సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం మొదట వేసుకున్న అంచనా తప్పింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాలకంటే ముందే తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు చేసిన కసరత్తు తాజా పరిణామాల నేపథ్యంలో మారిపోయింది. తెలంగాణలో నవంబర్ రెండో వారంలో పోలింగ్ నిర్వహించేందుకు వీలుగా అక్టోబర్ రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించి షెడ్యూల్ రూపొందించినా తుది ఓటర్ల జాబితా ప్రకటన గడువు పొడిగించాల్సి రావడం, ఓటర్ల జాబితాకు సంబంధించి శుక్రవారం హైకోర్టు ఆదేశాల జారీ దరిమిలా సీఈసీ షెడ్యూల్‌ను మార్చుకుంది. ఈ కారణంగానే శనివారం మధ్యాహ్నం 12 గంటలకే వెలువరించాల్సిన 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించింది. తెలంగాణ లో ఎన్నికలు నిర్వహించాలనుకున్న షెడ్యూల్‌ను ఛత్తీస్ గఢ్‌కు వర్తింపజేసింది.
హైకోర్టులో పిటిషన్ దృష్ట్యా అన్ని పరిణామాలను బేరీజు వేసు కుని నవంబర్ 12 న నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రకటన చేసింది. నవంబర్ రెండో వారం ముగిసేటప్పటికీ ఎన్నికల ప్రక్రియ ము గుస్తుందని భావించిన అధికార తెలంగాణ రాష్ట్ర సమి తి (టీఆర్‌ఎస్) ఈ పరిణామంతో కొంత ఆందోళన చెందినట్లు కనిపించింది. అక్టోబర్‌లో నోటిఫికేషన్ వస్తుందన్న ఉద్దేశంతోనే ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు 105 నియోజవర్గాలకు పార్టీ అభ్యర్థులను అసెంబ్లీ రద్దు రోజే ప్రకటించారు.
ఇబ్బందుల్లేకుండా ఉండేందుకే నోటిఫికేషన్ నవంబర్‌కు...
న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగానే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను నవంబర్‌లో విడుదల చేయాలన్న నిర్ణయం తీసుకుంది. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేయాలని ముందుగా నిర్ణయం తీసుకున్నా అనుకోని అవాంతరాల కారణంగా తెలంగాణను రాజస్తాన్‌తో కలిపింది. ఛత్తీస్‌గఢ్ ఎన్నికలను ముందుకు తీసుకువచ్చింది.
సాంకేతిక సమస్యల గుర్తింపులో యంత్రాంగం విఫలం...
ఓటర్ల తుది జాబితా ప్రకటనకు ముందు ఎదురయ్యే సాంకేతిక సమస్యలను గుర్తించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఎక్కువ జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చినా 10–12 జిల్లాల్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించడానికి వీలుగా తుది ఓటర్ల జాబితా ప్రకటనకు సమయం పొడిగించాలని గత బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా పలువురు కలెక్టర్లు సీఈవో రజత్‌కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే రాతపూర్వకంగా తనకు నివేదికలు పంపితే సీఈసీ దృష్టికి తీసుకెళ్తానని రజత్ వారికి చెప్పడంతో గురువారం రాత్రికి వారు ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయానికి నివేదికలు పంపారు. శుక్రవారం ఢిల్లీలో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంతోపాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారుల సమావేశంలో రజత్ కుమార్ ఈ విషయాన్ని సీఈసీ దృష్టిలో పెట్టారు. దీంతోపాటే ఓటర్ల జాబితాలో అక్రమంగా వేలాది మంది పేర్లు తొలగించారంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఓటర్ల తుది జాబితాను తమకు ఇవ్వకుండా ప్రకటించవద్దని షరతు విధించింది. ఈ రెండు అంశాలపై సీఈసీ శనివారం న్యాయ నిపుణులతో కూలంకషంగా చర్చించింది. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో ముందుగా ఎన్నికలు నిర్వహించడం సమంజసమే అయినా తుది ఓటర్ల జాబితా సిద్ధం కాకపోవడం, హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో కొంత సమయం తీసుకుంటే బాగుంటుందని న్యాయ నిపుణులు సూచించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment