ఆస్తుల బదిలీ.. ఇలా ఈజీ! | Special Story About transfer property title between family members | Sakshi
Sakshi News home page

ఆస్తుల బదిలీ.. ఇలా ఈజీ!

Published Mon, Dec 25 2023 5:22 AM | Last Updated on Mon, Dec 25 2023 5:22 AM

Special Story About transfer property title between family members - Sakshi

కుటుంబ సభ్యుల ఆర్థిక భద్రత ప్రతి ఒక్కరికీ ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలి. జీవితాంతం ఎంతో కష్టించి, ఆస్తులు, సంపద కూడబెట్టుకోవడంతోనే సరికాదు. తమ వారికి సాఫీగా బదిలీ అయ్యేలా చర్యలు తీసుకున్నప్పుడే ఆకాంక్ష ఫలిస్తుంది. ఒక ఆస్తికి ఒకటికి మించిన వారసులు ఉంటే పంపకం సమస్యగా మారకూడదు. క్లిష్టమైన కుటుంబ నిర్మాణం ఉన్న వారు ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించాల్సిందే.

దురదృష్టవశాత్తూ తమకు ఏదైనా జరిగితే, తమ పేరిట ఉన్న ఆస్తులు వారసులకు సాఫీగా బదిలీ అయ్యేది ఎలా? ఆస్తులకు సంబంధించి వివాదాలు ఏర్పడకుండా చూసుకునేది ఎలా..? ఎస్టేట్‌ (ఆస్తి) ప్లానింగ్‌ ఇందుకు పరిష్కారం అవుతుంది. వీలునామా రాస్తే సరిపోతుందిలే అనుకోవద్దు. దీనికంటే మెరుగైనది కుటుంబ ట్రస్ట్‌. ఆస్తులనే కాకుండా, కుటుంబ వ్యాపారాల సాఫీ పంపిణీ సైతం ఎస్టేట్‌ ప్లానింగ్‌తో సాధ్యపడుతుంది.

ఎస్టేట్‌ ప్లానింగ్‌ అంటే..?
ఆస్తుల పంపకాన్నే ఎస్టేట్‌ ప్లానింగ్‌గా చెబుతారు. తమ మరణానంతరం కుటుంబ సభ్యులకు ఆస్తులు ఎలా పంపిణీ చేయాలన్నది ఇందులో ఉంటుంది. తమ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటే కుటుంబ వ్యాపారానికి ఎవరు నాయకత్వం వహించాలి? అనే వివరాలు కూడా ఇందులో భాగమే. ప్లాట్లు, ఇళ్లు, పొలాలు, బంగారం, ఆభరణాలు, బ్యాంక్‌ బ్యాలన్స్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు అన్నింటికీ ఇందులో చోటు ఉంటుంది. కాయిన్లు, పెయింటింగ్‌లు తదితర అన్నింటి పంపిణీని ఎస్టేట్‌ ప్లానింగ్‌తో సులభతరం చేసుకోవచ్చు.  

ట్రస్ట్‌ ఏర్పాటు
కొన్ని కుటుంబాల నిర్మాణం సంక్లిష్టంగా ఉంటుంది. అలాగే, కొన్ని పెద్ద కుంటుంబాలు ఉంటాయి. మొదటి వివాహం ద్వారా పిల్లలు ఉండి, తర్వాత రెండో వివాహం ద్వారా పిల్లలు కన్న వారికి ఆస్తుల పంపిణీలో సహజంగా వివాదాలు ఏర్పడుతుంటాయి. అలాగే, ప్రత్యేక అవసరాల (దివ్యాంగులు) వారూ ఉండొచ్చు. అలాంటి వారికి ఆస్తుల పంపిణీని తమ ఇష్ట ప్రకారం చేసుకోవాలంటే అందుకు వీలునామా లేదా ఫ్యామిలీ ట్రస్ట్‌ మార్గాలవుతాయి. తమ సంపద సాఫీగా బదిలీ అయ్యేందుకు ట్రస్ట్‌ వీలు కలి్పస్తుంది.

