విభజన నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం ఎంత ముందుకెళ్తే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు అంత నష్టం తప్పదని కేంద్ర పెద్దలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌లతో కిరణ్ బుధవారం భేటీ అయ్యారు. సీమాంధ్రుల సమస్యల పరిష్కారానికి వేసిన ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చేదాకా విభజన ప్రక్రియను పూర్తిగా నిలిపేయాలని షిండేను ఆయన కోరినట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికలు ముగిసే దాకా విభజనను పక్కన పెట్టాలని సూచించారంటున్నారు. అయితే అన్ని పార్టీల వైఖరులూ తెలుసుకున్నాకే కాంగ్రెస్ ముందడుగు వేసిందని, పార్టీ తీర్మానం మేరకు ప్రభుత్వం తన పని చేసుకుపోతోందని కిరణ్‌కు షిండే చెప్పారని తెలిసింది. దిగ్విజయ్ నుంచి కూడా ఆయనకు అలాంటి స్పందనే ఎదురైంది. ప్రధాని మన్మోహన్‌సింగ్, రాహుల్‌గాంధీలను కలవాలని భావించిన కిరణ్, వారు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో హైదరాబాద్ పయనమయ్యారు. రాష్ట్ర విభజన, తదనంతర పరిణామాలు, క్షేత్రస్థాయిలో పార్టీ ఎదుర్కొంటున్న సంఘర్షణ తదితరాలపై షిండే, దిగ్విజయ్‌లతో కిరణ్ విడి విడిగా చర్చించారు. ‘‘విభజన నిర్ణయం అనంతరం ప్రజానీకమంతా కాంగ్రెస్‌నే దోషిగా చూస్తోందని, విపక్షాలు కూడా కాంగ్రెస్‌నే లక్ష్యం చేసి ప్రజల్లోకి వెళ్తున్నాయి. మంత్రులు, ఎంపీలని కూడా చూడకుండా జనం నిలదీస్తున్నారు. రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. దాంతో నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌ను వీడాల్సి వస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులు ఇప్పటికే రోడ్డెక్కారు. రైతులూ అదే బాట పడితే ఉద్యమం మహోధృతమవుతుంది. నదీ జలాలు, విద్యుత్, ఉద్యోగాలు, పరిశ్రమలు, హైదరాబాద్ తదితరాలపై స్పష్టత ఇవ్వకుండా విభజనపై ముందుకెళ్తే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు’’ అని చెప్పారంటున్నారు. దిగ్విజయ్, షిండేలతో భేటీకి ముందు ఏపీభవన్‌లో కేంద్ర మంత్రులు చిరంజీవి, కిల్లి కృపారాణి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, వట్టి వసంత్‌కుమార్, పితాని సత్యనారాయణ, సి.రామచంద్రయ్య, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణకుమార్, ఎ.సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులురెడ్డి తదితరులతో కిరణ్ సమావేశమయ్యారు. రాష్ట్రపతితో భేటీ కిరణ్ హైదరాబాద్ పయనమయే ముందు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. విభజన సహా పలు అంశాలపై ఆయనతో పావుగంట చర్చించారు. నవంబర్ 1న అనంతపురంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు ఉత్సవాలకు ప్రణబ్‌ను ఆహ్వానించినట్టు సమాచారం. మారిన దిగ్విజయ్ మాటతీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం నుంచి వెనక్కు మళ్లే ప్రసక్తే లేదని నిత్యం చెబుతూ వస్తున్న దిగ్విజయ్‌సింగ్ మాటతీరులో బుధవారం కాస్త మార్పు కన్పించింది. రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు తాము ప్రాధాన్యమిస్తామని వ్యాఖ్యానించారు. కిరణ్‌తో భేటీ తర్వాత ఆయన మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా సీమాంధ్రలో ప్రజాందోళనలు తగ్గడం లేదుగా అని ప్రశ్నించగా పై విధంగా బదులిచ్చారు. ‘‘రాష్ట్రంలో ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్న విషయం మాకు తెలుసు. ప్రజలు రెండుమార్లు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. వారి అభిప్రాయాలకు కాంగ్రెస్ అధిష్టానం అత్యంత ప్రాధాన్యమిస్తుంది. కేంద్రంలో రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారకులైన వారికి ఎలా అన్యాయం చేస్తాం? రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గుర్తించి, అందరి ప్రయోజనాలను కాపాడే విధంగా సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం’’ అని బదులిచ్చారు.
Published Thu, Sep 5 2013 7:17 AM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement