బయటికి వీర సమైక్యవాదిగా పోజులిస్తూ, లోలోన మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఆదేశానుసారం విభజన ప్రక్రియకు మొదటినుంచీ పూర్తిగా సహకరిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి... తన డబుల్ యాక్షన్‌ను త్వరలో తారస్థాయికి తీసుకెళ్లనున్నారా? రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీ చర్చను సజావుగా ముగించి కేంద్రానికి తిప్పి పంపడం ద్వారా అధిష్టానం తనపై ఉంచిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేయనున్నారా? ఆ వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ‘కొత్త పార్టీ’ ముసుగులో, ‘సమైక్య కార్డు’తో ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నారా? అధిష్టానం స్థాయిలో ఈ మేరకు రూపుదిద్దుకున్న స్క్రిప్టును తు.చ అమల్లో పెడుతూ వస్తున్నారా? కొంతకాలంగా అధికారిక సవూవేశాల్లో కిరణ్ తీసుకుంటున్న పలు నిర్ణయూలు ఇవే సంకేతాలను ఇస్తున్నారుు. సాధారణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరిలో నిర్వహించడం పరిపాటి. కానీ ఈసారి ఏమాత్రం అవకాశమున్నా వాటిని జనవరి నెలాఖరు నుంచే మొదలు పెట్టి, వీలైనంత త్వరగా ముగించాలని కిరణ్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు! ఇది ‘అసెంబ్లీ రద్దు’ దిశగా గట్టి సంకేతమేనని పరిశీలకులు భావిస్తున్నారు.