ట్రస్ట్‌ అంటే ధర్మనిధి. ట్రస్ట్‌ ఏర్పాటు చేసే వ్యక్తికి, ధర్మ కర్తలకు మధ్య ఒప్పందమే ట్రస్ట్‌ డీడ్‌. దీని ద్వారా తనకు సంబంధించిన ఆస్తులను ధర్మకర్తలకు అప్పగిస్తారు. ట్రస్ట్‌ ఏర్పాటు చేసిన వ్యక్తి మరణానంతరం ట్రస్ట్‌ డీడ్‌లో పేర్కొన్న విధంగా ఆస్తుల బదిలీ పూర్తి చేయాల్సిన బాధ్యత ట్రస్ట్‌ నిర్వాహకులపై ఉంటుంది. ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని అనుకునే వారు ట్రస్ట్‌ డీడ్‌ రాయాల్సి ఉంటుంది. సంపదను ఎలా బదిలీ చేయాలన్నది అందులో స్పష్టంగా పేర్కొనాలి. స్థిర, చరాస్తులను ట్రస్ట్‌కు బదిలీ చేయాలి.

ట్రస్ట్‌ డీడ్‌ రాసిన తర్వాత దాని నిర్వహణకు ట్రస్టీ (ధర్మకర్త)ని నియమించాలి. స్టాంప్‌ డ్యూటీ చెల్లించి, ట్రస్ట్‌ను రిజి్రస్టార్‌ కార్యాలయం వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలి.  ట్రస్ట్‌ ఏర్పాటు ఉద్దేశాన్ని ట్రస్ట్‌ డీడ్‌ తెలియజేయాలి. దీని ఏర్పాటు ఉద్దేశం, ఎలా పనిచేయాలన్నది స్పష్టంగా పేర్కొనాలి. ట్రస్టీ లేదంటే ట్రస్టీలుగా ఎవరిని నియమించాలి? అన్న సందేహం రావచ్చు. స్నేహితులు లేదా బంధువులను ట్రస్టీలుగా నియమించుకోవచ్చు.

లేదా కార్పొరేట్‌ సంస్థను అయినా ట్రస్టీగా నియమించొచ్చు. కొన్ని కార్పొరేట్‌ సంస్థలు ట్రస్ట్‌ సేవలను అందిస్తున్నాయి. ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు మరణించినా లేదా తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురైన సందర్భాల్లో ఆస్తులను ఎలా వినియోగించుకోవాలన్న సూచనలను ట్రస్ట్‌ డీడ్‌లో పేర్కొనొచ్చు. అలాగే, ధర్మకర్త జీవించి లేకపోయినా లేక రిటైర్మెంట్‌ తీసుకున్నా.. తదుపరి ట్రస్టీగా ఎవరు వ్యవహరించాలన్నది కూడా టస్ట్ర్‌ డీడ్‌లో పేర్కొనాలి.  

వీలునామా.. కోర్టు విచారణలు!
వీలునామా గురించే ఎక్కువ మందికి తెలుసు. సులభమైన, మెరుగైన సాధనమని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో కొన్ని ప్రతికూలతలు లేకపోలేదు. వీలునామా రిజిస్టర్‌ చేసినా, చేయకపోయినా దాన్ని కోర్టుల్లో సవాలు చేయవచ్చు. వీలునామా అనేది కేవలం వ్యక్తి మరణానంతరం అమల్లోకి వచ్చే పత్రం. వైకల్యం లేదా తీవ్ర అనారోగ్యం బారిన పడిన సందర్భాల్లో వీలునామా పని చేయదు. మరణించిన వ్యక్తి ఆస్తుల బదిలీకి సంబంధించినదే కానీ, ఆ ఆస్తుల నిర్వహణకు సంబంధించినది కాదు.

వీలునామా కింద లబి్ధదారులు హక్కులను కోర్టులో నిరూపించుకోవాల్సి వస్తుంది. ఇందుకు ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టొచ్చు. అప్పటి వరకు ఆ ఆస్తులను వినియోగించుకోవడానికి వీలు పడదు. మోసం, ఫోర్జరీ, ఒత్తిడితో రాయించినట్టు లేదా మానసిక వైకల్యంతో బాధపడుతున్న సమయంలో రాయించినట్టు, తెలియకుండా రాయించుకున్నట్టు తదితర ఆరోపణలపై వీలునామాను కోర్టులో సవాలు చేయవచ్చు.

వీలునామాను రిజిస్టర్‌ చేసినంత మాత్రాన అది చట్టబద్ధంగా చెల్లుబాటు అయిపోతుందని అనుకోవడం పొరపాటు. రిజిస్టర్‌ చేయించిన వీలునామా సైతం కోర్టుల విచారణ పరిధిలోకి వస్తుంది. మనదేశంలో ఎస్టేట్‌ ప్లానింగ్‌ కోసం హిందు అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) ఏర్పాటును కొంత మంది అనుసరిస్తుంటారు. ఇది పన్నుకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాటు. ఒక్కసారి హెచ్‌యూఎఫ్‌ రిజిస్టర్‌ చేసి, ఆస్తులు దానికి బదలాయించారంటే.. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు దఖలు పడతాయి. హెచ్‌యూఎఫ్‌ పరిధిలోని ఆస్తులను విభజించడం వివాదాలు, కోర్టు కేసులకు దారితీయవచ్చు. వీటన్నింటిలోకి మెరుగైనది ఫ్యామిలీ ట్రస్ట్‌.  

పిల్లలకు కూడా..
మైనర్‌ చిన్నారులు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఎస్టేట్‌ ప్లానింగ్‌ ప్రయోజనకరంగా ఉంటుంది. తాము లేని రోజున తమ పిల్లల బాధ్యతను బంధువులపై మోపడం.. వారు చూస్తారని ఆశించడం అన్ని సందర్భాల్లో సరైనది అనిపించుకోదు. ఇది పూర్తిస్థాయి, పెద్ద బాధ్యత.  ట్రస్ట్‌ ఏర్పాటు చేసి, దాని నిర్వహణ బాధ్యతను కార్పొరేట్‌ ట్రస్టీకి అప్పగించడం మెరుగైనది అవుతుంది.

కార్పొరేట్‌ ట్రస్టీ అయితే.. ప్రత్యేక అవసరాల పిల్లలకు (దివ్యాంగులు) పూర్తి సమయం పాటు సహాయకుడు/సహాయకురాలిని అందుబాటులో ఉంచుతారు. అలాగే వంట మనిíÙ, వైద్య సాయం సహాయకులు, స్పెషలిస్ట్‌ డాక్టర్‌ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. పిల్లలు సాధారణంగా తమ హక్కులను క్లెయిమ్‌ చేసుకోలేరు. అందుకుని వీలునామా రాస్తే, దాని నిర్వహణ బాధ్యతను ఒకరికి అప్పగించాల్సి వస్తుంది. అందుకే వీలునామాలో ఉన్న ప్రతికూలతల దృష్ట్యా పిల్లల కోసం ఫ్యామిలీ ట్రస్ట్‌ మెరుగైనది అవుతుంది.

ఎవరికి అవసరం..?
నిజానికి ఎస్టేట్‌ ప్లానింగ్‌ లేదా వీలునామా అనేవి సంపన్నులకేనన్న ఒక అపోహ నెలకొంది. ఇది నిజం కాదు. ప్రతి ఒక్కరికీ ఇది ఎంతగానో సాయపడుతుంది. తమ పేరిట ఆస్తులు ఉన్నా, లేదా అప్పులు ఉన్నా సరే ఎస్టేట్‌ ప్లానింగ్‌తో వారసులకు మార్గం స్పష్టంగా మారుతుంది. అకాల మరణం ఎదురైతే, తమ పేరిట ఉన్న ఆస్తులు ఎలా పంచాలి? అప్పులు ఎలా తీర్చాలి? ఏ ఆస్తి విక్రయించి అప్పు చెల్లించాలి? వీటికి ఎవరు బాధ్యత వహించాలి? ఇలాంటి వాటికి స్పష్టత ఇవ్వొచ్చు.

నిజానికి మనలో 90 శాతం మంది ఆస్తులకు సంబంధించి భవిష్యత్‌ ప్రణాళిక గురించి ఆలోచించరు. వీలునామా కూడా రాయరు. తాము క్షేమంగా ఉన్నందున, మరణం గురించి చర్చించడం, ఆస్తులపై చర్చను కోరుకోకపోవడం వల్ల ప్రణాళికకు దూరంగా ఉంటుంటారు. నిజానికి ఎంతో ముఖ్యమైన ఈ పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. దీనివల్ల ఉపయోగాలే కానీ, నష్టం ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ దీనికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.

మార్గాలు..
నామినేషన్, వీలునామా (విల్లు), ఫ్యామిలీ ట్రస్ట్‌ ఇవన్నీ ఎస్టేట్‌ ప్లానింగ్‌లో పలు రకాల సాధనాలు. ఆర్థిక సాధనాలకు నామినేషన్‌ సదుపాయం ఉంటుంది. సంబంధిత ఆస్తి ఎవరికి వెళ్లాలని అనుకుంటే వారి పేరును నామినీగా నమోదు చేసుకోవచ్చు. కానీ, అన్నింటికీ నామినేషన్‌ సదుపాయం ఉండదు. ముఖ్యంగా స్థిరాస్తులకు నామినేషన్‌ చేసుకోలేరు. కనుక అన్నింటికీ పరిష్కారంగా ఫ్యామిలీ ట్రస్ట్‌ అక్కరకు వస్తుంది.

ఇలాంటి ఏర్పాట్లు ఏవీ లేకుండా ఓ కుటుంబ యజమాని మరణించిన సందర్భాల్లో లేదా వారసులు కాని వ్యక్తి నామినీగా ఉండి వివాదాలు ఏర్పడిన సందర్భాల్లో.. ఆస్తుల పంపిణీ అన్నది ఆయా మతస్థుల వారసత్వ చట్టం ప్రకారం చేసుకోవాల్సి వస్తుంది. దీనికి కోర్టులను ఆశ్రయించాల్సిందే. హిందూ వారసత్వ చట్టం ప్రకారమైతే మరణించిన వ్యక్తి జీవిత భాగస్వామి, అతని తల్లి, పిల్లలకు సమానంగా ఆస్తులు బదిలీ చేసుకోవాలి. ఈ విషయంలో వివాదం ఏర్పడితే అప్పుడు పరిష్కారానికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.  

ఇది నిజం కాదు..
ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తే, తమ ఆస్తులన్నీ ట్రస్టీ నిర్వహణలోకి వెళ్లిపోతాయని, వాటిపై తాము నియంత్రణ కోల్పోతామనే అపోహ ఉంది. ట్రస్ట్‌ ఏర్పాటు చేసి, దానికి తమ ఆస్తులను బదిలీ చేసిన తర్వాత అప్పుడు ట్రస్టీయే యజమాని అవుతారు. నిజానికి ట్రస్ట్‌ డీల్‌లో పేర్కొన్న మేరకు బాధ్యతలను నిర్వహించడమే ట్రస్టీ పని. అంతేకానీ, సంబంధిత ట్రస్ట్‌ నిర్వహణలోని ఆస్తులను వినియోగించుకునే, అనుభవించే హక్కులు ట్రస్టీలకు ఉండవు.

కేవలం ట్రస్ట్‌ డీడ్‌లో పేర్కొన్న లబి్ధదారుల ప్రయోజనాల కోసమే ఆ ఆస్తులను వినియోగించాల్సి ఉంటుంది. ట్రస్ట్‌ ఏర్పాటు చేసిన వారు జీవించి ఉన్నంత వరకు బదిలీ చేసిన ఆస్తులు, ట్రస్ట్‌ కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. నేడు పలు ప్రొఫెషనల్‌ ట్రస్ట్‌ ఏజెన్సీలు ట్రస్టీ సేవలను అందిస్తున్నాయి. అవి ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తాయి. ట్రస్ట్‌ డీడ్‌కు పూర్తి స్థాయి నిర్వాహకుడి మాదిరే పనిచేస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement