ముందస్తు ఎన్నికలకు సై..! | political leaders ready to pre polls | Sakshi
Sakshi News home page

ముందస్తుకు సై..!

Published Fri, Jan 12 2018 8:25 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

 political leaders ready to pre polls - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బోగి మంటలతో పాటే రాజకీయ వేడి కూడా రాజుకొంటోంది. గడువు కన్నా ఆరునెలల ముందే లోక్‌సభతో పాటు ఎనిమిది రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ యోచిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడంతో పాటు ప్రజాకర్షక పథకాలను అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రైతాంగానికి మేలు చేసే రెండు కీలక పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. ‘వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌’ను ఈనెల ఒకటో తేదీ నుంచే అమలు చేస్తున్నారు. ఎకరాకు రూ.4వేల ‘పెట్టుబడి’ అందించే ప్రక్రియ మే నుంచి ప్రారంభం కాబోతుంది. అదే సమయంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు, పార్టీ జిల్లా, నియోజకవర్గ పరిశీలకులకు ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా రాష్ట్ర స్థాయిలో ఊపు పెంచింది. టీడీపీ నుంచి అనుముల రేవంత్‌రెడ్డి వచ్చి చేరడంతో ఊపు మీదున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర స్థాయిలో తన గళం పెంచింది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్న బీజేపీ తనకు పట్టున్న పట్టణ నియోజకవర్గాల్లోనైనా సత్తా చాటాలని భావిస్తోంది. రాష్ట్ర స్థాయిలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలను ఉమ్మడి జిల్లాలో కూడా అన్ని పార్టీల నేతలు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు సీరియస్‌గా తీసుకుంటున్నారు. సంవత్సరాంతానికి ముందస్తుగా ఎన్నికలు వచ్చినా ఢీకొనాలని ఉవ్విళ్లూరుతున్నారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 10 నియోజకవర్గాల్లో సాంకేతికంగా ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు పార్లమెంటు సీట్లు కూడా ఆ పార్టీవే. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి సిట్టింగుల్లో ఎవరెవరి స్థానాలు పదిలంగా ఉంటాయో, ఎవరి సీట్లను కొత్తవారికి అప్పగిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి ఎమ్మెల్యే ‘నా సీటు జోలికి రారు’ అనే ధీమాతో ఉన్నట్టే కనిపిస్తున్నా... అంతర్గతంగా మాత్రం కొందరిలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీ నేతలంతా టీఆర్‌ఎస్‌లో చేరడం, బీఎస్‌పీ, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ముగ్గురు సిట్టింగ్‌లు సైతం టీఆర్‌ఎస్‌ గూటికే వచ్చి సెటిలై పోవడంతో వచ్చే ఎన్నికల్లో సీట్ల విషయంలోనే అనిశ్చితి ఏర్పడింది. ప్రజాదరణ పొందుతూ వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న సిట్టింగ్‌లకు ఢోకా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో ఖానాపూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్, బోథ్‌ వంటి నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ల సీట్ల కోసం పార్టీలోనే పోటీదారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.


కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం
టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికతో ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు కీలక నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరారు. మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావు, సిర్పూర్‌ నుంచి రావి శ్రీనివాస్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం వీరే అనధికారిక కాంగ్రెస్‌ అభ్యర్థులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్, నవంబర్‌లలో ఉమ్మడి జిల్లాలో ఆదివాసీలు, లంబాడాల మధ్య మొదలైన వివాదం కాంగ్రెస్‌ పార్టీకి పరోక్షంగా అనుకూలించేదిగా మారింది. బోథ్‌ మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావు, ఆసిఫాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ ఆదివాసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందనే భావనను పెంపొందించారు. ఈ ఆదివాసీల ప్రభావం ఉమ్మడి జిల్లాలోని ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్‌ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలతో పాటు సిర్పూర్, ఆదిలాబాద్‌ అసెంబ్లీ స్థానాలపై కూడా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఆదిలాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంపై కూడా ఆదివాసీల ప్రభావం అధికంగా ఉండనుంది. ఈ పరిణామాలన్నీ తమకు అనుకూలిస్తాయని కాంగ్రెస్‌ భావిస్తోంది. మంచిర్యాలలో టిక్కెట్టు ఆశిస్తున్న కె.ప్రేంసాగర్‌రావు, ఎం.అరవింద్‌రెడ్డి చెరో దారిలో ఉన్నారు. ఇక్కడ ఎవరికి టిక్కెట్టు వచ్చినా, మరో నాయకుడు సహకరించే పరిస్థితి లేదు. నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. ఆదిలాబాద్‌లో ముగ్గురు నేతల మధ్య రాజకీయం టీఆర్‌ఎస్‌కు అనుకూలించే పరిస్థితి. ఈ మేరకు నాయకులంతా ‘ముందస్తు’ ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.


పట్టణాల్లో పట్టు కోసం బీజేపీ
దేశంలో అధికారంలో ఉన్నా... రాష్టంలో ఆశించిన స్థాయిలో ఎదగలేమనే నిర్ధారణకు వచ్చిన బీజేపీ తనకు పట్టున్న ప్రాంతాలపైనే దృష్టి పెట్టింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎదిగే పరిస్థితులు, సమయం లేదని భావిస్తున్న ఆపార్టీ పట్టణ ప్రాంతాలపై దృష్టి పెడుతోంది. ఉమ్మడి జిల్లాలో మొదటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం, బీజేపీ సంస్థాగత బలం ఉన్న మంచిర్యాల, బెల్లంపల్లి, ఆదిలాబాద్, ముధోల్, నిర్మల్‌ వంటి నియోజకవర్గాలపై ప్రధాన దృష్టి పెడుతోంది. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల వైఫల్యాలు, వారిపై వచ్చిన ఆరోపణలను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావడంతో పాటు ప్రధానమంత్రి చరిష్మాను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. మంచిర్యాల పట్టణంలో పార్టీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై ప్రజల్లోకి వెళ్తున్నట్లు ఆయన ‘సాక్షి’కి చెప్పారు. కాగా మిగతా పార్టీల్లో టీడీపీ నామ్‌కే వాస్తేగా మిగిలిపోనుండగా, బెల్లంపల్లిలో పోరుకు సీపీఐ సన్నద్ధమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement