ఇక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు | The online registrations | Sakshi
Sakshi News home page

ఇక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు

Published Sun, Oct 19 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

ఇక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు

ఇక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు

ఇల్లు కొనాలన్నా....భూమి విక్రయించాలన్నా...మార్కెట్ విలువ తెలుసుకోవాలన్నా...
 ఒప్పంద పత్రాలు రిజిస్ట్రేషన్ చేయించాలన్నా...అందుకు ఏ దారిలో వెళ్లాలో తెలియక ప్రజలు దళారులను ఆశ్రయిస్తుంటారు. దీంతో లొసుగు వ్యవహారాలు మొదలవుతాయి. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ శాఖలో దళారుల దందా నడుస్తోంది. ఇది ప్రజలకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆన్‌లైన్ సేవలు అందించేలా ప్రభుత్వం మార్పులు తీసుకు రానుంది. తొలుత యూనిక్ కోడ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ఆ శాఖ కసరత్తు పూర్తి చేసింది.

 
 సత్తెనపల్లి
 స్థిరాస్తి క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. వచ్చే నెల నుంచి ఆన్‌లైన్ విధానాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేయనున్నారు.

     దస్తావేజు లేఖరులు లేకుండా ఆస్తుల క్రయ విక్రయదారులే నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లే విధంగా ఆన్‌లైన్ విధానం అమలు చేసేందుకు కార్యచరణ రూపొందించారు.
     ఈ నెల 1వ తేదీ నుంచి 6 వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్ట్రేషన్లు నిలిపి వేసి సెంట్రల్ సర్వర్‌ను ఆన్‌లైన్‌కు అనుసంధానం చేశారు. కొత్త సాఫ్ట్‌వేర్‌ను లోడు చేశారు.
     ఇక మీదట సేల్ డీడ్‌లు, గిఫ్ట్ డీడ్‌లు ఇతర రిజిస్ట్రేషన్లు ఎవరికి వారు నిర్వహించుకునేలా కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు.
     ఆస్తుల మార్కెట్ విలువలు కూడా ఇంటర్నెట్‌లో చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఫీజు కూడా చలానా రూపంలో నేరుగా చెల్లించవచ్చు.

 స్లాట్ బుకింగ్ ఇలా.........
 ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయదలుచుకున్న వారు ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్ నమూనాలు పూర్తి చేయాలి. సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆ దరఖాస్తులో ఆధార్ నంబరు ఎంటర్ చేయగానే ఆటోమ్యాటిక్‌గా డేటా సెంటర్ నుంచి సదరు వ్యక్తి వివరాలు వేలిముద్రలతో సహా వస్తాయి.

     ఆస్తి వివరాలకు సంబంధించిన ఖాళీల్లో సరిహద్దులు, విస్తీర్ణం వివరాలు నమోదు చేయాలి.
     మార్కెట్ విలువ కూడా ఆన్‌లైన్‌లోనే తెలుసుకుని బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ ద్వారా చలానా లేకుండా ఫీజు కూడా చెల్లించవచ్చు.

     ఏ తేదీన రిజిస్ట్రేషన్ చేయదలచుకుంటారో అం దులో పేర్కొంటే ప్రాధాన్యతా క్రమంలో స్లాట్ కేటాయిస్తారు. ఆ రోజున రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే పాత దస్తావేజులు, లింకు డాక్యుమెంట్లు పరిశీలించి మరో సారి వేలిముద్రలు, ఫొటోలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తారు. దస్తావేజు లేఖరులతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు.

 అనుసంధానానికి అవకాశం..
 భూముల క్రయ, విక్రయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి కొన్ని శాఖలతో అనుసంధానం చేసే దిశగా రిజిస్ట్రేషన్ శాఖ అడుగులువేస్తోంది.  ఇప్పటికే బోగస్ పట్టాదారు పాస్‌పుస్తకాలతో నష్టపోకుండా ఉండేందుకు రెవెన్యూ శాఖ దస్త్రాలతో రిజిస్ట్రేషన్ శాఖ సరిచూసిన తరువాతే నమోదు చేస్తోంది.

     ఎవరైనా భూములు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన తరువాత వారి వివరాలను రెవెన్యూ, పురపాలక, గ్రామ పంచాయతీ, విద్యుత్ శాఖలలో హక్కుదారులుగా తమ వివరాలు నమోదుచేసుకోవాలి. చాలా వరకు ఇది జరగడం లేదు. దీంతో దస్త్రాలు తారుమారు చేయడం వంటివి బయటపడుతున్నాయి.
     దీనికి అడ్డుకట్ట వేయడానికి రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే సంబంధిత శాఖల దస్త్రాల్లోనే అసలైన హక్కుదారుల వివరాలు నమోదయ్యేలా అనుసంధానం జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement