సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రాజెక్టులను ప్రత్యక్షంగా పర్యవేక్షించే చీఫ్ ఇంజినీర్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. సీఆర్‌డీఏ ఇంజనీరింగ్ విభాగంలో మూడు కీలక ప్రాజెక్టులను చేపట్టిన వీరి మధ్య సమన్వయం లేకపోవడంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న రాజధాని పనుల పురోగతి మందగించింది. ఉన్నతాధికారులు ఎవరి దారిలో వారు వెళుతుండడంతో కింది స్థాయి సిబ్బంది నలిగిపోతున్నారు.
టెండర్ లేకుండానే సీఎం ఇంటివద్ద గ్రీవెన్స్ హాల్
సీఆర్‌డీఏ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొక్యూర్‌మెంట్, యుటిలిటీస్, హౌసింగ్‌లకు ముగ్గురు సీఈలను నియమించారు. ప్రొక్యూర్‌మెంట్, హౌసింగ్ సీఈల మధ్య విభేదాలు ముదరటంతో పలు ప్రాజెక్టుల పరిస్థితి గందరగోళంగా మారింది. పెద్దల మెప్పు కోసం హౌసింగ్ సీఈ నిబంధనలను పక్కనపెట్టి పని చేస్తుండడం ప్రొక్యూర్‌మెంట్ వింగ్‌కు ఇబ్బందికరంగా మారింది. ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద గ్రీవెన్స్ హాల్ నిర్మాణం విషయంలో వీరి మధ్య నెలకొన్న విభేదాలు గొడవపడే వరకూ వెళ్లాయి. సీఎం మౌఖిక ఆదేశంతో టెండరు పిలవకుండానే రూ.5.5 కోట్లతో ఓ కాంట్రాక్టర్ ద్వారా హాలు నిర్మాణాన్ని హౌసింగ్ సీఈ పూర్తి చేయించినట్లు సమాచారం. కాంట్రాక్టర్‌కు అనామతు ఖాతాలో బిల్లు చెల్లించే ప్రయత్నాలు చేశారు. కనీసం నామినేషన్ మీద పని ఇచ్చినట్లు కూడా చూపలేదు.
ఈ నేపథ్యంలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్‌కు పని అప్పగించినట్లు చూపేలా ప్రొక్యూర్‌మెంట్ సీఈపై ఒత్తిడి తెచ్చారు. అయితే అయిపోయిన పనికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసినట్లు తానెలా కాగితాలు సృష్టిస్తానని ఆయన నిలదీయడంతో కథ అడ్డం తిరిగింది. ఈ వ్యవహారంపై హౌసింగ్, ప్రొక్యూర్‌మెంట్ సీఈల మధ్య సీఎం కార్యాలయంలోనే వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఎలాగోలా కాంట్రాక్టర్‌కు బిల్లు ఇప్పించేలా చూడాలని ఉన్నతాధికారులు ప్రొక్యూర్‌మెంట్ సీఈపై ఒత్తిడి తెచ్చినా ఆయన నిరాకరించినట్లు తెలిసింది. దీంతోపాటు పలు పనులకు సంబంధించిన టెండర్లలోనూ ఇద్దరు సీఈల మధ్య విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి.
మందకొడిగా ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధి టెండర్లు
మరోవైపు పెద్ద బాధ్యతల్లో ఉన్న యుటిలిటీస్ సీఈని కొద్దికాలంగా పూర్తిగా పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంజనీరింగ్ విభాగాన్ని సమన్వయం చేయాల్సిన ఆయన ఆధిపత్య పోరులో వెనుకబడి నామమాత్రంగా మారిపోయారు. ఆయన పర్యవేక్షణలో ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధి ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియ సజావుగా జరగడం లేదనే విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment