినట్లు తెలిసింది. వారిద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకోకపోవడం వల్లే సీటును కేసీఆర్ పెండింగ్‌లో పెట్టారని టీఆర్‌ఎస్ వర్గాలు చెప్పాయి.
సామాజిక వర్గాల వారీగా టికెట్లు ఇలా...
34 - రెడ్డి
21 - బీసీ
16 - ఎస్సీ
12 - ఎస్టీ
11 - వెలమ
06 - కమ్మ
02 - ముస్లిం
01 - బ్రాహ్మణ
01 - వైశ్య
01- సిక్కు
లక్కీ 6
సీఎం కేసీఆర్ అదృష్ట సంఖ్య ఆరు అని అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే అసెంబ్లీ రద్దుకు ఆయన 6వ తేదీనే ఎంచుకోగా సీఎం ప్రకటించిన 105 మంది ఎన్నికల అభ్యర్థుల జాబితాలోని సంఖ్యలను కూడితే వచ్చేదీ ఆరే కావడం విశేషం.
ఈ ఎనిమిదింటా.. సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించని ఆ ఎనిమిది నియోజకవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ప్రకటించిన జాబితాలో 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ (ముషీరాబాద్), బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి (అంబర్‌పేట), రాంచంద్రారెడ్డి (ఖైరతాబాద్), రాజాసింగ్ (గోషామహల్) స్థానాలతోపాటు ఎంఐఎం కీలకంగా భావించే చార్మినార్, మలక్‌పేట స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు. ఇది రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. ఎంఐఎం తమకు ఫ్రెండ్లీ పార్టీ అని కేసీఆర్ ప్రకటించారు.
టీఆర్‌ఎస్ జాబితాలో ఎనిమిది స్థానాలు పెండింగ్
మరోవైపు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప్పల్ మినహా మరెక్కడా అభ్యర్థులను తేల్చకపోవడంతో బీజేపీ–టీఆర్‌ఎస్‌ల మధ్య సఖ్యత ఉందంటూ గుసగుసలు మొదల య్యాయి. టీఆర్‌ఎస్ తొలి జాబితాలోనే అంబర్‌పేట నుంచి సుధాకర్‌రెడ్డి, కృష్ణ యాదవ్, కాలేరు వెంకటేష్‌లలో ఒకరు, ముషీరాబాద్‌లో ముఠా గోపాల్ లేదా కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డిలలో ఒకరు, ఖైరతాబాద్‌లో మన్నె గోవర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డిలలో ఒకరు, గోషామహల్‌లో దానం నాగేందర్ పేర్లను ప్రకటిస్తారని భావించారు. ఎంఐఎం సిట్టింగ్ స్థానమైన చార్మినార్‌లో గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమిపాలైన ఇనాయత్ అలీని అక్కడి నుంచి బహదూర్‌పురాకు మార్చారు. చార్మినార్, మలక్‌పేటలకూ అభ్యర్థులను ప్రకటించకపోవడం వ్యూహంలోనే భాగంగానే భావిస్తున్నారు.
మల్కాజిగిరి.. మళ్లీ మొదటికి..: మల్కాజిగిరి స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు, కార్పొరేటర్ విజయశాంతిని ఎంపిక చేస్తూ బుధవారమే ఆమెకు సమాచారం ఇచ్చారు. గురువారం ఉదయం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఎంపీ మల్లారెడ్డి ఆమెను కాబోయే ఎమ్మెల్యేగానే పరిచయం చేశారు. అయితే ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు తన వర్గానికి చెందిన ఐదుగురు కార్పొరేటర్లతో రాజీనామా అస్త్రాన్ని సంధించి ఆమె అభ్యర్థిత్వాన్ని నిలుపుదల చేయించినట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment