కదిరి: డీఎడ్ పట్టా అంగడి సరుకుగా మారిపోయింది. కాసులు విదిల్చితే చాలు.. వచ్చి చేతుల్లో వాలిపోతున్నాయి. పరీక్షలకు చదివి తయారు కాకున్నా సరే పుస్తకాలు, స్టడీ మెటీరియల్ చూస్తూ మక్కీకి మక్కీగా జవాబులు రాయగలిగితే డీఎడ్ పూర్తి చేసినట్లే. అలా కాకున్నా కాసులు కొంత ఎక్కువ మొత్తంలో ఇచ్చుకుంటే పరీక్ష కూడా వారి బదులు మరొకరితో రాయిస్తారు. ఈ బాధ్యత కూడా ఆయా డీఎడ్ కళాశాలల యాజమాన్యమే చూసుకుంటుంది. విద్యాశాఖ అధికారుల ఉదాసీన వైఖరితో ఇలా అడ్డదారిలో డీఎడ్ పట్టాలు పొందిన ప్రబుద్ధులు విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు.
చూచిరాతే
కదిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నాలుగు రోజులుగా డీఎడ్ పరీక్షలు జరుగుతున్నాయి. శనివారం డీఎడ్ రెండో సంవత్సరం విద్యార్థులకు ఆంగ్ల పరీక్ష జరిగింది. మొత్తం 307 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. దీన్ని పరీక్ష అనడం కంటే చూచిరాత అనడం కరెక్ట్. వీటిపై ‘సాక్షి’ నిఘా పెట్టింది. గేటుకు తాళాలు వేసి ఎటువంటి పోలీస్ బందోబస్త్ లేకుండానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోలీసుశాఖకు సంబంధించిన వారి బంధువులు ఎక్కువ శాతం మంది పరీక్ష రాస్తున్నందున పోలీస్ బందోబస్త్ లేదని పరీక్ష రాస్తున్న కొందరు విద్యార్థులు పేర్కొన్నారు.
ఇన్విజిలేటర్లు అన్నీ తామై..
కదిరి, పరిసర ప్రాంతాలకు చెందిన ప్రైవేటు డీఎడ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు అక్కడ పరీక్ష రాస్తున్నారు. సర్కారు బడుల్లో పనిచేస్తూ తీరిక సమయాల్లో ఆయా డీఎడ్ కళాశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులనే ఆ పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్లుగా నియమించారు. అందుకే ఆయా కళాశాలల యాజమాన్యం చెప్పినట్లు వారే కాపీలను ప్రోత్సహించక తప్పలేదు. కాపీలు ఇవ్వడం, రాసిన తర్వాత మళ్లీ వాటిని కలెక్ట్ చేసి చెత్త బుట్టలో వేయించే బాధ్యతను కూడా ఇన్విజిలేటర్లే తీసుకున్నారు. ప్రతి అరగంటకోసారి నిండిన చెత్త బుట్టను బయట పారేస్తున్నారు. ఈ విషయం అక్కడున్న చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు సిట్టింగ్ స్క్వాడ్, ఫ్‌లైయింగ్ స్క్వాడ్‌కు కూడా తెలియందేమీ కాదు.
ఆప్షన్‌ను బట్టి రేటు
ఒకరి బదులు మరొకరు మొత్తం 30 మంది దాకా పరీక్ష రాస్తున్నట్లు తెలిసింది. కాపీలు రాయిస్తామంటూ పాస్ గ్యారంటీ కింద ఒక్కో అభ్యర్థి దగ్గర రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకరి బదులు మరో అభ్యర్థిని పరీక్షకు అనుమతించేందుకు మరో రేటు, ఇలా డమ్మీ అభ్యర్థిని యాజమాన్యమే సిద్దం చేయాలంటే ఇంకోరేటు వసూలు చేశారని అక్కడ పరీక్ష రాస్తున్న విద్యార్థులే కొందరు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment