సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది! శాసనసభ రద్దుకు కౌంట్‌డౌన్ మొదలైంది!! గురువారం ఉదయం మంత్రివర్గం సమావేశమై ఈ మేరకు తీర్మానం చేయనున్నట్లు అత్యున్నత అధికార వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతకం ప్రకారం గురువారం ఉదయం 6 గంటల నుంచి 7 వరకు కీలక నిర్ణయాలకు అత్యంత అనుకూల సమయమని, ఆయన నక్షత్ర, రాశులకు అనుకూలంగా గ్రహస్థితులు ఆ రోజు ఉన్నాయని, అందుకే ఆ సమయాన కేబినెట్ భేటీకి సీఎం సిద్ధమైనట్లు తెలియవచ్చింది. శాసనసభ రద్దుకు ప్రభుత్వం సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో మంగళవారం శరవేగంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు మంగళవారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌తో సమావేశమవగా ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయ్యారు. మరోవైపు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మెరుపు వ్యూహంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నారు. లక్షలాది మందితో ప్రగతి నివేదన సభ నిర్వహించి 48 గంటలు కూడా దాటకముందే హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. అన్నీ అనుకున్నట్లు గురువారం శాసనసభ రద్దు ప్రకటన వెలువడితే ముఖ్యమంత్రి శుక్రవారం హుస్నాబాద్ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పోలీసుశాఖ సైతం ముందస్తు ఎన్నికలకు అవసరమయ్యే బలగాల కోసం కసరత్తు మొదలుపెట్టింది.
అసెంబ్లీ రద్దుపై ఖాయమైన నిర్ణయం...
మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకోవడం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో కేబినెట్ భేటీకి అవసరమైన అన్ని అంశాలను సాధారణ పరిపాలనశాఖ పూర్తి చేసింది. గురువారం ఉదయానికి హైదరాబాద్‌లో ఉండాలంటూ మంత్రులకు ఇప్పటికే సమాచారం పంపింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎస్. కె. జోషి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యులు మంగళవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీ రద్దు నిర్ణయం, ఆ తర్వాత అనుసరించాల్సిన విధానాలపై వారు ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.
అనంతరం గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ నలుగురు అధికారులతో మరోసారి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ సూచన మేరకే ఉన్నతాధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లినట్లు తెలియవచ్చింది. డిసెంబర్‌లోగా కచ్చితంగా ఎన్నికలు జరిగేందుకు వీలుగా సాంకేతిక ఇబ్బందులేవీ లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు సూచించారు. గవర్నర్ కార్యాలయంలో చర్చల విషయాలను ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌కు ఫోన్‌లో వివరించినట్లు తెలిసింది. కేబినెట్ భేటీలో అసెంబ్లీ రద్దు అంశాన్ని చివరి నిమిషంలో ఎజెండాలో చేరుస్తారని, ఇప్పటికిప్పుడు ఎజెండాలో ఈ అంశం లేదని ఓ సీనియర్ మంత్రి చెప్పారు.
ఢిల్లీలో అంతా ఓకే...
తెలంగాణలో అసెంబ్లీని రద్దు చేస్తే డిసెంబర్‌లోగా కచ్చితంగా ఎన్నికల జరిగేలా జరుగుతున్న ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం కార్యాయంలోని అధికారి ప్రభుత్వానికి వివరించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, కరీంనగర్ ఎంపీ బి. వినోద్ కుమార్ వారం రోజులుగా ఢిల్లీలో ఇదే పనిలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌కు వచ్చిన వీరిద్దరు ఢిల్లీ అంశాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు. అనంతరం అసెంబ్లీ రద్దు ప్రక్రియపై కసరత్తు వేగవంతమైంది. సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం సీఎస్ ఎస్. కె. జోషి, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు సచివాలయానికి వచ్చారు. రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీని, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావుతోపాటు పలువురు ఇతర శాఖల ఉన్నతాధికారులను వేర్వేరుగా పిలిచి మాట్లాడారు. ప్రభుత్వపరంగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై సీఎం ఆదేశాల మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు.
సీఎస్‌తో ముఖ్య ఎన్నికల అధికారి భేటీ...
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (టీఎస్‌సీఈవో) రజత్ కుమార్ మంగళవారం సీఎస్ ఎస్.కె. జోషిని కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో నెలకొన్న సిబ్బంది కొరత విషయంలో ప్రభుత్వం వద్ద ఉన్న ప్రతిపాదలపై చర్చించేందుకు సీఎస్ పిలుపు మేరకే రజత్‌కుమార్ వెళ్లినట్లు తెలిసింది. అదనపు సీఈవో పోస్టులో ఐఏఎస్ అధికారిని నియమించాలని, జాయింట్ సీఈవో, డిప్యూటీ సీఈవోతోపాటు మరో 18 పోస్టులను భర్తీ చేయాలని రజత్ కుమార్ ఈ సందర్భంగా కోరారు. ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒకటి రెండు రోజుల్లోనే సీఈవో కార్యాలయంలో పూర్తిస్థాయి అధికారులు, సిబ్బంది కొలువుదీరనున్నారు. మరోవైపు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో కార్యాలయం బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటలకు సమావేశం నిర్వహిస్తోంది. అలాగే జిల్లాల ఎన్నికల అధికారులు (డీఈవో)గా పని చేసే కలెక్టర్లకు ఈ నెల 7న శిక్షణ కార్యక్రమం జరగనుంది.
పోలీసుశాఖ ‘ముందస్తు’ఏర్పాట్లు...
ముందస్తు ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్‌శాఖ అందుకు తగిన కార్యాచరణ, బలగాల పరిస్థితి, సిబ్బంది తదితర అంశాలపై దృష్టి పెట్టింది. ఎన్నికల బందోబస్తు కోసం సిద్ధంగా ఉండేలా కార్యచరణ రూపొందించాలని మౌఖికంగా బెటాలియన్ విభాగానికి పోలీస్‌శాఖ నుంచి సూచనలు వెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తం బెటాలియన్ల నుంచి 7–8 వేల మంది సిబ్బంది అందుబాటులో ఉండనున్నట్టు తెలిసింది. అలాగే అన్ని జిల్లాలు కమిషనరేట్లలో కలిపి సుమారు 3,500 మందిని కూడా ఎన్నికల విధుల్లో నియమించనున్నారు. మరోవైపు సుమారు 40 వేల మంది వరకు ఉన్న సివిల్ పోలీసులను మండలాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించేలా కార్యచరణ రూపొందిచనున్నారు. కాగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సుమారు 16 వేల మంది పారామిలిటరీ బలగాలను బందోబోస్తు కోసం కేటాయించేలా ఎన్నికల కమిషన్ ద్వారా పోలీస్‌శాఖ కోరనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పోలీస్ సిబ్బంది, కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటుగా హోంగార్డుల సేవలను ఎన్నికల సమయంలో వినియోగించుకోవాలని పోలీస్ శాఖ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అలాగే 24 వేల మంది హోంగార్డులను ఎన్నికల విధుల్లో నియమించేలా సన్నాహాలు చేస్తోంది. మొత్తంమీద ఎన్నికల బందోబస్తుపై త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
అన్ని పనులకూ ఆ గుడి నుంచే శ్రీకారం
సిద్దిపేట సమీపంలోని కోనాయపల్లిలో పూజ చేసిన తర్వాతనే ఏ పని అయినా ప్రారంభించడం కేసీఆర్‌కు అలవాటు. రాజకీయంగా చేసే ప్రతి పనినీ ఆ గుడిలో పూజ చేశాకే ప్రారంభిస్తారు. మొదటిసారి ఎమ్మెల్యే కావడానికి ముందు నుంచీ కేసీఆర్‌కు ఇదే సెంటిమెంటు ఉంది. టీఆర్‌ఎస్ ఆవిర్భావానికి ముందు కూడా ఈ గుడిలో పూజ చేశాకే కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహించారు. 2009లో ఆమరణ దీక్ష సందర్భంగానూ ఇదే గుడిలో పూజలు చేసి దీక్షాస్థలికి చేరుకున్నారు. ఇలా అన్ని సందర్భాల్లోనూ ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ వచ్చారు.
కేసీఆర్ దూకుడు
శాసనసభ రద్దు ఖాయమన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత మెరుపు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను బుధవారమే పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. గురువారం శాసనసభ రద్దయితే 119 మంది శాసనసభ్యులు పదవులు కోల్పోతారు. సీఎం, మంత్రిమండలి ఆపధర్మ ప్రభుత్వంలో యథావిధిగా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు అందనంత దూరంలో మొదటి దశ ఎన్నికల ప్రచారం పూర్తి చేయాలని భావిస్తున్న టీఆర్‌ఎస్ అధినేత... హుస్నాబాద్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని మంత్రులు హరీశ్, ఈటలను మంగళవారం ఆదేశించారు. గురువారం శాసనసభ రద్దు చేస్తూ ప్రకటన వెలువడితే మొదటిసారిగా హుస్నాబాద్ సభలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే 50 రోజుల్లో వంద సభలు పూర్తి చేయాలన్న ఆలోచనతో కార్యాచరణ మొదలుపెట్టారు.
2–3 రోజుల్లో 10 బహిరంగ సభలకు తేదీలు, స్థలాలు ఖరారు చేస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే ఒకేరోజు 2–3 సభలు నిర్వహించేలా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. సభల నిర్వహణపై 24 గంటల్లోగా సమాచారం ఇవ్వాలని మంత్రులు, సీనియర్ నేతలను ఆదేశించారు. మంగళవారం ఆయన నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల ముఖ్యులు, మంత్రులతో సభల విషయం చర్చించినట్లు తెలిసింది. ఈ నెలాఖరుకల్లా 20కిపైగా సభలకు వ్యూహరచన చేస్తున్నారు. ప్రతిపక్షాలు తేరుకోకముందే వీలైనంత త్వరగా తొలి విడత ప్రచారం ముగించాలని భావిస్తున్నారు. అభ్యర్థులను ఖరారు చేసిన నియోజకవర్గాల్లో మొదటి పది రోజుల్లో సభలు ఉంటాయని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో మంగళవారం పార్టీ ముఖ్య నేతలు, అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలిసింది. ప్రగతి నివేదన సభ అనంతరం తన ఫాంహౌస్‌కు చేరుకొని మంత్రి హరీశ్‌రావుతో 2 గంటలపాటు కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై చర్చించినట్లు తెలియవచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment