Caretaker Government
-
పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ రూ.330
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచింది. లీటర్ పెట్రోల్‌పై రూ.26.02, డీజిల్‌పై రూ.17.34 పెంచుతున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధర గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి రూ.330కు చేరుకుంది. ద్రవ్యోల్బణం 27.4 శాతానికి చేరడంతో ఈ చర్య అనివార్యమయినట్లు ప్రభుత్వం చెబుతోంది. శనివారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 296.41 పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. ఈ నెల ఒకటో తేదీన కూడా ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.14 చొప్పున పెంచింది. -
పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా కకర్ ప్రమాణం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా అన్వరుల్ హక్ కకర్(52) సోమవారం పదవీ ప్రమాణం చేశారు. సోమవారం అధ్యక్ష భవనంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో కకర్తో అధ్యక్షుడు అరిఫ్ అల్వీ ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ప్రధాని పదవి నుంచి వైదొలగిన షెహబాజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. మరికొద్ది నెలల్లో జరగాల్సిన నేషనల్ అసెంబ్లీ(దిగువసభ) ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించడం, దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడం కకర్ ముందున్న ప్రధాన లక్ష్యాలు. త్వరలోనే ఆయన తన మంత్రివర్గాన్ని ప్రకటించనున్నారు. -
అనుకున్నదొకటి... అయ్యిందొకటి!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం మొదట వేసుకున్న అంచనా తప్పింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాలకంటే ముందే తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు చేసిన కసరత్తు తాజా పరిణామాల నేపథ్యంలో మారిపోయింది. తెలంగాణలో నవంబర్ రెండో వారంలో పోలింగ్ నిర్వహించేందుకు వీలుగా అక్టోబర్ రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించి షెడ్యూల్ రూపొందించినా తుది ఓటర్ల జాబితా ప్రకటన గడువు పొడిగించాల్సి రావడం, ఓటర్ల జాబితాకు సంబంధించి శుక్రవారం హైకోర్టు ఆదేశాల జారీ దరిమిలా సీఈసీ షెడ్యూల్‌ను మార్చుకుంది. ఈ కారణంగానే శనివారం మధ్యాహ్నం 12 గంటలకే వెలువరించాల్సిన 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించింది. తెలంగాణ లో ఎన్నికలు నిర్వహించాలనుకున్న షెడ్యూల్‌ను ఛత్తీస్ గఢ్‌కు వర్తింపజేసింది. హైకోర్టులో పిటిషన్ దృష్ట్యా అన్ని పరిణామాలను బేరీజు వేసు కుని నవంబర్ 12 న నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రకటన చేసింది. నవంబర్ రెండో వారం ముగిసేటప్పటికీ ఎన్నికల ప్రక్రియ ము గుస్తుందని భావించిన అధికార తెలంగాణ రాష్ట్ర సమి తి (టీఆర్ఎస్) ఈ పరిణామంతో కొంత ఆందోళన చెందినట్లు కనిపించింది. అక్టోబర్‌లో నోటిఫికేషన్ వస్తుందన్న ఉద్దేశంతోనే ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు 105 నియోజవర్గాలకు పార్టీ అభ్యర్థులను అసెంబ్లీ రద్దు రోజే ప్రకటించారు. ఇబ్బందుల్లేకుండా ఉండేందుకే నోటిఫికేషన్ నవంబర్‌కు... న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగానే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను నవంబర్‌లో విడుదల చేయాలన్న నిర్ణయం తీసుకుంది. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేయాలని ముందుగా నిర్ణయం తీసుకున్నా అనుకోని అవాంతరాల కారణంగా తెలంగాణను రాజస్తాన్‌తో కలిపింది. ఛత్తీస్‌గఢ్ ఎన్నికలను ముందుకు తీసుకువచ్చింది. సాంకేతిక సమస్యల గుర్తింపులో యంత్రాంగం విఫలం... ఓటర్ల తుది జాబితా ప్రకటనకు ముందు ఎదురయ్యే సాంకేతిక సమస్యలను గుర్తించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఎక్కువ జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చినా 10–12 జిల్లాల్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించడానికి వీలుగా తుది ఓటర్ల జాబితా ప్రకటనకు సమయం పొడిగించాలని గత బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా పలువురు కలెక్టర్లు సీఈవో రజత్‌కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే రాతపూర్వకంగా తనకు నివేదికలు పంపితే సీఈసీ దృష్టికి తీసుకెళ్తానని రజత్ వారికి చెప్పడంతో గురువారం రాత్రికి వారు ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయానికి నివేదికలు పంపారు. శుక్రవారం ఢిల్లీలో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంతోపాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారుల సమావేశంలో రజత్ కుమార్ ఈ విషయాన్ని సీఈసీ దృష్టిలో పెట్టారు. దీంతోపాటే ఓటర్ల జాబితాలో అక్రమంగా వేలాది మంది పేర్లు తొలగించారంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఓటర్ల తుది జాబితాను తమకు ఇవ్వకుండా ప్రకటించవద్దని షరతు విధించింది. ఈ రెండు అంశాలపై సీఈసీ శనివారం న్యాయ నిపుణులతో కూలంకషంగా చర్చించింది. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో ముందుగా ఎన్నికలు నిర్వహించడం సమంజసమే అయినా తుది ఓటర్ల జాబితా సిద్ధం కాకపోవడం, హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో కొంత సమయం తీసుకుంటే బాగుంటుందని న్యాయ నిపుణులు సూచించినట్లు తెలిసింది. -
నేటి నుంచి పూర్తిస్థాయి ప్రచారంలో కేసీఆర్
-
గులాబీ ప్రచార భేరి
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల వ్యూహంలో ప్రత్యర్థి పార్టీలకంటే ముందంజలో ఉన్న టీఆర్ఎస్ ప్రచారపర్వంలోనూ దూకుడు ప్రదర్శించనుంది. విపక్షాలకంటే ముందే పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బహిరంగ సభతో టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు బుధవారం నుంచి పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలవాల్సిన ఆవశ్యకతను తెలపనున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ను ఆశీర్వదించాలని బహి రంగ సభ వేదికగా ప్రజలను కోరనున్నారు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని పదేపదే అడ్డుకోవడం వల్లే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని ప్రజలకు వివరించనున్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పుతో టీఆర్ఎస్ను గెలిపిస్తే స్వాభిమానంతో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని, అన్ని రంగాల్లోనూ తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగుతుం దని హామీ ఇవ్వనున్నారు. మొత్తంగా టీఆర్ఎస్ బహిరంగ సభలతో ఎన్నికల్లో రాజకీయ వేడి మరింత రాజుకోనుంది. వరుసగా సభలు.. ఉమ్మడి జిల్లాలవారీగా సభలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. నిజామాబాద్ సభ అనంతరం ఈ నెల 4న నల్లగొండలో, 5న వనపర్తిలో, 7న వరంగల్, 8న ఖమ్మంలో ఉమ్మడి జిల్లాల బహిరంగ సభలు నిర్వహించనుంది. బహిరంగ సభల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ ఆయా జిల్లాల మంత్రులు, పలువురు అభ్యర్థులతో ఇప్పటికే ఫోన్లలో మాట్లాడారు. బహిరంగ సభలకు జనం త్వరగా వచ్చేలా చూడాలని ఆదేశించారు. అసంతృప్తులు ఆగినట్లేనా... ప్రత్యర్థి పార్టీలను, సొంత పార్టీ వారిని ఆశ్చర్యపరుస్తూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దయిన రోజే 105 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో టికెట్ ఆశించి భంగపడిన నేతలు అసమ్మతి కార్యక్రమాలు మొదలుపెట్టారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని అసంతృప్తి నేతలు డిమాండ్ చేశారు. అభ్యర్థులకు సహకరించేది లేదంటూ ప్రకటించారు. అనంతరం మంత్రి కేటీఆర్ చొరవతో నియోజకవర్గాలవారీగా అసమ్మతి, అసంతృప్తి నేతలను బుజ్జగిస్తున్నారు. టికెట్లు ఖరారైన మరుసటి రోజు నుంచే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. చాలా మంది నేతలు ఇప్పటికే కేటీఆర్‌తో చర్చించి వెళ్లారు. కొందరు నేతలు మాత్రం స్వతంత్రులుగా పోటీ చేస్తామని ప్రకటించి సొంతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలాంటి స్థానాలు దాదాపు 10 వరకు ఉన్నాయి. టీఆర్ఎస్ అధినేత వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. బహిరంగ సభల నిర్వహణలో, ఆయా నియోజకవర్గాల జనసమీకరణ విషయంలో వారి వైఖరి ఆధారంగా తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. పెండింగ్ జాబితాపై అస్పష్టత... టీఆర్ఎస్ మరో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో ప్రచారం మొదలుపెడుతున్నా అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోవడంతో ఆయా సెగ్మెంట్లలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆశావహులు తీవ్ర ఒత్తిడితో నలిగిపోతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలో ముందుకు వెళ్తుంటే తమ సెగ్మెంట్లలో పార్టీపరంగా ఇబ్బందులు నెలకొంటున్నాయని అంటున్నారు. ఉమ్మడి బహిరంగ సభల నిర్వహణకు ముందు అభ్యర్థులను ప్రకటించేలా టీఆర్ఎస్ కసరత్తు పూర్తి చేసింది. అయితే మహాకూటమిలో పార్టీలవారీగా సీట్ల సర్దుబాటుతో తలెత్తే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే పెండింగ్ సీట్ల అభ్యర్థుల ఖరారులో జాప్యం చేస్తోంది. ఎంపీ మల్లారెడ్డి ప్రచారానికి బ్రేక్... టీఆర్ఎస్ పెండింగ్‌లో పెట్టిన మేడ్చల్ అభ్యర్థి ఖరారులో రోజురోజుకూ పరిణామాలు మారుతున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే ఎం. సుధీర్‌రెడ్డికి తొలి జాబితాలో స్థానం దక్కలేదు. అదే సమయంలో మల్కాజ్గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి తనకు అధిష్టానం అవకాశం ఇచ్చినట్లుగా సన్నిహితుల వద్ద చెప్పుకున్నారు. అనంతరం నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. అయితే మల్లారెడ్డి ప్రచార నిర్వహణపై టీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా స్పందించింది. ప్రచారం ఆపేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మంగళవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. దీంతో మేడ్చల్ అభ్యర్థి ఎవరనేది మళ్లీ మొదటికి వచ్చింది. -
ఆపద్ధర్మంలోనూ అధర్మపాలనే!
ప్రజల తీర్పును లెక్కచేయకుండా నిరంకుశంగా వ్యవహరించడంలో ఇద్దరు తెలుగు సీఎంలదీ ఒకే బాట. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ఇంకా పది మాసాలుండ గానే 2003 నవంబర్‌లో చంద్రబాబు శాసనసభను రద్దుచేయించారు. చంద్రశేఖర్‌రావు ఎనిమిది మాసాల ముందే తెలంగాణ అసెంబ్లీని రద్దుచేశారు. కాగా, ఇరువురు ‘చంద్రులు’ తమ రాష్ట్రాల గవర్నర్ల ముందు సాగిలపడి ఆపధర్మ ముఖ్యమంత్రులుగా తామే కొనసాగేలా ఏర్పాట్లు చేసుకోవడంలో కూడా ఘనాపాటీలేనని మరువరాదు. నిజానికి ఈ ‘ఆపధర్మం’ అన్న మాట గాని, ‘ఆపధర్మ ప్రభుత్వం’ ఏర్పాటు గానీ పాలకులు తమ అవసరాల కొద్దీ సృష్టించుకున్న పదాలే. అన్నింటా వేలు పెట్టి అహం బ్రహ్మ కావా లని/ఆశించేవాడు తుదకు యంబ్రహ్మగా మారుతాడు/ ధనస్వామ్యం వర్గాన్నే వెనకేసుకు తిరుగుతాడు!! రాజ్యాంగ నిర్వహణా పద్ధతుల్ని దీర్ఘకాలం పాటు జల్లెడ పట్టి మరీ పరిశీలించిన అనుభవంతో మహాకవి వెలిబుచ్చిన ఈ అభిప్రాయం నేటి రెండు తెలుగు ప్రభుత్వాల ఆచరణకు అద్దంపడుతోంది. తెలుగు ప్రజ లకు ఇరు ప్రాంతాల గొడుగు పట్టి కడతేర్చుదామని బయల్దేరిన ఇద్దరు చంద్రులు (చంద్రబాబు, కేసీఆర్) గురు శిష్యులుగా ఎదిగివచ్చి తెలుగు ప్రజల్ని చీల్చి ముఖ్యమంత్రులయ్యారు. సంతోషం. కానీ పాలనాధికా రాలు, రాజ్య నిర్వహణ వ్యవహారాలను పంచుకోవడంలో కూడా ఒకే పద్ధతి అనుసరిస్తు న్నారు. శాసనసభలను అర్ధంతరంగా రద్దుచేయ డంలో ఇద్దరిదీ ఒకే బాట, అయితే ఒక్క తేడా ఉంది. వైఎస్సార్సీపీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను, తెలుగుదేశం పార్టీని మింగేయడానికి శరవేగాన దూసుకువస్తున్నాడన్న భీతి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుని పీడిస్తోంది. అందుకే అసెంబ్లీని రద్దుచేయడానికి సాహసించడం లేదు. అసెంబ్లీ కాలపరిమితి పూర్తయ్యేదాకా ఆయన దింపుడు కళ్లం ఆశతో కాల క్షేపం చేస్తున్నారు. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వేలు జరి పించగా కొన్ని పట్టణ ప్రాంతాలు మినహా జిల్లాల్లో మాత్రం గుండెకు దడ పుట్టించే నివేదికలు వచ్చాయి. దీంతో కేంద్రంలో నిలకడలేని ప్రధాని నరేంద్రమోదీ అండ చూసుకుని అసెంబ్లీని ఆకస్మికంగా రద్దు చేయించారు. ఐదేళ్లూ పరిపాలించి ‘మాకు మంచి చేయండి’ అని ఓట్లు వేసి ఆశీర్వదించిన ప్రజల ఆంకాంక్షలకు భిన్నంగా వ్యవహరించారు. ప్రజల తీర్పును లెక్కజేయకుండా నిరంకుశంగా వ్యవహరించడంలో ఇద్దరు తెలుగు సీఎంలదీ ఒకే బాట. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ఇంకా పది మాసాలుండగానే 2003 నవంబర్‌లో చంద్రబాబు శాసన సభను రద్దుచేయించారు. చంద్రశేఖర్ రావు 8 మాసాల ముందే తెలం గాణ అసెంబ్లీని రద్దుచేశారు. కాగా, ఇరువురు ‘చంద్రులు’ తమ రాష్ట్రాల గవర్నర్ల ముందు సాగిలపడి ఆపద్ధర్మ ముఖ్యమంత్రులుగా తామే కొన సాగేలా ఏర్పాట్లు చేసుకోవడంలో కూడా ఘనాపాటీలేనని మరువరాదు. నిజానికి ఈ ‘ఆపద్ధర్మం’ అన్న మాట గానీ, ‘ఆపద్ధర్మ ప్రభుత్వం’ ఏర్పాటు గానీ పాలకులు తమ అవసరాల కొద్దీ సృష్టించుకున్న పదాలే. సంప్రదాయంగా వచ్చిన దురలవాటు! ఇది ఒక ‘సంప్రదాయం’గా మారిన దురలవాటేగాని రాజ్యాంగం అను మతించిన శాసనం కాదని గుర్తించాల్సిన సమయం వచ్చింది. అలాగే, ఆర్డినెన్స్ ద్వారా ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రజల నెత్తిన రుద్దడాన్నీ రాజ్యాంగం అనుమతించదు. దాదాపు పదిహేనేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ రద్దుకు చంద్రబాబు చూపిన సాకు–‘శాంతి భద్రతల యంత్రాంగం వైఫల్యం, ఆర్థిక పరిస్థితుల అస్తవ్యస్త స్థితి’. నేడు తెలం గాణ సీఎం కేసీఆర్ చూపుతున్న కారణాలు దాదాపు అలాంటివే. కానీ, నిర్దిష్టమైన, సమర్ధనీయమైన నిర్ణయం మాత్రం కాదు. ఈ నిష్కారణ మైన తొందరపాటుతో అసెంబ్లీని రద్దుచేస్తే ఆరు నెలల్లోగా శాసన సభకు ఎన్నికలు జరిపించాల్సిన రాజ్యాంగ బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. అయితే, తెలంగాణ ఎన్నికలను ఏ పరిణామంతో ముడిపెట్టి 9 మాసాల ముందే శాసనసభను రద్దుచేశారు? ఎందుకు డిసెంబర్లోనే తిరిగి ఎన్నికలు జరపాలని హడావుడిగా ప్రకటించారు? మూడు ఉత్త రాది రాష్ట్రాల అసెంబ్లీల గడువు తీరేలోగా వచ్చే డిసెంబర్ లోగా ఎన్ని కలు జరిగే పరిస్థితులుండడం, వాటితోపాటే తెలంగాణ శాసనసభకు ఎన్నికలు నిర్వహిస్తే తమకు మంచిదనే అభిప్రాయం సీఎం కేసీఆర్ నిర్ణయానికి కారణం. అసెంబ్లీ రద్దు కారణంగా సాధారణ గడువుకు ముందే ముందస్తుగా ఎన్నికలు పూర్తి హడావుడిగా జరపడానికి కొన్ని సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేయాలి. వాటిలో ప్రధానమైనది ఓటర్ల జాబితా తుది సవరణ. 2003 నవంబర్‌లో అప్పటి ఏపీ అసెంబ్లీని అక స్మాత్తుగా రద్దు చేయడం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో అప్పటికి నమోదైన లక్షలాది బోగస్ ఓటర్ల పేర్లు తొలగించి తుది జాబితా ప్రకటించారు. తెలంగాణలో కూడా బోగస్ ఓటర్లు ఉన్నారనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆప ద్ధర్మ ప్రభుత్వాల అధినేతలకు సైతం అనేక ఎత్తుగడలు వేయడానికి ఆస్కారం ఉంది. శాసనసభను రద్దు చేయడం వల్ల ఏ కొత్త బిల్లు రూప కల్పనకు, ప్రవేశ పెట్టడానికి అవకాశం లేదు. కాని అనుకూలంగా వ్యవ హరించే గవర్నర్ల ద్వారా ఆర్డినెన్సులు జారీ చేయించుకుని తమ పనులు పూర్తిచేసుకోవచ్చని ఉమ్మడి శాసనసభ రద్దు తర్వాత అప్పటి ఆపద్ధర్మ సీఎం చంద్రబాబు భావించారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఓటర్లను ప్రభా వితం చేసే నిర్ణయాలు తీసుకోరాదు. రోజూవారీ వ్యవహారాలకు సంబం ధించి మాత్రమే నిర్ణయాలు చేయాలి. బడ్జెట్ తయారీ, భారీ ప్రాజె క్టులపై ప్రకటనలు, నామినేటెడ్ పదవుల పంపిణీ, ఉన్నతాధికారుల బదిలీలు వంటి నిర్ణయాలు ఆపద్ధర్మ సర్కార్లు తీసుకోవడం నిషిద్ధం. ఇలాంటి ఆంక్షలను తొలిసారిగా నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి హోదాలో ప్రవేశపెట్టారు. కానీ, రాజ్యాంగంలో ఇలాంటి నిషేధం ఏదీ లేదన్న సాకుతో నాటి ఆపద్ధర్మ ప్రధాని చరణ్‌సింగ్ దాన్ని వ్యతిరేకించారు. ‘ఆపద్ధర్మ’ నిర్ణయాలను తోసిపుచ్చిన రాష్ట్రపతులు! గతంలో వాజ్‌పేయి నాయకత్వంలోని ఆపద్ధర్మ సర్కారు, గుజరాత్, పంజాబ్ అసెంబ్లీలు రద్దయ్యాక అక్కడి ఆపద్ధర్మ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా భావించి కొందరు రాష్ట్రపతులు తిరస్కరించారు. శాసనసభలను సమావేశపరచి, చర్చించిన తర్వాత అసెంబ్లీ రద్దు ప్రకటించాలన్న కనీస ఇంగితం కూడా నేటి పాలకులకు కొరవడింది. అసలు ఆపద్ధర్మం అనే పదాన్నే రాజ్యాంగంలో చేర్చన ప్పుడు మరి ఏ చట్టం చాటు నుంచి నర్మగర్భంగా ఆచరణలోకి తెచ్చి పాలకులు ఇలా లబ్ధి పొందుతున్నారు? విధాన నిర్ణయాలకు వీల్లేకున్నా కార్గిల్ యుద్ధ సమయంలో ఆపద్ధర్మ ప్రధానిగా వాజ్‌పేయి ఈ దిశగా పావులు కదిపారు. ఆపద్ధర్మంపై ప్రసిద్ధ న్యాయ కోవిదుడు ఎంపీ పాయ్ ‘చేతలుడిగిన ప్రభుత్వం అసెంబ్లీని రద్దుచేసుకుని 6 నెలలు నిద్రాణావస్థ లోకి జారుకోవడం అనేది చట్టబద్ధత కన్నా సామాజికంగా, నైతికంగా ఎంతవరకు ఆమోద యోగ్యమన్నదే అసలు ప్రశ్న’ అని వ్యాఖ్యానిం చారు. ఆపద్ధర్మ ప్రభుత్వానికి కూడా అన్ని నియమాలు ఉల్లంఘించే నేర్పు ఉంటుంది. ఆ పనిని ఒకటో చంద్రుడు చేయగా లేనిది రెండో చంద్రుడికి మాత్రం ఎందుకు అడ్డు ఉంటుంది? అసెంబ్లీతో సంబంధం లేకుండా నిమిషాల్లో కేబినెట్ సమావేశం జరిపించి తెలంగాణ చంద్రుడు గడువుకు ముందే శాసనసభ ఎన్నికలకు తెరతీశారు. మళ్లీ ఉమ్మడి ఏపీ అసెంబ్లీ రద్దు విషయానికి వస్తే, అలిపిరిలో నక్సలైట్ల దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన చంద్రబాబు సానుభూతితో గెలవవచ్చనే అంచనాతో ఈ పనిచేశారని ప్రపంచబ్యాంక్ సైతం నాడు వ్యాఖ్యానిం చింది. అందువల్ల అనేక రంగాలలో విషమ ఫలితాలను ప్రజలు అను భవించాల్సి వచ్చింది. ఆపద్ధర్మ ప్రభుత్వాలు మధ్యంతర దశలో ఎలాంటి కొత్త పథకాలను ప్రవేశ పెట్టడానికి వీల్లేదని మరో రాజ్యాంగ చట్ట నిపుణుడు డాక్టర్ దుర్గాదాస్ బసు ‘కాన్సిస్టిట్యూషనల్ లా ఆఫ్ ఇండియా’లో పేర్కొన్నారు. ఇంతకూ మన పాలనా వ్యవస్థలు ఇంతటి ప్రజా వ్యతిరేక చర్యలు, ఎత్తుగడల ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోడా నికి ఎలా సాహసిస్తున్నాయి? ఆడింది ఆటగా, తాము పాడింది పాటగా రాజకీయ పక్షాలు యథేచ్చగా సామాన్య ప్రజా బాహుళ్యంపై ఇలా ఎలా స్వారీ చేయగల్గుతున్నాయి? ఈ ప్రశ్నకు చింతనను రేకెత్తించగల సమా ధానాన్ని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ ముసాయిదా రచనకు ముందే ఆసక్తికరంగా ఇలా ప్రకటించారు: ‘‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ‘స్వేచ్ఛ’ అనే పదంపై మితిమీరిన ఆశను రేకెత్తించింది. అది మానవుల మధ్య సమా నత్వాన్ని పాదుకొల్పడానికి ఏనాడూ సాను కూల తనూ ప్రదర్శించలేదు. సమానత్వం ప్రాధాన్యతను గుర్తించడంలో అది విఫలమయింది. కనీసం స్వేచ్ఛకు, సమానత్వానికి మధ్య ఉండవల సిన సమ తుల్యతనూ అది పాటించలేదు. దాని పర్యవసానంగానే అసమానతల పరంపర జడలు విప్పుకుంది. అన్ని రాజకీయ సమా జాలు రెండువర్గాలుగా–పాలకులు, పాలితులుగా విడిపోతూ వచ్చాయి. ఇది సంఘానికి చెరుపే. అంతటి దాకా ఈ చెడు ఆగి పోయినా కొంత మేలు. కానీ పాలకులు ఎప్పుడూ పాలక వర్గాల నుంచే వస్తున్నారు గానీ, పాలిత వర్గాలు ఎన్నడూ పాలక వర్గంగా రూపొందడం లేదు. అందుకనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎన్నడూ నిజమైన ప్రజా ప్రభుత్వంగా గానీ లేదా ప్రజల ప్రభుత్వంగా గానీ రూపొందలేక పోయింది. ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది ఎంతగా ప్రజా ప్రభుత్వ మనే డాబూ దర్పాల కవచం తొడుక్కున్నా ఆచరణలో వాస్తవానికి అది వారసత్వ కుటుంబ పాలక వర్గంగానే ఉండిపోయింది. రాజకీయ జీవి తంలో విష వలయంలో చిక్కుబడిపోయినందున పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విఫలమై పోతోంది. అందుకే తనకు ఇంత స్వేచ్ఛనూ, ఇంత సంతోషాన్నీ, ఆశాభావాన్నీ కల్పించగలదన్న ఆశతో ఉన్న సామాన్యుడి కనీస కోర్కెను కూడా ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తీర్చడంలో విఫలమవుతోంది’’ (డాక్టర్ అంబేడ్కర్ స్పీక్స్: వాల్యూం 1). అందాకా ఏదో రూపంలో సంపన్నవర్గ పాలకుల నాలుకలు సాగుతూనే ఉంటాయి. అందాకా దగాపడిన ప్రజలంతా నిత్య సమరంలోనే ఉంటారు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@ahoo.co.in -
మళ్లీ నేనే సీఎం
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని, అందులో ఎలాంటి సందేహం లేదని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు. తాను ఏం చేసినా తెలంగాణ శ్రేయస్సు కోసమే చేస్తానని, చెడు కోరి ఏదీ చేయనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఎవరి పీడ విరగడ కావాల్నో తేలుస్తారని, కాంగ్రెస్సే రాష్ట్రానికి పట్టిన పెద్ద పీడ అని దుయ్యబట్టారు. అసెంబ్లీ రద్దు, గవర్నర్‌తో భేటీ అనంతరం గురువారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ఆయన మాటల్లోనే... ‘ఎన్నికల నిర్వహణలో కూడా ఊహాగానాలు వద్దు. నాకు ఎలాంటి సందేహం లేదు. నాకు తెలిసినంత వరకు అక్టోబర్ మొదటివారంలో నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్లోనే ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ మొదటివారంలో ఫలితాలు వస్తాయి. ఇది నాకున్న పరిజ్ఞానం. కచ్చితంగా నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికలు వస్తాయి. అన్ని చోట్లా ఒకే దశలో జరుగుతాయి. మీకు కూడా నేను ఏమీ తెలియనీయలేదు. (జర్నలిస్టులనుద్దేశించి). మీరేమీ అనుకోవద్దు. నేనే స్వయంగా కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో మాట్లాడినా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ కూడా మాట్లాడారు. ఈ విషయంలో ఊహాగానాలు బంద్ చేయండి. 14 స్థానాల్లో అభ్యర్థులను వారం పది రోజు ల్లో ప్రకటించాల్సి ఉంది. మేనిఫెస్టోలో పెట్టినవి 99.9 శాతం అమలు చేశాం. మేనిఫెస్టోలో చెప్పని 76 కార్యక్రమాలు చేశాం. కల్యాణలక్ష్మి పెట్టమని మమ్మల్నెవరూ అడగలేదు. ఎవరూ ధర్నాలు చేయలేదు. పిటిషన్లు ఇవ్వలేదు. బీడీ కార్మికులకు పింఛన్ ఇవ్వమని ఎవరూ అడగలేదు. పరిస్థితులను బట్టి అన్నీ చేసినం. కల్యాణలక్ష్మి విషయంలో ఆర్థిక పరిస్థితిని బట్టి తొలుత రూ.51 వేలు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీలకే అన్నాం. తర్వాత బీసీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకూ ఇచ్చాం. మేం ఏది చేసినా రైతు కేంద్రీకృతంగా చేశాం. రైతుబంధు, రైతు బీమా, భూ రికార్డుల ప్రక్షాళన, బీసీ కులాలకు ఆత్మగౌరవం కోసం హైదరాబాద్‌లో కమ్యూనిటీ హాళ్లు ఇచ్చాం. నిధులు మంజూరు చేశాం. ఇప్పుడు తెలంగాణలో పేకాట క్లబ్‌లు లేవు. గుడుంబా అడ్డాలు లేవు. ఎరువుల కోసం ఎదురుచూపుల్లేవు. లాఠీచార్జీల్లేవు. 4 సంవత్సరాల 5 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క మతఘర్షణలు లేవు. గతంలో ఊ అంటే కర్ఫ్యూ విధించేవారు. వలసలు ఆగిపోయాయి. అక్కడి ప్రజలంతా హైదరాబాద్‌లో ఉన్న రేషన్ కార్డులను వాపస్ చేస్తున్నరు. ఇవన్నీ విస్మరించి అడ్డగోలు కథలు చేస్తున్నరు. వాళ్ల చరిత్ర అందరికీ తెలుసు ఏ పార్టీ మా మీద ఆరోపణలు చేస్తుందో వాళ్ల చరిత్ర అందరికీ తెలుసు. కేసీఆర్ పీడ విరగడ అవుతుందని దుర్మార్గంగా మాట్లాడుతున్నరు. విరగడయ్యేది కేసీఆర్ పీడనా.. కాంగ్రెస్ పీడనా రేపు చెప్తం. నేను ఎప్పుడో చెప్పిన. తెలంగాణ కోసం పని చేస్తామంటే హైదరాబాద్‌లో ఇల్లు కిరాయికి ఇవ్వద్దని భయపెట్టిండ్రు. తెలంగాణకు కాంగ్రెస్సే పెద్ద శత్రువు. పెద్ద పీడ.. పెద్ద విలన్. నాడు స్వరాష్ట్రంగా ఉన్న తెలంగాణను లేకుండా చేసింది జవహర్‌లాల్‌నెహ్రూ. నాడు 11 మంది ఎంపీలు గెలిచి రాష్ట్రం ఇవ్వమన్నా ఇవ్వకుండా ప్రజాతీర్పును కాలరాసింది ఇందిరాగాంధీ. ఇప్పుడు కూడా కాంగ్రెస్ మనకు భిక్ష పెట్టలే. మేమే కాంగ్రెస్‌కు 2004లో భిక్ష పెట్టినం. పదేండ్ల యూపీఏ పాలన మా భిక్షే. చివరకు సచ్చిపోతం.. దేశంలో ఆగమైపోతమనే స్థితిలో తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తయని ఆగమాగం మీద, ఆగమేఘాల మీద, వాళ్ల స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ఇచ్చిండ్రు. నేను మళ్లీ చెపుతున్న. నాటి నుంచి నేటి వరకు తెలంగాణకు పీడ కాంగ్రెస్సే. మా దగ్గర్లోనే ఎవరూ లేరు: ప్రతిపక్షాలు మా దగ్గర్లో లేవు. 82 స్థానాల్లో 60శాతం కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయని సర్వేలు చెపుతున్నాయి. 17–18 సార్లు సర్వే చేపించినం. 100 స్థానాల్లో 50 శాతంపైన ఉన్నం. మేం 100 గెలుస్తం. మిగిలిన వాటిలో 7 ఎవరికి పోతయో అందరికీ తెలుసు. అన్ని పార్టీలు కలిసి వచ్చినా 50 శాతం కంటే ఎక్కువ రావు వాళ్లకు. మాకేం కాదు కదా. మేం 100సీట్లు గెలిచి తీరుతాం. ఓవైసీ స్వచ్ఛందంగా మద్దతిచ్చారు ఎంఐఎం మాకు స్నేహపూర్వక పార్టీ. మేం కలిసి పనిచేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీ ఉండొచ్చు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అస్థిరపాలు చేయాలని చూస్తుంటే ఆ సమాచారం తెలిసిన అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి చెప్పారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇలా ఎందుకు చేస్తున్నారు.. మేం స్వచ్ఛందంగా మీకు మద్దతిస్తామని చెప్పారు. అప్పటినుంచి మేం కలిసే పనిచేస్తున్నాం. అందులో తప్పేముంది. మేనిఫెస్టో కమిటీ భవిష్యత్తులో ప్రజలకు ఏం చేస్తామనేది రానున్న ఎన్నికల్లో చెప్పడం కోసం 15 మందితో కేకే అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ వేస్తున్నాం. నేను అసెంబ్లీ రద్దు లాంటి నిర్ణయాలు ప్రకటించకూడదు. అది పూర్తిగా కేబినెట్కున్న హక్కు. వరాలు ప్రకటించకూడదు. సీఎం హోదాలో ప్రకటిస్తే వాటికి జీవోలిచ్చి అమలు చేయాలె. ఇప్పటివరకు ఇచ్చిన హామీలకు కేబినెట్ నిర్ణయాలు అయిపోయాయి. జీవోలు కూడా వచ్చాయి. కొద్దిరోజుల్లో మా మేనిఫెస్టో కూడా వస్తుంది. రాబోయే ఐదేళ్లపై మాకు పూర్తి అవగాహన ఉంది. రాష్ట్ర ఆదాయం, రాబడుల మీద అవగాహన ఉంది. మాది ఒంటరి పోరే. మజ్లిస్ ఫ్రెండ్లీ పార్టీనే. భవిష్యత్తులో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలన్నీ చెప్తం. ఏదైనా ఒకటే.. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలైనా, బ్యాలెట్లైనా ఒకటే. యూపీఏ–2 రాగానే మోదీ వాళ్లు ఆరోపణలు చేసిండ్రు.. మోదీ రాగానే కాంగ్రెస్ వాళ్లు చేస్తున్నరు. ఈవీఎంలలో లంగతనం చేసే పని ఏదైనా ఉంటే పవర్లో ఉన్నోడు పోనే పోడు కదా.. మరి మోదీ ఎట్ల గెలిచిండు. వీవీప్యాట్లు వచ్చిన తర్వాత ఈవీఎంలపై సందేహం అవసరం లేదు. అయినా బ్యాలెట్ పెట్టినా నష్టం లేదు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అనేది నిర్ణయం కాలేదు కాబట్టి నేను నా దారిలో పోతున్నా. నిర్ణయం అయి ఉంటే అదే చేసే వాడినేమో. మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీఎం నేనే అయితా... సందేహం ఏమైనా ఉందా? ఫెడరల్ ఫ్రంట్ విషయంలో కూడా నేను ఒక మాట చెపుతున్నా. మాది చక్రాలు తిప్పే ఫ్రంట్ కాదు. ప్రజల కోసం పెట్టే ఫ్రంట్. నేను ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంటేనే నిలబడుతుంది. మీరే చూస్తరు. మేమెట్ట కలుస్తం బీజేపీతో మేమెట్ట కలుస్తం.. మా గోత్రాలే కలవవు. సిద్ధాంత పరంగా టీఆర్ఎస్ 100 శాతం సెక్యులర్. అట్టనే ఉంటది. లక్ష్మణ్.. గరీబుగాడు అట్లనే మాట్లాడతడు. వాళ్ల కథేంటో మీకు తెలియదా? నాకు కూడా పీఎం కావాలని ఉంది. అయితనా.. కలలు మస్తుంటయ్.. వాళ్లు ఉన్న సీట్లు నిలబెట్టుకుంటే గొప్పే. పాలన సౌలభ్యం కోసం రాష్ట్రాల చేతిలో ఉండాల్సిన ఎన్నో రకాల అంశాలు, అధికారులు కేంద్రం గుప్పిట్లో ఉన్నాయి. నవ్వుకుంటరనే సోయి లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు చూస్తుంటే కేసీఆర్ 100 యూనిట్లంటే వాళ్లు 200 యూనిట్లంటున్నరు. పింఛన్ నేను వెయ్యి అంటే వాళ్లు రెండు వేలు అంటున్నరు. ఎంత సిల్లీగా, బాధ్యతారాహిత్యంగా హామీలు ఇస్తున్నరంటే ప్రజలు నవ్వుతరనే సోయ లేకుండా ఇస్తున్నరు. రూ.వెయ్యి పింఛన్ ఇవ్వాలని, రైతులకు పెట్టుబడి ఇచ్చి బీమా కల్పించాలని మీ జీవితంలో అనుకోలే. కేసీఆర్ చెపితేగానీ సోయ రాలే. ఇప్పుడైనా బుద్ధి వచ్చి రూ.2 వేలు ఇస్తమని కాంగ్రెస్ దెయ్యాల నోటి నుంచి వచ్చింది. వాళ్లు అలా ప్రకటించే స్థితికి తెచ్చింది కేసీఆరే. అది టీఆర్ఎస్ విజయమే. నేను రూ.2200 పింఛన్ ఇస్తనంటే ఓట్లేస్తరా? చిన్నప్పుడు చాక్లెట్ల పంచాయతీలాగా చెప్తున్నరు. ఇది ఆరోగ్యకర పోటీనా. మేం సంపద పెరుగుతున్న కొద్దీ కార్యక్రమాలు పెంచుకుంటూ పోతున్నం. మా లక్ష్యం ఎన్నికల తాయిలాలు కాదు. సంపద పెంచడం... పేద ప్రజలకు పంచడమే. పాలమూరులోనే 9 లక్షల ఎకరాలకు నీరు నెట్టెంపాడు మేమే పూర్తి చేసినం. కల్వకుర్తి, బీమా మేమే చేసినం. ఒక్క పాలమూరులోనే 9 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినం. కరెంటు కోతలు నివారించినం. అప్రకటిత కోతల్లేవు. నాణ్యమైన కరెంటు ఇస్తున్నం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం తెలంగాణే. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఫలితం సిరిసిల్ల గోడల మీద రైతుల ఆత్మహత్యలు వద్దనే రాతలు మాత్రమే. 2014కు ముందు పరిశ్రమలు మూసివేశారు. భయంకరంగా కలప స్మగ్లింగ్ జరిగేది. పూటకో ఎన్కౌంటర్.. మతకల్లోలాలు, మారణహోమం జరిగేది. ఈ దరిద్రానికి నెలవు, రిజర్వ్‌బ్యాంక్ కాంగ్రెస్ పార్టీనే. వాళ్ల పీడ పోవాలె. చెరపట్టిన తెలంగాణను విడిపించిన భూమిపుత్రుడు కేసీఆర్. రాష్ట్రం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎవరి పీడ పోగొట్టాల్నో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఉంటే ఉంటడు.. పోతే పోతడు డీఎస్ విషయంలో పార్టీ పరంగా చాలా గౌరవం ఇచ్చినం. వస్తూనే సలహాదారు పదవి ఇచ్చినం. ఆ తర్వాత రాజ్యసభ ఖాళీ అయితే పెద్దమనిషి అడిగిండు కదా అని గౌరవించినం. కొడుకు వేరే పార్టీలోకి పోయి డిస్ట్రబ్ చేస్తుండని ఫిర్యాదు చేసిండ్రు. అయినా మేమేమీ నిర్ణయం తీసుకోలేదు. ఉంటే ఉంటడు.. పోతే పోతడు.. మేమైనా ఇంకా ఏదీ నిర్ణయించలేదు. త్యాగాలు చేసింది మేమే ప్రజలకు న్యాయం తెలుసు. టీఆర్ఎస్ ఎన్నో త్యాగాలు చేసింది. ఇప్పుడు కూడా నాలుగైదు నెలల అధికారాన్ని తెలంగాణ ప్రజల కోసం త్యాగం చేశాం. అభివృద్ధి పథం ఆగిపోవద్దన్నదే మా ఉద్దేశం. చిల్లర మాటలు మాట్లాడొద్దు. నోరు ఫినాయిల్‌తో కడుక్కునే ఆరోపణలు బంద్ కావాలే. నేను ఇప్పుడు అంటున్నా.. కమాన్.. బిగ్ బ్యాటిల్‌కి వెల్కమ్. ఐయామ్ రెడీ.. తెలంగాణ ప్రజాక్షేత్రంలోకి పోదాం. అక్కడ తేల్చుకుందాం. రేపటి నుంచే మా ఎన్నికల కార్యాచరణ ప్రారంభమవుతుంది. ముందుగా అనుకున్నట్టు 50 రోజుల్లో 100 సభలు నిర్వహిస్తం. నేనే పోయి ప్రజలకు చెపుతా. డిపాజిట్లు రావు ఇంకా టీడీపీ ఉందా.. పొత్తు పెట్టుకోవడానికి. మా సర్వేల్లో ఎక్కడా 0.1, 0.2 శాతం మించి రాలేదు. వాళ్లిద్దరూ పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే చంద్రబాబు పొద్దున లేస్తే తెలంగాణ మీద అభాండాలు వేస్తడు. కృష్ణానది నీళ్లపై ఉత్తరాలు రాస్తడు. గోదావరి నది మీద కట్టే ప్రాజెక్టులపై కేసులేస్తడు. మళ్లీ తెలంగాణలో ఆంధ్ర పార్టీలకు గులాం కావాల్నా.. ఆంధ్ర పార్టీలను తెచ్చి పెట్టుకుంటరా? ఇదే గులాంగిరీ అంటే... అలా కావొద్దు. లేచినోడో.. లేవనోడో ఇక్కడి వ్యక్తే శాసనకర్త కావాలె. ముందస్తు ఎన్నికలకు వెళితే ఎన్టీఆరే గెలవలేదని, ఈయన గెలుస్తడా.. అంటున్నరు. కేసీఆర్ సాధిస్తడు. చెన్నారెడ్డి కంటే మగోడని నిరూపించుకోలేదా? వాటీజ్ దిస్ నాన్సెన్స్ మాపై ప్రతిపక్షాలు చేసిన ఒక్క ఆరోపణ అయినా నిరూపిస్తారా..? వాటీజ్ దిస్ నాన్సెన్స్? దిసీజ్ అన్లిమిటెడ్ ఇడీయసీ. ప్రగతి నివేదన అట్టర్‌ప్లాఫ్ అన్నరు. సభ కాదు.. మీ మైండ్ అట్టర్‌ప్లాఫ్. యూ ఆర్ బ్యాంక్రప్ట్.. అందుకే ప్రజల దగ్గరకు వెళ్తున్నం. మేమెవరికీ భయపడడం లేదు. కాంగ్రెస్ భయపడుతుందేమో? రాహుల్ గాంధీ ఓ ఫ్యాక్టరే కాదు. ఈ దేశంలోనే ఆయన పెద్ద బఫూన్.. మన దగ్గరే ఎక్కువ జీతాలు దేశంలో బాగా జీతాలు అందుకుంటున్న ఉద్యోగులు రాష్ట్రంలో ఉన్నారు. గత ప్రభుత్వాలు చిన్న తరహా ఉద్యోగులతో బానిస చాకిరి చేయించుకున్నాయి. ఆశ వర్కర్లు, హోంగార్డులు, అంగన్వాడీలు అనేక మంది చిన్న తరహా ఉద్యోగుల వేతనాలు భారీగా పెంచాం. ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం రిస్క్ అలవెన్స్‌ను అదనంగా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణే. చిన్నతరహా ఉద్యోగుల వేతనాలు ఇంకా పెంచాలని ఉంది. -
రాజ్యాంగంలో లేని ‘ఆపద్ధర్మం’!
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎన్నుకున్న లోక్‌సభ లేదా శాసనసభ కాల పరిమితి ముగియక ముందే రద్దు అయితే తిరిగి ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం కొలువు తీరేంత వరకు అప్పటిదాకా ఉన్న ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి ఆపద్ధర్మంగా కొనసాగుతారు. పాలనాపరంగా ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సభ లు రద్దయ్యే సమయానికి ప్రధాని లేదా సీఎంగా కొనసాగిన వ్యక్తిని అదే పదవిలో కొనసాగాలని రాష్ట్రపతి లేదా గవర్నర్ కోరుతారు. ఇలా వారి కోరిక మేరకు సీఎం పదవిలో కొనసాగిన వ్యక్తి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అవుతారు. అప్పటివరకు పని చేసిన మంత్రు లు కూడా అవే బాధ్యతలను నిర్వర్తిస్తారు. అలాగే శాసనసభ లేని సమయంలో ప్రధాని లేదా ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం అంటారు. అయితే ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గురించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. తెలంగాణ శాసనసభ రద్దయిన నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విధులు, అధికారాలపై న్యాయనిపుణులను ప్రశ్నించినప్పుడు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆపద్ధర్మ ప్రభుత్వం అన్నది రాజ్యాంగంలో లేకపోయినా మన దేశంలో ఓ సంప్రదాయంగా వస్తోందని వారు వివరించారు. విధాన నిర్ణయాలకు తావు లేదు అసాధారణ, అత్యవసర పరిస్థితుల్లో తప్ప సాధారణంగా కీలక విధానపరమైన నిర్ణయాలేవీ కూడా ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదు. ఎన్ని కలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరాదు. రోజువారీ వ్యవహారాలు, కార్యకలాపాలకు సంబంధించిన నిర్ణయాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ తయారీ, ఆర్డినెన్స్‌ల జారీ, పన్ను ల పెంపు, తగ్గింపు, భారీ ప్రాజెక్టుల ప్రకటన, నామినేటెడ్ పదవుల భర్తీ, కీలక పోస్టుల్లోని ఉన్నతాధికారుల బదిలీలు వంటి విషయాల్లో నిర్ణయాలు తీసు కోవడానికి వీల్లేదు. వీటికి సంబంధించిన నిర్ణయాల ను ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వ మే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆపద్ధర్మ ప్రభు త్వం ఏదైనా కీలక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే.. ఆ నిర్ణయం సబబా? కాదా? అన్న విషయంపై న్యాయ సమీక్ష చేసేందుకు అవకాశం ఉంది. ఆపద్ధర్మ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 1975లో దేశంలో తొలిసారి.. మన దేశం విషయానికొస్తే డాక్టర్ జయప్రకాశ్ నారాయణ 1974లో ఎన్నికల సంస్కరణలపై జస్టిస్ వీఎం తర్కుండే నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 1975లో ఇచ్చిన తన నివేదికలో తొలిసారి ఆపద్ధర్మ ప్రభుత్వం గుర్తించి ప్రస్తావించింది. ఎన్నిక ల సమయంలో ఉండే ప్రభుత్వం కేవలం ఆపద్ధర్మ ప్రభుత్వంగానే బాధ్యతలు నిర్వర్తించేలా చూడాల్సిన అవసరం ఉందని ఆ కమిటీ సిఫారసు చేసింది. తర్వాత 1989లో అప్పటి న్యాయశాఖ మంత్రి దినేశ్ గోస్వామి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. ఆపద్ధర్మ ప్రభుత్వం విషయంలో 1975లో జస్టిస్ తుర్కుండే కమిటీ చేసిన సిఫారసును వ్యతిరేకించింది. నీలం సంజీవరెడ్డి తొలి అధికారిక ప్రకటన 1979లో లోక్‌సభ రద్దయినప్పుడు అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆపద్ధర్మ ప్రభుత్వం విషయంలో తొలిసారి అధికారిక ప్రకటన చేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వం కొత్త విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని ఆ ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే అప్పటి ప్రధాని చరణ్‌సింగ్ దీన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని, ఈ విషయంలో రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదని స్పష్టం చేశారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదా, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఆర్థిక సాయం వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1991లో నాటి ప్రధాని చంద్రశేఖర్ కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నారు. న్యాయవ్యవస్థలో పలు బదిలీలను చేపట్టారు. కొందరు అధికారులను కూడా బదిలీ చేశారు. వీటిపై ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పినా పట్టించుకోలేదు. అయితే పార్లమెంట్ రద్దు చివరి రోజు ఎంపీలకు పెన్షన్ జారీ విషయంలో తీసుకొచ్చిన బిల్లు వివాదాస్పదమైంది. నాటి రాష్ట్రపతి వెంకటరామన్ ఆ బిల్లులకు ఆమోదం తెలపలేదు. 1997లో ఐకే గుజ్రాల్ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం కూడా వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంది. ఏకంగా గవర్నర్ల నియామకాలు చేపట్టింది. పంజాబ్ రాష్ట్రంలో రూ.కోట్ల రుణాలను మాఫీ చేసింది. తర్వాత వాజ్‌పేయి నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలే తీసుకుంది. రాష్ట్రపతి అభిప్రాయాలతో విభేదించేందుకు సైతం వాజ్‌పేయి ప్రభుత్వం వెనుకాడలేదు. ఆశ్రిత పక్షపాతానికి, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు విధానపరమైన నిర్ణయాలను ఉపయోగించరాదన్న ఉద్దేశంతోనే ఆపద్ధర్మ ప్రభుత్వానికి కీలక నిర్ణయాల విషయంలో ఆంక్షలు విధించారు. ఆపద్ధర్మ సీఎంగా 450 ఎకరాలు కట్టబెట్టిన బాబు.. 2004లో అప్పటి ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన సొంత మనిషి బిల్లీరావుకు చెందిన ఐఎంజీ భరత అకాడమీస్‌కు అత్యంత ఖరీదైన గచ్చిబౌలి ప్రాంతంలోని 450 ఎకరాలను ఎకరా రూ.50 వేలకే కట్టబెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆపద్ధర్మ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకోరాదని తెలిసినా, మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని తెలుసుకున్న చంద్రబాబు ఆగమేఘాలపై వేల కోట్ల విలువైన 450 ఎకరాల భూమిని కేవలం రూ.2 కోట్లకే ఐఎంజీకి కేటాయించి శంకుస్థాపన కూడా పూర్తి చేశారు. ఐఎంజీ భరత కార్యాలయానికి జూబ్లీహిల్స్‌లో ఐదు ఎకరాలను ఎకరా రూ.50 వేలకే కేటాయించారు. ఈ కేటాయింపులను అప్పట్లో భారీ కుంభకోణంగా అభివర్ణించారు. ఈ భూములకు సంబంధించిన వివా దం ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. చంద్రబాబు హయాంలో జరిగిన భారీ కుంభకోణాల్లో ఐఎంజీకి చేసిన భూముల కేటాయింపు వ్యవహారం మొదటిస్థానంలో ఉంటుంది. విన్స్టన్ చర్చిల్తో ప్రారంభం రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ఇంగ్లండ్ ప్రధాన మంత్రిగా విన్స్టన్ చర్చిల్ కొనసాగుతున్నప్పుడు ‘ఆపద్ధర్మ ప్రభుత్వం’అన్న పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన చర్చిల్ తన పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలన్న ఉద్దేశంతో ఇంగ్లండ్ రాజుకు తన రాజీనామాను సమర్పించారు. తర్వాత ఇంగ్లండ్ రాజు చర్చిల్‌ను పిలిచి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కార్యనిర్వహణ బాధ్యతలు చూసుకోవాలని చెప్పి దానికి ‘కేర్‌టేకర్ గవర్నమెంట్ (ఆపద్ధర్మ ప్రభుత్వం)’గా నామకరణం చేశారు. ఈ ఆపద్ధర్మ ప్రభుత్వంలో విధానపరమైన నిర్ణయాలేవీ తీసుకోరాదని నిర్ణయించారు. నాడు పోట్స్డామ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న చర్చిల్ తనతోపాటు ప్రతిపక్ష పార్టీ నేతను కూడా తీసుకెళ్లి.. ఆపద్ధర్మ ప్రభుత్వం నడవాల్సిన తీరు ఇదేనంటూ ప్రపంచానికి చాటి చెప్పారు. అప్పుట్లో ఆయనపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. -
ఎందుకీ ముందస్తు..?
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : రాష్ట్రంలో ఎందుకీ ముందస్తు ఎన్నికలు? గత కొన్ని రోజులుగా తెలంగాణలో ప్రతి ఒక్కరినీ తొలుస్తున్న ప్రశ్న. గురువారం అసెంబ్లీ రద్దు ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ఎక్కడ, ఏ నలుగురు కలిసినా దీనిపైనే చర్చోపచర్చలు. గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వారికి సానుకూల ఫలితాలు రాలేదని తెలిసినా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ రద్దువైపే మొగ్గు చూపారంటే దాని వెనుక బలమైన కారణాలు ఉండి ఉండొచ్చంటూ విశ్లేషణలు. టీఆర్ఎస్ను కలసికట్టుగా ఎదుర్కోవాలని భావిస్తున్న ప్రతిపక్షాలు అందుకు సిద్ధమ య్యేలోగా దెబ్బకొట్టేందుకే సీఎం ‘ముందస్తు’బరిలోకి దూకారని కొందరు భావిస్తుండగా వివిధ పథకాలపై వ్యక్తమవుతున్న ప్రజా సంతృప్తిని వెంటనే ఓట్లుగా మలుచుకోవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని మరికొందరు అంచనా వేస్తున్నారు. మరోవైపు గత లోక్‌సభ ఎన్ని కల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉన్న రాష్ట్రాల్లో పుంజుకుంటున్నట్లు వార్తలు వెలువడటం, పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక రాహుల్ గాంధీపట్ల ప్రజాదరణ పెరగడం వంటి పరిణామాలు కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ఓ కారణమై ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రచారాస్త్రాలుగా పథకాలు ... ఉద్యమ పార్టీగా తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్... ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీల అమల్లోనూ విజయవంతమైందనే వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. కొన్ని హామీలు అమలు కాలేదనే విమర్శలున్నా 24 గంటల నిరంతర విద్యుత్ టీఆర్ఎస్కు ఉన్న సానుకూల అంశాల్లో అత్యంత ఎక్కువ ప్రభావం చూపుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అలాగే రైతు బంధు పథకం ద్వారా 34 లక్షల మంది రైతాంగానికి ఎకరాకు రూ. 4 వేల చొప్పున పెట్టుబడి రాయితీ ప్రకటించి అమలు చేయడం, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున బీమా సదుపాయం కల్పించడం వంటి అంశాలు పెద్ద ప్రచారాస్త్రాలుగా ఉపయోగపడుతాయని టీఆర్ఎస్ భావిస్తోంది. డబుల్ బెడ్రూం, మిషన్ భగీరథ వంటి పథకాలు ఇంకా పూర్తి కాకున్నా మళ్లీ అధికారంలోకొస్తే వాటిని త్వరగా పూర్తి చేస్తామని ప్రజలను ఒప్పించగలమన్న ధీమాతో కేసీఆర్ ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొంటున్నారు. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకూడదనే... ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిస్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని భావించిన టీఆర్ఎస్... ఆయా పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకునేందుకు సమయం ఇవ్వకూడదనే ముందస్తుకు మొగ్గుచూపిందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేల్లో అనుకూల ఫలితాలు వచ్చినా ఆయా సర్వేల్లో పార్టీ గెలిచే సీట్ల సంఖ్య కాస్త తగ్గుతూ రావడం సీఎంకు ఆందోళన కలిగించిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సర్వే సంస్థ నిర్వాహకుడు చెప్పారు. మరిన్ని సీట్లు తగ్గేదాకా ఆగడంకంటే ప్రజాదరణ ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్లడం శ్రేయస్కరమని కేసీఆర్ భావించి ఉంటారని ఆ నిర్వాహకుడు అభిప్రాయపడ్డారు. కోదండరాం సహా కొందరు తెలంగాణ ఉద్యమకారుల విమర్శలూ సీఎం ‘ముందస్తు’కు కారణమని తెలుస్తోంది. అలాగే ముందస్తు ఎన్నికల్లో విజయం సాధిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించుకోవచ్చని కేసీఆర్ అంచనా వేస్తున్నారని ఓ నేత పేర్కొన్నారు. -
ప్రతిపక్షానికి సవాల్!
1994లో అప్పటి టీడీపీ అధ్యక్షుడు ఎన్.టి.రామారావు ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రయోగాత్మకంగా 33 శాతం నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇప్పుడు టీఆర్ఎస్ 91 శాతం నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి రికార్డు సృష్టించింది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి దేశ రాజకీయాల్లో అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వెలువడుతుందో తెలియకుండానే ఒకేసారి 105 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది. 1994లో అప్పటి టీడీపీ అధ్యక్షుడు ఎన్.టి.రామారావు ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రయోగాత్మకంగా 33 శాతం నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇప్పుడు టీఆర్ఎస్ 91 శాతం నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి రికార్డు సృష్టించింది. గురువారం ప్రకటించిన జాబితాలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ఆయన మంత్రివర్గ సహచరులు, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ నుంచి ఫిరాయించి టీఆర్ఎస్లో చేరిన అందరికీ టిఆర్ఎస్ టికెట్లు కేటాయించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి ప్రాతి నిధ్యం వహిస్తున్న హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులను ఎంపిక చేయలేదు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ 2014లో హుజూర్నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేఎల్పీనేత కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్‌పేట నియోజకవర్గానికీ అభ్యర్థిని ప్రకటించలేదు. సాహసోపేత నిర్ణయమే... ప్రస్తుత శాసనసభ్యుల్లో (ఇప్పటివరకు ప్రకటించిన జాబితాను అనుసరించి) ఇద్దరికి మినహా అందరికీ టికెట్లు కేటాయించి టీఆర్ఎస్ నాయకత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏదైనా ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిపై కొంత వ్యతిరేకత, మరికొందరిపై తీవ్ర వ్యతిరేకత ఉంటుందని, వాటిని అధిగమించడానికి టీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కొంత ప్రతికూలతకు దారి తీసే అవకాశం లేకపోలేదని వారంటున్నారు. వివాదాస్పదులుగా ముద్రపడిన కొందరు ఎమ్మెల్యేలకూ టికెట్లు కేటాయించడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. మహిళా కలెక్టర్పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు కేసు ఎదుర్కొంటున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, భూవివాదాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గత నాలుగేళ్లలో నియోజకవర్గాలకు చుట్టపు చూపుగా వెళ్లి వస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మంది ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ నాయకత్వం టికెట్లు ఖరారు చేసింది. కాగా, జాబితాలో నలుగురు మహిళలకు చోటు దక్కింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ పెద్దపీట... గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన 25 మంది ఎమ్మెల్యేలకూ కేసీఆర్ టికెట్లు కేటాయించారు. అదే సమయంలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వారెవరికీ ఈసారి టికెట్లు ఇవ్వలేదు. అయితే ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారారన్న అపవాదు మూటగట్టుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని, దాన్ని కూడా టీఆర్ఎస్ నాయకత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించే అంశమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నాయకత్వాన్ని నమ్మి పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు నిరాకరిస్తే పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ అధిష్టానం ఈ పని చేసి ఉంటుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు,. ఏదేమైనా టీఆర్ఎస్ నాయకత్వం టికెట్లు ఖరారు చేయడంలో మితిమీరిన ఆత్మవిశ్వాసం కనబరిచిందనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. బాల్క సుమన్‌కే అవకాశం... రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని భావించిన అర డజను మంది ఎంపీలకు నిరాశే ఎదురైంది. కేవలం పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు మాత్రమే అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం లభించింది. సుమన్ చెన్నూరు నుంచి పోటీ చేయనున్నారు. కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత జగిత్యాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆశపడ్డ రాష్ట్ర రైతు సమితి చైర్మన్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి కూడా అవకాశం దక్కలేదు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ లేదా మునుగోడు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు దక్కాయి. చోటు దక్కని దానం... టీఆర్ఎస్లో ఇటీవలే అట్టహాసంగా చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్‌కు అభ్యర్థుల జాబితాలో చోటు దక్కలేదు. అయితే ఆయన టికెట్ ఆశిస్తున్న ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని మాత్రం కేసీఆర్ పెండింగ్‌లో పెట్టారు. అక్కడ నుంచి పోటీ చేయాలని ఆ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి, మాజీ మంత్రి పి. జనార్దన్‌రెడ్డి కుమార్తె విజయ సైతం ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ నాగేందర్‌కు టికెట్ ప్రకటిస్తే విజయ కాంగ్రెస్‌లో చేరే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వం ఆమెకు టికెట్ ఆఫర్ చేసినట్లు తెలిసింది. వారిద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకోకపోవడం వల్లే సీటును కేసీఆర్ పెండింగ్‌లో పెట్టారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. సామాజిక వర్గాల వారీగా టికెట్లు ఇలా... 34 - రెడ్డి 21 - బీసీ 16 - ఎస్సీ 12 - ఎస్టీ 11 - వెలమ 06 - కమ్మ 02 - ముస్లిం 01 - బ్రాహ్మణ 01 - వైశ్య 01- సిక్కు లక్కీ 6 సీఎం కేసీఆర్ అదృష్ట సంఖ్య ఆరు అని అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే అసెంబ్లీ రద్దుకు ఆయన 6వ తేదీనే ఎంచుకోగా సీఎం ప్రకటించిన 105 మంది ఎన్నికల అభ్యర్థుల జాబితాలోని సంఖ్యలను కూడితే వచ్చేదీ ఆరే కావడం విశేషం. ఈ ఎనిమిదింటా.. సస్పెన్స్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించని ఆ ఎనిమిది నియోజకవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ప్రకటించిన జాబితాలో 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ (ముషీరాబాద్), బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి (అంబర్‌పేట), రాంచంద్రారెడ్డి (ఖైరతాబాద్), రాజాసింగ్ (గోషామహల్) స్థానాలతోపాటు ఎంఐఎం కీలకంగా భావించే చార్మినార్, మలక్‌పేట స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు. ఇది రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. ఎంఐఎం తమకు ఫ్రెండ్లీ పార్టీ అని కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ జాబితాలో ఎనిమిది స్థానాలు పెండింగ్ మరోవైపు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప్పల్ మినహా మరెక్కడా అభ్యర్థులను తేల్చకపోవడంతో బీజేపీ–టీఆర్ఎస్ల మధ్య సఖ్యత ఉందంటూ గుసగుసలు మొదల య్యాయి. టీఆర్ఎస్ తొలి జాబితాలోనే అంబర్‌పేట నుంచి సుధాకర్‌రెడ్డి, కృష్ణ యాదవ్, కాలేరు వెంకటేష్‌లలో ఒకరు, ముషీరాబాద్‌లో ముఠా గోపాల్ లేదా కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డిలలో ఒకరు, ఖైరతాబాద్‌లో మన్నె గోవర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డిలలో ఒకరు, గోషామహల్లో దానం నాగేందర్ పేర్లను ప్రకటిస్తారని భావించారు. ఎంఐఎం సిట్టింగ్ స్థానమైన చార్మినార్‌లో గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమిపాలైన ఇనాయత్ అలీని అక్కడి నుంచి బహదూర్‌పురాకు మార్చారు. చార్మినార్, మలక్పేటలకూ అభ్యర్థులను ప్రకటించకపోవడం వ్యూహంలోనే భాగంగానే భావిస్తున్నారు. మల్కాజిగిరి.. మళ్లీ మొదటికి..: మల్కాజిగిరి స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు, కార్పొరేటర్ విజయశాంతిని ఎంపిక చేస్తూ బుధవారమే ఆమెకు సమాచారం ఇచ్చారు. గురువారం ఉదయం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఎంపీ మల్లారెడ్డి ఆమెను కాబోయే ఎమ్మెల్యేగానే పరిచయం చేశారు. అయితే ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు తన వర్గానికి చెందిన ఐదుగురు కార్పొరేటర్లతో రాజీనామా అస్త్రాన్ని సంధించి ఆమె అభ్యర్థిత్వాన్ని నిలుపుదల చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. -
9 సమావేశాలు.. 126 రోజులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ తొలి శాసనసభకు గురువారం చివరి రోజైంది. ఐదేళ్లు నిండకుండానే సభ రద్దయింది. శాసనసభ ఇప్పటివరకు 9 విడతలుగా సమావేశమైంది. 126 రోజులపాటు సమావేశాలు జరిగాయి. 2014 జూన్ 2న ప్రభుత్వం ఏర్పాటవగా.. 2014 జూన్ 9న శాసనసభ తొలి సమావేశం ప్రారంభమైంది. తొలి శాసనసభ సమావేశాలు జూన్ 9 నుంచి 14 వరకు 6 రోజులు జరిగాయి. రెండోసారి 2014లోనే నవంబర్ 5 నుంచి 29 వరకు 19 రోజులు సభ జరిగింది. మూడోసారి 2015 మార్చి 9 నుంచి 26 వరకు 14 రోజులు జరిగాయి. మూడో సెషన్లోనే 2015 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 10 వరకు 7 రోజులు సమావేశాలు జరిగాయి. నాలుగో సెషన్ 2016లో మార్చి 11 నుంచి 31 వరకు 17 రోజులు.. ఐదో సెషన్లో 2016లో ఆగస్టు 30న ఒకే రోజు శాసనసభ సమావేశమైంది. ఆరో సెషన్ 2016 డిసెంబర్ 16 నుంచి 2017 జనవరి 18 వరకు 18 రోజులు.. ఏడో సెషన్ 2017 మార్చి 11 నుంచి 27 వరకు 13 రోజులు జరిగింది. ఏడో సెషన్లో భాగంగానే ఏప్రిల్ 17న ఒక రోజు, ఏప్రిల్ 30న ఒక రోజు కూడా సమావేశాలు జరిగాయి. 8వ సెషన్లో 2017 అక్టోబర్ 29 నుంచి నవంబర్ 17 వరకు 16 రోజులు.. 9వ సెషన్లో 2018 మార్చి 12 నుంచి 29 వరకు 13 రోజులు సమావేశాలు జరిగాయి. -
ఇద్దరికే సారీ!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు తాజా మాజీలకు మాత్రమే టికెట్లను నిరాకరించారు. చెన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు స్థానంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు టికెట్ కేటాయించారు. ఆందోల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినీనటుడు బాబూమోహన్‌కు టికెట్ ఇవ్వకుండా, అక్కడ జర్నలిస్టు సీహెచ్ క్రాంతికిరణ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నల్లాల ఓదెలుకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలను వెల్లడించలేదు. 2009 నుంచి ఇప్పటిదాకా రెండుసార్లు సాధారణ ఎన్నికల్లోనూ, ఒక ఉప ఎన్నికలోనూ ఆయన గెలిచారు. అయితే స్థానికంగా ఉన్న వ్యతిరేకత వల్లనే టికెట్ నిరాకరించినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. -
టికెట్లతోనే అయిపోదు.. గెలిచి రావాలి
సాక్షి, హైదరాబాద్: పార్టీ టికెట్లను ఇవ్వగానే పని పూర్తయినట్టు కాదని, ఎన్నికల్లో గెలిచి రావాలని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. శాసనసభకు 105 మంది అభ్యర్థులను ప్రకటించిన అనంతరం గురువారం సాయంత్రం ఆయన అభ్యర్థులతో సమావేశమై పలు సూచనలు చేశారు. టికెట్లపై గందరగోళం, చివరి క్షణంలో అయోమయం ఉండకూడదనే అభ్యర్థులను ముందుగానే ప్రకటించామన్నారు. అభ్యర్థిత్వంపై అయోమయం అవసరంలేదని, గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. నియోజకవర్గాల్లో అసంతృప్తిగా ఉన్న నాయకులతో సమావేశమై, సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. పూర్తిగా నియోజకవర్గాల్లోనే ఉంటూ, ప్రజలతో కలిసి గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశించారు. పార్టీ అభ్యర్థుల పనితీరు, వ్యవహారశైలిపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తానని, లోపాలు ఉంటే సరిచేసుకోవాలన్నారు. అహంకారం, గర్వం లేకుండా పనిచేసుకోవాలని, ఈ నెల 15లోగా మరోసారి సమావేశం ఉంటుందని చెప్పారు. -
అంతా అనుకున్నట్టే!
గత కొన్ని నెలలుగా మీడియాలో హోరెత్తుతున్న ముందస్తు ఎన్నికల ముహూర్తం ఆగమించింది. గడువుకన్నా దాదాపు 9 నెలల ముందు తెలంగాణ తొలి అసెంబ్లీ రద్దయింది. అందరి ఊహా గానాలనూ నిజం చేస్తూ గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశమై అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయడం, గవర్నర్ నరసింహన్ దాన్ని ఆమోదించడం చకచకా పూర్తయ్యాయి. అయితే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మరింత దూకుడుగా వ్యవహరించారు. ఎవరూ అంచనా వేయని రీతిలో 105 స్థానాలకు పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించి విపక్షాలను విస్మయపరిచారు. బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయి మెరుపు వేగంతో ఇంతటి ప్రధానమైన రాజకీయ నిర్ణయం తీసుకునే సాహసం చేసి ఉండరు. ఇక ఎన్నికలు ఎప్పుడన్నదానిపైనే అందరికీ ఉత్కంఠ. వచ్చే డిసెంబర్‌లోపు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి గనుక వాటితోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండాలన్నది కేసీఆర్ భావన. ఆయనకు కేంద్రంతో పెద్దగా పేచీలేమీ లేవు గనుక ఇందుకు అవాంతరాలు ఎదురు కాకపోవచ్చు కూడా. అనుకోని రీతిలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తప్ప రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ రద్దయిన ఆర్నెల్లలో ఎటూ ఎన్నికలు జరిగితీరాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఎన్నికలు ఆలస్యమై సార్వత్రిక ఎన్నికలతోపాటే ఇవీ జరిగితే ఆయన లెక్కలు తారుమారు కావడానికి ఆస్కారం ఉంది. 2003లో తనపై అలిపిరిలో నక్సలైట్లు హత్యాయత్నం చేసినప్పుడు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై జనంలో సానుభూతి వెల్లువెత్తుతున్నదని భ్రమించి ముందస్తు కోసం తొందరపడ్డారు. 2004 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని లెక్కలేశారు. కానీ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తి కాలేదన్న కారణంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయన వినతిని తోసిపుచ్చింది. ఆ ఏడాది ఏప్రిల్–మే నెలల్లో లోక్‌సభతోపాటే ఎన్నిక లొచ్చి బాబు పదవీచ్యుతుడయ్యారు. సహజంగానే తాజా నిర్ణయాన్ని పార్టీలన్నీ తప్పుబడుతున్నాయి. ముందస్తుకు వెళ్లడం కేసీఆర్ చేతగానితనానికి నిదర్శమంటున్నాయి. ఈ విమర్శల మాటెలా ఉన్నా ముందస్తుకు వెళ్లడం కేసీఆర్ తోనే మొదలు కాలేదు. 1970 చివరిలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు జోరుగా ఉన్నప్పుడు నాటి ప్రధాని ఇందిరాగాంధీ వాటిని ఖండించేవారు. పైకి ఏం చెప్పినా చివరకు దాదాపు ఏడాది ముందుగా లోక్‌సభను రద్దుచేశారు. 1971 మార్చిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. ఆ తర్వాత పలుసార్లు మద్యంతర ఎన్నికలు జరిగాయి. జనంలో పాలన బాగుందన్న భావన బలంగా ఉన్నదని విశ్వసించినా... ప్రధాన ప్రత్యర్థి పక్షాలు అయోమయంలో పడ్డాయని, వాటి నైతికస్థైర్యం సన్నగిల్లిందని భావించినా... సర్జికల్ స్ట్రైక్ తరహాలో విపక్షాలకు షాక్ ఇవ్వాలనుకున్నా అధికార పార్టీలు ముందస్తు వైపు మొగ్గుతాయి. మున్ముందు పరిస్థితులు ప్రతికూలం కావొచ్చుననుకున్నా ఇలాంటి నిర్ణయం తీసుకుంటాయి. కేసీఆర్ చెబుతున్న వివరణ వేరు. రాష్ట్రంలో రాజకీయ విచ్చలవిడితనం, అతి ప్రవర్తన, అసహనం పెరిగిపోయాయని... విపక్షాలు అవాంఛనీయ మైన ఆరోపణలు చేస్తున్నాయని, ఇందువల్ల అధికారుల స్థైర్యం దెబ్బతినే అవకాశం ఉన్నదని... కను కనే ప్రగతి రథచక్రం ఆగకూడదన్న ఉద్దేశంతో కాస్త ముందుగా ఎన్నికలకు పోతున్నామన్నారు. అంటే... వాటి ప్రచార ప్రభావం ఉన్నకొద్దీ పెరిగి తమకు చేటు తెస్తుందని ఆయన భావించార నుకోవాలా? టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకొచ్చినా ఈ విపక్షాలు ఉంటాయి. ఇప్పటిలాగే అప్పుడూ అవి ఆరోపణలు చేస్తాయి. కనుక కేసీఆర్ చెప్పిన వివరణ సంతృప్తికరమైనది కాదు. అయితే ఆయన నిర్ణయం వెనక రాజకీయ చతురత పుష్కలంగా ఉన్నది. ప్రధాని మోదీ హవా 2014నాటితో పోలిస్తే తగ్గిందని కొందరు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పుంజుకున్న సూచనలున్నాయని వారి భావన. ఆ ఫలితాల ప్రభావం రానున్న సార్వత్రిక ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుంది. పర్యవసానంగా మోదీ, రాహుల్ మధ్య పోటీగా ఆ ఎన్నికలు పరిణమిస్తే సహజంగానే అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఎంతో కొంత పుంజుకునే అవకాశం ఏర్పడుతుంది. తెలంగాణలో టీడీపీని కేసీఆర్ ఎటూ సమాధి చేశారు. తాను ఇచ్చిన లేఖ వల్లే తెలంగాణ ఏర్పడిందని బాబు ఇక్కడ చెప్పుకుంటున్నా, ఏపీలో మాత్రం రాత్రికి రాత్రే అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారని, దాన్ని తాము వ్యతిరేకించామని అవకాశం చిక్కినప్పుడల్లా ఆయన వాపోతున్నారు. దానికితోడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరిని కోట్లు ముట్టజెప్పి కొనాలని ప్రయత్నించి ఆయన అడ్డంగా దొరికిపోయారు. చివరకు హడావుడిగా ప్రభు త్వాన్ని ఏపీకి తరలించారు. ఈ కారణాల వల్ల తెలంగాణలో బాబుకు మునుపటి విశ్వసనీయత లేదు. నూతన రాష్ట్రంలో బీజేపీ పెద్దగా ఎదిగింది లేదు. కనుక కేసీఆర్‌కు ఉంటే గింటే కాంగ్రెస్ మాత్రమే ప్రధాన ప్రత్యర్థి. టీడీపీతో అది కలిస్తే దాని విశ్వసనీయతే దెబ్బతింటుందని ఆయన భావిస్తున్నారు. కనుకనే ముందస్తుకు సిద్ధపడటమే శ్రేయస్కరమని ఆయన భావిస్తున్నట్టు కనబడు తోంది. ప్రభుత్వం చేతిలో ఉంటే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనడం కష్టమేమీ కాదు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చునన్న అంచనా ఇతర రాజకీయ పక్షాలకు ఉన్నా ఆ పార్టీలు పెద్దగా కదిలింది లేదు. కాంగ్రెస్‌లో ఇంటిపోరు షరా మామూలే. పొత్తు గురించి ఊహాగా నాలొస్తున్నా కాంగ్రెస్, టీడీపీలు ఇంకా గోప్యతనే పాటిస్తున్నాయి. అవి మొహమాటాన్ని ఎప్పుడు విడిచిపెడతాయో చూడాలి. కొద్దో గొప్పో బలమున్న సీపీఎం మాత్రం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) పేరిట ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీఆర్ఎస్కు అనుకూల ప్రచారం చేసు కోదగ్గ పథకాలున్నట్టే... సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రజాన్యాయ స్థానంలో చివరకు ఎలాంటి తీర్పు వెలువడనున్నదో వేచిచూడాలి.