deed
-
అకృత్యం – దుష్కృత్యం
అకృత్యం, దుష్కృత్యం అనే రెండు పదాలని సమానార్థకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు సాధారణంగా. నిఘంటువు ననుసరించి రెండింటి మధ్య తేడా ఉన్నా వ్యవహారంలో మాత్రం సమానార్థకాలే. నిజానికి రెండు చేయకూడని పనులే. కాని రెండింటికీ మధ్య అతిసన్నని గీత వంటి తేడా ఉంది. కృత్యం అంటే చేయబడినది, పని అని అర్థం. అకృత్యం అనగానే వ్యతిరేకార్థం కనుక చేయబడనిది అని అర్థం చెప్పేస్తారు వ్యవహారజ్ఞానం తక్కువైన పండితులు. వ్యాకరణ రీత్యా ఆ విధంగా పదాన్ని సాధించవచ్చు. కాని దాని అర్థం మాత్రం చేయకూడని పని అని. చేయబడనిది అనే అర్థంలో అకృత్యం అనవలసి ఉంటుంది. దుష్కృత్యం అంటే చెడ్డపని. అకృత్యం అంటే చేయకూడని పని చేయటం వల్ల ఆ వ్యక్తికి నష్టం కలగ వచ్చు, కలగక పోవచ్చు. అది ఆ వ్యక్తి స్వభావాన్ని సూచిస్తుంది. కాని, దుష్కృత్యం అంటే చెడ్డపని వల్ల వ్యక్తికి ఇతరులకి, సమాజానికి కూడా హాని కలుగుతుంది. మానవుడు ఏ పని చేయకుండా కొద్దిసేపైనా ఉండలేడు. ఏమీ చేయటం లేదు అన్న వ్యక్తి కూడా ఆ క్షణం చేయటం లేదు అనే మాటని పలికాడు కదా! అది పనేగా! గాలి పీల్చటం, మానలేదుగా. ఆహారం తినటం, నీళ్ళు తాగటం ఆపలేదే. ఇవన్నీ ప్రయత్న పూర్వకంగా చేయటం లేదు. అసంకల్పిత చర్యలుగా సాగుతుంటాయి. కనక, నేను ఏమీ చేయటం లేదు అనటానికి వీలు లేదు. చేయటం తప్పనప్పుడు ఉపయోగ పడేది ఏదైనా చేయవచ్చు కదా! చేయాలని ఉండి, ఏం చేయాలో సరిగా తెలియక అనవసరమైన పనికిరాని పని చేయటం జరుగుతుంది. ఉద్దేశపూర్వకంగా చేయక పోయినా, సాధారణంగా చేయకూడని పని వల్ల ఏదో ఒక హాని ఉంటుంది. అందుకే దానిని చెడ్డపనితో సమానంగా భావించటం జరుగుతుంది. కాని, దుష్కృత్యం అంటే, ఉద్దేశపూర్వకంగా, కావాలని ఇతరులకి హాని కలగాలని చేసే పని. దుష్కృత్యం వెనుక దురుద్దేశం ఉంటుంది. కావాలని బాధించటానికి చేసే పని. క్రూరత్వం కాఠిన్యం ఉంటాయి. అది ఒకరకమైన మానసిక స్థితి. నలుగురు ఆనందం గా ఉంటే చూడలేక పోవటం, ఏడుస్తూ ఉంటే ఆనందించటం, ఏదైనా వ్యవస్థ సవ్యంగా నడుస్తూ ఉంటే చూడలేక పోవటం మొదలైన దుర్బుద్ధులు ఉన్నవారు చేసేవి ఈ పనులు. నలుగురు కలిసి ఏదో వేడుక జరుపుకుంటూ ఆనందంగా ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని చూసి ఓర్వ లేక చెడగొట్టటానికి విధ్వంసకచర్యలు చేయటం దుష్కృత్యం కాదా! అదే సామర్థ్యాన్ని, తెలివితేటలని పదిమంది సంతోషానికి ఉపయోగించవచ్చు కదా! ఒక దేశం కాని జాతి గాని పురోగమిస్తున్నప్పుడు ప్రగతి నిరోధక వ్యవహారాలు, మాటలు, ప్రచారాలు దుష్కృత్యాలే. పరాయి దేశాలపై దండయాత్రలు, దోపిడీలు, దోచుకోటాలు చేయతగిన పనులా? ఒకరకంగా చూస్తే ఇవి మానసిక జాడ్యాలు అని చెప్పవచ్చు. పైశాచిక, రాక్షసానందాలు. మందులతో తగ్గకపోతే శస్త్రచికిత్స తప్పదు. సామదాన భేద దండోపాయాల్లో ఏదో ఒక దానితో అదుపు చేయవలసి ఉంటుంది. వ్యక్తిగతమైన కక్షలు, అసూయా ద్వేషాలతో చేసే హానికారకమైన పనుల నుండి, జాతి, మత విద్వేషాలతో చేసే దురాగతాల వరకు ఇటువంటివి మనకు ఎన్నో కనపడుతూ ఉంటాయి. సంఘవిద్రోహకచర్యలు, హత్యలు, అత్యాచారాలు మొదలైననవి అన్నీ దుష్కృత్యాలే. ఒక్కమాటలో చెప్పాలంటే పాపకృత్యాలు అని చెప్పవచ్చు. పాపం అన్న దానికి కూడా చక్కని నిర్వచనం ఇచ్చారు పెద్దలు. ‘‘..పాపాయ పరపీడనం..’’ అని. ఇతరులని బాధించటమే పాపం. అందులోనూ కావాలని బాధించటం. అనుకోకుండా తాము చేసిన పని వల్ల ఇతరులకి బాధ కలిగితే అది పొరపాటు అవుతుంది కాని, దుష్కృత్యం అవదు. దానిని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. – డా. ఎన్. అనంత లక్ష్మి -
ఆస్తుల బదిలీ.. ఇలా ఈజీ!
కుటుంబ సభ్యుల ఆర్థిక భద్రత ప్రతి ఒక్కరికీ ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలి. జీవితాంతం ఎంతో కష్టించి, ఆస్తులు, సంపద కూడబెట్టుకోవడంతోనే సరికాదు. తమ వారికి సాఫీగా బదిలీ అయ్యేలా చర్యలు తీసుకున్నప్పుడే ఆకాంక్ష ఫలిస్తుంది. ఒక ఆస్తికి ఒకటికి మించిన వారసులు ఉంటే పంపకం సమస్యగా మారకూడదు. క్లిష్టమైన కుటుంబ నిర్మాణం ఉన్న వారు ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించాల్సిందే. దురదృష్టవశాత్తూ తమకు ఏదైనా జరిగితే, తమ పేరిట ఉన్న ఆస్తులు వారసులకు సాఫీగా బదిలీ అయ్యేది ఎలా? ఆస్తులకు సంబంధించి వివాదాలు ఏర్పడకుండా చూసుకునేది ఎలా..? ఎస్టేట్ (ఆస్తి) ప్లానింగ్ ఇందుకు పరిష్కారం అవుతుంది. వీలునామా రాస్తే సరిపోతుందిలే అనుకోవద్దు. దీనికంటే మెరుగైనది కుటుంబ ట్రస్ట్. ఆస్తులనే కాకుండా, కుటుంబ వ్యాపారాల సాఫీ పంపిణీ సైతం ఎస్టేట్ ప్లానింగ్‌తో సాధ్యపడుతుంది. ఎస్టేట్ ప్లానింగ్ అంటే..? ఆస్తుల పంపకాన్నే ఎస్టేట్ ప్లానింగ్‌గా చెబుతారు. తమ మరణానంతరం కుటుంబ సభ్యులకు ఆస్తులు ఎలా పంపిణీ చేయాలన్నది ఇందులో ఉంటుంది. తమ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటే కుటుంబ వ్యాపారానికి ఎవరు నాయకత్వం వహించాలి? అనే వివరాలు కూడా ఇందులో భాగమే. ప్లాట్లు, ఇళ్లు, పొలాలు, బంగారం, ఆభరణాలు, బ్యాంక్ బ్యాలన్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నింటికీ ఇందులో చోటు ఉంటుంది. కాయిన్లు, పెయింటింగ్‌లు తదితర అన్నింటి పంపిణీని ఎస్టేట్ ప్లానింగ్‌తో సులభతరం చేసుకోవచ్చు. ట్రస్ట్ ఏర్పాటు కొన్ని కుటుంబాల నిర్మాణం సంక్లిష్టంగా ఉంటుంది. అలాగే, కొన్ని పెద్ద కుంటుంబాలు ఉంటాయి. మొదటి వివాహం ద్వారా పిల్లలు ఉండి, తర్వాత రెండో వివాహం ద్వారా పిల్లలు కన్న వారికి ఆస్తుల పంపిణీలో సహజంగా వివాదాలు ఏర్పడుతుంటాయి. అలాగే, ప్రత్యేక అవసరాల (దివ్యాంగులు) వారూ ఉండొచ్చు. అలాంటి వారికి ఆస్తుల పంపిణీని తమ ఇష్ట ప్రకారం చేసుకోవాలంటే అందుకు వీలునామా లేదా ఫ్యామిలీ ట్రస్ట్ మార్గాలవుతాయి. తమ సంపద సాఫీగా బదిలీ అయ్యేందుకు ట్రస్ట్ వీలు కలి్పస్తుంది. ట్రస్ట్ అంటే ధర్మనిధి. ట్రస్ట్ ఏర్పాటు చేసే వ్యక్తికి, ధర్మ కర్తలకు మధ్య ఒప్పందమే ట్రస్ట్ డీడ్. దీని ద్వారా తనకు సంబంధించిన ఆస్తులను ధర్మకర్తలకు అప్పగిస్తారు. ట్రస్ట్ ఏర్పాటు చేసిన వ్యక్తి మరణానంతరం ట్రస్ట్ డీడ్‌లో పేర్కొన్న విధంగా ఆస్తుల బదిలీ పూర్తి చేయాల్సిన బాధ్యత ట్రస్ట్ నిర్వాహకులపై ఉంటుంది. ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అనుకునే వారు ట్రస్ట్ డీడ్ రాయాల్సి ఉంటుంది. సంపదను ఎలా బదిలీ చేయాలన్నది అందులో స్పష్టంగా పేర్కొనాలి. స్థిర, చరాస్తులను ట్రస్ట్‌కు బదిలీ చేయాలి. ట్రస్ట్ డీడ్ రాసిన తర్వాత దాని నిర్వహణకు ట్రస్టీ (ధర్మకర్త)ని నియమించాలి. స్టాంప్ డ్యూటీ చెల్లించి, ట్రస్ట్‌ను రిజి్రస్టార్ కార్యాలయం వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. ట్రస్ట్ ఏర్పాటు ఉద్దేశాన్ని ట్రస్ట్ డీడ్ తెలియజేయాలి. దీని ఏర్పాటు ఉద్దేశం, ఎలా పనిచేయాలన్నది స్పష్టంగా పేర్కొనాలి. ట్రస్టీ లేదంటే ట్రస్టీలుగా ఎవరిని నియమించాలి? అన్న సందేహం రావచ్చు. స్నేహితులు లేదా బంధువులను ట్రస్టీలుగా నియమించుకోవచ్చు. లేదా కార్పొరేట్ సంస్థను అయినా ట్రస్టీగా నియమించొచ్చు. కొన్ని కార్పొరేట్ సంస్థలు ట్రస్ట్ సేవలను అందిస్తున్నాయి. ట్రస్ట్ వ్యవస్థాపకుడు మరణించినా లేదా తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురైన సందర్భాల్లో ఆస్తులను ఎలా వినియోగించుకోవాలన్న సూచనలను ట్రస్ట్ డీడ్‌లో పేర్కొనొచ్చు. అలాగే, ధర్మకర్త జీవించి లేకపోయినా లేక రిటైర్మెంట్ తీసుకున్నా.. తదుపరి ట్రస్టీగా ఎవరు వ్యవహరించాలన్నది కూడా టస్ట్ర్ డీడ్‌లో పేర్కొనాలి. వీలునామా.. కోర్టు విచారణలు! వీలునామా గురించే ఎక్కువ మందికి తెలుసు. సులభమైన, మెరుగైన సాధనమని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో కొన్ని ప్రతికూలతలు లేకపోలేదు. వీలునామా రిజిస్టర్ చేసినా, చేయకపోయినా దాన్ని కోర్టుల్లో సవాలు చేయవచ్చు. వీలునామా అనేది కేవలం వ్యక్తి మరణానంతరం అమల్లోకి వచ్చే పత్రం. వైకల్యం లేదా తీవ్ర అనారోగ్యం బారిన పడిన సందర్భాల్లో వీలునామా పని చేయదు. మరణించిన వ్యక్తి ఆస్తుల బదిలీకి సంబంధించినదే కానీ, ఆ ఆస్తుల నిర్వహణకు సంబంధించినది కాదు. వీలునామా కింద లబి్ధదారులు హక్కులను కోర్టులో నిరూపించుకోవాల్సి వస్తుంది. ఇందుకు ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టొచ్చు. అప్పటి వరకు ఆ ఆస్తులను వినియోగించుకోవడానికి వీలు పడదు. మోసం, ఫోర్జరీ, ఒత్తిడితో రాయించినట్టు లేదా మానసిక వైకల్యంతో బాధపడుతున్న సమయంలో రాయించినట్టు, తెలియకుండా రాయించుకున్నట్టు తదితర ఆరోపణలపై వీలునామాను కోర్టులో సవాలు చేయవచ్చు. వీలునామాను రిజిస్టర్ చేసినంత మాత్రాన అది చట్టబద్ధంగా చెల్లుబాటు అయిపోతుందని అనుకోవడం పొరపాటు. రిజిస్టర్ చేయించిన వీలునామా సైతం కోర్టుల విచారణ పరిధిలోకి వస్తుంది. మనదేశంలో ఎస్టేట్ ప్లానింగ్ కోసం హిందు అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) ఏర్పాటును కొంత మంది అనుసరిస్తుంటారు. ఇది పన్నుకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాటు. ఒక్కసారి హెచ్‌యూఎఫ్ రిజిస్టర్ చేసి, ఆస్తులు దానికి బదలాయించారంటే.. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు దఖలు పడతాయి. హెచ్‌యూఎఫ్ పరిధిలోని ఆస్తులను విభజించడం వివాదాలు, కోర్టు కేసులకు దారితీయవచ్చు. వీటన్నింటిలోకి మెరుగైనది ఫ్యామిలీ ట్రస్ట్. పిల్లలకు కూడా.. మైనర్ చిన్నారులు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఎస్టేట్ ప్లానింగ్ ప్రయోజనకరంగా ఉంటుంది. తాము లేని రోజున తమ పిల్లల బాధ్యతను బంధువులపై మోపడం.. వారు చూస్తారని ఆశించడం అన్ని సందర్భాల్లో సరైనది అనిపించుకోదు. ఇది పూర్తిస్థాయి, పెద్ద బాధ్యత. ట్రస్ట్ ఏర్పాటు చేసి, దాని నిర్వహణ బాధ్యతను కార్పొరేట్ ట్రస్టీకి అప్పగించడం మెరుగైనది అవుతుంది. కార్పొరేట్ ట్రస్టీ అయితే.. ప్రత్యేక అవసరాల పిల్లలకు (దివ్యాంగులు) పూర్తి సమయం పాటు సహాయకుడు/సహాయకురాలిని అందుబాటులో ఉంచుతారు. అలాగే వంట మనిíÙ, వైద్య సాయం సహాయకులు, స్పెషలిస్ట్ డాక్టర్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. పిల్లలు సాధారణంగా తమ హక్కులను క్లెయిమ్ చేసుకోలేరు. అందుకుని వీలునామా రాస్తే, దాని నిర్వహణ బాధ్యతను ఒకరికి అప్పగించాల్సి వస్తుంది. అందుకే వీలునామాలో ఉన్న ప్రతికూలతల దృష్ట్యా పిల్లల కోసం ఫ్యామిలీ ట్రస్ట్ మెరుగైనది అవుతుంది. ఎవరికి అవసరం..? నిజానికి ఎస్టేట్ ప్లానింగ్ లేదా వీలునామా అనేవి సంపన్నులకేనన్న ఒక అపోహ నెలకొంది. ఇది నిజం కాదు. ప్రతి ఒక్కరికీ ఇది ఎంతగానో సాయపడుతుంది. తమ పేరిట ఆస్తులు ఉన్నా, లేదా అప్పులు ఉన్నా సరే ఎస్టేట్ ప్లానింగ్‌తో వారసులకు మార్గం స్పష్టంగా మారుతుంది. అకాల మరణం ఎదురైతే, తమ పేరిట ఉన్న ఆస్తులు ఎలా పంచాలి? అప్పులు ఎలా తీర్చాలి? ఏ ఆస్తి విక్రయించి అప్పు చెల్లించాలి? వీటికి ఎవరు బాధ్యత వహించాలి? ఇలాంటి వాటికి స్పష్టత ఇవ్వొచ్చు. నిజానికి మనలో 90 శాతం మంది ఆస్తులకు సంబంధించి భవిష్యత్ ప్రణాళిక గురించి ఆలోచించరు. వీలునామా కూడా రాయరు. తాము క్షేమంగా ఉన్నందున, మరణం గురించి చర్చించడం, ఆస్తులపై చర్చను కోరుకోకపోవడం వల్ల ప్రణాళికకు దూరంగా ఉంటుంటారు. నిజానికి ఎంతో ముఖ్యమైన ఈ పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. దీనివల్ల ఉపయోగాలే కానీ, నష్టం ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ దీనికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మార్గాలు.. నామినేషన్, వీలునామా (విల్లు), ఫ్యామిలీ ట్రస్ట్ ఇవన్నీ ఎస్టేట్ ప్లానింగ్‌లో పలు రకాల సాధనాలు. ఆర్థిక సాధనాలకు నామినేషన్ సదుపాయం ఉంటుంది. సంబంధిత ఆస్తి ఎవరికి వెళ్లాలని అనుకుంటే వారి పేరును నామినీగా నమోదు చేసుకోవచ్చు. కానీ, అన్నింటికీ నామినేషన్ సదుపాయం ఉండదు. ముఖ్యంగా స్థిరాస్తులకు నామినేషన్ చేసుకోలేరు. కనుక అన్నింటికీ పరిష్కారంగా ఫ్యామిలీ ట్రస్ట్ అక్కరకు వస్తుంది. ఇలాంటి ఏర్పాట్లు ఏవీ లేకుండా ఓ కుటుంబ యజమాని మరణించిన సందర్భాల్లో లేదా వారసులు కాని వ్యక్తి నామినీగా ఉండి వివాదాలు ఏర్పడిన సందర్భాల్లో.. ఆస్తుల పంపిణీ అన్నది ఆయా మతస్థుల వారసత్వ చట్టం ప్రకారం చేసుకోవాల్సి వస్తుంది. దీనికి కోర్టులను ఆశ్రయించాల్సిందే. హిందూ వారసత్వ చట్టం ప్రకారమైతే మరణించిన వ్యక్తి జీవిత భాగస్వామి, అతని తల్లి, పిల్లలకు సమానంగా ఆస్తులు బదిలీ చేసుకోవాలి. ఈ విషయంలో వివాదం ఏర్పడితే అప్పుడు పరిష్కారానికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇది నిజం కాదు.. ట్రస్ట్ ఏర్పాటు చేస్తే, తమ ఆస్తులన్నీ ట్రస్టీ నిర్వహణలోకి వెళ్లిపోతాయని, వాటిపై తాము నియంత్రణ కోల్పోతామనే అపోహ ఉంది. ట్రస్ట్ ఏర్పాటు చేసి, దానికి తమ ఆస్తులను బదిలీ చేసిన తర్వాత అప్పుడు ట్రస్టీయే యజమాని అవుతారు. నిజానికి ట్రస్ట్ డీల్‌లో పేర్కొన్న మేరకు బాధ్యతలను నిర్వహించడమే ట్రస్టీ పని. అంతేకానీ, సంబంధిత ట్రస్ట్ నిర్వహణలోని ఆస్తులను వినియోగించుకునే, అనుభవించే హక్కులు ట్రస్టీలకు ఉండవు. కేవలం ట్రస్ట్ డీడ్‌లో పేర్కొన్న లబి్ధదారుల ప్రయోజనాల కోసమే ఆ ఆస్తులను వినియోగించాల్సి ఉంటుంది. ట్రస్ట్ ఏర్పాటు చేసిన వారు జీవించి ఉన్నంత వరకు బదిలీ చేసిన ఆస్తులు, ట్రస్ట్ కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. నేడు పలు ప్రొఫెషనల్ ట్రస్ట్ ఏజెన్సీలు ట్రస్టీ సేవలను అందిస్తున్నాయి. అవి ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తాయి. ట్రస్ట్ డీడ్‌కు పూర్తి స్థాయి నిర్వాహకుడి మాదిరే పనిచేస్తాయి. -
కేంద్రం కీలక సంస్కరణ.. దేశంలో ఏకరీతిగా భూ రిజిస్ట్రేషన్..!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ 2022లో నూతన భూ సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఒకే దేశం - ఒకే రిజిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 'ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్' సాఫ్ట్‌వేర్‌తో నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(NGDRS)తో ఏకీకరణను అమలులోకి తీసుకోవడం, డీడ్స్, డాక్యుమెంట్లను ఎక్కడైనా ఏకరీతిగా నమోదు చేయడానికి ప్రోత్సహించబడుతుంది. "మెరుగైన జీవన సౌలభ్యం కోసం, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి వీలుగా వన్ నేషన్ - వన్ రిజిస్ట్రేషన్ విధానం ఏర్పాటు చేయనున్నట్లు" సీతారామన్ తెలిపారు. అలాగే, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి 25,000 ఒప్పందాలు తొలగించామని, 1,486 యూనియన్ చట్టాలను కూడా రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. చెల్లింపులలో జాప్యాన్ని తగ్గించడానికి ఆన్ లైన్ బిల్లు చెల్లింపు వ్యవస్థ గురించి అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలతో మాట్లాడినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే, ఎంటర్ప్రైజ్, హబ్‌ల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొని రావాలని ఆమె తన బడ్జెట్ 2022 ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కొత్త చట్టం ఇప్పటికే ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను కవర్ చేస్తుందని, ఎగుమతులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది అని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. 'ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్' సాఫ్ట్‌వేర్‌తో నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌తో ఏకీకరణను అమలులోకి తీసుకోవడం, డీడ్స్, డాక్యుమెంట్లను ఎక్కడైనా ఏకరీతిగా నమోదు చేయడానికి ప్రోత్సహించబడుతుంది. - కేంద్రమంత్రి @nsitharaman #Budget2022 #AatmaNirbharBharatKaBudget pic.twitter.com/VbvRmJ8t71 — PIB in Telangana 🇮🇳#AmritMahotsav (@PIBHyderabad) February 1, 2022 (చదవండి: బడ్జెట్ 2022: పెరిగేవి..తగ్గేవి ఇవే..!) -
ముడుపు
పుణ్యం–పాపం ఈ రెండు సరిహద్దుల మధ్య నిల్చొని నేను చేసిన ఒక కార్యం గురించి ఈ కథ.నాకు ‘మాజోర్డె’ (గోవాలో ఒక ఊరు) చర్చికి సహాయ ఫాద్రీ అని బదిలీ అయింది. వేసవికాలం మొదలయింది. చర్చిలో చేయవలసిన పనులూ ఊళ్లోని మనుష్యులతో కొత్త పరిచయాలూ ఈ విషయాలతో నిమగ్నమైపోయాను. ఒక నెల తెలియకుండానే గడిచిపోయింది.‘సహాయ మతగురువుగా’(ఫాద్రీ) నా పని, నాకెంతో మనస్ఫూర్తిగా ఇష్టం. స్నేహసంబంధాలు పెంచుకోవడం, పిల్లలతో ఆడుకోవడం, చదువుకొనే పిల్లలకి ఉత్సాహప్రోత్సాహాలు ఇవ్వడం, చెడునడతల్లో మసిలేవాళ్ల గురించి వాకబు చెయ్యడం, కష్టాలలో చిక్కినవాళ్లకి తగిన సహాయం చేయడం నాకు మొదట్నించి బహు ఇష్టం. ‘ఫాద్రీ’ అయ్యాక ఈ నా తత్వం మరీ బలపడింది. నేను ఈ గుణాన్ని పూర్తిగా సద్వినియోగం చేస్తున్నాను. ఒకరోజు నేను చర్చిలో ప్రవచనాలు (సేర్మన్)చెబుతూ మంచి పట్టులో ఉన్నాను. ఒక స్త్రీ తన కొడుకుని ఒక జాతరలో ఏవిధంగా పోగొట్టుకుందో, ఆ పిల్లవాడు తప్పిపోతే వెతికి, వెతికి విసిగిపోయి, ఏ విధంగా భగవంతుడ్ని ప్రార్థించి, ఆయన మీదే భారం వదిలిందో.. తర్వాత ఆవిడ మొక్కుబడికి ఫలితంగా మేరీమాత కరుణించి కొన్ని సంవత్సరాల పిదప ఆ పిల్లవాడు తిరిగి లభించేలా చేసిందో.. అంతా వివరంగా చెప్పాను. నా ‘సెర్మన్’ పూర్తయ్యాక జనమంతా దేవుడికి ప్రార్థనలు చేసి, ఇళ్లకి వెళ్లిపోయారు. కానీ ఒక వయస్సుమీరిన వ్యక్తి వెళ్లలేదు. ఇంకా బల్లమీదే తలవొంచి కళ్లు మూసుకు కూర్చున్నాడు. ప్రార్థన చేస్తూ అతని భక్తి, శ్రద్ధ నన్ను ఆకర్షించాయి. ఏదో కష్టంలో పడి భగవంతుడ్ని రక్షించమని ప్రార్థిస్తున్నాడు కాబోలు. అతడి ధ్యానం భగ్నం చేయడం ఇష్టంలేక, అతడిని అలాగే విడిచి నేను లోపలికి వెళ్లిపోయాను. చర్చి విషయాలు ఫాద్రీ(మతచార్యుడు)తో మాట్లాడటానికి, చర్చి సేవకులకి చెప్పవలసిన పనులు పురమాయించడానికీ వెళ్లాను. ఆ ప్రకారమే ఫాద్రీతో మాట్లాడి ‘సాంక్రిష్టావ్’ (చర్చిలో సామాన్లు ఉంచే కొట్టు)లో సేవకులకి చేయవలసిన పనులు చెప్పి, బయటకి వచ్చాను. చర్చి ప్రవేశద్వారం దగ్గరే అతను నిలబడి, జపమాలతో భగవన్నామం స్మరిస్తున్నాడు. వయసు యాభై లేదా యాభై ఐదు సంవత్సరాలు ఉండవచ్చు. కానీ నడుం వొంగి, చర్మం ముడుతలుపడి డెభ్బై ఏళ్ల ముసలివాడిలా కనిపిస్తున్నాడు. మెడ మీద శాలువా కప్పుకున్నాడు. ఈ రోజుల్లో ఇలా శాలువాని కప్పుకునేవాళ్లు బహుతక్కువ. అందువల్ల అతడి ఈ వేషం కొంత అసామాన్యంగా తోచింది. నాకు ఫేస్ రీడింగ్ రాదు. అయినా నాకనిపించింది. ఈ వ్యక్తి దయామయుడు. పరోపకారి. అతడు నా కోసమే నించునట్టు ఉన్నాడు. నన్ను చూడగానే తలవొంచి వందనం చేశాడు. వయసులో నేను చాలా చిన్నవాడిని గనక సిగ్గేసింది. నేను ఆ పెద్దాయన దగ్గరకి వెళ్లి భుజం మీద చెయ్యివేసి పలకరించాను ‘‘ఏం నాయనా? ఎలాగున్నావు?’’నేనింత అన్నానో లేదో, ఆ ముసలాయన పెదవులు వణుకసాగాయి. కళ్లు చిన్నవిచేసి, ఏదో అర్థిస్తున్నట్లు చూడసాగాడు. అతని కళ్లల్లో నీళ్లు నిండాయి. వణుకుతున్న చేతుల్తో తన భుజంమీదనున్న నా చేతుల్ని నిమురుతూ అన్నాడు.‘‘నా కొడుకా! నువ్వు.. నువ్వు... నా కొడుకువా??’’నేను తడబడుతూ అన్నాను. ‘‘నువ్వు నాకు జన్మనివ్వకపోయినా, నన్ను నీ కొడుకుగా భావించు.’’ నా ఓదార్పు మాటలతో ఆ ముసలాయన కాస్త స్థిమిత పడ్డాడు. కళ్లల్లో నీళ్లు అరచేయితో తుడుస్తూ అన్నాడు.‘‘గురూజీ! క్షమించాలి. మీరు నన్ను ‘నాయనా’ అని సంబోధించారు.నా కనిపించింది.. నా కనిపించింది.. నా కొడుకే నన్ను పలకరించాడని.. నా కొడుకే నాకు లభించాడని... బహుశా నీ అంతే పెరిగి ఉంటాడు ఇప్పుడు.’’ఆ ముసలాయన దుఃఖం నాకు అర్థమయింది. ఆయన కొడుకు ఎక్కడికో దూరప్రాంతాలకి వెళ్లివుంటాడు. బహుశా నావికుడై ఉండొచ్చు. నేను ఆయన్ని అడిగాను ‘‘మీ అబ్బాయి ఎక్కడుంటాడూ?’’ అని పెద్దపెద్దగా తలాడిస్తూ, లోపల నుంచి వరదలా వస్తున్న దుఃఖాన్నీ, ఏడుపునీ ఆపడానికి గట్టిగా పళ్లతో పెదాల్ని నొక్కి పెట్టి, గద్గదస్వరంతో అతనన్నాడు.‘‘నాకు తెలియదు. ఎవరికీ తెలియదు.’’ ఆగి, శిలవ(క్రాస్) వైపు వేలు చూపిస్తూ.. ‘‘ఒక్కడికే తెలుసు... భగవంతుడికి..’’ నా గందరగోళం మరింత హెచ్చింది. క్షణం సేపు నాకు అనుమానం వేసింది. ఈ ముసలాడు పిచ్చివాడు కాదు కదా? కానీ పాపం అతని దుఃఖం చూసి నా మనసు కరిగిపోయింది. ‘‘నీ పేరేమిటి?’’ అడిగాను.‘‘కామిల్.’’‘‘నువ్వెక్కడుండేది?’’‘‘చెరువు దగ్గరున్న మేడ ఇంట్లో’’‘‘నాయనా ‘కామిల్’ నువ్వింక ఇంటికి వెళ్లు. నేను తర్వాత నిన్ను కలుస్తాను’’ అన్నాను.‘‘గురూజీ! మీరు మీ ప్రవచనంలో చెప్పిన ప్రకారం నేను కూడా ముడుపు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను.’’ నా జవాబుకోసం ‘కామిల్’ ఎంతో ఆతృతతో నా కళ్లల్లోకి చూస్తున్నాడు. నేను అతని దృష్టిని తప్పించుకుని ఊరికే ఉన్నాను.‘‘అలా చేస్తే నా కొడుకు తిరిగొస్తాడు కదూ?’’ అతను నన్ను అడిగాడు.‘‘అవును వస్తాడు. దేవుడి మీదే భారం వెయ్యి. వేసి ఎదురు చూడు’’ నేను అతని భుజం తట్టి ధైర్యం చెప్పాను.‘‘కామిన్’’ వెళ్లడానికి వెనుతిరిగాడు. వెళ్తూ, వెళ్తూ అతనన్నమాటలు నా చెవికి తగిలాయి.‘‘చాలా చాలా ఎదురుచూశాను ఫాద్రీ. ఇంకా ఎదురు చూస్తున్నాను. అయినా ఫరవాలేదు.. ఇంకా ఎదురు చూస్తాను.’’అతను వెళ్తూ ఉండగా అతనిని సాగనంపడానికి ఎందుకో నాకాళ్లు ఆడలేదు. నేను తిరిగి లోపలికి వచ్చేశాను. లోపలికి వచ్చి ‘సాంకిశ్తాన్’ని పిలిచాను. వచ్చాడు.‘‘ఇదిగో ఒక విషయం చెప్పు.ఇప్పుడు వచ్చిన ఆ ముసలాయన ఎవరు? అతను నీకు తెలుసా?’’‘‘ఎవరూ? కామిలా.’’‘‘అవును. అతని కథ ఏమిటి? అతని కొడుకు ఎక్కడున్నాడట!’’ నేను ఉత్సుకతతో అడిగాను.‘‘ఏం చెప్పను అయ్యా! ‘కామిల్’ నాకు బాగా తెలుసు. మనిషి స్వచ్ఛమైన బంగారం. ఎవ్వరినైనా అవసరానికి ఆదుకుంటాడు. అతనికి ఎవ్వరూ నా అనే వాళ్లు లేరు. పాపం ఒక్కడే ఒంటరిగా ఉంటాడు. అతనికి ఒక్కడే కొడుకు. ఆ కొడుకు పుట్టగానే భార్య చనిపోయింది. ఆ తర్వాత ‘కామిలే’ కొడుకుని పెంచి పెద్ద చేశాడు. కానీ పాపం ఒకరోజు ఆ కుర్రవాడు సుమారు పన్నెండేళ్ల వయసులో తప్పిపోయాడు.ఎక్కడికెళ్లాడో,ఏమైపోయాడో ఎవరికీ అంతుపట్టలేదు. చాలా వెతికారు. ఏం ప్రయోజనం లేకపోయింది. ఇది జరిగి సుమారు ఇరవై సంవత్సరాలయింది. ఆ అబ్బాయి గురించి ఏవిధమైన సమాచారం అందలేదు.అసలుబతికున్నాడో, లేదో కూడా తెలియదు ఎవరికీ!’’నేను ఆశ్చర్యంగా అడిగాను.. ‘‘మరి కామిల్ ఆశ వదులుకోలేదా? ఇంకా కొడుకు కోసం వెతుకుతున్నాడా?’’‘‘అవును. అతనికనిస్తుంది – కొడుకు తప్పక తిరిగొస్తాడని. ఏనాటికైనా! పాపం ముసలివాడయ్యాడు. కాస్త మతిభ్రమణం కూడా వచ్చినట్టుంది.’’నేను ఆలోచనల్లో పడ్డాను. ‘సాంకిస్తావ్’ చెప్పుకుపోతున్నాడు. ‘‘కామిల్కి చాలా ఉంది. పిల్లవాడు తప్పిపోయినప్పటి నుంచి ఎంతో ఆచూకీ చేశాడు. అందుకోసం ప్రత్యేకంగా బొంబాయి కూడా వెళ్లాడు. ఈ ఊరికి వచ్చే ప్రతీ ఓడ పనివాళ్లని, పడవవాళ్లని విచారిస్తాడు.జాలేస్తుంది. పాపం ‘కామలిన్’ దుస్థితి! మనిషి చాలా ఉత్తముడు. ఈ కామిన్ గత పది, పన్నెండేళ్లలో కనీసం ఐదారు పిల్లల్నయినా తన పిల్లల్లాగా ప్రేమావాత్సల్యాలతో పోషించి పెంచాడు! కానీ పాపం ఏం చేస్తాం అందరూ కృతఘ్నులై విడిచి వెళ్లిపోయారు.’’‘‘మరి అలా ఎందుకు పోషించాడు అంతమందినీ?’’‘‘ఐదుగురంటే ఒక్కసారే అందర్నీ కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కర్ని! ఎందుకు పోషించాడో అతనికే తెలియాలి. అతనికి బహుశా ఇలా అనిపించేది! ఎవరైనా బీద పిల్లవాడిని పోషించి పెద్ద చేస్తే, ఆ పుణ్యం వల్ల తన కొడుకు ఎక్కడున్నా సుఖపడతాడనీ! ఆకుర్రాళ్లకి మాత్రం మదమెక్కినట్లుంది. అతనుపెట్టిన తిండీ, బట్టా అనుభవించినన్నాళ్లూ అనుభవించి అతనికే ఎసరుపెట్టి పలాయనం చేశారు!’’‘కామిల్’ కథ విని నా మనసు చివుక్కుమంది. ఆ రోజు ఆ ఆలోచనల్లోనే గడిచింది. మర్నాడు ‘కామిల్’ సెర్మన్(ప్రవచనం)కి ఎందుకో రాలేదు. నేను మధ్యాహ్నం లేచి, వెతుక్కుంటూ కామిన్ ఇంటికి చేరాను. కామిల్ వసారాలోనే వాలుకుర్చీలో పడుకున్నాడు. ఒంటి మీద నిన్నటి బట్టలే ఉన్నాయి. నా అలికిడి అవగానే గబగబా లేచాడు.‘‘ఎవరూ...? నా కొడుకు ‘జుజో’ వచ్చాడా? రా బంగారు తండ్రీ రా’’నేను ముందనుకొన్నాను. ఫాద్రీ వచ్చాడనే గౌరవభావంతో లేచాడని! కానీ తన ముద్దుల కొడుకు వచ్చాడనుకున్నాడు. పాపం! నా రోబ్ (మత గురువులు ధరించే ఘనమైన దుస్తులు)ని చూసి కూడా గుర్తు పట్టలేదు. నాకు చెప్పక తప్పలేదు.‘‘నాయనా కామిల్! నేను జుజోని కాదు. ఫాద్రీని.’’‘కామిల్’ నిరాశపడి, శక్తి హఠాత్తుగా పోయినవాడిలాగ వరండాలో చతికిలబడ్డాడు. అతని పొరుగింటి వ్యక్తి వచ్చి నాతో అన్నాడు.‘‘ఈ మధ్య అతని ప్రవర్తన కాస్త పిచ్చిగా ఉంటోంది. ఎవరొచ్చినా జొజో వచ్చాడని భ్రమపడతాడు. ఆ తరువాత కాదని తెలిసి నిరాశపడి, కూర్చుంటాడు.’’ఆ వ్యక్తి మాటలు విని నా గుండెల్లో దుఃఖం వరదలా వచ్చింది. ‘కామిల్’ దగ్గర కూర్చుని మెల్లిగా అడిగాను.‘కామిల్’గారూ, ఈవేళ మీరు సెర్మన్కి రాలేదేమి?‘‘రోజు రావడం వీలవడంలేదు. నిన్నవచ్చాను కదా. ఆ బడలిక ఇంకా తీరలేదు.’’‘‘ఫరవాలేదు. దీనులకీ, దుర్భలులకీ భగవంతుడు ఇంటి దగ్గరే దర్శనమిస్తాడు.’’‘కామిల్’ నిజం తెలిసినట్లు తల ఊపాడు. క్షణం ఆగి అన్నాడు. ‘‘నేను ‘మేరీ’మాతకి మొక్కుకున్నాను.’’‘‘మంచిపని చేశావు’’ నేను అప్రయత్నంగా అన్నాను. నేనింకా ఏదో చెబుతానని ఆకాంక్షతో ఎదురు చూస్తున్నాడు కానీ ఎందువల్లో నా గొంతుక ఎండిపోయింది.‘‘నీ కొడుకు జుజో తప్పకవస్తాడు.’’ కానీ అలా అనాలనిపించినా మాటలు పెగల్లేదు. గొంతుక మూగదయిపోయింది.‘‘ఇప్పుడొస్తాడు నా జుజో ఇప్పుడొస్తాడు.’’ఆ రోజు నుంచీ నేను కామిల్ ఇంటికి వెళ్లలేదు.నాకు భయమేసింది. కామిల్ ఆ విషయం నన్ను అడుగుతాడేమోనని, మొక్కుబడి చేసినాఇంకా ఎందుకు రాలేదు నా కొడుకు అని. ‘‘విశ్వాసం ఉంచి ఎదురుచూడు’’ అని నేను ముందే చెప్పాను. ‘‘కానీ ఎన్నిరోజులని ఎదురుచూడను’’ అని నన్ను ప్రశ్నిస్తే, నేను ఏమని జవాబివ్వడం? అందువల్ల నేను కామిల్ ఇంటికి వెళ్లకపోయినా, అతని బాగోగులు విచారిస్తున్నాను.కామిల్ ఆరోగ్యం రోజురోజుకి దిగజారిపోతోంది. మతి చలిస్తోంది. కానీ కొడుకు తిరిగి వస్తాడనే విశ్వాసం మాత్రం రోజు రోజుకీ పెరిగిపోతోంది!వర్షాకాలం చేరువయింది. స్కూళ్ల సెలవులు పూర్తయి కొత్తగా తెరిచారు. ఒకరోజు ఒక స్త్రీ ‘చాందోర్’ (గోవా సాల్సెట్’ తాలూకాలో గ్రామం) నుంచి వచ్చింది – ఒక పిల్లవాడిని వెంటబెట్టుకుని చర్చికి. మత గురువు బయటకి వెళ్లాడు. నేనే ఆమెని కూర్చోబెట్టి అసలు సంగతి అడిగాను. తాను అతి పేదరికం వలన కొడుకుని పోషించలేకపోతోందని, అందువలన చర్చి ఆధీనంలో ఉన్న ‘బోర్డింగ్’ (భోజన, వసతి సౌకర్యాలు ఇచ్చే ఇల్లు)లో జేర్చుకోమని అర్థించడానికి వచ్చింది. ఆమె దీనంగా అంది.‘‘ఈ కుర్రవాడిని మీరు ఉంచుకుంటే ఎంతో పుణ్యముంటుంది. మీరు చెప్పిన ప్రతి పనీ చేస్తాడు.’’ మా చర్చి ‘బోర్డింగ్’ ఇంట్లో ఇటువంటి పిల్లలు ఇంకా ఉన్నారు. ఆ స్త్రీ విన్నపం స్వీకరించి, ఆ పిల్లవాడిని మా చర్చి వసతిగృహలో చేర్చుకోవడానికి అంగీకరించాను. ఆమె ఆ బాలుడ్ని మాకప్పగించి ఇంటికి వెళ్లిపోయింది.ఆ పిల్లవాడ్ని దగ్గరకి పిలిచాను. పద్నాలుగు సంవత్సరాలుండవచ్చు. హుషారుగా కనిపిస్తున్నాడు. నేనడిగాను.‘‘నీ పేరేమిట్రా?’’‘‘జుజో.’’పేరు వినకముందే నాకు హఠాత్తుగా ‘కామిల్’ గుర్తుకు వచ్చాడు. అతని కొడుకు పేరు కూడా జుజో. నాకనిపించింది ఇలా చేస్తే ఎలాగుంటుందీ? కామిల్ ఈ మధ్య స్థిమితం తప్పాడు. ఎవ్వరూ ఇంటికి వచ్చినా, అలికిడయినా తన కొడుకొచ్చాడని తహతహలాడుతున్నాడు. అందుకని ఈ కుర్రవాడ్నే కామిల్ దగ్గరికి పంపి, అతని కొడుకే జుజో వచ్చాడని నమ్మిస్తే ఎలాగుంటుంది? మనిషి మారుతాడేమో, మనసు, ఆరోగ్యం బాగుపడుతుందేమో! ఈ పిల్లవాడి అవసరాలు తీరతాయి, కామిల్కీ ఈ ముసలితనంలో ఆధారం దొరుకుతుంది.ఈ ఆలోచన రాగానే, నాకు మాత్రం స్థిమితం లేకపోయింది. లేచినా, పడుకున్నా, కూర్చున్నా, నడుస్తున్నా ఇదే ఆలోచన. పాప, పుణ్యాల బేరీజు మాని, ఆ పిల్లాడికి విశ్వాసంగా సంగతి చెప్పాను. చేయవలసిన పని నచ్చజెప్పాను. తిరిగొచ్చిన కామిల్ కొడుకుగా నటించాలనీ, ‘కామిల్’ని ‘నాన్నా’ అని సంబోధించాలనీ నేర్పాను. అన్నీ నేను చెప్పినట్లే చేయమని హెచ్చరించాను. ఆ తర్వాత నాటకం సిద్ధం చేసి ఒకరోజు కామిల్ ఇంటికి వెళ్లాం. సాయంకాల సమయం. ‘కామిల్ ఇంటిపట్టునే ఉన్నాడు. లోపల వంట చెయ్యడం కోసం కట్టెలు అగ్గిలో పెట్టి ‘ఫూ’ అంటున్నాడు.‘‘కామిల్ బాబూ, ఇదిగో చూడు– ఎవరొచ్చారో.’’వంట చేయడానికుపక్రమించిన కామిల్ గబగబా లేచాడు. తుండుగుడ్డతో చెయ్యి తుడుచుకుని, అలా తుడుచుకుంటూనే అడిగాడు.‘‘ఎవరొచ్చారూ?’’ అని.‘జుజో వచ్చాడు. ఇదిగో చూడు’ అలా అని నేను జుజోని ముందుకు తోశాను. జుజో ముందే నేర్పిన ప్రకారం ఎదురువెళ్లి ‘నాన్నా’ అన్నాడు.‘‘నా తండ్రీ వచ్చావా?’’ అని అంటూ తడబడుతూ ‘కామిల్’ ముందుకు వచ్చాడు.సూర్యుడి ఆఖరి కిరణాలు వాలుగా పడుతున్నాయి. ‘కామిల్’ ‘జుజో’ని దగ్గరికి తీసుకుని చేతులతో ఆతృతగా నిమిరాడు. ఆగి అనుమానపు చూపులతో నన్ను పొడుస్తూ అన్నాడు.‘‘ఎవరు ఫాద్రీ ఇతడు జుజో అనిఎవరు చెప్పారు? నన్ను మోసం చెయ్యొద్దు. నా జుజో పెద్దవాడయి ఉంటాడు. నీ అంత ఎదిగి ఉంటాడు.’’ అలా అని కామిల్ ఉన్నచోటే చతికిలబడ్డాడు. నాకనిపించినట్టు ఈవేళ ‘కామిల్’ ఏ పిచ్చిలోనూ లేడు. నాలాగే కులాసాగా, మెలుకువగా, తెలివిగా కనిపించాడు.‘‘నేను బహుశా జుజోని గుర్తుపట్టలేకపోవచ్చు. వాడిప్పుడు పెద్దవాడయి ఉంటాడు. కానీ వాడు నన్ను తప్పక గుర్తుపడ్తాడు. నీకు తెలుసా ఈ కుర్తానే నేనెప్పుడూ తొడుక్కుంటాను? లోకులు అంటారు. ఇంక చాలు ఈ కుర్తా వదిలిపెట్టు – చక్కగా చొక్కా తొడుక్కో అని. లోకులేమైనా అనని. నేను పట్టించుకోను. నా జుజో ఉన్నప్పుడు నేను ఈ కుర్తానే వేసుకునేవాడిని. ఇప్పుడు నా జుజో తిరిగివస్తే, నన్ను గుర్తు పట్టలేకపోయినా, నా కుర్తా చూసి తప్పక జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ‘కామిల్’ అలా చాలా మాట్లాడి అలసిపోయాడు. నాకు ఏం చెప్పాలో తెలియలేదు.’’‘‘ఫాద్రీ! నా జుజో తప్పక తిరిగివస్తాడు. నేను సాయ్బిణికి మొక్కుకున్నాను. వాడురాక మానడు. నేను ఎదురుచూస్తున్నాను. జుజో వస్తాడు. వాడు వచ్చేవరకూ, వాడిని చూసేవరకూ నేను ఈ ప్రాణం వదిలేదిలేదు. నేను చావను.. నేను చావను..’’ అంటూ కామిల్ ఏడవసాగాడు.నాకు చాలా సిగ్గువేసింది. నా ప్రయోగం ఫలించలేదని కాదు. ‘కామిల్’కి దేవుడిమీదున్న విశ్వాసం చూసి నాకు కూడా క్షణం సేపు అనిపించింది. నిజంగానే జుజో వస్తాడు!బరువైన హృదయంతోనూ, అలసిపోయిన కాళ్లతోనూ, నేను కృతిమ జుజోని వెంటబెట్టుకు తిరుగుముఖం పట్టాను. ఇది జరిగి పక్షం రోజులు గడిచాయి.అకస్మాత్తుగా ఒకరోజు సాయంకాలం కామిల్ ఇంటి పక్కావిడ పరుగు పరుగున వచ్చింది.‘‘ఫాద్రీ, కామిల్ మరణావస్థలో ఉన్నాడు. త్వరగా రా, వచ్చి దైవ విధి చెయ్యి.’’‘‘మరణిస్తున్నాడా? డాక్టరుకి కబురు వెళ్లిందా?‘‘లేదు. ఈ రాత్రి గడవకపోవచ్చు.’’ నాకు ఆవిడ మాటలకి కోపం వచ్చింది.వీళ్లకి ముందు ఫాద్రీ గుర్తుకొస్తాడు–డాక్టరు కాదు.‘‘నువ్వు వెంటనే వెళ్లి డాక్టర్ని పిలుచుకురా– నేను పంపానని చెప్పు. నేనూ వెంటనే వస్తాను.’’ ఆవిడ వెళ్లిపోయింది. క్షణం సేపు నా బుర్ర తిమ్మిరెక్కిపోయింది. ‘‘జుజో తిరిగి వస్తాడు. వాడిని చూడకుండా నా ఆఖరి శ్వాస విడవను. వాడిని చూసే నేను ప్రాణాలు వదుల్తాను.’’ పాపం ‘కామిల్’ మరణం గుమ్మందాకా వచ్చినా ఆశ వదులుకోవడం లేదు.నేను రెండు మూడు ముఖ్యమైనపనులు పూర్తిచేసి గబగబా బయటపడ్డాను.నేను కామిల్ ఇంటికి చేరేసరికి చీకటిపడింది. డాక్టర్ అతన్ని పరీక్షించి తిరిగి వెళ్లిపోతున్నాడు. నన్ను చూసి డాక్టర్ ఆగాడు. ముసలితనం. జ్వరం తగ్గవచ్చు. నేను ఇంజక్షన్ ఇచ్చాను.అయినా దైవవిధి చేయడం మంచిది. డాక్టర్ వెళ్లిపోయాడు. నేను బాల్కనీలో నించున్నాను. పక్కింటావిడ గుమ్మం దగ్గరే నిల్చొని నాకేసి చూస్తోంది.‘‘పడుకున్నాడా?’’అడిగాను.‘‘లేదు. తెలివిలోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా కొడుకు గురించి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు.’’‘‘నువ్వు ఇంటికి వెళ్లు. భోజనం చేసి రా. ఇక్కడుండేం చేసేది లేదు.’’పక్కింటావిడ వెళ్లేవరకూ నేను ఆగాను. బాగా చీకటియింది. లోపలగదిలో ఓ కిరోసిన్ నూనె దీపం మిణుకు మిణుకుమని వెలుగుతోంది. గదిలో పాత పట్టె మంచం మీద కామిల్ పడుకున్నాడు.నేను ఇటూ అటూ చూశాను. అంతా కటిక చీకటి. దగ్గరలో ఎవ్వరూ కనబడ్డంలేదు. నేను తొరతొరగా నా పొడుగైన ‘రోబ్(మతాధికారి దుస్తులు) తీసేశాను. అది తీశాక లోపల ముందే వేసుకున్న ఫ్యాంటూ, బుష్కోటూ బైటపడ్డాయి. రోబ్ కుర్చీలో పడేసి నేను లోపలికి వెళ్లాను.‘‘నాన్నా!’’ నేను మృదువుగా పిలిచాను.కామిల్ తెలివిలోనే ఉన్నాడు. కళ్లు కూడా తెరిచే ఉన్నాయి. పిలుపు వింటూనే కళ్లు పెద్దవిచేసి, స్పృహలోకి వచ్చాడు.‘‘నాన్నా! నేను జుజోని వచ్చాను.’’ నేను దగ్గరకెళ్లి వొంగొని చెవిలో అన్నాను. ‘‘ఓ నా కొడుకా.. జుజో... నా కొడుకా..’’ కామిల్ అమితానందంలో మాటలే కరువయ్యాయి. కామిల్ హఠాత్తుగా బలం పుంజుకుని లేచాడు. లేచి కూర్చున్నాడు.‘‘నాన్నా..!’’ అంటూ ప్రేమతో నేను కామిల్ భుజం మీద నా తల ఉంచాను. ‘కామిల్’ అవస్థ చూసి నాకు కూడా కళ్లనీళ్లు వచ్చాయి. కళ్లల్లో నీళ్లు ఆగకుండా ప్రవహిస్తున్నాయి.కిరోసిన్ నూనెదీపం చాలా కొద్దిగా కాంతినివ్వడం వలన కామిల్ నన్ను గుర్తుపట్టేయగలడనే భయం లేకపోయింది. నేను కామిల్ని గట్టిగా కౌగిలించుకున్నాను. కామిల్ అతృతగా నా వెన్నునిమురుతున్నాడు. కామిల్ ఒళ్లు జ్వరంతో భగభగ మండుతోంది.అయినా మొహం మీద ఆనందంతో కూడిన నవ్వు నృత్యం చేస్తోంది!‘‘నా కొడుకా.. జుజో నా కొడుకా’’ కామిల్కి ఎంతో మాట్లాడాలని అనిపించినా, నోట్లోంచి పదాలు పెకలడం లేదు. మాటలు దొర్లడం లేదు.‘‘నాన్నా... నాన్నా... ఇంక నిద్రపో’’ నేనన్నాను. కానీ కామిల్ కదలలేదు.‘‘జుజో... నా బంగారు తండ్రీ... నువ్వు వచ్చావా ఇన్నేళ్లకి. నాకు తెలుసు నువ్వు తప్పక వస్తావని. నేను మేరీమాతకి మొక్కుబడి చేశాను. ముడుపు చెల్లిస్తానని వాగ్దానం చేశాను. దేవుడి మీదే విశ్వాసం నిలిపాను. ఆయన దయవల్ల నువ్వు వచ్చావు. ... ఇప్పుడు... ఇప్పుడు... నాకు శక్తిలేదు... నాకు వీ... నువ్వు ముడుపు చెల్లించు దైవానికి... నువ్వు...’’ కామిల్ గొంతుక నూతిలోంచి వస్తున్నట్లు. ఎక్కడో దూరం నుంచి వస్తున్నట్లు తగ్గి తగ్గి..... క్రమేణా అంతరించింది. అతని తల నా భుజం మీద వాలింది. కాళ్లు, చేతులు చల్లబడ్డాయి.నేను నెమ్మదిగా అతని తల జరిపి దిండుమీద ఉంచాను. అతని కళ్లు తెరిచే ఉన్నాయి. వాటిని వేళ్లతో స్పృశించి మూసేశాను. అతని శరీరం మీద దుప్పటి కప్పాను. ఆ తర్వాత బయటికి వచ్చి మళ్లీ ‘రోబ్’ ముందులాగే ధరించాను. కొంకణీ మూలం : దామోదర్ మావ్జొ అనువాదం: శిష్టా జగన్నాధరావు -
రాసుకున్నోళ్లకు రాసుకున్నంత..!
కదిరి: డీఎడ్ పట్టా అంగడి సరుకుగా మారిపోయింది. కాసులు విదిల్చితే చాలు.. వచ్చి చేతుల్లో వాలిపోతున్నాయి. పరీక్షలకు చదివి తయారు కాకున్నా సరే పుస్తకాలు, స్టడీ మెటీరియల్ చూస్తూ మక్కీకి మక్కీగా జవాబులు రాయగలిగితే డీఎడ్ పూర్తి చేసినట్లే. అలా కాకున్నా కాసులు కొంత ఎక్కువ మొత్తంలో ఇచ్చుకుంటే పరీక్ష కూడా వారి బదులు మరొకరితో రాయిస్తారు. ఈ బాధ్యత కూడా ఆయా డీఎడ్ కళాశాలల యాజమాన్యమే చూసుకుంటుంది. విద్యాశాఖ అధికారుల ఉదాసీన వైఖరితో ఇలా అడ్డదారిలో డీఎడ్ పట్టాలు పొందిన ప్రబుద్ధులు విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. చూచిరాతే కదిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నాలుగు రోజులుగా డీఎడ్ పరీక్షలు జరుగుతున్నాయి. శనివారం డీఎడ్ రెండో సంవత్సరం విద్యార్థులకు ఆంగ్ల పరీక్ష జరిగింది. మొత్తం 307 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. దీన్ని పరీక్ష అనడం కంటే చూచిరాత అనడం కరెక్ట్. వీటిపై ‘సాక్షి’ నిఘా పెట్టింది. గేటుకు తాళాలు వేసి ఎటువంటి పోలీస్ బందోబస్త్ లేకుండానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోలీసుశాఖకు సంబంధించిన వారి బంధువులు ఎక్కువ శాతం మంది పరీక్ష రాస్తున్నందున పోలీస్ బందోబస్త్ లేదని పరీక్ష రాస్తున్న కొందరు విద్యార్థులు పేర్కొన్నారు. ఇన్విజిలేటర్లు అన్నీ తామై.. కదిరి, పరిసర ప్రాంతాలకు చెందిన ప్రైవేటు డీఎడ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు అక్కడ పరీక్ష రాస్తున్నారు. సర్కారు బడుల్లో పనిచేస్తూ తీరిక సమయాల్లో ఆయా డీఎడ్ కళాశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులనే ఆ పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్లుగా నియమించారు. అందుకే ఆయా కళాశాలల యాజమాన్యం చెప్పినట్లు వారే కాపీలను ప్రోత్సహించక తప్పలేదు. కాపీలు ఇవ్వడం, రాసిన తర్వాత మళ్లీ వాటిని కలెక్ట్ చేసి చెత్త బుట్టలో వేయించే బాధ్యతను కూడా ఇన్విజిలేటర్లే తీసుకున్నారు. ప్రతి అరగంటకోసారి నిండిన చెత్త బుట్టను బయట పారేస్తున్నారు. ఈ విషయం అక్కడున్న చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లైయింగ్ స్క్వాడ్‌కు కూడా తెలియందేమీ కాదు. ఆప్షన్‌ను బట్టి రేటు ఒకరి బదులు మరొకరు మొత్తం 30 మంది దాకా పరీక్ష రాస్తున్నట్లు తెలిసింది. కాపీలు రాయిస్తామంటూ పాస్ గ్యారంటీ కింద ఒక్కో అభ్యర్థి దగ్గర రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకరి బదులు మరో అభ్యర్థిని పరీక్షకు అనుమతించేందుకు మరో రేటు, ఇలా డమ్మీ అభ్యర్థిని యాజమాన్యమే సిద్దం చేయాలంటే ఇంకోరేటు వసూలు చేశారని అక్కడ పరీక్ష రాస్తున్న విద్యార్థులే కొందరు పేర్కొన్నారు. -
రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేటీకరణ తగదు
ఏపీ దస్తావేజు లేఖరుల సంఘం డిమాండ్ విజయవాడ బ్యూరో : రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలను ప్రైయివేటేజైషన్ చేసి వేలాది మంది దస్తావేజు లేఖర్ల పొట్టగొట్టే ప్రయత్నాలు విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ అధ్యక్షతన విజయవాడలో మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రిజిస్ట్ట్రేషన్ కార్యకలాపాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రకటించడం పట్ల దస్తావేజు లేఖరుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 291 సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజు లేఖరులుగా పనిచేస్తున్న అనేక వేల మంది రోడ్డున పడతారని, వారి కుటుంబాలకు ఉపాధి పోతుందని దస్తావేజు లేఖరుల సంఘం వాపోయింది. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని నిర్ణయించారు. దస్తావేజు లేఖరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్టాంప్స్ అండ్ రిజిస్ట్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు, మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని తీర్మానించారు. ఈ సమావేశంలో సంఘ రాష్ర్ట అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వేణుగోపాల్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యాక్షుడు ఎలియాజర్, ఏపీసీఆర్డీఏ ఇన్చార్జి పైలా సతీష్‌బాబు పాల్గొని మాట్లాడారు. -
ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు
ఇల్లు కొనాలన్నా....భూమి విక్రయించాలన్నా...మార్కెట్ విలువ తెలుసుకోవాలన్నా... ఒప్పంద పత్రాలు రిజిస్ట్రేషన్ చేయించాలన్నా...అందుకు ఏ దారిలో వెళ్లాలో తెలియక ప్రజలు దళారులను ఆశ్రయిస్తుంటారు. దీంతో లొసుగు వ్యవహారాలు మొదలవుతాయి. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ శాఖలో దళారుల దందా నడుస్తోంది. ఇది ప్రజలకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆన్లైన్ సేవలు అందించేలా ప్రభుత్వం మార్పులు తీసుకు రానుంది. తొలుత యూనిక్ కోడ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ఆ శాఖ కసరత్తు పూర్తి చేసింది. సత్తెనపల్లి స్థిరాస్తి క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లను ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. వచ్చే నెల నుంచి ఆన్లైన్ విధానాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. దస్తావేజు లేఖరులు లేకుండా ఆస్తుల క్రయ విక్రయదారులే నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లే విధంగా ఆన్లైన్ విధానం అమలు చేసేందుకు కార్యచరణ రూపొందించారు. ఈ నెల 1వ తేదీ నుంచి 6 వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్ట్రేషన్లు నిలిపి వేసి సెంట్రల్ సర్వర్‌ను ఆన్‌లైన్‌కు అనుసంధానం చేశారు. కొత్త సాఫ్ట్‌వేర్‌ను లోడు చేశారు. ఇక మీదట సేల్ డీడ్లు, గిఫ్ట్ డీడ్లు ఇతర రిజిస్ట్రేషన్లు ఎవరికి వారు నిర్వహించుకునేలా కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఆస్తుల మార్కెట్ విలువలు కూడా ఇంటర్నెట్లో చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఫీజు కూడా చలానా రూపంలో నేరుగా చెల్లించవచ్చు. స్లాట్ బుకింగ్ ఇలా......... ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయదలుచుకున్న వారు ఆన్లైన్లో డాక్యుమెంట్ నమూనాలు పూర్తి చేయాలి. సంబంధిత వెబ్సైట్లోకి వెళ్లి ఆ దరఖాస్తులో ఆధార్ నంబరు ఎంటర్ చేయగానే ఆటోమ్యాటిక్‌గా డేటా సెంటర్ నుంచి సదరు వ్యక్తి వివరాలు వేలిముద్రలతో సహా వస్తాయి. ఆస్తి వివరాలకు సంబంధించిన ఖాళీల్లో సరిహద్దులు, విస్తీర్ణం వివరాలు నమోదు చేయాలి. మార్కెట్ విలువ కూడా ఆన్లైన్లోనే తెలుసుకుని బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ ద్వారా చలానా లేకుండా ఫీజు కూడా చెల్లించవచ్చు. ఏ తేదీన రిజిస్ట్రేషన్ చేయదలచుకుంటారో అం దులో పేర్కొంటే ప్రాధాన్యతా క్రమంలో స్లాట్ కేటాయిస్తారు. ఆ రోజున రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే పాత దస్తావేజులు, లింకు డాక్యుమెంట్లు పరిశీలించి మరో సారి వేలిముద్రలు, ఫొటోలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తారు. దస్తావేజు లేఖరులతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. అనుసంధానానికి అవకాశం.. భూముల క్రయ, విక్రయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి కొన్ని శాఖలతో అనుసంధానం చేసే దిశగా రిజిస్ట్రేషన్ శాఖ అడుగులువేస్తోంది. ఇప్పటికే బోగస్ పట్టాదారు పాస్‌పుస్తకాలతో నష్టపోకుండా ఉండేందుకు రెవెన్యూ శాఖ దస్త్రాలతో రిజిస్ట్రేషన్ శాఖ సరిచూసిన తరువాతే నమోదు చేస్తోంది. ఎవరైనా భూములు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన తరువాత వారి వివరాలను రెవెన్యూ, పురపాలక, గ్రామ పంచాయతీ, విద్యుత్ శాఖలలో హక్కుదారులుగా తమ వివరాలు నమోదుచేసుకోవాలి. చాలా వరకు ఇది జరగడం లేదు. దీంతో దస్త్రాలు తారుమారు చేయడం వంటివి బయటపడుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే సంబంధిత శాఖల దస్త్రాల్లోనే అసలైన హక్కుదారుల వివరాలు నమోదయ్యేలా అనుసంధానం జరగనుంది.