పుణ్యం–పాపం ఈ రెండు సరిహద్దుల మధ్య నిల్చొని నేను చేసిన ఒక కార్యం గురించి ఈ కథ.నాకు ‘మాజోర్డె’ (గోవాలో ఒక ఊరు) చర్చికి సహాయ ఫాద్రీ అని బదిలీ అయింది. వేసవికాలం మొదలయింది. చర్చిలో చేయవలసిన పనులూ ఊళ్లోని మనుష్యులతో కొత్త పరిచయాలూ ఈ విషయాలతో నిమగ్నమైపోయాను. ఒక నెల తెలియకుండానే గడిచిపోయింది.‘సహాయ మతగురువుగా’(ఫాద్రీ) నా పని, నాకెంతో మనస్ఫూర్తిగా ఇష్టం. స్నేహసంబంధాలు పెంచుకోవడం, పిల్లలతో ఆడుకోవడం, చదువుకొనే పిల్లలకి ఉత్సాహప్రోత్సాహాలు ఇవ్వడం, చెడునడతల్లో మసిలేవాళ్ల గురించి వాకబు చెయ్యడం, కష్టాలలో చిక్కినవాళ్లకి తగిన సహాయం చేయడం నాకు మొదట్నించి బహు ఇష్టం. ‘ఫాద్రీ’ అయ్యాక ఈ నా తత్వం మరీ బలపడింది. నేను ఈ గుణాన్ని పూర్తిగా సద్వినియోగం చేస్తున్నాను.
ఒకరోజు నేను చర్చిలో ప్రవచనాలు (సేర్మన్)చెబుతూ మంచి పట్టులో ఉన్నాను. ఒక స్త్రీ తన కొడుకుని ఒక జాతరలో ఏవిధంగా పోగొట్టుకుందో, ఆ పిల్లవాడు తప్పిపోతే వెతికి, వెతికి విసిగిపోయి, ఏ విధంగా భగవంతుడ్ని ప్రార్థించి, ఆయన మీదే భారం వదిలిందో.. తర్వాత ఆవిడ మొక్కుబడికి ఫలితంగా మేరీమాత కరుణించి కొన్ని సంవత్సరాల పిదప ఆ పిల్లవాడు తిరిగి లభించేలా చేసిందో.. అంతా వివరంగా చెప్పాను. నా ‘సెర్మన్’ పూర్తయ్యాక జనమంతా దేవుడికి ప్రార్థనలు చేసి, ఇళ్లకి వెళ్లిపోయారు. కానీ ఒక వయస్సుమీరిన వ్యక్తి వెళ్లలేదు. ఇంకా బల్లమీదే తలవొంచి కళ్లు మూసుకు కూర్చున్నాడు. ప్రార్థన చేస్తూ అతని భక్తి, శ్రద్ధ నన్ను ఆకర్షించాయి. ఏదో కష్టంలో పడి భగవంతుడ్ని రక్షించమని ప్రార్థిస్తున్నాడు కాబోలు. అతడి ధ్యానం భగ్నం చేయడం ఇష్టంలేక, అతడిని అలాగే విడిచి నేను లోపలికి వెళ్లిపోయాను. చర్చి విషయాలు ఫాద్రీ(మతచార్యుడు)తో మాట్లాడటానికి, చర్చి సేవకులకి చెప్పవలసిన పనులు పురమాయించడానికీ వెళ్లాను. ఆ ప్రకారమే ఫాద్రీతో మాట్లాడి ‘సాంక్రిష్టావ్’ (చర్చిలో సామాన్లు ఉంచే కొట్టు)లో సేవకులకి చేయవలసిన పనులు చెప్పి, బయటకి వచ్చాను.
చర్చి ప్రవేశద్వారం దగ్గరే అతను నిలబడి, జపమాలతో భగవన్నామం స్మరిస్తున్నాడు. వయసు యాభై లేదా యాభై ఐదు సంవత్సరాలు ఉండవచ్చు. కానీ నడుం వొంగి, చర్మం ముడుతలుపడి డెభ్బై ఏళ్ల ముసలివాడిలా కనిపిస్తున్నాడు. మెడ మీద శాలువా కప్పుకున్నాడు. ఈ రోజుల్లో ఇలా శాలువాని కప్పుకునేవాళ్లు బహుతక్కువ. అందువల్ల అతడి ఈ వేషం కొంత అసామాన్యంగా తోచింది. నాకు ఫేస్ రీడింగ్ రాదు. అయినా నాకనిపించింది. ఈ వ్యక్తి దయామయుడు. పరోపకారి. అతడు నా కోసమే నించునట్టు ఉన్నాడు. నన్ను చూడగానే తలవొంచి వందనం చేశాడు. వయసులో నేను చాలా చిన్నవాడిని గనక సిగ్గేసింది.
నేను ఆ పెద్దాయన దగ్గరకి వెళ్లి భుజం మీద చెయ్యివేసి పలకరించాను ‘‘ఏం నాయనా? ఎలాగున్నావు?’’నేనింత అన్నానో లేదో, ఆ ముసలాయన పెదవులు వణుకసాగాయి. కళ్లు చిన్నవిచేసి, ఏదో అర్థిస్తున్నట్లు చూడసాగాడు. అతని కళ్లల్లో నీళ్లు నిండాయి. వణుకుతున్న చేతుల్తో తన భుజంమీదనున్న నా చేతుల్ని నిమురుతూ అన్నాడు.‘‘నా కొడుకా! నువ్వు.. నువ్వు... నా కొడుకువా??’’నేను తడబడుతూ అన్నాను. ‘‘నువ్వు నాకు జన్మనివ్వకపోయినా, నన్ను నీ కొడుకుగా భావించు.’’ నా ఓదార్పు మాటలతో ఆ ముసలాయన కాస్త స్థిమిత పడ్డాడు. కళ్లల్లో నీళ్లు అరచేయితో తుడుస్తూ అన్నాడు.‘‘గురూజీ! క్షమించాలి. మీరు నన్ను ‘నాయనా’ అని సంబోధించారు.నా కనిపించింది.. నా కనిపించింది.. నా కొడుకే నన్ను పలకరించాడని.. నా కొడుకే నాకు లభించాడని... బహుశా నీ అంతే పెరిగి ఉంటాడు ఇప్పుడు.’’ఆ ముసలాయన దుఃఖం నాకు అర్థమయింది. ఆయన కొడుకు ఎక్కడికో దూరప్రాంతాలకి వెళ్లివుంటాడు. బహుశా నావికుడై ఉండొచ్చు. నేను ఆయన్ని అడిగాను ‘‘మీ అబ్బాయి ఎక్కడుంటాడూ?’’ అని పెద్దపెద్దగా తలాడిస్తూ, లోపల నుంచి వరదలా వస్తున్న దుఃఖాన్నీ, ఏడుపునీ ఆపడానికి గట్టిగా పళ్లతో పెదాల్ని నొక్కి పెట్టి, గద్గదస్వరంతో అతనన్నాడు.‘‘నాకు తెలియదు. ఎవరికీ తెలియదు.’’ ఆగి, శిలవ(క్రాస్) వైపు వేలు చూపిస్తూ.. ‘‘ఒక్కడికే తెలుసు... భగవంతుడికి..’’ నా గందరగోళం మరింత హెచ్చింది. క్షణం సేపు నాకు అనుమానం వేసింది. ఈ ముసలాడు పిచ్చివాడు కాదు కదా? కానీ పాపం అతని దుఃఖం చూసి నా మనసు కరిగిపోయింది.
‘‘నీ పేరేమిటి?’’ అడిగాను.‘‘కామిల్.’’‘‘నువ్వెక్కడుండేది?’’‘‘చెరువు దగ్గరున్న మేడ ఇంట్లో’’‘‘నాయనా ‘కామిల్’ నువ్వింక ఇంటికి వెళ్లు. నేను తర్వాత నిన్ను కలుస్తాను’’ అన్నాను.‘‘గురూజీ! మీరు మీ ప్రవచనంలో చెప్పిన ప్రకారం నేను కూడా ముడుపు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను.’’ నా జవాబుకోసం ‘కామిల్’ ఎంతో ఆతృతతో నా కళ్లల్లోకి చూస్తున్నాడు. నేను అతని దృష్టిని తప్పించుకుని ఊరికే ఉన్నాను.‘‘అలా చేస్తే నా కొడుకు తిరిగొస్తాడు కదూ?’’ అతను నన్ను అడిగాడు.‘‘అవును వస్తాడు. దేవుడి మీదే భారం వెయ్యి. వేసి ఎదురు చూడు’’ నేను అతని భుజం తట్టి ధైర్యం చెప్పాను.‘‘కామిన్’’ వెళ్లడానికి వెనుతిరిగాడు. వెళ్తూ, వెళ్తూ అతనన్నమాటలు నా చెవికి తగిలాయి.‘‘చాలా చాలా ఎదురుచూశాను ఫాద్రీ. ఇంకా ఎదురు చూస్తున్నాను. అయినా ఫరవాలేదు.. ఇంకా ఎదురు చూస్తాను.’’అతను వెళ్తూ ఉండగా అతనిని సాగనంపడానికి ఎందుకో నాకాళ్లు ఆడలేదు. నేను తిరిగి లోపలికి వచ్చేశాను. లోపలికి వచ్చి ‘సాంకిశ్తాన్’ని పిలిచాను. వచ్చాడు.‘‘ఇదిగో ఒక విషయం చెప్పు.ఇప్పుడు వచ్చిన ఆ ముసలాయన ఎవరు? అతను నీకు తెలుసా?’’‘‘ఎవరూ? కామిలా.’’‘‘అవును. అతని కథ ఏమిటి? అతని కొడుకు ఎక్కడున్నాడట!’’ నేను ఉత్సుకతతో అడిగాను.‘‘ఏం చెప్పను అయ్యా! ‘కామిల్’ నాకు బాగా తెలుసు. మనిషి స్వచ్ఛమైన బంగారం. ఎవ్వరినైనా అవసరానికి ఆదుకుంటాడు. అతనికి ఎవ్వరూ నా అనే వాళ్లు లేరు. పాపం ఒక్కడే ఒంటరిగా ఉంటాడు. అతనికి ఒక్కడే కొడుకు. ఆ కొడుకు పుట్టగానే భార్య చనిపోయింది. ఆ తర్వాత ‘కామిలే’ కొడుకుని పెంచి పెద్ద చేశాడు. కానీ పాపం ఒకరోజు ఆ కుర్రవాడు సుమారు పన్నెండేళ్ల వయసులో తప్పిపోయాడు.ఎక్కడికెళ్లాడో,ఏమైపోయాడో ఎవరికీ అంతుపట్టలేదు. చాలా వెతికారు. ఏం ప్రయోజనం లేకపోయింది. ఇది జరిగి సుమారు ఇరవై సంవత్సరాలయింది. ఆ అబ్బాయి గురించి ఏవిధమైన సమాచారం అందలేదు.అసలుబతికున్నాడో, లేదో కూడా తెలియదు ఎవరికీ!’’నేను ఆశ్చర్యంగా అడిగాను.. ‘‘మరి కామిల్ ఆశ వదులుకోలేదా? ఇంకా కొడుకు కోసం వెతుకుతున్నాడా?’’‘‘అవును. అతనికనిస్తుంది – కొడుకు తప్పక తిరిగొస్తాడని. ఏనాటికైనా! పాపం ముసలివాడయ్యాడు. కాస్త మతిభ్రమణం కూడా వచ్చినట్టుంది.’’నేను ఆలోచనల్లో పడ్డాను. ‘సాంకిస్తావ్’ చెప్పుకుపోతున్నాడు.
‘‘కామిల్‌కి చాలా ఉంది. పిల్లవాడు తప్పిపోయినప్పటి నుంచి ఎంతో ఆచూకీ చేశాడు. అందుకోసం ప్రత్యేకంగా బొంబాయి కూడా వెళ్లాడు. ఈ ఊరికి వచ్చే ప్రతీ ఓడ పనివాళ్లని, పడవవాళ్లని విచారిస్తాడు.జాలేస్తుంది. పాపం ‘కామలిన్’ దుస్థితి! మనిషి చాలా ఉత్తముడు. ఈ కామిన్ గత పది, పన్నెండేళ్లలో కనీసం ఐదారు పిల్లల్నయినా తన పిల్లల్లాగా ప్రేమావాత్సల్యాలతో పోషించి పెంచాడు! కానీ పాపం ఏం చేస్తాం అందరూ కృతఘ్నులై విడిచి వెళ్లిపోయారు.’’‘‘మరి అలా ఎందుకు పోషించాడు అంతమందినీ?’’‘‘ఐదుగురంటే ఒక్కసారే అందర్నీ కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కర్ని! ఎందుకు పోషించాడో అతనికే తెలియాలి. అతనికి బహుశా ఇలా అనిపించేది! ఎవరైనా బీద పిల్లవాడిని పోషించి పెద్ద చేస్తే, ఆ పుణ్యం వల్ల తన కొడుకు ఎక్కడున్నా సుఖపడతాడనీ! ఆకుర్రాళ్లకి మాత్రం మదమెక్కినట్లుంది. అతనుపెట్టిన తిండీ, బట్టా అనుభవించినన్నాళ్లూ అనుభవించి అతనికే ఎసరుపెట్టి పలాయనం చేశారు!’’‘కామిల్’ కథ విని నా మనసు చివుక్కుమంది. ఆ రోజు ఆ ఆలోచనల్లోనే గడిచింది. మర్నాడు ‘కామిల్’ సెర్మన్(ప్రవచనం)కి ఎందుకో రాలేదు. నేను మధ్యాహ్నం లేచి, వెతుక్కుంటూ కామిన్ ఇంటికి చేరాను. కామిల్ వసారాలోనే వాలుకుర్చీలో పడుకున్నాడు. ఒంటి మీద నిన్నటి బట్టలే ఉన్నాయి. నా అలికిడి అవగానే గబగబా లేచాడు.‘‘ఎవరూ...? నా కొడుకు ‘జుజో’ వచ్చాడా? రా బంగారు తండ్రీ రా’’నేను ముందనుకొన్నాను. ఫాద్రీ వచ్చాడనే గౌరవభావంతో లేచాడని! కానీ తన ముద్దుల కొడుకు వచ్చాడనుకున్నాడు. పాపం! నా రోబ్ (మత గురువులు ధరించే ఘనమైన దుస్తులు)ని చూసి కూడా గుర్తు పట్టలేదు. నాకు చెప్పక తప్పలేదు.‘‘నాయనా కామిల్! నేను జుజోని కాదు. ఫాద్రీని.’’‘కామిల్’ నిరాశపడి, శక్తి హఠాత్తుగా పోయినవాడిలాగ వరండాలో చతికిలబడ్డాడు. అతని పొరుగింటి వ్యక్తి వచ్చి నాతో అన్నాడు.‘‘ఈ మధ్య అతని ప్రవర్తన కాస్త పిచ్చిగా ఉంటోంది. ఎవరొచ్చినా జొజో వచ్చాడని భ్రమపడతాడు. ఆ తరువాత కాదని తెలిసి నిరాశపడి, కూర్చుంటాడు.’’ఆ వ్యక్తి మాటలు విని నా గుండెల్లో దుఃఖం వరదలా వచ్చింది. ‘కామిల్’ దగ్గర కూర్చుని మెల్లిగా అడిగాను.‘కామిల్’గారూ, ఈవేళ మీరు సెర్మన్‌కి రాలేదేమి?‘‘రోజు రావడం వీలవడంలేదు. నిన్నవచ్చాను కదా. ఆ బడలిక ఇంకా తీరలేదు.’’‘‘ఫరవాలేదు. దీనులకీ, దుర్భలులకీ భగవంతుడు ఇంటి దగ్గరే దర్శనమిస్తాడు.’’‘కామిల్’ నిజం తెలిసినట్లు తల ఊపాడు. క్షణం ఆగి అన్నాడు.
‘‘నేను ‘మేరీ’మాతకి మొక్కుకున్నాను.’’‘‘మంచిపని చేశావు’’ నేను అప్రయత్నంగా అన్నాను. నేనింకా ఏదో చెబుతానని ఆకాంక్షతో ఎదురు చూస్తున్నాడు కానీ ఎందువల్లో నా గొంతుక ఎండిపోయింది.‘‘నీ కొడుకు జుజో తప్పకవస్తాడు.’’ కానీ అలా అనాలనిపించినా మాటలు పెగల్లేదు. గొంతుక మూగదయిపోయింది.‘‘ఇప్పుడొస్తాడు నా జుజో ఇప్పుడొస్తాడు.’’ఆ రోజు నుంచీ నేను కామిల్ ఇంటికి వెళ్లలేదు.నాకు భయమేసింది. కామిల్ ఆ విషయం నన్ను అడుగుతాడేమోనని, మొక్కుబడి చేసినాఇంకా ఎందుకు రాలేదు నా కొడుకు అని. ‘‘విశ్వాసం ఉంచి ఎదురుచూడు’’ అని నేను ముందే చెప్పాను. ‘‘కానీ ఎన్నిరోజులని ఎదురుచూడను’’ అని నన్ను ప్రశ్నిస్తే, నేను ఏమని జవాబివ్వడం? అందువల్ల నేను కామిల్ ఇంటికి వెళ్లకపోయినా, అతని బాగోగులు విచారిస్తున్నాను.కామిల్ ఆరోగ్యం రోజురోజుకి దిగజారిపోతోంది. మతి చలిస్తోంది. కానీ కొడుకు తిరిగి వస్తాడనే విశ్వాసం మాత్రం రోజు రోజుకీ పెరిగిపోతోంది!వర్షాకాలం చేరువయింది. స్కూళ్ల సెలవులు పూర్తయి కొత్తగా తెరిచారు. ఒకరోజు ఒక స్త్రీ ‘చాందోర్’ (గోవా సాల్‌సెట్’ తాలూకాలో గ్రామం) నుంచి వచ్చింది – ఒక పిల్లవాడిని వెంటబెట్టుకుని చర్చికి. మత గురువు బయటకి వెళ్లాడు. నేనే ఆమెని కూర్చోబెట్టి అసలు సంగతి అడిగాను. తాను అతి పేదరికం వలన కొడుకుని పోషించలేకపోతోందని, అందువలన చర్చి ఆధీనంలో ఉన్న ‘బోర్డింగ్’ (భోజన, వసతి సౌకర్యాలు ఇచ్చే ఇల్లు)లో జేర్చుకోమని అర్థించడానికి వచ్చింది. ఆమె దీనంగా అంది.‘‘ఈ కుర్రవాడిని మీరు ఉంచుకుంటే ఎంతో పుణ్యముంటుంది. మీరు చెప్పిన ప్రతి పనీ చేస్తాడు.’’ మా చర్చి ‘బోర్డింగ్’ ఇంట్లో ఇటువంటి పిల్లలు ఇంకా ఉన్నారు. ఆ స్త్రీ విన్నపం స్వీకరించి, ఆ పిల్లవాడిని మా చర్చి వసతిగృహలో చేర్చుకోవడానికి అంగీకరించాను. ఆమె ఆ బాలుడ్ని మాకప్పగించి ఇంటికి వెళ్లిపోయింది.ఆ పిల్లవాడ్ని దగ్గరకి పిలిచాను. పద్నాలుగు సంవత్సరాలుండవచ్చు. హుషారుగా కనిపిస్తున్నాడు. నేనడిగాను.‘‘నీ పేరేమిట్రా?’’‘‘జుజో.’’పేరు వినకముందే నాకు హఠాత్తుగా ‘కామిల్’ గుర్తుకు వచ్చాడు. అతని కొడుకు పేరు కూడా జుజో. నాకనిపించింది ఇలా చేస్తే ఎలాగుంటుందీ? కామిల్ ఈ మధ్య స్థిమితం తప్పాడు. ఎవ్వరూ ఇంటికి వచ్చినా, అలికిడయినా తన కొడుకొచ్చాడని తహతహలాడుతున్నాడు. అందుకని ఈ కుర్రవాడ్నే కామిల్ దగ్గరికి పంపి, అతని కొడుకే జుజో వచ్చాడని నమ్మిస్తే ఎలాగుంటుంది? మనిషి మారుతాడేమో, మనసు, ఆరోగ్యం బాగుపడుతుందేమో! ఈ పిల్లవాడి అవసరాలు తీరతాయి, కామిల్‌కీ ఈ ముసలితనంలో ఆధారం దొరుకుతుంది.ఈ ఆలోచన రాగానే, నాకు మాత్రం స్థిమితం లేకపోయింది. లేచినా, పడుకున్నా, కూర్చున్నా, నడుస్తున్నా ఇదే ఆలోచన. పాప, పుణ్యాల బేరీజు మాని, ఆ పిల్లాడికి విశ్వాసంగా సంగతి చెప్పాను. చేయవలసిన పని నచ్చజెప్పాను. తిరిగొచ్చిన కామిల్ కొడుకుగా నటించాలనీ, ‘కామిల్’ని ‘నాన్నా’ అని సంబోధించాలనీ నేర్పాను. అన్నీ నేను చెప్పినట్లే చేయమని హెచ్చరించాను. ఆ తర్వాత నాటకం సిద్ధం చేసి ఒకరోజు కామిల్ ఇంటికి వెళ్లాం.
సాయంకాల సమయం. ‘కామిల్ ఇంటిపట్టునే ఉన్నాడు. లోపల వంట చెయ్యడం కోసం కట్టెలు అగ్గిలో పెట్టి ‘ఫూ’ అంటున్నాడు.‘‘కామిల్ బాబూ, ఇదిగో చూడు– ఎవరొచ్చారో.’’వంట చేయడానికుపక్రమించిన కామిల్ గబగబా లేచాడు. తుండుగుడ్డతో చెయ్యి తుడుచుకుని, అలా తుడుచుకుంటూనే అడిగాడు.‘‘ఎవరొచ్చారూ?’’ అని.‘జుజో వచ్చాడు. ఇదిగో చూడు’ అలా అని నేను జుజోని ముందుకు తోశాను. జుజో ముందే నేర్పిన ప్రకారం ఎదురువెళ్లి ‘నాన్నా’ అన్నాడు.‘‘నా తండ్రీ వచ్చావా?’’ అని అంటూ తడబడుతూ ‘కామిల్’ ముందుకు వచ్చాడు.సూర్యుడి ఆఖరి కిరణాలు వాలుగా పడుతున్నాయి. ‘కామిల్’ ‘జుజో’ని దగ్గరికి తీసుకుని చేతులతో ఆతృతగా నిమిరాడు. ఆగి అనుమానపు చూపులతో నన్ను పొడుస్తూ అన్నాడు.‘‘ఎవరు ఫాద్రీ ఇతడు జుజో అనిఎవరు చెప్పారు? నన్ను మోసం చెయ్యొద్దు. నా జుజో పెద్దవాడయి ఉంటాడు. నీ అంత ఎదిగి ఉంటాడు.’’ అలా అని కామిల్ ఉన్నచోటే చతికిలబడ్డాడు. నాకనిపించినట్టు ఈవేళ ‘కామిల్’ ఏ పిచ్చిలోనూ లేడు. నాలాగే కులాసాగా, మెలుకువగా, తెలివిగా కనిపించాడు.‘‘నేను బహుశా జుజోని గుర్తుపట్టలేకపోవచ్చు. వాడిప్పుడు పెద్దవాడయి ఉంటాడు. కానీ వాడు నన్ను తప్పక గుర్తుపడ్తాడు. నీకు తెలుసా ఈ కుర్తానే నేనెప్పుడూ తొడుక్కుంటాను? లోకులు అంటారు. ఇంక చాలు ఈ కుర్తా వదిలిపెట్టు – చక్కగా చొక్కా తొడుక్కో అని. లోకులేమైనా అనని. నేను పట్టించుకోను. నా జుజో ఉన్నప్పుడు నేను ఈ కుర్తానే వేసుకునేవాడిని. ఇప్పుడు నా జుజో తిరిగివస్తే, నన్ను గుర్తు పట్టలేకపోయినా, నా కుర్తా చూసి తప్పక జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ‘కామిల్’ అలా చాలా మాట్లాడి అలసిపోయాడు. నాకు ఏం చెప్పాలో తెలియలేదు.’’‘‘ఫాద్రీ! నా జుజో తప్పక తిరిగివస్తాడు. నేను సాయ్‌బిణికి మొక్కుకున్నాను. వాడురాక మానడు. నేను ఎదురుచూస్తున్నాను. జుజో వస్తాడు. వాడు వచ్చేవరకూ, వాడిని చూసేవరకూ నేను ఈ ప్రాణం వదిలేదిలేదు. నేను చావను.. నేను చావను..’’ అంటూ కామిల్ ఏడవసాగాడు.నాకు చాలా సిగ్గువేసింది. నా ప్రయోగం ఫలించలేదని కాదు. ‘కామిల్’కి దేవుడిమీదున్న విశ్వాసం చూసి నాకు కూడా క్షణం సేపు అనిపించింది. నిజంగానే జుజో వస్తాడు!బరువైన హృదయంతోనూ, అలసిపోయిన కాళ్లతోనూ, నేను కృతిమ జుజోని వెంటబెట్టుకు తిరుగుముఖం పట్టాను. ఇది జరిగి పక్షం రోజులు గడిచాయి.అకస్మాత్తుగా ఒకరోజు సాయంకాలం కామిల్ ఇంటి పక్కావిడ పరుగు పరుగున వచ్చింది.‘‘ఫాద్రీ, కామిల్ మరణావస్థలో ఉన్నాడు. త్వరగా రా, వచ్చి దైవ విధి చెయ్యి.’’‘‘మరణిస్తున్నాడా? డాక్టరుకి కబురు వెళ్లిందా?‘‘లేదు. ఈ రాత్రి గడవకపోవచ్చు.’’ నాకు ఆవిడ మాటలకి కోపం వచ్చింది.వీళ్లకి ముందు ఫాద్రీ గుర్తుకొస్తాడు–డాక్టరు కాదు.‘‘నువ్వు వెంటనే వెళ్లి డాక్టర్‌ని పిలుచుకురా– నేను పంపానని చెప్పు. నేనూ వెంటనే వస్తాను.’’ ఆవిడ వెళ్లిపోయింది. క్షణం సేపు నా బుర్ర తిమ్మిరెక్కిపోయింది. ‘‘జుజో తిరిగి వస్తాడు. వాడిని చూడకుండా నా ఆఖరి శ్వాస విడవను. వాడిని చూసే నేను ప్రాణాలు వదుల్తాను.’’ పాపం ‘కామిల్’ మరణం గుమ్మందాకా వచ్చినా ఆశ వదులుకోవడం లేదు.నేను రెండు మూడు ముఖ్యమైనపనులు పూర్తిచేసి గబగబా బయటపడ్డాను.నేను కామిల్ ఇంటికి చేరేసరికి చీకటిపడింది. డాక్టర్ అతన్ని పరీక్షించి తిరిగి వెళ్లిపోతున్నాడు. నన్ను చూసి డాక్టర్ ఆగాడు. ముసలితనం. జ్వరం తగ్గవచ్చు. నేను ఇంజక్షన్ ఇచ్చాను.అయినా దైవవిధి చేయడం మంచిది.
డాక్టర్ వెళ్లిపోయాడు. నేను బాల్కనీలో నించున్నాను. పక్కింటావిడ గుమ్మం దగ్గరే నిల్చొని నాకేసి చూస్తోంది.‘‘పడుకున్నాడా?’’అడిగాను.‘‘లేదు. తెలివిలోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా కొడుకు గురించి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు.’’‘‘నువ్వు ఇంటికి వెళ్లు. భోజనం చేసి రా. ఇక్కడుండేం చేసేది లేదు.’’పక్కింటావిడ వెళ్లేవరకూ నేను ఆగాను. బాగా చీకటియింది. లోపలగదిలో ఓ కిరోసిన్ నూనె దీపం మిణుకు మిణుకుమని వెలుగుతోంది. గదిలో పాత పట్టె మంచం మీద కామిల్ పడుకున్నాడు.నేను ఇటూ అటూ చూశాను. అంతా కటిక చీకటి. దగ్గరలో ఎవ్వరూ కనబడ్డంలేదు. నేను తొరతొరగా నా పొడుగైన ‘రోబ్(మతాధికారి దుస్తులు) తీసేశాను. అది తీశాక లోపల ముందే వేసుకున్న ఫ్యాంటూ, బుష్‌కోటూ బైటపడ్డాయి. రోబ్ కుర్చీలో పడేసి నేను లోపలికి వెళ్లాను.‘‘నాన్నా!’’ నేను మృదువుగా పిలిచాను.కామిల్ తెలివిలోనే ఉన్నాడు. కళ్లు కూడా తెరిచే ఉన్నాయి. పిలుపు వింటూనే కళ్లు పెద్దవిచేసి, స్పృహలోకి వచ్చాడు.‘‘నాన్నా! నేను జుజోని వచ్చాను.’’ నేను దగ్గరకెళ్లి వొంగొని చెవిలో అన్నాను. ‘‘ఓ నా కొడుకా.. జుజో... నా కొడుకా..’’ కామిల్ అమితానందంలో మాటలే కరువయ్యాయి. కామిల్ హఠాత్తుగా బలం పుంజుకుని లేచాడు. లేచి కూర్చున్నాడు.‘‘నాన్నా..!’’ అంటూ ప్రేమతో నేను కామిల్ భుజం మీద నా తల ఉంచాను. ‘కామిల్’ అవస్థ చూసి నాకు కూడా కళ్లనీళ్లు వచ్చాయి. కళ్లల్లో నీళ్లు ఆగకుండా ప్రవహిస్తున్నాయి.కిరోసిన్ నూనెదీపం చాలా కొద్దిగా కాంతినివ్వడం వలన కామిల్ నన్ను గుర్తుపట్టేయగలడనే భయం లేకపోయింది. నేను కామిల్‌ని గట్టిగా కౌగిలించుకున్నాను. కామిల్ అతృతగా నా వెన్నునిమురుతున్నాడు. కామిల్ ఒళ్లు జ్వరంతో భగభగ మండుతోంది.అయినా మొహం మీద ఆనందంతో కూడిన నవ్వు నృత్యం చేస్తోంది!‘‘నా కొడుకా.. జుజో నా కొడుకా’’ కామిల్‌కి ఎంతో మాట్లాడాలని అనిపించినా, నోట్లోంచి పదాలు పెకలడం లేదు. మాటలు దొర్లడం లేదు.‘‘నాన్నా... నాన్నా... ఇంక నిద్రపో’’ నేనన్నాను. కానీ కామిల్ కదలలేదు.‘‘జుజో... నా బంగారు తండ్రీ... నువ్వు వచ్చావా ఇన్నేళ్లకి. నాకు తెలుసు నువ్వు తప్పక వస్తావని. నేను మేరీమాతకి మొక్కుబడి చేశాను. ముడుపు చెల్లిస్తానని వాగ్దానం చేశాను. దేవుడి మీదే విశ్వాసం నిలిపాను. ఆయన దయవల్ల నువ్వు వచ్చావు. ... ఇప్పుడు... ఇప్పుడు... నాకు శక్తిలేదు... నాకు వీ... నువ్వు ముడుపు చెల్లించు దైవానికి... నువ్వు...’’ కామిల్ గొంతుక నూతిలోంచి వస్తున్నట్లు. ఎక్కడో దూరం నుంచి వస్తున్నట్లు తగ్గి తగ్గి..... క్రమేణా అంతరించింది. అతని తల నా భుజం మీద వాలింది. కాళ్లు, చేతులు చల్లబడ్డాయి.నేను నెమ్మదిగా అతని తల జరిపి దిండుమీద ఉంచాను. అతని కళ్లు తెరిచే ఉన్నాయి. వాటిని వేళ్లతో స్పృశించి మూసేశాను. అతని శరీరం మీద దుప్పటి కప్పాను. ఆ తర్వాత బయటికి వచ్చి మళ్లీ ‘రోబ్’ ముందులాగే ధరించాను.
కొంకణీ మూలం : దామోదర్ మావ్‌జొ
అనువాదం: శిష్టా జగన్నాధరావు
ముడుపు
Published Sun, Nov 4 2018 1:18 AM | Last Updated on Sun, Nov 4 2018 1:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment