ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర
సాక్షి, అమరావతి/రాజంపేట/బెంగళూరు: రాష్ట్ర ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులు స్వయంగా తెలుసుకోవడానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని అధిగమిస్తున్న నేపథ్యంలో ‘వాక్ విత్ జగనన్న’ (జగనన్నతో కలిసి నడుద్దాం) కార్యక్రమాన్ని సోమవారం భారీఎత్తున నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఏపీ, తెలంగాణ తో పాటు దేశంలోని పలు నగరాల్లోనూ ఈ కార్యక్రమం జరగనున్నది.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతేడాది నవంబరు 6న ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నుంచి కాలినడకన రాష్ట్ర పర్యటనకు బయల్దేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పాదయాత్ర పూర్తిచేసుకుని నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించారు. 74వ రోజు అయిన సోమవారం నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో జగన్ 1000 కిలోమీటర్ల యాత్రను పూర్తిచేసుకోనున్నారు. మూడో వంతు యాత్ర అవలీలగా పూర్తిచేయడం పట్ల పార్టీ వర్గాలకు ఉత్సాహాన్ని ఇస్తోంది. ఈ నేపథ్యంలో ‘వాక్ విత్ జగనన్న’ నిర్వహించాలని పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపునివ్వడంతో దానిని భారీఎత్తున విజయవంతం చేయాలని శ్రేణులు ముందుకు కదులుతున్నాయి. 29న దాదాపు ప్రతి జిల్లా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ వేల సంఖ్యలో కార్యకర్తలు ఎక్కడికక్కడ జగన్‌కు సంఘీభావం తెలపాలన్న కృతనిశ్చయంతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
‘నవరత్నాలు’కు విస్తృత ప్రాచుర్యం
జగన్ ప్రకటించిన ‘నవరత్నాలు’ విశేషాలను పార్టీ శ్రేణులు ‘వాక్ విత్ జగనన్న’ ద్వారా ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లనున్నాయి. జిల్లాల వారీగా స్థానిక సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ఇతర నేతలు ఈ కార్యక్రమ నిర్వహణకు సిద్ధమయ్యారు. కాగా, నెల్లూరు జిల్లాలో సోమవారం జగన్ 1000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయ్యే ప్రదేశంలో పండుగ వాతావరణం నెలకొంది. చెన్నై, పుణే నగరాల్లో ఆదివారమే ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమాలు జరిగాయి. పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో ç ఒకరోజు ముందుగానే ఈ కార్యక్రమం జరిగింది.
ప్రజాసంకల్ప యాత్రకు బ్రహ్మరథం: ఆకేపాటి
రాజంపేట: జననేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం చెర్లోపల్లె వద్దనున్న వినాయకుని గుడి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయం వరకు ఆదివారం ఆయన ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప మేయరు సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్ బాషా, జడ్పీ వైస్‌చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, పార్టీ నేతలు ఆకేపాటి వేణుగోపాలరెడ్డి, గోపిరెడ్డి, భాస్కరరాజు, కృష్ణవేణి పాల్గొన్నారు.
బెంగళూరులో సంఘీభావ యాత్ర
సాక్షి, బెంగళూరు: వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు మద్దతుగా ఆదివారం బెంగళూరులో సంఘీభావ యాత్ర చేపట్టారు. యాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంలో ‘వాక్ విత్ జగనన్న’ పేరుతో ఈ యాత్ర నిర్వహించారు. నగరంలోని పార్టీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు మారతహళ్లి కృతుంగా రెస్టారెంట్ నుంచి అభిమానులు యాత్ర సాగించారు. పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త రాకేష్‌రెడ్డి ఈ యాత్రను ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment