నాయిని నారాజ్‌! | Nayini Narsimha Reddy Sad On TRS Candidates List | Sakshi
Sakshi News home page

నాయిని నారాజ్‌!

Published Fri, Sep 7 2018 8:46 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

Nayini Narsimha Reddy Sad On TRS Candidates List - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: తాను సూచించిన అభ్యర్థికి టికెట్‌ ఇవ్వలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గురువారం ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాలో ముషీరాబాద్‌ స్థానం నుంచి తన సమీప బంధువు, కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన కేసీఆర్‌ నిర్వహించిన విలేకరుల సమావేశానికి సైతం దూరంగా ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఆ జాబితాలో ముషీరాబాద్‌ స్థానానికి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ముఠా గోపాల్‌ పేరు ఉందన్న సమాచారంతో నాయిని అలిగినట్టు తెలిసింది.

ఈ క్రమంలోనే కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి హాజరు కాలేదన్న ప్రచారం జరిగింది. దీంతో చివరి నిమిషంలో ముషీరాబాద్‌ అభ్యర్థి ప్రకటనను వాయిదా వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయమై హోంమంత్రిని ‘సాక్షి’ ప్రతినిధి అడగ్గా.. కేబినెట్‌ సమావేశంలో తాను పాల్గొనడం వల్లే, కేసీఆర్‌ విలేకరుల సమావేశానికి వెళ్లలేదని, ‘అయినా ముషీరాబాద్‌ టికెట్‌ శ్రీనివాసరెడ్డికి ఎందుకు రాదు... తప్పకుండా వస్తుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

పద్మారావు ‘పాంచ్‌’ పటాకా..
2004లో తొలిసారి శాసనసభకు పోటీ చేసిన మంత్రి పద్మారావు.. రెండు విజయాలు, రెండు ఓటములు తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఐదోసారి పోటీకి సిద్ధమయ్యారు. 2004, 2014లో విజయం సాధించిన ఈయన.. 2008 ఉప ఎన్నికల్లో తలసాని చేతిలో, 2009లో (సనత్‌నగర్‌) మర్రి శశిధర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.   

తలసాని ‘ఆరోసారి’..
మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తొలిసారి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేయనున్నారు. 1995లో ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన తలసాని, 1999, 2008, 2014లలో విజయం సాధించారు. 2004, 2009లో ఓటమి పాలయ్యారు. ముందస్తు ఎన్నికల్లో ఆరోసారి శాసనసభకు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.  

సాయన్నా.. ఆరోసారే..
కంటోన్మెంట్‌ నియోకజవర్గంలో 1994 నుంచి వరసగా పోటీ చేసి నాలుగుసార్లు సాయన్న విజయం సాధించారు. 2009లో శంకర్‌రావు చేతిలో ఓడిపోయారు. తిరిగి 2014లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తొలిసారిగా పోటీ చేస్తున్న సాయన్న.. శాసనసభ ఎన్నికలను ఎదుర్కోవడం ఇది ఆరోసారి.   

గతంలో ఓడిన వారికి మరో ఛాన్స్‌  
2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి పాలైన ముద్దగోని రాంమోహన్‌గౌడ్‌(ఎల్బీనగర్‌), భేతి సుభాష్‌రెడ్డి(ఉప్పల్‌), జీవన్‌సింగ్‌(కార్వాన్‌), సీతారాంరెడ్డి (చాంద్రాయణగుట్ట), ఇనాయత్‌ అలీకి చార్మినార్‌ బదులు బహుదూర్‌పురాలో అవకాశం కల్పించారు. అంబర్‌పేట, మలక్‌పేట, గోషామహల్‌లలో కొత్త అభ్యర్థుల పేర్లను
పరిశీలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement