
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో జరగనున్న ముందస్తు ఎన్నికలపై కోర్టుకెళ్లాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ జరుగుతోందని, 13 లక్షల మంది యువకులు ఓటు హక్కు కోసం వేచి చూస్తున్నారని, జనవరి 1 తర్వాతే ఎన్నికలు జరిగితే వారు ఎన్నికల్లో పాల్గొంటారని, అలా కాదని ముందస్తుకెళితే కోర్టుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలిసింది. అసెంబ్లీని రద్దు చేయాలంటూ తెలంగాణ సీఎం, కేబినెట్ నిర్ణయం తీసుకోవడం.. ఇందుకు గవర్నర్ కూడా ఆమోదించడంతో ప్రక్రియపై కమిషన్ సందిగ్ధంలో పడిపోయిందని ఆ పార్టీ నేతలు అంటున్నట్లు సమాచారం. జాబితా సవరణ జరుగుతున్నపుడు ఎన్నికలు ఇంతవరకు జరగలేదని, అసెంబ్లీ రద్దయినా వచ్చే ఏడాదికి ముందు ఎన్నికలు జరగవని వారు చెబుతున్నట్లు తెలిసింది.
ఈ విషయమై గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రస్తావిస్తూ.. ‘రాష్ట్రంలో ఓటర్ల జాబితా ముసాయిదాను సెప్టెంబర్ 1నే కమిషన్ విడుదల చేసింది. ఇందుకు అక్టోబర్ 31 వరకు సమయమిచ్చింది. నవంబర్ 30 వరకు ధ్రువీకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత చివరగా జాబితా సవరణ చేసి జనవరి 4న తుది జాబితా వెల్లడిస్తామంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు రాష్ట్రంలో ఎన్నికలు జరపకూడదు’అని పేర్కొంది. ఎన్నికలు కనీసం రెండు నెలలు కూడా లేని ఇలాంటి పరిస్థితి కమిషన్‌ను సందిగ్ధంలోకి నెడుతుందని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment