ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాష్ట్ర ప్రజలు రెండుసార్లు కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగు ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ హైకమాండ్ గుర్తిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఈరోజు ఉదయం దిగ్విజయ్ సింగ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, సీమాంధ్రలో సమైక్య ఉద్యమం, సచివాలయంలో ఇరుప్రాంతాల ఉద్యోగుల నిరసనలు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా ముఖ్యమంత్రి నిన్న ఆంటోనీ కమిటీతో సమావేశం అయ్యారు. సీమాంధ్ర వాదనలు వినేందుకు నిన్న రాత్రి 8గంటలకు రికాబ్‌గంజ్ రోడ్డులోని కాంగ్రెస్ వార్ రూంలో జరిగిన భేటీకి ఆంటోనీతోపాటు సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, కేంద్ర పెట్రోలియం మంత్రి వీరప్పమొయిలీ హాజరయ్యారు. సీమాంధ్ర బృందం తరఫున సిఎం కిరణ్‌సహా సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, సీనియర్ నాయకుడు కమల్‌నాథ్ సైతం భేటీకి హాజరు కావటం గమనార్హం.